ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్న శ్రీశ్రీ గారితో దేశచరిత్రల వరకూ ఏకీభవిస్తాం కానీ అదేమాట బాల్కనీలకు అంటే మాత్రం విబేధించి I beg to differ అనవలసిందే. బాల్కనీలకు అనాదిగా ఘనచరిత్రే ఉంది. ఆ మాటకొస్తే రామాయణంలో సీతమ్మవారు రామచంద్ర మూర్తిని ఫస్ట్‌లుక్ బాల్కనీ నుంచే అంటారు. భారతం చదివినా మయసభ బాల్కనీ నుండి మానధనుడైన రారాజు సుయోధనుని చూసి ద్రౌపతి పరిహసించిందన్న కారణమే కురుక్షేత్రానికి పూర్వ నేపథ్యం. ఈ బాల్కనీయే విశ్వకర్మడిజైన్ చెయ్యకపోతే ద్రౌపతి నవ్వులేదు, మయసభ డైలాగుల్లేవు, కురుక్షేత్ర యుద్ధమూలేదు. తన ప్రైవేట్ జెట్ (పుష్పక విమానం) బాల్కనీలో నుండి చూసుకోకుండా మాంచి జోష్‌లో పాన్ నమిలి, ఉమ్మి ప్రాణం మీదకు తెచ్చుకున్న గయుడు, బాల్కనీలో నుండి సారంగధరుడ్ని చూసి మనసుపడ్డ చిత్రాంగి ఇలా బాల్కనీ బాసలెన్నో పురాణకాలం నుండే ఉన్నాయట.
ఈ బాల్కనీ నాలుగు వందేళ్ళ క్రితం ఇటలీలో బాల్కోన్ అన్న పదం నుండి వచ్చింది. బాల్కనీలు రాకముందు ప్రేమికుల పాట్లు దేముడికే ఎరుక. ద్వాపర యుగంలో బాల్కనీలు లేవని నా అనుమానం. అవే ఉంటే రుక్మిణీ పాణిగ్రహణం గుడి నుండి కాకుండా బాల్కనీ నుండే జరిగేది.
జహాపనా జరోకా దర్శన్
చరిత్రపరంగా చూసినా ఖ్యాతినొందిన మొగల్ కాలంలోనే చక్రవర్తుల బాల్కనీ (జరోకా) నుండి ప్రజలకు దర్శనమిచ్చే సంప్రదాయం ఉండేది. జరోకా దర్శన వారసత్వం చాలా కాలం కొనసాగిందట. నిజం చెప్పాలంటే జహాపనాల జరోకా కిటికీకి ఎక్కువ, బాల్కనికీ తక్కువే. సెక్యూరిటీ కారణాన బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులేని కాలం కూడా కనుకనేమో! చరిత్రలోని నుంచి బాల్కనీల ప్రాబల్యం సాహిత్యంలోకీ వచ్చేసింది. ఐదు వందేళ్ళ క్రిందటే షేక్‌స్పియర్ రోమియో జూలియట్ల రసవత్తరమైన రొమాన్సు బాల్కనీ నుండే నడిపాడు. ఈ నాటకం తరువాత యూరోప్ అంతా జూలియట్ బాల్కనీ అనే ప్రత్యేకమైన బాల్కనీ డిజైనే వచ్చేసి అందర్నీ మెప్పించిందట. అలా అలా బాల్కనీలు మన సినిమాల్లోకి వచ్చేశాయి.
ఆల్‌టైమ్ క్లాసిక్ మాయాబజార్ లో శశిరేఖ, అభిమన్యుల బాల్కనీ సీన్ చక్కన్న అద్భుతంగా పండించారు. ఇప్పటికీ ఏ భాషలో ఎన్ని సినిమాలొచ్చినా చక్కన్న బాల్కనీ సీనే హైలెట్. మనం కూడా మాయాబజార్ శశిరేఖ బాల్కనీని పెటెంట్ చేసుంటే బాగుండేదేమో! ఇలా రూపాంతరం చెందిన ప్రాచీన ఆనవాయితీని కొద్దిగా `మోడి` ఫై చేసుకునే ఎర్రకోటపై మన జెండా పండుగ జరుగుతోంది. బాల్కనీలకు పర్యాయపదాలే మన ఎర్రకోట బురుజులు.
