మేము ఐదారు తరగతుల్లో ఉన్నప్పుడు, మన వూళ్ళల్లో పది కుటుంబాల్లో ఎవరో ఒకరు హైదరాబాదులో ఉన్న రోజుల్లో యాభై ఏళ్ళ క్రితం మొట్టమొదటిసారి (వీడు ఇప్పటోడు కాదురా బాబు అని మీరు అనుకున్నా సరే) హైదరాబాద్ వెళ్ళాం. సరిగ్గా ఎర్ర బస్సెక్కో, ఆర్డనరీ స్లీపర్ క్లాసు రైల్లోనేలెండి. అప్పటికి ఇంకా మన ‘ గనన్న అన్ని ఊర్లలో ఎయిర్‌పోర్ట్‌లు కట్టని పేద రోజుల్లెండి. విజయనగర్ కాలనీలోనో, భాగ్‌లింగంపల్లిలో 2RT, MIG లో బంధువులింట్లో దిగి గోల్కోండ, సాలార్‌జంగ్ మ్యూజియంలో గడియారంలో గంటలు కొట్టడానికి తలుపు తీసుకుని బయటకొచ్చే బొమ్మల్ని నోరెళ్ళబెట్టి చూసి, ఇరాని కేఫ్‌లో చాయ్, బిస్కెట్స్ సేవించి ఇల్లు చేరుకున్నాం.
తరువాత రోజు బంజారాహిల్స్‌లో ఉన్న కలిగిన పెద్ద బంధువుల పేద్ద ఇంటికి వెళ్ళాం. మన దేవుళ్ళందరూ ఎత్తైన కొండల మీద కొలువై ఉంటే ఆ తరువాత గ్రేడింగ్ లో డబ్బు చేసిన మన పెద్దలు కొంచెం ఎత్తు తక్కువున్న జూబ్లీహిల్స్‌లోనో, బంజారాహిల్స్‌లోనో, కావూరి హిల్స్‌లోనో, బొంబాయిలో అయితే మలబార్ హిల్స్‌లోనో కొలువుదీరి ఉంటారు. మా బంధువులు ఇల్లు అంతా చూపిస్తూ ఒక గదిలోకి తీసుకెళ్ళి ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అని చూపించారు. మాస్టర్‌కు వీళ్ళింట్లో బెడ్‌రూమ్ ఎందుకు కట్టారో (ఎర్రబస్సెక్కొచ్చానని ముందే మనవి చేసా) అని ఆలోచిస్తూ, ‘ఏమోలే హోమ్ ట్యూషన్ చెప్పడానికొచ్చిన మాస్టారుకి ఆలస్యమైతే ఆ రాత్రికి అక్కడే నిదురించడానికి మాస్టర్ బెడ్రూమేమో’ అని సరిపెట్టుకున్నా. తరువాత కొంతకాలానికి బుద్ది వికసించి Master Bedroom అంటే ఇంటి యజమానిగారి శయనమందిరం (రాజుగారి గది) అని తెలిసింది.
