నా చిన్నప్పుడు మా నాయనమ్మ ‘‘లేడికి కాళ్లు లేక చిక్కిందా కాలమొచ్చి చిక్కిందా నాయనా’’, అనేది. ఇప్పుడు ఎవరైనా నడవడానికి కష్టపడటం చూసినప్పుడల్లా అదే గుర్తుకొస్తుంది. ఎంతో సునాయాసంగా చకచకా నడిచేవాళ్ళు నాలుగు అడుగు లేయలేకపోవడం కాలమహిమే. ఒకసారి తమ్ముడు లక్ష్మీ ప్రసాద్ గారి నాన్న గారు గెడ్డాపు సత్యం గారు రాసిన జైత్రయాత్ర పుస్తకావిష్కరణకు డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారిని ఆహ్వానించాం. ఆవిష్కరణ వేదిక రెండో అంతస్తులో (అక్కడ లిఫ్ట్ లేదని గాడ్ ప్రామిస్‌గా మాకు తెలియదు) వారు కారు దిగి ‘మేడపైనా?’ అని అతి ప్రయాసతో ఒక అంతస్తు ఎక్కారు. మేము ఇంకొక ఫ్లోరెక్కాలి సార్ అనగానే ఆయన మా వైపు కౌశికుడు ఇల్లాలిని తీక్షణంగా చూసిన చూపు చూసి వెనక్కి పోలేక మా మీద ప్రేమతో ఎంతో కష్టంగా మరో అంతస్తు ఎక్కి సభ దిగ్విజయం చేశారు. కాసేపటికి మూడ్ మంచిగా మారిన తరువాత మోకాళ్లవైపు చూపిస్తూ ‘‘శ్రీపాద’’ వల్లభులు సహకరించుటలేదని జోకేశారు. నాలుగు కాళ్ళతో నడిచే స్థాయి నుండి రెండు కాళ్ళతో నడిచేస్థాయికి మనం ఇవాల్వ్ అయ్యాం. బస్, రైలు, సైకిల్ లేనప్పుడు ఎక్కడికైనా పోవడానికి మనకు వాకింగ్ మినహా వేరే ఛాయిస్ లేదు. అప్పట్లో అందరం బాగానే నడిచేవాళ్ళం. ఇప్పుడు వాకింగ్ చేయాలనేది మన ఛాయిస్. అందుకే గుండ్రంగా తయారై డైటీషియన్లను మన పొట్ట కట్టుకుని మరీ పోషిస్తున్నాం.
నడకను అమితంగా ఇష్టపడే ఫ్రెంచి తత్త్వవేత్త రూసో “Walking supplied first the right balance of stimulation and response, exertion and idleness” చెప్పుకున్నాడు. ‘Every walk is a sort of crusade. When we walk, we are simultaneously doing and not doing’ అని తీర్మానించాడు. తత్త్వవేత్త రూసో వాకింగ్‌కు పోయినప్పుడు జేబు నిండా చిన్నకార్డులు వేసుకుని తన ఆలోచనలను ఎప్పటికప్పుడు వాటి మీద రాసుకునేవాడట.
గమ్యం లేకుండా నడిచే సరదా నడకను ‘Sauntering’ అంటారు. Sans – terre అనే మాట నుండి Sauntering పుట్టింది. Sans – terre అంటే ఇల్లు, వాకిలి, పొలము లేదని మరోలా చెప్పాలంటే ఇల్లే లేదంటే ప్రపంచంలో ఎక్కడుంటే అదే మన ఇల్లన్నట్లే. ఆత్రేయ గారు ‘గౌరమ్మా నీ మొగుడెవరమ్మ’, ‘ఇల్లువాకిలి లేనివాడ బిచ్చమెత్తుకుని తిరిగేవాడా’ అని శివుని బనాయించినట్లో, సిరివెన్నెల గారు జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అన్నట్లు. నడక మీద ఏకంగా చిన్న పుస్తకమే రాసిన అమెరికన్ రచయిత హెన్రీడేవిడ్ థోరో ….
ఉదయపు నడక ఆ రోజుకి గొప్పవరం అని నమ్మాడు. రోజూ అడవుల్లో రెండు గంటలు నడిచే అలవాటున్న థోరో దారిలో కనబడిన ఆకులు, రెమ్మలు, పళ్ళు, పూలు, విత్తనాలు సమృద్ధిగా జేబుల్లో నింపుకుని మరీ ఇల్లు చేరేవాడట. ప్రకృతిని, అడవిని అమితంగా ప్రేమించే థోరో “A walk in Nature walks the Soul back home” అని నడక గొప్పదనాన్ని చాటాడు.