పూర్వం చక్రవర్తులకు, రాజులకు, జమీందార్లకే పరిమితమైన బాల్కనీలు కాలానుగుణంగా డెమొక్రెటిగ్గా జనసామాన్యులకూ అందుబాటులోకొచ్చాయి. వినాయకవ్రత కథలో భక్తులు తమశక్తి కొలదీ బంగారంతోనో, వెండితోనో, మట్టితోనో వినాయకుని మూర్తిని చేసుకుని వ్రతమాచరించాలన్నట్లు జనం కూడా వారి వారి ఇళ్ళల్లో శక్తి కొలదీ బాల్కనీలు కట్టుకున్నారు. కాకపోతే కొన్ని ఇళ్ళు గొప్పవాళ్ళ బాల్కనీలంత ఉంటే, కొంతమంది గొప్పవాళ్ళ బాల్కనీలు పేదవాళ్ళ ఇళ్ళకు రెండింతలుంటున్నాయి. విల్లా వాసులకు రెండు, మూడు బాల్కనీలకు తక్కువుండటం లేదు. నేటికీ కలకత్తా పెళ్ళి విందుల్లో ప్రతి విస్తరికి ఎన్ని చేప తలలు వడ్డన చేస్తారనేది ముందే మాట్లాడుకుంటారట. స్తోమతను బట్టి విస్తరికి 2,3,4 చేప తలలు వడ్డించాలట. ఎన్ని తలలు వడ్డించాలంటే అన్ని జలపుష్పాలు (చేపలకు బెంగాలీల ముద్దు పేరు) కొనాల్సిందే. వడ్డనలో ఏ మాత్రం తేడా వచ్చిందో మగ పెళ్ళి వాళ్ళు రచ్చరచ్చే. ఈ బాల్కనీల నెంబరు, సైజు వారివారి స్థోమతను బట్టే.
శశిరేఖ బాల్కనీ
ప్రస్తుతం ప్రతి అపార్ట్‌మెంట్‌కు బాల్కనీ రావాలనడంతో చిక్కే. వాస్తు పట్టింపులతో ఈ చిక్కే పెద్దదయింది. కొన్ని నిజంగా బాల్కనీలైతే కొన్ని మాత్రం బాల్కనీల్లాంటివి. అవి ఏ.సి. ఫస్ట్ క్లాస్ బోగీలో క్యూపేల పక్కన నడవడానికి మాత్రం వీలుపడేలా ఉంటాయి. ఫ్యాషన్ పెరేడ్ లో క్యాట్ వ్యాక్ ప్రాక్టీసుకు ఇవి ఫర్ఫెక్ట్ సైజు.
విశాఖపట్నంలో మాకు ఒక బిల్డర్ మిత్రుడుండేవారు. ఆయన కట్టిన అపార్ట్ మెంట్లన్నింటిలో బాల్కనీలు బహు బాగుండేవని పేరు. ఆయన పేరు బి.ఆర్.రాజు అయితే అది ఎటుపోయిందో కాని ఆయన బాల్కనీరాజుగా పేరుపొందారు. ముళ్ళపూడివారు ఇడ్లీ కంటే చట్నీ బాగుందన్నట్లో, లేకపోతే బాపుగారు కొన్ని కథలకు వేసిన బొమ్మలు చూసినవాళ్ళు కథ కంటే బొమ్మే బాగుందనుకున్నట్లే రాజుగారి ఫ్లాట్స్ లో బాల్కనీలు సూపర్ అనుకునేవారు.
మనం ఇల్లు కొనేటప్పుడు బాల్కనీలు చూసుకుని ఎంతో ఊహించుకుని ఎన్నో కలలుకంటాం. అక్కడే సగం జీవితం గడిపేయొచ్చని మురిసిపోతాం. తీరా ఇంట్లో దిగిన తరువతే తెలుస్తుంది, అదంతా ఒట్టి భ్రాంతే అని. ఎలాగంటే వయసులో ఉన్నవాళ్ళకు బాల్కనీలో గడపడానికి తీరికుండదు. వయసు మీరిన వాళ్ళకు బాల్కనీ లోకి పోవడానికి ఓపికుండదు. మన పెద్దలెవరైనా బాల్కనీలో కూర్చుంటాం అంటే చలనో, దోమలనో మనం వాళ్ళని కూర్చోనివ్వం. పైన చెప్పిన మినహాయింపులన్నీ పోవడంతో బాల్కనీలు ఫక్తు యుటిలిటీలవుతాయి. మహా అయితే అవి వాషింగ్ మిషన్లు పెట్టుకోవడానికో వడియాలు పెట్టుకోవడానికో (అదైనా ఎండ తగులుతుంటే) లేదా రూఫ్ గార్డెనింకో పనికొస్తాయి. మనం కొనుక్కున్న జిమ్ ఎక్సర్ సైజ్ సైకిల్ కేవలం టవలారేసుకోడానికుపయోగపడ్డట్టే!
