Marriage looks – Changing out-looks
మా నాన్న శ్రీరామ్మూర్తి గారు చేసింది పోలీసుద్యోగమైనా `సివిలైజ్డ్’గా ఉండేవారు. వారి సివిలైజ్డ్‌నైస్‌కు సాత్త్విక గుణం తోడవడంతో వారు రిటైరైన తరువాత బై-ప్రోడక్టుగా ఇరవై ఏళ్ళకు పైగా మ్యాచ్ ఫిక్సింగ్ (IPL కాదని మనవి) చేసేవారు. అందువల్ల మా ఇల్లు ఎప్పుడూ మ్యారేజ్ లింక్స్ ఆఫీసుకు ఎక్స్స్టెన్షన్ కౌంటర్లా జనాలతో కళకళలాడుతూ ఉండేది. రామోజీ ఫిల్మ్ సిటీలో పర్మినెంట్‌గా వేసిన కోర్టుహాల్, పోలీస్ స్టేషన్ సెట్ లాగా మా లివింగ్ రూమ్‌లో ఆరేడు కుర్చీలు రెండు టీపాయ్‌లు. నాన్నగారు కాలకృత్యాలు ముగించుకుని టిఫిన్ తిని తొమ్మిది గంటలకు RTO, రిజిస్ట్రేషన్, ట్రెజరీ ఆఫీసుల దగ్గర కాయితాల పనివాళ్ళ లాగానో, రైటర్స్లాగానో, డైరీలు ఫోల్డర్స్తో కూర్చుంటే సందర్శకుల సందడి మొదలై చిన్నలంచ్, టీ బ్రేక్‌లతో రాత్రి ఏడెనిమిది వరకూ ఫిక్సింగ్ సెషన్స్ నడిచేవి. ఈ లోపు కింద పెట్టేసిన ఖాళీ కాఫీ కప్పుల ఫుట్‌బాల్ గేమ్ కూడా అయిపోయేది.
ఇలా పెళ్ళిమాటల సెషన్స్ ముమ్మరంగా నడిచే రోజుల్లో అటు ఇటూ తిరుగుతూనో, పేపరు చదువుకుంటూనో నేనొక చెవి అటువైపు వెయ్యడంతో, ఈ ప్రక్రియలో ఆలోచనాధోరణిలో కాలానుగుణంగా వచ్చిన మార్పులు చూడడం జరిగింది. మొట్టమొదట్లో పెళ్ళికూతుర్ల వివరాలలో B.A, B.Sc చదివారనో, సంగీతమో, నాట్యమో, వంటో వచ్చనో ఉండేవి. మా అమ్మాయికి కార్డు ముక్క రాయడం వచ్చు అనో, పిల్లలకు చదువు చెప్పుకునే పాటి చదువు చదివిందనో చెప్పేవారు. తరువాత కాలంలో అమ్మాయిల వివరాలు పెళ్ళికోసం కాకుండా ఉద్యోగాల C.V ల్లాగా C++, Java, Python (Language వరకే అయితే ok.. సైతాన్, కోబ్రా లాంగ్వేజెస్ కాకపోతే పర్వాలేదు అనే స్థాయికి చేరాము), అమ్మాయి మిగతా వివరాలతోపాటు ఏవరేజ్ కాంప్లెక్షన్, Red, Pure White, Milky white తో పాటు Wheatish (గోధుమ తాచులాగానేమో) అని రకరకాల షేడ్స్ పెట్టేవారు. ఒకరోజు పాత టెలిఫోన్ రంగులో (Fast color) ఉన్న పెళ్ళి మాటలకొచ్చిన ఒక అమ్మాయి తండ్రి మా నాన్నగారితో, ‘మా అమ్మాయి Pure White’, అని చెప్పడం విని నేను ఆందోళనలతో కూడిన సంశయంతో వారి మోహంలోకి చూస్తే నా భావం గ్రహించిన వారు ‘‘అమ్మాయి అంతా వాళ్ళ అమ్మ కలరండి’’ అనడంతో కుదుటపడ్డా. గతంలో ఉన్న కుటుంబ గౌరవం, అమ్మాయి గుణగణాలకు ఉన్న ప్రాముఖ్యత కొంతలో కొంత తగ్గి ఉద్యోగం, ఆదాయం, ఆస్తిపాస్తులకు ప్రయార్టీ పెరిగింది.