తత్త్వవేత్త ఫ్రెడరిక్ నీషే అనునిత్యం ఆల్ప్ పర్వతశ్రేణుల్లో రెండు గంటలు నడిచేవారట. గొప్ప గొప్ప ఆలోచనలన్నీ నడక నుండే పుడతాయన్నది నీషే విశ్వాసం. మరో తత్త్వవేత్త ఇమ్మాన్యుయేల్ కాన్ట్ నడకలో నిత్యం ఎంత సమయపాలన పాటించేవాడంటే ఆ వీధి జనాలు తమ వాచీలను సరిచేసుకునేంతగానట.
పై కథలన్నీ చదివినప్పుడు నాకూ రోజూ నడవాలనే అనిపిస్తుంది కానీ ఆచరణలో అలసత్వం ఆవహించి మొరాయిస్తామ. అప్పటికీ వాకింగ్ షూసు, ట్రాక్ ప్యాంట్లు, స్వెట్ షర్టులు ఇత్యాది వాకింగ్ కిట్ అంతా అమెరికా నుండి దిగుమతైనా మనం మంచం దిగడం ఒక్కటే పెద్ద చిక్కు. ఒకవేళ దిగినా ఆంధ్రుడి నగుటచేతనేమో ఆరంభశూరత్వంతో మొదలుపెట్టిన రెండు, మూడు రోజులకే నడక ఆగిపోయేది. మా అబ్బాయి సందీప్ మణిపాల్‌లో మెడిసన్ చదివే రోజుల్లో పరీక్షలు దగ్గరకు రాగానే కొత్త టేబుల్ లైట్, టేబుల్క్లాత్ కొనేసి, స్నాక్స్, పుస్తకాలు టేబుల్ మీదకు సర్దేసి, శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి పోవడం కూడా పూర్తి చేసేవాడట. ఇదంతా గమనిస్తున్న వాడి జూనియర్ శ్రవణ్ ‘‘మాస్టారు, కొనాల్సినవన్నీ కొనేశాం, టేబుల్ సెట్ చేసేశాం. గుడికెళ్ళొచ్చేశాం ఇక చదవడం ఒకటే మిగిలింది’’ అనే వాడట. నాదీ అదే తంతు. ఈ విషయంలో మా వాడిని అని ప్రయోజనమేముంది “Blame it on genes” అని నన్ను నేను అనుకోవడం తప్ప.
వాస్తవానికి కాస్త బద్దకం వదిలించుకుని పొద్దున్నే మా పార్క్‌కు వెళ్ళాలే గాని ఆ కిక్కే వేరబ్బా! బొంబాయి లోకల్ ట్రైనెక్కడానికి కష్టపడి స్టేషన్‌కు చేరుకోవాలేగానీ అక్కడి జనం మనల్ని రైల్లోకి తోస్తారు. మనస్టేషన్ రాగానే మళ్ళీ రోడ్డు మీదకు మనప్రమేయం లేకనే వారే గెంటేస్తారు. ఏదో విధంగా పార్క్ చేరితే కార్తీకపౌర్ణమి నాడు లక్షలాది భక్తులతో అరుణాచల గిరి ప్రదక్షిణ చేసినట్లే. ఏ పుణ్యాత్ముడో మనల్ని చేయిపట్టి కాస్త లెక్క నడిపించేస్తాడు.
మా పార్క్ మినీ ప్రపంచం. ఓ పెద్ద కెలయిడోస్కాపు. మనకు ఓపికుందా ఏదో ప్యానల్ డిస్కషన్లో పాల్గొనొచ్చు. ఓపిక లేదా ఒక చెవి అటు వొగ్గితే చాలు! జగనన్న, చంద్రన్న, కేసీఆర్న్న, రేవంతన్న, జనసేనాని, జత్వానీ, తిరుపతి లడ్డు, రంగరంగ హైడ్రా, కాళేశ్వరం లాంటి బోల్డు మేటర్సు. ఖాదర్‌వల్లీ, కీటో, మెడిటరేనియన్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, వీరమాచనేని రామకృష్ణ డైటింగ్‌ల మీద ఫైటింగులూ కనవచ్చు. ఛానల్ మార్చామా షేర్ఖాన్ల గ్రూపు ఐటిసి పెరిగిందా? గోడ్రెజ్ తగ్గిందా? షేర్లు సెన్సెక్స్ బలపడిందాల తో సాగిపోతుంటే, మరొక ప్రక్క రియల్టర్ల బృందం పుప్పాలగూడ, బీరంగూడ, తుక్కుగూడ, లేఅవుట్ల ముచ్చట్లలో మునిగితేలుతుంటారు. మందుబాబులు వీకెండ్లో బ్లాక్లేబులా? ఓల్డ్ మాంకా? అని మీమాంసలో ఉంటారు. పార్క్‌కు కాస్త లేట్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ‘రెండు రౌండ్లేసి వస్తానన్నా, చిన్న రౌండ్లు నాలుగేసి, పెద్ద రౌండ్లు మూడేద్దామన్నా’ అది విన్న మందేషులు సభానంతర సాయంకాల సభలను ఊహించేసుకుని ఆనందపడిపోతారు. నాన్‌వెజ్ ప్రియులకు ఫ్రాన్స్ అంటే ప్రాన్స్‌లా వినబడి ప్రాణం లేచొచ్చినట్లు. ఇంకాస్త సీనియర్స్ ఎకోస్పిరిన్, ఇన్సులిన్ డోసులు, మోకా ళ్లు, కాటరాక్ట్ ఆపరేషన్ల చర్చలతో ముందకు సాగుతుంటారు.