బాల్కనీ బెనిఫిట్‌షో
మేము సివిల్స్ పరీక్షలకు వెళ్ళేరోజుల్లో వరల్డ్ హిస్టరీలో బాల్కన్ వార్స్ గురించి చదివాము. అప్పటివరకు బాల్కన్ వార్స్ అంటే బాల్కనీ కోసం యుద్దాలనుకొన్నం కానీ అవి జరిగింది దేశాల మధ్యనే అని చదివాకే తెలిసింది. వెనకటికి స్కూల్లో కుర్రోడిని, `మొదటి పానిపట్ యుద్దం ఎప్పుడు జరిగింద`ని అడిగితే, `అది నాకు తెలియదు సార్, మా వీధిలో వాటర్ టాంకర్ వచ్చినప్పుడుల్లా సగటున రోజుకు మూడు పానీపట్టు యుద్దాలు జరుగుతాయని` చెప్పినట్లే. ఈ బాల్కనీలకు కొండొకచో సామాజిక ప్రయోజనం ఉంది. యూత్ బాల్కనీ సందేశాలు, సంకేతాలు సైగలు ఎన్నో అనవసరపు పెళ్ళి చూపుల్ని తప్పించి Self help పధకం కింద తల్లిదండ్రులకు ఎంతో శ్రమ, ఖర్చు తగ్గించడం వాస్తవం. మేఘసందేశాలకు, హంససందేశాలకు, పావురం టపాలకు నోచుకోని మన యువత పాలిట మన బాల్కనీలు గొప్ప బూన్లే. పిల్లల ప్రేమని ఆమోదించని ఎవరి మాట వినని సీతయ్యల వలన స్టార్ హోటల్ గదుల్లో ఎస్కేప్ రూట్లో అగ్ని ప్రమాదం నుండి తప్పించుకున్నట్లు బాల్కనీ ఎస్కేప్ రూట్లో పెళ్ళి కూతుళ్ళు జంపే. ఎటొచ్చి అవతార్ భుజా టవర్లు, లాంకోటవర్స్ వచ్చినాక బాల్కనీ జంపర్స్‌కు కష్టకాలమొచ్చింది. సిటీలో బావులు లేని లోటును బాల్కనీల నుండి తాళ్ళతో బుట్టల్ని వేలాడదీసి మనం కొంత తీర్చుకున్నా అమెజాన్, స్విగ్గీ లొచ్చి ఈ సిటీ చేదలు బందయ్యాయి.
బాల్కనీలు ఇంటికి ఏదో ఒక మూలకే ఉన్నా కొందరు వాస్తు పురుషులకు చాలా పట్టింపులే ఉంటాయి. తమ్ముడు ప్రయాగ సుబ్రహ్మణ్యం ఇటీవలే కొన్న కొత్త ఫ్లాట్లో బాల్కనీ ఈశాన్యంలో ఉంది. ఆ ఫ్లాట్ చూడ్డానికొచ్చిన వాస్తు పండిట్, ఈ బాల్కనీలో ఎట్టి పరిస్థితుల్లో బరువులు పెట్టొద్దని సలహా ఇచ్చాడట. తమ్ముడికి మాటకారితనం పిసరంత ఎక్కువే కావడంతో వెంటనే ఇంట్లో `బరువైన` వారినందరినీ పిలచి, `విన్నారుగా మీరు బాల్కనీ లోకి మాత్రం పోకండి ` అని హెచ్చరించాడు.
నా వరకు నాకు ఇంట్లో ఉన్నంత సేపూ ఇల్లే ప్రపంచం అనిపించినా బాల్కనీలోకి అడుగుపెట్టి ఒక్కసారి వీధిలోకి చూడగానే ఈ లోకమే నా ఇల్లనిపిస్తుంది. మనకు ఎన్ని కష్టాలున్నా ప్రొద్దున్నే పేపర్ చదువుతూ బాల్కనీలో కాఫీ తాగే కిక్కే వేరప్పా.
చివరగా బాల్కనీ గురించిన అందమైన కవితా వాక్యాలతో ముగిస్తా.
Why is balcony
not referred to as a room
when as a matter of fact
it often has
maximum room?