మా తరం కుటుంబాలకు తండ్రులే మాస్టర్లు గాని, (లేని రాజ్యానికి యాసర్ అరాఫత్ అధ్యక్షుడైనట్లు) మా మాస్టర్లు బెడ్‌రూమ్స్‌లేని మాస్టర్లు. మా చిన్నతనమంతా గూడ్స్‌రైల్ బోగీల్లా వరసాగ్గా ఉన్న రెండు, మూడు గదుల్లో గడిచింది. ఆ గదులన్నీ డ్రాయింగ్ కమ్ డైనింగ్ కమ్ స్టడియింగ్ కమ్ బెడ్ రూమ్స్. ఇంకా వీలయితే పరిస్థితులు, జన సమీకరణలతో మరికొన్ని ‘కమ్‌లు’ కూడా చేరేవి. అప్పట్లో నలుగురైదుగురు పిల్లలున్న, సంసారాలైనా బామ్మలతో, మేనత్తలతో, పిన్నులతో వచ్చేపోయే బంధుజనంతో మన ఇళ్ళన్నీ ఆల్ సీజన్ జనరల్ రైలు బోగీలే. నిజానికి కొన్ని సందర్భాల్లో మాస్టర్‌కు బెడ్ దొరకడమే మహాభాగ్యం, మాస్టర్ బెడ్‌రూమ్! అంతసీనెక్కడిది! రైలుబోగీల్లాంటి ఇళ్ళల్లో సంసారం చేస్తున్నా మన గత తరం మాస్టర్స్ నలుగురైదుగురు పిల్లల్ని సునాయాసంగా కనేసి సంసార సాగరాల్ని ధైర్యంగా ఈదేస్తే మాస్టర్ బెడ్‌రూమ్సున్న నేటి మాస్టర్స్ ఒకరిద్దర్ని కని, పెంచడానికి సంతాన సాఫల్య కేంద్రాల్లో, సర్రోగసీల్లో గస పడుతుండటం చూస్తే మనవారి ‘Art of Living’ మనం ఏమి నేర్చుకున్నామబ్బా అనుకోవాల్సిందే! ప్రముఖ చిత్రకారులు బాపుగారు మద్రాసులో వారి బాల్యాన్ని గురించి చెబుతూ ‘మా అమ్మ మధ్యాహ్నాలు చీరచెంగు పరుచుకుని గడపపై చేయి ఆన్చి కునుకు తీసేది’ అని రాశారు. ఆ రోజుల్లో అన్ని ఇళ్ళల్లో గడపలే మన అమ్మలకు తలగడలు.
మా కుటుంబంలో పిల్లలంతా మా మామగారింట్లో వేసవి సెలవులకు చేరితే రాత్రి చివరగా నిద్రపోయేవాడు అంతకుముందు నిద్రపోయిన పిల్లల దిండు సంగ్రహించి నిద్రపోయేవాడు. ప్రొద్దున ఎవరి తలలకింద దిండ్లు ఉంటే వాళ్లు చివరగా నిద్రపోయినట్లు లెక్క. ‘‘ప్రస్తుతం ఒక్కరు లేక ఇద్దరు పిల్లలే కావడంతోవారి డిమాండ్లు పెరిగిపోయాయి కానీ మన చిన్నప్పుడు మనల్ని ఎవరు పెంచారు సార్ ఏదో ఆయుషుండబట్టి పెరిగి బతికి పోయాంగానీ’’, అన్న మా కొలీగ్ కిరణ్‌కుమార్ తరచూ గతంలో నాతో అన్నమాట చాలా నిజం.
ఇలా 1 RT, 2RT LIG, MIG లుగా మొదలైన మన గృహప్రస్థానం ఆకాశానికెగసి 40 అంతస్తులతో నిజంగానే Avatar టవర్స్ అయి పోయాయి. నాకైతే ఇలాంటి టవర్స్‌లో ఇరవై అంతస్తులు దాటిన వాళ్లు ఆకాశంలో మంచమేసుకుని పడుకున్నట్లుంటారు. ఇంకా పైకిపోతే ఏ పైలెట్లో కాస్త కిందకొస్తే 9/11 యేగా! ఒక్కసారి ఈ టవర్స్ పార్కింగ్‌లోకి ప్రవేశిస్తే కురుక్షేత్రయుద్ధంలో విశ్వరూప సందర్శనతో బెంబేలెత్తిన అర్జునుడు ‘ప్రభోకృష్ణ పెక్కు ఉదరములతో, బాహువులతో నీరూపము ఆది అంతములు తెలియక భయము గొలుపుచున్నదన్నట్లు పెక్కు పార్కింగ్ లెవల్సులో నా కారును గుర్తించుట కష్టమగుచున్నది’ అని అనుభమవుచున్నది. అలాంటి B1, B2, B3ల్లో మనకారును మనం గుర్తుపట్టడం కంటే ట్రెజర్ హన్ట్‌లో ట్రెజర్ కనుక్కోవడమే సులభం. నాకు పంజాబ్ వెళ్ళినప్పుడల్లా తలపాగాలు, గడ్డాలతో ఉన్నవాళ్ళను చూసినప్పుడు వీళ్ళ భార్యలు వారిని ఎలా గుర్తుపడతారో అనే డౌట్ వస్తుంటుంది. ఇలాంటి చోట్ల గెస్ట్ పార్కింగ్ కోసం బామ్మగారికి మన ఇళ్ళల్లో మెట్ల కింద గదిచ్చినట్లు పార్కింగ్ ఏ మూలకో పెట్టి చంపుతారు. మన ఆధార్‌కార్డులు, హరోస్కోపులు, సెల్‌నెంబర్లు తీసుకుని మన మెడలో విజిటర్ బిళ్ళేసి, వీలేసి మీ పాట్లు మీరు పడండని మయసభలోకి మనల్ని వదుల్తారు.