పెళ్ళికి ఫొటోలు ఇవ్వడం పెద్ద టాపిక్. గతంలో మనుషుల ముక్కు, మొహాలు కనబడేలా ఇస్తే ప్రస్తుతం తల ఎత్తుకుని, వంచుకుని, కూలింగ్ అద్దాల్తో చెట్టుకు ఆనుకునో, (అమెరికా పెళ్ళి కొడుకైతే ఖచ్చితంగా) కారుకి ఆనుకునో, బైకెక్కో, జిమ్‌లో సైకిల్ తొక్కుతూనో గడ్డాల్తో, జులపాల్తోనో పెడతారు. ఇటీవల ఒకానొక పెళ్ళికొడుకు అన్ని ఫొటోలు మంకీక్యాప్తోనో, హ్యాట్తోనో పెడితే కొందరు అన్వేషకులు అంతర్జాలాన్ని శోధించి మాయాజాలాన్ని చేధిస్తే ఏతావాతా తేలిందేమిటంటే పెళ్ళికొడుక్కి ఎకరాలెకరాలే పోయి బొత్తిగా మైదానం అయిపోయింది. ఎవరో ఈ మాట నాతో అంటే పెళ్ళి కూతుళ్ళ మనసులో మరులు గొలిపించడం మా ప్యాకేజీలో లేదు కానీ మా బంధువు డాక్టర్ రాధారాణి (ఉత్తమ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్) సాయంతో భారీ డిస్కౌంట్‌తో తలపై కురులు మొలిపించి Baldness నుండి Boldness కు రప్పించేయగలమని బోల్డు భరోసా ఇచ్చి ముందుకు నడిపిస్తామని హామీ ఇచ్చేసాం.
మరికొందరు తండ్రులు అమ్మాయి ఫొటోలు పంపము అని వివరాలు మాత్రం పంపుతారు. టెక్నాలజీ పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో అవతలి వాళ్ళు Facebook, Linkedin లాంటివి మధించి అసలు విషయం గ్రహిస్తారన్న విషయం వీరు గ్రహించలేరు. వంద మంది ఉద్యోగుల మధ్య అమ్మాయి work చేస్తున్నా పెళ్ళి చేసుకోబోయేవాడికి ఫొటో పంపమనడం కొంచెం తేడాగా లేదు.
పూజ్యులు బాపు, రమణలు వయస్సులో ఉండగా ఎవరింటికైనా పెళ్ళిచూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయి పాదం కుదురు, నడక ఎలా ఉందో చూసేవారట. పాదం కుదురైతే నడత, నడవడిక బాగుంటుందని వారి నమ్మిక. రమణ గారితో పెళ్ళిచూపులకు వెళ్ళినప్పుడు పెళ్ళికూతురు పాదాలు చూడటానికి వారు పడ్డపాట్లు కోతికొమ్మచ్చిలో రసవత్తరంగా చెప్పారు. ఇలాంటివి పోయి ఆస్తిపాస్తులకుపోవడంతో పెళ్ళిళ్ళు కుదర్చే వారు అమ్మాయికి 5CR, 10CR మాటలు మొదలు పెట్టేసారు. నాకు తెలిసిన CR అంటే CR – Reddy గారే ఏలూరులో CR – Reddy కాలేజీనే.
పిల్ల కొంచెం అటు ఇటుగా ఉంటే శివాలయంలో శివుడ్ని నంది కొమ్ముల మధ్య నుంచి చూసినట్లు, అటు రెండు CR ఇటు రెండు CR మూటల మధ్య నుంచి వాటిని నిమురుతూ పిల్లని చూపిస్తూ కొండొకచో ‘ఊ అంటవా బాబు ఊహు అంటావా బాబు’ అని చివరకు ఊ అనిపించేస్తున్నారు. ఈ మధ్య పెళ్ళిచూపులకు వెళ్ళిన కుర్రోడు మరీ మొహమాటపడుతుంటే పెళ్ళికూతురే ఒక అడుగు ముందుకేసి ‘Be comfortable and feel free to ask any questions’ అని పెళ్ళికొడుకును కుదటపరచి (HR లోనో మార్కెటింగ్లోనో పనిచేస్తుండటంతో) పెళ్ళికుదుర్చుకుందని విని ఔరా అనుకొన్నా.