(తమ్ముడు ప్రయాగ సుబ్రహ్మణ్యంకు కృతజ్ఞతలతో)
Dear Harsha garu,
Very interesting narrative on Balconies. Enjoyed reading it sitting in my favourite place, swing in the balcony.
As usual, another gem from your thoughts. 👌
చాలా బాగుంది సార్!
చక్కని మాటలతో హాస్యాన్ని
రంగరించి మా అందరికి
బాల్కనీయం అనే కవితను అందమైన చిత్రాలతో కమనీయంగా అందించారు. కృతజ్ఞతలు 🙏🏻🙏🏻
Very nice sir
Good narration
Super.. హర్ష వర్ధన్ గారు!
సార్, నమస్తే. ‘బెల్లం’ తరువాత ఈ ‘బాల్కనీయం’ అంతే మధురం!! సినీ బాల్కనీయం ఎంతో హృద్యం! అగ్గిపిడుగు లో నాయికానాయకల బాల్కనీ దృశ్యాలు గుర్తొచ్చాయి. పడోసన్ కి బాల్కనీయే కదా మూలం!! “అంతఃపుర గవాక్షము నుండి ఓరకంట చూచినదై..! మహాకవి గుర్తుతెచ్చిన తీరు బాగుంది. ఆధునిక బాల్కనీలు పాపం కటకటాల పాలౌడం, కపోతాల బారి పడకుండా చూడటంతో..ఈ ముచ్చట కనుమరుగౌతోంది! విదేశాలల్లో బహుళ అంతస్థుల లో, ఏ బాల్కనీ నుండి తడిబట్టలు ఆరేసి వుంటాయే…అది ఖచ్చితంగా భారతీయులదై వుంటుందని ఎక్కడో చదివిన గుర్తు. మన కాలనీలలో పక్క ఖాళీ ప్లాట్ లోకి, కిచెన్ చెత్త నిండిన ప్లాస్టిక్ సంచుల మిసైల్స్ దబ్బని దాడిచేసేది కూడా బాల్కనీల నుండే!!
ఒక వెరైటీ సబ్జెక్ట్ తీసుకుని డెవలప్ చేసిన విధానానికి హేట్సాఫ్!!
హర్షవర్ధన్ గారూ! మీ బాల్కనీ ఉపాఖ్యానం బాగుంది. ఇసుమున తైలంబు తీయవచ్చు వలె ఉంది. ఒకప్రక్క చరిత్ర ను అందిస్తూ మరోప్రక్క మీ ప్రతిభా పాటవాలను అందించారు. బెంగాల్ సంప్రదాయాలు తెలియచేసారు. ద్వాపరయుగంలో బాల్కనీలు లేవని నా అనుమానం అని చెబుతూ ద్వాపరయుగంలోని ఉదాహరణలు ఇచ్చినట్టగా ఉన్నారు. కారణమేమయిఉంటుందబ్బా!
Inkaa nayam…baala ni (ammayi lani )kane ( chooche) place kaabatti…balakani annaru kaamosu…
బాగున్నది .
‘బాల్కనీ యం ‘ అని హర్ష వనము లో చూడగానే , ఏమి వ్రాసినది చదవాలని ఉత్సాహము కలిగి ముందుకు సాగగా….
పురాణకాలం నుండి నేటి వరకు సాగిన వివరణ ఆనందం , ఆహ్లాదం, తోపాటు అనుసరణీయం గాఅన్పించింది. బాగున్నది. ఈశాన్యం బాల్కనీ బరువైన మనుషులకు ప్రవేశం లేదనే హాస్యం దృశ్యం లా కనిపించింది. ఇంత కవనానికి బాల్కనీ కూడా అర్హమెనని చె ప్పినట్లున్నది. హర్షగారి ఊహాశక్తి ఆనందదాయకం. వారికి నా హృదయపూర్వక అభినందనలు.
Harsha mee
Balconyla( challani volcano)
navvula varsham lo tadisi muddayyam
I wonder the way you select a topic for your blog.They are not unknown subjects yet you make them so attractive with your flow of thought& relevant&timely satirical capsules one can’t but enjoy reading& repeat to enjoy again
🤴
ఇల్లే ప్రపంచం అయినవారిని ఇంటికంటే ఇరుకైన బాల్కనీలో నిల్చోబెట్టి ప్రపంచమంతా మన ఇల్లే అన్న భావన కలిగించడం నీ వల్లే ఔతుంది హర్షన్నా!