అమెరికా వాడు మనకంటగట్టిన అలవాటుతో మన టాయిలెట్స్, బాత్రూమ్స్ కాస్తా రెస్ట్ రూమ్స్ అయ్యాయి. అమెరికా వాళ్ళకు రెస్ట్ దొరికే ఒకేచోటు అదే కావడంతో వాళ్ళు Rest Rooms అని పిలుచుకోవడం బాగానే ఉంటుంది కానీ ఎప్పుడూ Rest తీసుకునే మనం కూడా వాటిని అలా పిలవడం గొప్పకోసమే. ఇవి చాలకవాళ్ళు 2.5, 3.5 Bath అనే లెక్కలు మనకిచ్చారు. వాస్తవానికి 0.5 అనేది టాయిలెట్‌కు ఎక్కువ బాత్రూమ్‌కు తక్కువ. మన సినిమాల్లో కమెడియన్‌కు ఎక్కువ విలన్‌కు తక్కువ రోల్స్‌లా.
టవర్స్ కన్నా మన విల్లాలే మిన్న. Gated Community లోనో విల్లాల్లోనో ఉంటున్న కొంతమంది ఎప్పుడూ Insecure గా, Obsessed గా ఉండటం నిజం. లంకంత ఇల్లు. అది Maintain చేయడానికి నలుగురైదుగురు పనివాళ్లు అవసరం. పనివాళ్ళు వస్తే భయం, రాకపోతే ఆందోళన. విల్లాలు కొనేస్థాయి (ఎక్కువమంది విషయంలో) వచ్చే సరికి పిల్లలు అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అధమపక్షం బెంగుళూరు, బొంబాయిల్లో. విల్లాకు కాపలాదారులైన మన పెద్దలు (విల్లాలన్నీ డూప్లెక్స్‌లే కావున) పనివాళ్ళు పైన గదులు శుభ్రం చేయడానికి వెళితే (పరీక్షహాల్లో ఇన్‌విజిలేటర్స్‌లా) గమనించకపోతే ఇంట్లో సామాన్లు గల్లంతవుతాయని భయం. మన ఇటాలియన్ మార్బుల్, అద్దాలు మెరపించడం కోసం వాళ్ళ మూలగలు అరగించేయడం (మోతాదుకు మించి వారితోపని చేయించేవారు) మళ్ళీ జన్మలో రోల్‌రివర్స్ అయి (కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారే సుమా అండి) కర్మఫలం అనుభవించాల్సి వస్తుందేమో జాగ్రత్త పడితే మంచిది. పనివాళ్ళు రాకపోతే ఈ పనంతా ఎవరు చేస్తారన్న ఆందోళన. వాళ్ళకు కాపలా కాసి, ఒక్కసారి పైకెక్కి దిగేసరికి వీళ్ళ పనైపోతుంది. పైకి ఎక్కడం మళ్ళీ పని వాళ్ళతోనే.