గతంలో వైజాగ్‌లో పనిచేస్తుండగా మిత్రుడు అగర్వాల్గారికి అగర్వాల్ ఇమేజస్ అనే స్టూడియో ఉండేది. మంచి ఫొటోగ్రాఫరైన అగర్వాల్ ఎలాంటి అమ్మాయినైనా కాజల్ లాగానో, ఐశ్వర్యరాయ్ లాగానో కమ్ సే కమ్ రాశీఖన్నా లాగానో ఫొటోలు తీయగల దిట్ట. ఆ ఫొటోలు చూసి పిల్లని చూడ్డానికొచ్చి కొంతమంది నిరాశకు గురై గొడవలై పోతుండటంతో ఒకరోజు అగర్వాల్ భాయ్‌ని కలిసి ఈ మాటే అనేసాను. అగర్వాల్ గారు ‘‘సార్ వంద అబద్దాలైనా ఆడి ఒక పెళ్ళి చేయమన్నారు. నేను ఆడింది ఇది ఒక్కటే. నేను నా టాలెంట్‌తో నా ఫొటోలతో ఆవాహా ఆవాహ అని పెళ్ళి కొడుకుల్ని అమ్మాయిని చూడ్డం వరకు సాయం పట్టేస్తున్నా. మిగతా రాయితీల్తో మీరు మేనేజ్ చేసుకుని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవాలి అని ముక్తాయించాడు. ఆ తరువాత జనం వారి ఫొటోలకు ఆషాఢం డిస్కౌంట్లు ఇచ్చుకుంటూ అలా ‘ముందుకు’ పోతుండేవారు.
ఈ మధ్య skype లో నెల రోజులు ముచ్చటించుకున్న అమెరికా వరుడు would-beని మొదటిసారి కలవడానికి హైదరాబాద్‌లో మాల్ ఎంచుకుని మాంఛి బిల్డప్‌తో నిక్కరేసుకుని వస్తే పవర్‌స్టార్, మెగాస్టార్ సినిమాలు చూసే అమ్మడు ఠఠ్! ఫస్ట్ అప్పియరెన్స్ మరీ నిక్కరేసుకునా అని ‘నో’ చెప్పేసిందట. Facebook లో ఛాటింగ్స్తో బంగీ జంపింగ్ చేస్తున్నంత థ్రిల్లై ముందుకెళ్ళి పెళ్ళాడిన మరో సాహస బాలుడు పెళ్లైన తరువాత అది తాడు కట్టుకోని బంగీ జంపేనని ఆలస్యంగా తెలుసుకున్నాడు.
కొంతమంది డబ్బు చేసిన తండ్రులు మా అమ్మాయికి కాఫీపెట్టడం కూడా రాదు అనో, ఎండ కన్నెరగకుండా పెంచాం అనో చెప్పడం విన్న నేను మనస్సులో ఎవడి దుంపతెంచడానికో లేక లాంఛనాలతోపాటు డి విటమిన్ టాబ్లెట్స్ కూడా ఇస్తారేమో అనుకునేవాడ్ని. అమెరికా వలసలు మొదలైన కొద్దిరోజుల తర్వాత అబ్బాయి తండ్రులు కొంత మంది పైన చెప్పిన వాళ్ళను మించిపోయేవారు. మా వాడికి అస్సలు తీరికుండదండి, రోజూ బిల్ గేట్స్తోనో, వారెన్ బఫేట్తోనో (ఆ కంపెనీల్లో బాబు పనిచేస్తుంటే) మీటింగుల్తో చాలా బిజీ అని చెవిలో క్యాబేజిలే పెట్టేసేవారు. గతంలో బిల్‌కలెక్టర్‌గా పనిచేస్తున్న ఒక పెళ్ళికొడుకుని చూడ్డానికి పెళ్ళిపెద్దగా వెళ్ళిన జాయింట్ కలెక్టర్ తో పిల్లవాడి తండ్రి బిల్‌కలెక్టర్ ఉద్యోగం ఎంత గొప్పదో చెప్పడం మొదలు పెట్టడంతో పెళ్ళిపెద్ద బుర్ర గోక్కోవల్సొచ్చింది.
