సత్యాన్ని, ధర్మాన్ని తప్పకుండా పదిమందిని పోషిస్తూ ప్రతిఫలం కోసం ఎదురు చూడకుండా ఈ లోకంలో ఒకరుంటే వారి ముఖంలో ఒక వర్ఛస్సు ఉంటుంది. వారు తేజస్విగా వుంటారు. ఈ ప్రపంచమంతా సత్య, ధర్మనిష్ఠతో పరిపాలించే పరమేశ్వర ముఖం ఎంత ఉజ్వలంగా ఉంటుందో భావించమని శాస్త్రాలు మనకు చెబుతున్నాయి.
– శ్రీ కంచి పరమాచార్య
‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అనేది మనందరికీ తెలిసిన సత్యమే. కానీ, కంటి చూపు కాపాడుకోవడం అందరి లాగా సాధ్యంకాక దీన స్థితిలో ఉన్న నిరుపేదలెందరో కంటి చూపు సమస్యను సకాలంలో గుర్తించలేక చూపు కోల్పోయి అంధులుగా జీవితం గడుపుతుండటం దయనీయం. అటువంటి వారిని ఆదుకునేందుకు, గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న పేద ప్రజలకు పరీక్షలు నిర్వహించి, సకాలంలో వైద్య సేవలందించి వారి కంటి చూపును కాపాడాలనే ఉన్నతాశయంతో డా. ప్రభాకర్ గారు కృషి చేస్తున్నారు.
రోగులను పరీక్షిస్తున్న డా. ప్రభాకర్
ఇందుకోసమే 2004 సంవత్సరంలో రాజమండ్రి సమీపంలోని వేమగిరి గ్రామంలో Divine Eye Foundation ఆధ్వర్యాన పరమహంస యోగానంద నేత్రాలయాన్ని ప్రారంభించారు. పేద ప్రజలకు ఉచిత సేవలందించే ఈ ట్రస్ట్ ఆసుపత్రికి హైదరాబాద్ లోని ప్రపంచ ప్రఖ్యాత L.V. Prasad Eye Foundation వారు సాంకేతిక సహకారం అందచేయడంతో పాటు అనుబంధ ఆసుపత్రి హోదా కూడా కల్పించారు. అందువల్ల అత్యాధునిక వైద్య విధానంలో రోగులకు సేవలనందించే అవకాశం ఏర్పడింది.
‘ఈ సమాజం మనకు ఎంతో ఇచ్చింది. మనం సమాజానికి, ప్రజలకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి’ అనే ఆశయంతో డా. ప్రభాకర్ గారు మరి కొంత మంది దాతల సహకారంతో సుమారు ఐదు ఎకరాల విశాల ప్రాంగణంలో ఆసుపత్రి నిర్మించారు. సర్వసాధారణంగా ఉచిత సేవలు అనగానే చిన్నచిన్న ఇరుకు గదులు, అరకొర సౌకర్యాలతో ఉన్న వైద్యశాలలు మనం చూస్తుంటాము. ఇందుకు భిన్నంగా గాలి, వెలుతురూ కలిగిన విశాలమైన భవనాలలో రోగులకు సేవలందిస్తున్న ఏకైక ట్రస్ట్ హాస్పిటల్ నవ్యాంధ్రప్రదేశ్ మొత్తం మీద పరమహంస యోగానంద నేత్రాలయమే.
పరమహంస యోగానంద నేత్రాలయం
ఇక్కడ అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఆపరేషన్ థియేటర్లలో రోగులకు కంటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. రోగులకు ఉచిత శస్త్ర చికిత్సలతో పాటు రోగితో వచ్చే సందర్శకులకు ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయపడింది. డా. ప్రభాకర్ గారు ఆసుపత్రి సిబ్బందికి మంచి శిక్షణనిచ్చి వారి ద్వారా రోగులకు మెరుగైన సేవలను అందిస్తున్నారు. ప్రణాళికా బద్ధంగా పరిసర గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రాధమిక పరీక్షలు నిర్వహించి రోగులకు సూచనలివ్వడం, శస్త్ర చికిత్స అవసరమైన రోగులను ఆసుపత్రికి చేర్చి కంటి ఆపరేషన్స్ చేసి పంపడం ఆసుపత్రి నిర్వాహకుల ప్రప్రథమ కర్తవ్యం. డా.ప్రభాకర్ గారితో ఎప్పుడు మాట్లాడినా డబ్బు చెల్లించలేక ఉచిత సేవలు పొందే రోగుల పట్ల ఎటువంటి విపక్ష చూపకుండా సమానమైన సేవలందించడమే ట్రస్ట్ లక్ష్యం అని చెబుతుంటారు. పేదవాళ్లకు సేవలందించడం ఘనకార్యమేమి కాదని అది భగవంతుడు మనకు కల్గించిన అదృష్టమని, అవకాశమని మనం భావించాలనేది వారి నమ్మకం.