ఎప్పుడైనా సెలవలకు మనవలు, మనవరాళ్ళు వచ్చినా వాళ్ళూ ఆ మెట్ల మీదనుండి ఎక్కడ పడిపోతారో అని గేట్లు పెట్టి, పైన కట్లు కట్టి వాళ్ళను కట్టడి చేస్తారు. కరోనా కాలంలో విల్లావాసులకు పనివాళ్ళ కష్టాలు కొంతలో కొంత తెలిసి రావడంతో పాటు ఏదో సినిమాలో బ్రాహ్మి ప్యారిస్ ఇంత పెద్దదని ఇప్పుడే తెలిసిందన్నట్లు మా విల్లా ఇంతపెద్దదని ఇప్పుడే తెలిసొచ్చిందనుకున్న వారూ తక్కువేంకాదు. అమెరికా వెళ్ళి నోళ్ళల్లో కాఫీ తాగుతున్నాం అన్న ఆనందంకన్నా కప్పులు మనమే కడగాలన్న విషాదం వెన్నంటి ఉన్నట్లే విల్లాల్లో ఉన్నవాళ్ళకు పనివాళ్ళు ఎవరూ రాకపోతే మనమే ఇదంతా చేసుకోవాలన్న విల్లాపం నీడలా వెంటాడుతుంటుంది.
మనవాళ్ళ విల్లాలో లివింగ్ రూమ్‌లో Antique pieces (భోషాణాలు, పందిరిమంచాలు, పాతలాంతర్లు, మరచెంబులు, ఇత్తడి క్యారేజీలు, అట్లకాడలు, తపేళాలు, ఇత్తడి, రాగికాగులు వెలిసిపోయిన పటాలు) ఎన్నిఉంటే అంత Modern living. ఇక్కడ Except husbands, నగలతో సహా అన్నీ Antique look యే! విల్లాలో ఈ Paradox చూసినప్పుడు బీహార్లో ఇళ్ళగురించి గతంలో ఎప్పుడో విన్న విషయం గుర్తొస్తుంది. అక్కడ ఇళ్ళకు బయటవైపు ప్లాస్టరింగ్ చేయిస్త్తే మున్సిపల్ టాక్స్ నాలుగురెట్లు ఎక్కువట. అందుకని బయట గోడలకు No Plastering, లోపల (వోతో అందర్‌కీ బాత్‌హై) ఇంద్రభవనాలేనట. మన విల్లాలు దీనికి రివర్స్. లోపల antique బయట exotic.
ఈ విల్లాల్లో ఉన్న ఒకే ఒక్క గొప్ప సౌకర్యం ఇంట్లోనే ఉంటూ ఒకరికొకరు SMS లు ఇచ్చుకోవచ్చు. ‘Please come down for dinner, Do you need coffee’ లాంటివి. మా బ్యాచ్‌మేట్ ఒకాయన డూప్లెక్స్ విల్లాలో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్న పుత్రరత్నానికి స్టడీరూమ్‌గా పైగది కేటాయించాడు. ‘బాబు బాగా బిజీ’ అనుకుని కిందకు రానివ్వకుండా వేళకు టీలు, భోజనం, టిఫిన్స్ కొత్తల్లుడికి పంపినట్లు పైకే పంపించాడు. పైన మన మైనర్‌బాబు చదవాల్సినవి చదవడం మానేసి, చూడకూడని ‘సైట్లన్నీ’ చూసేసి ‘సైట్’ తెచ్చుకుంటే ఇదంతా తెలియని తండ్రి మురిసిపోతుంటే మనవాడు డజను బ్యాక్‌లాగ్స్‌తో నాలుగేళ్ళ కోర్సు చాలా వేగంగా ఏడేళ్లలో పూర్తిచేయడంతో మైనర్ బాబుగారి నిర్వాహం బయటపడి Son Stroke తో తండ్రి మూర్చబోయి గవర్నమెంటోరి భాషలో For better monitoring (గుంటూరోళ్ళ అల్లుడిలా) వాడి బస కిందకు మార్చబడిరది.
విల్లాలో కిట్టీల కష్టాలకూ కొదవేమీ లేదు. ఎక్కువసార్లు మేడమ్స్ ఎదుటవారి మంచి గుణాలను కాక వారు ధరించిన డైమండ్స్‌నో, డ్రస్సులనో గుర్తుంచుకొనుటతో విల్లా యజమానులకు రోజూ డ్రస్సింగ్‌డౌనే. సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకు వచ్చే శ్వాస సంబంధమైన Occupational hazards వలెనే Villa Hazards విల్లా వాసులకు తప్పవుమరి.