కొంతమంది అమెరికా పెళ్ళికొడుకులు మరీ స్పెషల్. పెళ్ళాడబోయే అమ్మాయి ఫోన్ చేస్తే నేను జిమ్‌లో ఉన్నాననో, నేను స్విమ్మింగ్కో, జాగింగ్‌కో వెళుతున్నా ఫోన్ పెట్టేయ్ అనే బాపతు. ఇలాంటి ఒక వృద్ద వరుడిని మా బంధువుల అమ్మాయికి చూడటానికి వెళ్ళా. సదరు పెళ్ళికొడుకు నన్ను బేతాళ ప్రశ్నలతో వేధిస్తుంటే అతని తండ్రి ఎంతో అసహన వదనంతో వీడు ఎవడో ఒకర్ని చేసుకుంటే న్యూసెన్స్ వదిలిపోతుందన్నట్లు బిక్క ముఖం పెట్టుకుని కూర్చున్నాడు. సాఫ్ట్వేర్ బూమ్‌తో మెడలో బిళ్ళున్నోడే వరుడని కమిటైపోయిన కొందరు, మా నాన్నగారు బ్యాంకు ఉద్యోగులు, లెక్చరర్ లాంటివి ఎన్ని మ్యాచెస్ చూపించినా సాఫ్ట్వేర్ యేమీ లేవా సార్ అని కొందరు నీరసించేవారు. కలిసొస్తే నడిచొచ్చే కొడుకు లొచ్చే కాలంపోయి, కలిసొస్తే H1 ఉన్న అమ్మాయో pick అయిన అమ్మాయో కోడలుగా వచ్చే కాలమొచ్చింది.
ఇరవై ఏళ్ళు పైగా (ఇక్కడ 30 year industry లో అన్నట్లుగానే) ఇవన్నీ దగ్గరగా చూసిన నా పరిమిత జ్ఞానంతో తెలుసుకున్నది ‘ఏ వయస్సుకు ఆ ముచ్చట’ అన్నపాత సామెత పెళ్ళిళ్ళ విషయంలో ముమ్మాటికి నిజం. ప్రస్తుత ముప్పదులు దాటి 1.5 K, 2.5 K సంపాదిస్తున్న Boys and girls మాకేంటి తొందర అనుకుంటారు. ఇంకాస్త ముందుకెళితే ఆదాయం పెరిగి (తల అరెకరం పోయి) దానితోపాటు Over aged అయి డిఫెన్స్‌లో పడతారు. వైజాగ్ దసపల్లా హోటల్లోగాని ఇంకేదైనా హోటల్లోగానీ వేడి ఇడ్లీ సాంబార్ తినాలనుకుంటే ఉదయం 8.30 లోపు వెళ్ళాలి. తాపీగా ఉన్న కొందరు పెళ్ళికొడుకు/ కూతుర్లలా ఆర్చుకుని తీర్చుకుని ఉదయం 11గం॥లకు హోటల్కెళ్ళి ఇడ్లీ, దోశె, పూరీ ఉందా అని ఆడిగితే వెయిటర్ ‘అవన్ని తొమ్మిది లోపే సార్/ మేడమ్’ అంటే మన ‘లేటు’ బ్యాచ్ అసహనంగా, ‘ఇంకేమి ఉంది’ అని అడిగితే, ‘వడ మాత్రం ఉంది సార్’, అంటాడు. మనవాళ్ళు ఇగో చంపుకోలేక, ‘వేడేనా’ అంటే వెయిటర్ అంతే లౌక్యంగా ‘సుమారు వేడి’ సార్ అన్నా ‘సర్లే తెచ్చి పెట్టు’ అని తినేస్తారు. ఇలా బస్సు మిస్సైన వాళ్ళకు ‘‘సుమారు వేడి బ్యాచ్” అని పేటెంట్ చేసెయ్యాలి. ఇలాంటి వాళ్ళను చూసి చూసి విసిగి పోయిన మా తమ్ముడు శేఖర్ ‘‘అన్నా మనం చేసుకోవల్సిన వయస్సులో పెళ్ళి చేసుకుంటే ‘నచ్చిందే పెళ్ళాం’, అది దాటిపోతే ‘వచ్చిందే పెళ్ళాం’ ‘వచ్చినోడే మొగుడు’ అవుతాడు అంటుంటాడు. జైంట్ వీలెక్కాలనుకుంటే మన కుర్చీరాగానే కూర్చోవాలి, మిస్సయితే వెయిటింగే!