పార్కులో మందుముచ్చట్లు, మందుల ఇక్కట్లతో చూడముచ్చటగా రెండు ఛానల్సు నడుస్తుంటాయి. మరోప్రక్క మహిళా బృందాలు కోడళ్ళ రుసురుసలు, కిట్టీపార్టీ పాలిట్రిక్స్, యూట్యూబ్ వంటల్తో వాకేస్తుంటారు. అక్కడ ఎవరిగోల వారిదే టైటిలే అతి పెద్ద హిట్టు. వెరసి మా పార్క్ చిన్ని కృష్ణుని నోట బాపురే పదునాలుగు భువన భాండములకు, టీవీపేనల్ డిస్కషన్స్‌కు ఏ మాత్రం తీసిపోదు. వాడివేడి చర్చలతో రసకందాయంగా వాకర్స్ క్రియాశీలకంగా ప్యానల్ డిస్కషన్స్‌లో పాల్గొనడం చూడడం గొప్ప అనుభూతి.
పార్క్ నడకలు ప్యారిస్ ఫ్యాషన్ పెరేడ్‌కు మించే ఉంటాయి. చీమలు చావనివి, వొళ్లు అలవనివి, చొక్కా తడవనివి, పెళ్ళినడకలు, పాముల్నైనా చంపే ఆర్మీ కవాతులు, కేరళ అలరి పట్టు యుద్ధ విన్యాసంలా చేతులూపుతూ పక్క నోడి వీపు పగిలేలా మరికొన్ని. వీళ్ళందర్నీ ఛేదించుకుంటూ (ప్యాసింజర్లను, గూడ్సులను దాటుకుంటూ) దూసుకుపోయే వందేభారతీయులు మరికొందరు. ఎన్.ఆర్.ఐ అమ్మమ్మలు, తాతయ్యలు అడ్డిదాసులు, నైకులు, స్కెచ్చర్లు, లాస్‌వేగస్ టీషర్టులు, టోపీలు ధరించి ‘నయగరాల’ ముచ్చట్లతో అలా ‘ముందుకు’పోతుంటారు. పార్కులో కొందరు నడవడానికొస్తే, ఇంకొందరు నోరు మెదపడానికొస్తారు. మరికొందరు కాళ్లు కదుపుతూ, నోరు మెదుపుతూ కరవడానికి వస్తారు. వీరు గౌతమబుద్ధుని మధ్యేమార్గీయులు.
చాలా వాకర్స్ క్లబ్‌లు ఎక్కువభాగం వాగర్స్క్లబ్బులే! ఒక రకంగా అది మంచిదే. పార్కుల్ని Lung spaces అంటారు. వాక్‌తో కాళ్లకు, వాక్కుతో లంగ్స్‌కు పని కల్పించే ఏకైక ప్రక్రియ వాకింగే. శారీరక, మానసికోల్లాసాన్ని ఇవ్వగలిగే ఆరామ్భాగ్లు మన పార్కులే. పార్క్‌లు ప్రెషర్‌కుక్కర్ వాల్వుల్లా ఉండబట్టి బతికిపోయాం లేకపోతే ఎర్రగడ్డ ఆసుపత్రి భారీవిస్తరణ చేపట్టాల్సొచ్చేది. అమెరికాలో ఊరంత పార్కులు, మైళ్ళ కొద్దీ నేషనల్ పార్కులున్నా పలికేవారుండకపోవడంతో అక్కడ సైకియాట్రిస్టులకు మంచి ప్రాక్టీసు. మన దగ్గర పార్కుల్లో వాకర్స్ ఇయర్‌ఫోన్స్ ఎటుదారి తీస్తాయో? ఇయర్‌ఫోన్స్ వచ్చిన కొత్తల్లో పార్కులో ఒకాయన తనలో తాను మాట్లాడుకోవడం చూసి, పాపం బాగానే ఉన్నాడు, ఏమిటో అనుకుని బాధపడుతుంటే ఒక మిత్రుడు నా చెవిలో నీలంపన్ను (Blue Tooth) మహిమని చెప్పాడు. ఇప్పుడు ఆ దృశ్యం బాగా అలవాటయ్యింది.