అసలు ఈ Villa అనే మాటే లాటిన్ భాషలో ఊరి చివర పొలాల్లో కట్టుకున్న పెద్ద ఇళ్ళకు వాడేవారు. క్రమేణా ఈ విల్లాలో ఉండే మోతుబరి rustic రైతులను Villian (విల్లావాసులు) అని పిలిచేవారట. ఆ Villian అన్న పదమే కాలానుక్రమంలో మన సినిమాల్లో విలనైపోయింది. ఇలా మోటుతనం కాస్తా అర్థం మారి విలనీ అయిపోయింది. విల్లా వాసులందరూ కొత్త సినిమాల్లో విలన్స్‌లా కాకుండా పాత అర్థమొచ్చే విలన్లుగా (ఉత్తమ విలన్ కమలహాసన్ టైటిల్లా) ఉంటే వారితో ఎవరికీ ప్రమాదం లేదు. ఎటొచ్చి వారు మన తెలుగుసీరియల్స్ విలన్లయితేనే ప్రజలకు కష్టాలు.
కొన్ని విల్లాలోకి ప్రవేశించడానికే విపరీతమైన సెక్యూరిటీ చూసినప్పుడు మన విల్లాలోకి మనం వెళ్ళడానికీ విలవిల్లాడటం విధివిలాసం అనుకోవాల్సిందే. విల్లాల సెక్యూరిటీ మీద మా బంధువు చెప్పిన జోకొకటి గుర్తొస్తుంది. ఆయన విల్లాలో ఉంటున్న ఒక సినీ నిర్మాతకు అప్పిచ్చాడు. సినిమా ఫట్ అవ్వడంతో నిర్మాత (మనకు తెలిసిన అప్పు తీసుకున్నోళ్ళ రొటీన్ స్టోరీనే) అప్పిచ్చినాయన ఫోన్ ఎత్తడు, చిక్కడు దొరకడు. విల్లాకుపోయి నిలేద్దామంటే అతని పర్మిషన్ లేకుండా సెక్యూరిటీవాడు లోనికి వదలడు. అప్పుడు మా బంధువుకి అప్పిచ్చినోడికంటె అప్పుపుచ్చుకున్నోడికే సెక్యూరిటీ ఎక్కువన్న విషయం బాగా తెలిసొచ్చింది. ప్రజాధనం దర్జాగా దోచుకుని బ్యాంకుల్ని ముంచి సెక్యూరీటీతో విదేశాల్లో విహరిస్తున్న విజయ్‌మాల్యా, నీరవ్ మోడీలే నేటి నిజం.
‘ఎంత చెట్టుకి అంత గాలి’ అనేది పాతసామెత. ‘ఎంత విల్లాకు అంత అప్పు’ అనేది కొత్త సామెత. గోదారి జిల్లాలో గొప్పకు పోయే వాళ్ళ గురించి ఒక మాట చెప్తారు. అక్కడ ఎంత పెద్ద కారుంటే ఆయనకు అంత అప్పు ఉంటుందట. అందువల్ల బెంజి, ఆడికార్లలో తిరిగే బడాయిబాబుల కంటే మారుతి 800, స్విఫ్ట్ డిజైర్‌లో తిరిగే వాళ్ళకు అప్పివ్వడమే సేఫ్. ఇలా చేస్తే అప్పిచ్చువాడు వైద్యుడు కాకపోయినా రోగిమాత్రం కాడు.