ఎంతో కష్టపడడి కొంతమంది IAS, IPS లకు సెలక్టయి మాకేంటి అనుకుంటారు. కొందరు అమ్మాయిలు అబ్బాయిలు “Only civil servants” అనే నియమంతో ఎంతకూ పెళ్ళికుదరకపోవడం చూస్తుంటాం. IPS సెలక్టైన అమ్మాయికి పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న హెడ్కానిస్టేబుల్లా, అమ్మమహిళా హోంగార్డ్లా (మేడమ్స్ ఇగోని కిందివాళ్ళు బాగా పెంచిపోషించడంతో) ఆనడంతోనే చిక్కు. ఇలా చెట్టెక్కి కూర్చుని కాలం గడిచిపోతే మళ్ళీ వీరే మాకేం తక్కువ, మాకేంటి అనుకోవాల్సి వస్తుంది. ‘కొంతమంది విషయంలో Higher Qualification యే పెళ్ళికి disqualification అయిపోతుంది’ అనేది వాస్తవం. పెద్ద హోదాలు, జీతాలు, చదువులు, అందాలు, ఆస్తులు ఈ బాపతే.
ఇటీవల ఒక సంపన్నుడు వాళ్ళ అమ్మాయి గురించి చెబుతూ మా అమ్మాయి దీపికా పదుకొనేలా ఉంటుందని అంటే నేను మనస్సులోనే రణబీర్‌కపూర్‌కు పెళ్లైపోయింది కదా ఇప్పుడు ఎలాగో పాపం అనుకున్నా. హారోస్కోప్ల Horror లు చెప్పుకోవాలంటే ఇంకో పుస్తకమే అవుతుంది. ఎదురుగా ఉన్నవాళ్ళ మాటల్ని కాకుండా ముప్పై ఏళ్ళ క్రితం ఎవరో రాసిన వివరాలపై (ఎంతవరకు అవి కరెక్టో ఎవరికి తెలుసు) పూర్తిగా ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యం. డెలివరీ చేసిన నర్సు పదినిముషాలు తేడాగా చెబితే జాతకమే మారిపోతుంది. అందుకే అవి Horrorscopes!
ఫాక్షన్ లీడర్ కొడుకు విధిలేక ఫాక్షన్ లీడరే అయినట్లు మా నాన్నగారు మ్యాచ్ ఫిక్సింగ్స్ చేయడంతో నాకూ పెళ్ళిళ్ళు చూడాల్సిన (Not out of Choice, but by compulsion) పరిస్థితి వచ్చేసింది. ఇరవై ఏళ్ళ క్రితం ఆడపిల్లల తండ్రులు ‘‘మేము పెద్దవాళ్ళమయ్యేలోపు ఒక అయ్యచేతిలో పెడితే మా బాధ్యత అయిపోతుందనే మాట ప్రస్తుత రోజుల్లో కొన్నికొన్నిసార్లు ఒక అయ్య(బకరా) నెత్తినపెడితే అన్నట్లు వినిపిస్తున్నాయి. అత్తగారు లేరట. ఆడపడుచులేదట ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుందనుకునేవారు కొందరైతే, పెళ్ళి అవ్వగానే మా అబ్బాయిని మూడునెలల్లోనే వేరే ఇంట్లో పెడతామని హామీ ఇవ్వాల్సిన పరిస్థితులు. ఆడపిల్ల తండ్రులైతే 5 CR , 10 R assets అని చెబుతూ ‘మా తదనంతరం’ అన్న Rider కూడా పెట్టాల్సిన పరిస్థితులూ చాలానే చూస్తున్నా.