డా. ప్రభాకర్ గారి సేవా నిరతికి ఎంతోమంది దాతలు చేయూతనందించి తమ వంతు సాయం చేస్తున్నారు. డాక్టర్ గారి ఏకైక కుమార్తె డా.హరిప్రియ సేవలు కూడా ఈ ట్రస్ట్ కు అసమానం. ఆమె కూడా నాన్నగారి అడుగుజాడల్లోనే M.S. Ophthalmology చదివి పూర్తి సమయాన్ని ట్రస్ట్ ఆసుపత్రి సేవలకు అందించడం గర్వించదగ్గ విషయం. తండ్రి ఆశయాలను మన్నించి ఉత్తమ సంస్కారాన్ని, సేవా గుణాన్ని వారసత్వంగా కొనసాగిస్తున్న డా.హరిప్రియ ఇప్పటికే గత ఏడేళ్లలో అరవై వేల శస్త్ర చికిత్సలు చేయడం, అందులో నలభై వేలు పూర్తిగా ఉచితమే కావడం ఆమె సేవా నిరతికి నిదర్శనం. తెల్లవారుజామున ప్రారంభమయ్యే ఆమె దినచర్య రాత్రి పొద్దుపోయే వరకు రోగుల పరీక్షలు, శస్త్ర చికిత్సలతో కొనసాగుతూనే ఉంటుంది.
ఇటీవల నేను కొంతమంది మిత్రులతో కలసి రాజమండ్రి ట్రస్ట్ హాస్పిటల్ చూడ్డానికి వెళ్ళాను. ఆ రోజు ఆదివారమైనా హరిప్రియ అమలాపురంలో శస్త్ర చికిత్సలు చేయడానికి వెళ్లినట్లు చెప్పారు. గతంలో ఈనాడు వసుంధరకు ఇఛ్చిన ఇంటర్వ్యూలో ‘ఇన్ని గంటలు రోజూ పని చేస్తున్నా అలసట అనిపించదు. దానికి కారణం ఆత్మసంతృప్తికి మించిన ఆనందం ఉండదనేది నా నమ్మకం’ అని చెబుతూ ‘ధనవంతులు నా ఆసుపత్రిలోనే కాదు ఎక్కడైనా వైద్యం చేయించుకోగలరు. వారికి నా అవసరం లేదు కాబట్టి ఎవరికి నా సాయం అవసరమో వారికే నేను అందుబాటులో ఉండటానికి ప్రయత్నిస్తున్నా’ అని నిరంతర సేవాసక్తిని ఆమె వ్యక్తపరిచారు. డా.హరిప్రియను అన్ని విధాలా ప్రోత్సహిస్తూ అండగా ఉన్న ఆమె భర్త డా.ఇంద్రజిత్ కూడా సేవా భావం కలిగిన కంటి వైద్యులే కావడం ట్రస్ట్ సేవలు విస్తరించడానికి మరింత దోహదపడుతోంది.
ఈనాడు వసుంధర ఇంటర్వ్యూలో డా. హరిప్రియ
‘పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జనియించినప్పుడే’ అనే నానుడిని తిరగరాసి పుత్రికోత్సాహాన్ని తండ్రికి కలుగచేసి అవిశ్రాంతంగా పేదల సేవకై అహర్నిశలు శ్రమిస్తున్న చిరంజీవి డా. హరిప్రియ ఎంతో మంది యువ వైద్యులకు వెలుగు దివ్వె కావాలని ఆకాంక్షిస్తున్నాను.
Manava seve Madhava seva ani Kada naanudi. The services of Dr Prabhakar garu and Haripriya are highly appreciated. Actually the eye operations to me, my wife and my sister were done by Dr. Haripriya only. In young age she performed number of operations. God bless both of them and their hospitals too
Dr. ప్రభాకర్ గారు, Dr. హరిప్రియ గారి సేవలు వెళ్లకట్టలేనివి, వైద్యం వ్యాపారం ఐన ఈరోజుల్లో వీరి సేవలు ప్రశంసనీయం 🙏
Daivam manusha roopenaa. God dwells in our hearts as Antaryami. Seva dharma self less service is karmayoga. Doctor Prabhakar….A moving and Loving God.
నేత్రాలయ వ్యవస్థ స్థాపకులు , వారిసిబ్బందికి హృదయపూర్వక అభనందనలు. వారి సేవ స్ఫూర్తిదాయకం .
మానవ సేవయే మాధవ సేవ అనే ఉద్దేశ్యంతో పనిచేస్తున్న వారందరికీ, మరియు చెయ్యాలి అని అనుకుంటున్న వారికి ఈ blog స్ఫూర్తదాయకంగా ఉంటుంది.
డా. ప్రభాకర్ పేదల కళ్లల్లో వెలుగులు నింపే ప్రభాకరుడు. సార్థక నామధేయుడు.
Manava sevaye Madhava seva
The guiding mantra of Dr. Prabhakar garu and family.
Dear sir
Your constant help had become bricks and breath for this Netralaya in its formation