ఎంతో సరదాపడి ఇటీవలే విల్లా కొనుకున్న మిత్రుడు విల్లా మెయిన్‌టెనెన్స్ కోసం ఇంకో ఇల్లు అమ్మాల్సొచ్చేట్లుందని వాపోయాడు. ఇంత కష్టపడి కొనుక్కున్న ఇల్లుని నేను మైన్‌టెయిన్ చేయడం కాదు అదే నన్ను మైన్‌టేన్ చేస్తోందనేది అతనికి ఆలస్యంగా అయిన జ్ఞానోదయం. డ్రీమ్‌హౌసనుకున్నది Nightmare అవ్వడం అంటే ఇదేమరి. కొంతమంది విల్లా పుంగవులు ఎక్కడికైనా (గుడికైనా సరే) నిక్కర్లేసుకునే పోతూ (పిల్లలు అమెరికా వాసులగుటచే) Will catch up, Awesome, That’s great, got it, Sounds good, Ping me, hangout, wassup, Did you try Sushi in L.A? అనేసుకుంటూ, అవకాడో, కివీ, బ్రొకలే, సెలెరీ తినేస్తూ, స్టార్‌బక్స్ కాఫీలు తాగేస్తూ, కీటో, మెడిటరేయన్, నాటోడైట్లు గురించి చర్చించుకుంటూ తగలెట్టేసిన కెలరీలను లెక్కేసుకుంటూ, SVU ల్లో వీకెండ్స్ గోల్ఫ్ ఆడేస్తూ (బ్యాట్ తిరగేసైనా పట్టేసుకుని) గడిపేస్తుంటేనే విల్లా నివాసం ఉల్లాసంగా ఉంటుంది. ఇంటికొచ్చిన గెస్ట్‌లను నాలుగైదు పెట్స్‌తో నాకించేస్తూ మధ్యమధ్యలో “No Darling” (మనల్ని కాదులెండి) Don’t Worry అవేమీ చేయవు. అంటుంటే మీరు విల్లాకు ఫర్పెక్ట్ మ్యాచింగ్. ఇవేమీ చేయకపోతే మీరు విల్లాకు అన్‌ఫిట్టే!
ఇలా కొంతమంది మిత్రుల విల్లా వెతలు విన్న తరువాత కరుణశ్రీజంధ్యాల పాపయ్యశాస్త్రిగారు రచించిన పుష్పవిలాపంలోని …
‘‘మా వెలలేని ముగ్ధ సుకుమార
సుగంధ మరంధ మాధురీ జీవితమెల్ల
మీకై త్యజించి, కృశించి నశించిపోయి
మాయవ్వనమెల్ల కొల్లగొట్టి
ఆపై చీపురుతోడ చిమ్మి
నరజాతికి నీతి ఉన్నదా’
అన్న మాటలు ఏ విల్లాలో పనివాళ్ళను చూసినా నాకు పదేపదే గుర్తుకొస్తాయి.
నాతోపాటే ఎందరో ‘విల్లా’పాన్ని చూసిన కవిమిత్రులు కిల్లాడ సత్యన్నారయణగారు ఇళ్ళు పెద్దవయ్యే కొద్దీ మనసులు ఇరుకై పోతున్నాయని గమనించి ఏకంగా ‘విల్లా’ మీద మంచి కవితే రాసి అందులో …
‘‘ఒక్కో విల్లా ఒక్క ప్రపంచం
ఎవరి ప్రపంచం వారిదే …
ఎవరిగది వాళ్ళదే
ఎవరి సుఖం వాళ్ళదే
ఎందుకోగానీ
విల్లా ఎంత ప్రయత్నించినా
ఇల్లు కావడం లేదు …’’
అంటూ ….
‘‘పాకంలో ముంచడం మరచిపోయిన
జిలేబీలా
విల్లాల్లో జీవం లేదు
అందుకే
విల్లా ప్రయాణం ఎప్పుడూ
ఇల్లువైపే సాగాలి ….’’
అని హెచ్చరించారు.
ఆత్మీయులు కిల్లాడ సత్యనారాయణ IPS (వారణాశి కొత్వాల్) గారికి నమస్సులతో..
Well said. Enjoyed reading it.
Very true and beautiful writeup Sir,
Enjoyed reading it .
ఏమని వర్ణించను? కమనీయం !
నలుగురు స్నేహితులతో కలసి చదువుకుంటే చాల బాగుంటుంది.
యం.రాధాకృష్ణ మూర్తి.
విల్లావాసుల “విలవిల్లాప” విచిత్ర గాథలు కళ్లకు కట్టినట్లుగా వివరిస్తూ కథనాన్ని వినోదభరితంగా విజ్ఞాన దాయకంగా నడిపించిన తీరు కమనీయం.
Mee raathalu entha madhura mante, mundugaa sonthaniki oka sari chaduvukoni, like minded friends andarikee forward chesesi, kaneesam iddaru muggurukaina chadivi vinipinchaka pothe న్యాయం chesinatlu undadu mari. Uchitanga vastondi గదా!. Ee rojullo 10 nimishalu pleasure kavalanna dabbu ఖర్చ pettali mari😀
Thank you for giving us free pleasure, harsha anna.