కొంతమంది పెళ్ళికొడుకుల తండ్రులు ‘‘వాళ్ళు ఇస్తామన్న పొలం గురించి కనుక్కుంటే అంత రేటు లేదంటున్నారు సార్ అనో, గూగుల్‌లో పెళ్ళికూతురు వాళ్ళ ఇల్లు చూశాను సార్ అంతపెద్దగా లేదనే అనేవాళ్ళనూ చూసా. మరొక జాగ్రత్తపరురాలు కోడలుకు పెడతామన్న నగలన్నింటినీ ముందు పంపిస్తే గోకించుకుని (22 క్యారెట్సా, వన్ గ్రామ్గోల్డా) చూసుకుంటామని చెప్పింది. మరికొన్ని తేడాకేసులు పెళ్ళి కూతురు ఫాదర్ ఏ యూనివర్సిటీలో చదివాడో, టెన్త్, ఇంటర్లో ఆయనకు ఎన్ని మార్కులొచ్చాయో, ఆయన బ్లడ్ గ్రూపేంటో తెలుసుకోగలరా సార్ అనో. పెళ్ళి కూతురు నాన్న, అన్నల IQ ఎంతో తెలుసుకోండనో అనడం కూడా చూసేశాం.
మరికొంతమంది అవధానాల్లో నిషిద్దాక్షరుల్లా సంబంధాల కోసం వెదికేప్పుడు ‘No girls from Police and Judicial families’ అని కూడా (వాళ్ళకు ఎంత గొప్ప అనుభవమయ్యిందో) రాసేసుకుంటున్నారు. IIT, IIM మేధావులతో దెబ్బతిన్న కొంతమంది త్రివిక్రమ్ ఏదో సినిమాలో వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని చెప్పినట్లు వాళ్ళు వద్దని దణ్ణం పెట్టేస్తున్నారు. మరికొంత మంది. Salary should not be less than 2 lakhs per month అనో Property should be above 50 cr అనో పెట్టేస్తున్నారు.
పెళ్ళిచూపుల ఇంటర్వ్యూల్లోనూ పెనుమార్పులొచ్చేసాయి. సింగిల్ సిట్టింగ్స్‌తో ఏవీ కుదరడంలేదు. ఉద్యోగాల్లాగానే 3rd Round 5th Round ఫైనల్ గా HR round. పెళ్ళికొడుకులైతే Social drinking ఓకేనా అని అడగటం, నాకొక బ్రేకప్పయిందని చెప్పడం వింటున్నాం. Social drinking/ science drinking అయినా ఉన్నది ఒక liver యే కదా అని నా సంశయం. అమ్మాయిలైతే నేను ఉదయం (బాగా early గా) పదికే లేస్తాను. Is it ok నా అనో, నాకు వంటరాదు Is it ok నా అనో అడగడం. సరదాపడ్డ పిల్లవాడు తరువాత ఏమైన అంటే ముందే చెప్పాగా (Govt Ref to Go 22 or G.O.46 అన్నట్లు) అంటున్నారని వింటున్నాం. ఇలా సరదా పడి మొహమాట పడిన నా మిత్రుడి కుమారుడు కాస్త కలిగినింటి నుంచి వచ్చిన New wife కి Add on card ఇచ్చాడు. ఆ పిల్ల నెలలోపే మాల్స్ వెంటపడి Shop till you drop (ఇక్కడ drop అయింది ఆమె కాదు అతడు అని గ్రహింపగలరు) అని షుమారు రెండు లక్షలకు పైగా swipe చేసేయ్యడంతో అతగాడు కన్ళీళ్ళు wipe చేసుకోవాల్సి వచ్చింది. కొడుకు ఇబ్బంది చూసిన నా మిత్రుడు అందుకే పెద్దవాళ్ళు ‘వియ్యం అందుకునేటప్పుడు మనం చెయ్యి ఎత్తితే కనీసం కాబోయే వియ్యంకుడి మోకాలైనా అందితేనే ముందుకెళ్ళాలి’ అన్నమాట వినాలి అని వాపోయాడు.