Beginning with’ It is not how big the house is, it’s how happy the home is’ , ‘Villa’pam presents a clear analysis of our (most of us) journey from small houses to the so called Villas.
Being Villian (owning a big house) is a pride to many despite the drawbacks in possessing it and do not project the negative aspects (many are not willing to share issues related it).
The manner in which ‘ Villapam ‘ was presented is quite humorous and interesting.
Thank you sir for sharing ‘Villa’pam.
హర్షవర్ధన్ గారి విల్లా పం చాలా బాగుంది. హర్షవనం లో రకరకాల మొక్కలతో నవ్వు ల పువ్వులు పూయిస్తున్నారు. అన్నట్టు ఈ గుంటూరోళ్ళ అల్లుళ్ళ సంగతి ఏంటి?
బావుంది మీ
‘విల్లాయ తాండవం..’
కళ్లకు కట్టినట్టు,
మనసు పొరలు ఏదో కదిలించినట్లు,
జీవం లేని ,సజీవమైన జీవితాలను ….సోదాహరణంగా స్పష్టం గా చెప్పారు సార్
బావుంది విల్లాప సల్లాపాలు….
అవును సారూ….ఈ ” గుంటూరోళ్ల
అల్లుళ్ల కథేంటి”….?
అమెరికా రొటీన్ మాటలు ఇట్టే పట్టేసారు సుమ్మీ…
కరోనా నేపధ్యంలో విల్లా విలనీయుల విలాపాలను బహు చక్కగ మీదైన తీరులో హృద్యంగా చిత్రించారు బాగుంది👌👌🙏🏼———చలం
గొప్ప వాళ్ల విలాప గృహాలను విల్లా అంటారని తెలియచెప్పేరు. ఎంతో ఖరీదయిన దరిద్రం అనుభవిస్తూ హాయి గా నటిస్తూ బ్రతికేస్తూ ఉంటారు
హర్షవర్ధన్ గారూ విల్లాలో ఉంటున్న వాళ్ళందరూ , భుజాలు తడుముకునేట్టు రాశారు సర్…మరీ గ్రేట్ observer . చాలా బావుంది.
Simply outstanding VILAAPAM on VILLApam.
The reality and associated additional burdens of living in Duplex/Triplex Villas is very well narrated in Harshaji’s VILLApam.
As usual another gem from Harshavanam.👌👍
హర్ష వనం లో ఆనంద సందోహాలు , మది పులకించే మధుర జ్ఞాపకాలు ఆ పాత మధురాలు హృదయాన్ని స్పృశిస్తూ రవంతసేపు ఓలలాడిస్తూ మొత్తానికి హర్షాతిరేకంగా 🙏🙏🙏
‘ఇల్లంతా సందడి’ అనే మధురమయిన situation కు దూరం చేసిన ‘విల్లాల’ కథను బహు చమత్కారంగా రచించినందుకు అభినందనలు హర్ష గారు. విల్లా లు విల్లన్స్ మధ్య సామీప్యాన్ని గూడా చక్కగా చెప్పారు.
హర్షవర్ధన్ గారికి నమస్సులు. ఇంటికి మనిషికీ సంబంధం అనాదిది. ఆ సంబంధం ఎప్పుడు మధురమో, ఎప్పుడు మనోహరమో, ఎప్పుడు వికారమో క్రమవికాసంలో చూపించారు. చాలా అద్భతంగా రాశారు. చదువుతుంటే చాలా హాయిగా ఉంది. ఆలోచిస్తే చురుక్కు మంటుంది. ఇంటి నుంచి విల్లాకు ప్రయాణంలో ఇల్లును మనం ఊ ర్లో నే విడి చి పెట్టి నగరంలోని విల్లాల్లో బిక్కుబిక్కు మంటున్నాం. మధ్య మధ్యలో మంచి satire పంచ్ లు యిచ్చారు. చాలా బాగుంది సార్.
ఈ ఆధునిక ప్రపంచంలో ప్రస్తుత జీవన శైలికి “విల్లాపం” ఓ దర్పణం. సమర్పించిన అక్షరసత్యం మరింత “హర్ష”ణీయం. రచనా చతురత కడు అభినందనీయం. వాస్తవాలకు హాస్యం మిళితం చేసి వాటికి కాసిని చమక్కులు అద్ది వండి వార్చిన మాంఛి పలావు లాంటిదీ “విల్లా”పం. అదేంటో అజీర్తి చేయడం అటుంచి పొట్టచెక్కలయ్యేట్లు నవ్వాల్సివచ్చింది. మూడాఫ్ గా వున్నప్పుడు ఇదిచదివిన తరువాత మనసు కాస్త కుదుటపడ్డమే కాదు మరింత రెజువెనేట్ అయ్యాననిపిస్తోంది. 😀😀😀
“విల్లా” పం అంటే ఏంటో అర్ధం అయ్యే లోపే…
కాసేపైనా…
విల్లా వాసులు విలపించేట్లు,(ఉడుక్కుంటూ)
విల్లా కల బాసులు మురిసేట్టు,(కల తీరనందుకు)…
సాగింది హర్ష వనం విహారం
…విల్లాల్లో ఉన్నవాళ్ళకు పనివాళ్ళు ఎవరూ రాకపోతే మనమే ఇదంతా చేసుకోవాలన్న విల్లాపం నీడలా వెంటాడుతుంటుంది….వంటి సత్యాలని చెప్తూ…ఇంటికొచ్చిన గెస్ట్‌లను నాలుగైదు పెట్స్‌తో నాకించేస్తూ మధ్యమధ్యలో “No Darling” (మనల్ని కాదులెండి) Don’t Worry అవేమీ చేయవు. అంటుంటే మీరు విల్లాకు ఫర్పెక్ట్ మ్యాచింగ్……
..చదివినంత సేపూ తెగ నవ్వించేసారు..సర్.
మీ హర్ష వనం లోకి వెళితే…నవ్వుతూ హాయిగా తిరుగుతూ… ఆఫీసు లో పడ్డ వర్క్ ప్రెషర్ అంతా మరచి
పోయేలా మీ ‘విల్లా’పం……మిత్రులకి ఫార్వర్డ్ చేసే కంటే రాత్రి డిన్నర్ కాగానే లేదా ఓ వీకెండ్ లో కాన్ఫరెన్స్ కాల్ లో నలుగురు మిత్రులతో కలిసి చదువుతూ ఆనందిస్తూ ఉంటాం…
చాలా చాలా బాగుంది….👌👌💐💐🙏🙏
మరిన్ని మీ పెన్ను నుండి
జాలు వారతాయని ఆశిస్తూ….
నీవు రాసేవన్ని అక్షర సత్యం. అంతకు ముందు పిండి మర కానీ ఇప్పుడు విల్లా గురించి కానీ పూర్తి గా మన అందరి అనుభవాలే. అఫ్ కోర్స్ నాకు విల్లా భాదలు లేవు. చిన్నప్పటి జీవితాలు మనందరివి ఒకటే. “మన చిన్నప్పుడు మనల్ని ఎవరు పెంచారు సార్ ఏదో ఆయుషుండబట్టి పెరిగి బతికి పోయాంగానీ’’, అన్నది నిజం.
బాగుంది
wonderful description on Modern life’s aberrations and blind imitation
of western life at the cost of our culture and peace.
how we lost the famiy connect by living for others is vividly described by Harsha garu.
keep going sir
Dilip.c.Byra
True picture of Villa living compared to that of olden days brought into one frame…it’s nice explanation….It’s serious other wise there is no home found except all houses with no living
రెండు మూడు గదుల ఇల్లునుండి మొదలు పెట్టి… విల్లా ల వరకు.. జీవన విధానాలను కళ్ళకు కట్టినట్టు చెప్పినారు సర్… మంచి సరదాగా హస్యో క్తంగా… చదువుతున్నంత సేపు.. నవ్వుకుంటూనే వున్నా సర్ 👌🏼👌🏼👌🏼… కృతజ్ఞతలు 😊🙏🏼
బాగుగా విల్లవిన్నవించారుగా !