కొందరు అమ్మాయిలు ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూలోనే ఆరేళ్ళ నుండి అమెరికాలో ఉంటున్నావు Bank balance ఇంతేనా అనో, మీ పేరెంట్స్ వస్తే మన దగ్గర ఎన్నిరోజులుంటారనో, ఇంట్లో పనులు ఎలా షేర్ చేసుకోవాలో (MOU) చేసేసుకుంటున్నారు. ఇలాంటి Rapid fire session కు జడిసి కొంతమంది అబ్బాయిల తండ్రులు అన్ని expectations మరచి మా అబ్బాయి ఇంటికెళ్తే మా కోడలు మమ్ముల్ని చూసి Air Hostess లా నవ్వితే చాలనో, మా అబ్బాయికే కాదు మాక్కూడా కాఫీ ఇవ్వక్కర్లేదు మేమే కలిపిస్తాం (కోడలైనా కూతురైనా ఒకటే అనేసుకుని కళ్ళు తుడిచేసుకుని) మాకు కాఫీ చేసిచ్చే ఓపిక లేకపోతే కాఫీ కలిపిచ్చేందుకు ఎవరినైనా ఏర్పాటు చేయగలం అని హామీలిచ్చే వాళ్ళనీ చూస్తున్నాం. మా అమ్మాయి ఎవర్నీ కష్టపెట్టే రకం కాదు. బాబు Add on Card ఇస్తే సర్దుకుపోతుందని పిల్లతండ్రులు అనడంతో హతవిధీ అనుకోవాల్సి వస్తోంది. Anything is fair in love and war అన్న పెద్దల మాట మన్నించి లవ్ మ్యారేజ్ ముచ్చట్లు ముచ్చటించడం లేదు.
పెళ్ళి చూపుల్లో, మాటల్లో పెనుమార్పులే చోటు చేసుకోవడం ఇంటా బయటా అందరం చూస్తూనే ఉన్నం. మనకు ఏమికావాలో స్పష్టమైతే మనపని తేలికవుతుంది. సెలక్షన్ జరిగిపోతుంది. పెళ్ళైపోతుంది. లేకపోతే “No wind is favourable to a sailor who doesn’t know where to go” అన్న సామెత నిజమై పెళ్ళికాని ప్రసాదులు, అమ్మడులు పడవెక్కలేని సరంగులుగా మిగిలిపోగలరు.
(ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లో ప్రతి బాలు సిక్సర్ కొట్టాలనుకున్నట్లు ప్రతి మ్యాచి ఫిక్సింగ్ అయిపోవాలని ఆరాటపడే ఆత్మబంధు ప్రసాద్‌కు ప్రేమతో ….)
డా. తుమ్మల శ్రీనివాసులు
సార్…. ముందుగా మీకు అభినందనలు
నమస్కారాలు. 💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీ, “పెళ్లి మాటలు” వీనులకు విందు, మనసుకు పసందు కలిగించింది. చాలా
సంతోషం. భాష, శైలి, భావ వ్యక్తీకరణ,
సంభాషణలు మనసుకు ఎంతో హాయి ని కలిగించాయి….. మరొక్కసారి మీకు నమస్కారాలు 🙏🏻🙏🏻.
సర్….సూపరో సూపర్….😀😀😀
ఫస్ట్ లెన్ పంచ్ నుంచి….😍😍😍
లోతైన పరిశీలన, అద్భుతమైన అవగాహన తో హాస్య సమ్మిలితమైన మీ రచనా శైలి అద్భుతం అమేయం అనితర సాధ్యం. మన దైనందన జీవితం లోని ఒక్కొక్క సందర్భం తీసుకొని హ్యూమర్ ని రంగరించి వెనుకటి రోజులలోకి వెళ్లి కాసేపు నవ్వుకోవడానికి మాకు అందించిన మీకు ధన్యవాదములు సర్
Factual information (trends in marriage looks-changing out-looks) presented humorously. Enjoyed reading this ‘Pellimatalu’.
మీరన్నట్టు అబ్బాయిలకి మూటలు చూపించైనా “ఊ” అని పించొచ్చేమో కాని…
అమ్మాయి లకి ఏం చూపించి “ఊ అంటావా బేబి ఉఉ అంటావా బేబీ..” అనాలో మాత్రం తల్లిదండ్రులకి తలీడం లేదు😃
No comments .
పెళ్ళి మాటలు చాలా బాగుంది. ప్రస్తుత పరిస్థితులను కళ్ళ కు కట్టి నట్లు వివరించారు. నేను మా అబ్బాయి కి పెళ్ళి సంబంధం చూస్తూ మీరు చెప్పిన విషయాలు చాలా వరకు experience అయ్యాను. Really nice narration.
It’s an important occasion in everyone’s life and the way you carried the information to depict the contents is amazing 👌🏻👌🏻👌🏻
Excellent sir
Realistic analysis and good narration 👍👏👏
రచనా శైలి అత్యద్భుతంగా ఉందండి.మొత్తం ఏకబిగిన చదివి ఆనందించాం.
The subject it self is narrated with Keenly observed satirical fun on contemporary happenings in Marriage fixings.
I felt like reading Malladi.Venkatakrishna Murhty book and watching Jandyala Movies in 90s where in very keen observation of human behaviour and social changes are reflected in a very sensible satirical comedy.
we are missing this kind of sensible comedy with the modern vulgar comedy shows and TV shows. Very refreshing indeed.
Just awesome sir,Keep going.
You have an excellent observation skills giving comic ink to your pen.
Thanks for sharing
Baldness to boldness ,
Mentioning CRs,conditions in CV etc
gave fun unlimited.
Dilip.c.Byra.
8367642222.
Agree with your comments 100%. The narration reminded me Jandhyala (Vari hasya chaturata).
బాగుంది. కాబోయే వరుడు/అమ్మాయి ఎలా వుండాలో అనే కోరిక యెక్కువ అయి పెళ్ళిళ్ళు బాగా లేట్ అవుతున్నాయి.
కుదరక పోతే ఎలా విడిపోవాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడ ఈ మధ్య పెళ్లి మాటల్లో వచ్చాయి అని ఎక్కడో చదివినట్లు గుర్తు. అంతే కాదు, పెళ్ళి కొడుకు పొటేన్సి గురించి కూడ టెస్ట్ జరుగుతున్నాయట.
మంచి టాపిక్ మీద రాసావు.
Sir,
Sooper narration.Real but your expressive words had made it more fun to read. Recently ina movie “Varudukavali” ,the bride’s mother searches for a groom and first interviews him to recommend to her daughter. Funny though but it’s reality.Enjoyed reading it .
Excellent analysis of origin and growth of MARRIAGE LOOKS in Telugu families. All are akshara satyaalu. Keep writing andi.
Oka cinemalo Brahmanandam Srilakshmi tindi gurinchi matlaadukuntam gurtukocchindi
Dear Sir,
S4uccessful fixing on Match Fixing. Every issue is properly fixed in its place. Only knowledgeable people with proper connections at right place can do successful fixing. Harshavardan garu, your observations on hearing the conversations your father had with other match fixers gave you enough insight on how the system operates.
As usual one more good job on Fixing the link of Then and Now and how the deals have changed over time. Greatly enjoyed your job.👍😃
Kesava Babu.
సర్,
పెండ్లి మార్కెట్ ను సంపూర్ణంగా చదివేసారు…ప్రతీ వాక్యం లోనూ నిజం తో పాటు నవ్వు తెప్పించేట్టు ఎంత చక్కగా రాశారో!!!
🤣🤣🤣🙏🙏
Sir very interesting with narration from olden days to present days with exact clear picturization and enjoyed alot
ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించి విషయాన్ని చక్కగా బోధపరుచుకుని భద్రపరుచుకునే మీ లక్షణమే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది సర్. మాచ్ ఫిక్సింగ్ వ్యవహారాలను ఎంత రంజు గా వివరించారు! హాట్స్ఆఫ్🙏🏼🙏🏼🙏🏼——-చలం