సాయంత్రం వేళల్లో పార్క్ సీన్ పూర్తిగా ఛేంజ్ అయిపోతుంది. వాకింగ్ సెకండరీ టాకింగ్ ప్రైమరీ. మా పార్క్‌లో పెద్ద వాళ్ళు బూస్ట్, ఎన్ష్యూర్, ఒక్కపూట తాగకపోయినా నీరసించరుకాని ఏ కారణం చేతనైనా సాయంత్రం పార్కు ఒక్కరోజు మిస్సైతే బెంగపడిపోతారు. కోవిడ్ లాక్‌డౌన్‌తో పెద్దలు పార్క్‌కు రాలేక ఏమీ తోచక ఇంట్లో కూర్చుని కూర్చుని గోడలు అదే పనిగా గోకడంతో పోస్ట్ కోవిడ్ మా కాలనీలో చాలా ఇళ్ళకు కొత్తగా పెయింట్స్ వేయాల్సొచ్చిందంటే నమ్మండి.
పార్కు మొత్తానికి ఛీర్ లీడర్ మా కొండన్నే. Rain or shine గోడుగేసుకునైనా సరే రెండు పూట్లా వారు వాక్కు సరే రావల్సిందే వారి వాక్కు వినిపించాల్సిందే. కొండన్న చిన్నప్పుడు పాకెట్ మనీ ఖర్చు పెట్టాడో లేదో తెలియదు కాని మేము చూస్తున్నప్పటి నుండి తన కోటా కెలరీలు ఖర్చే (Burning calories). రోజూ సాయంత్రం లోపు ఎలాగైనా ఎక్సర్సైజు రింగు పూర్తి చేసే పెద్ద రింగ్ మాస్టర్ వారే. మాకు వాన సాకు చెప్పడానికి వీలులేకుండా పార్క్ మిత్రుడు శ్రీనివాసు రావు ఇటీవల మాకందరికీ మార్గదర్శి గొడుగుల్ని బహుకరించి మమ్ముల్ని కొండన్నకు పట్టివ్వడంతో ఆ చిన్న బహానా కూడా పోయింది. అది మొదలుగా మేమూ మార్గదర్శి గొడుగులో దూరి వానల నెదుర్కొంటూ నడకలు కొనసాగిస్తున్నాం. అన్న దగ్గర మార్కులు కొట్టేస్తున్నాం.ఈ నడకలు మనం కొత్తగా నేర్చినవేమీ కాదు. తన భర్త సత్యవంతుని ప్రాణాలను కొనిపోతున్న యమధర్మరాజును నడకతో వెంటాడి సతీసావిత్రి తిరిగి తెచ్చుకోగలిగింది. యమధర్మ రాజుగారి వాహనం దున్నపోతు కావడం ఆమెకు కలిసొచ్చింది. అదే ఏ నెమలో, జింకో అయితే సత్యవంతుని కేసు గల్లంతే. ఆదిశంకరులు కాలినడకన పర్యటించి దేశ నలుమూలలా మఠాలను స్థాపించి జగద్గురువైనారు. అదే బాటలో కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతులు చాతుర్మాస దీక్షలో పాదయాత్రలు చేసి నడిచే దైవమై నిలిచారు. ధోరో ప్రభావంతో మహాత్మాగాంధీ దండి మార్చ్‌తో స్ఫూర్తి నింపి దండిగా ప్రజల అండతో దేశ స్వాతంత్య్రం సిద్ధింపజేశారు. మావో లాంగ్ మార్చ్, మార్టిన్ లూథర్ కింగ్ వాషింగ్టన్ మార్చ్ చరిత్ర గతినే మార్చేసాయి. ఎటొచ్చి కొన్ని పాదయాత్రలు మన తల రాతలు మార్చి మనల్ని మట్టి కరిపించి మన కొంప మీదకు తీసుకొచ్చాయి. అందుకని మరక మంచిదే అన్న యాడ్ చూసి మోసపోరాదు. నడకలన్నీ మంచివే అన్న భ్రమలో పడరాదు.
మా ఊరు చల్లపల్లి దగ్గర నడకుదురు అనే చిన్న గ్రామం ఉంది. ఆ వూరి వాళ్లందరి కుదురైన నడక వలన ఆ వూరికి ఆ పేరొచ్చిందేమో ఒకసారి ఆ వూరికి పోయి వాళ్ళను చూడాలని అప్పుడప్పుడు ఉబలాట తెగ పడుతుంటా. ఈ మధ్యనే నడకుదురు అని ఇంటిపేరు గలవారున్నారని చదివా. వారి నడక సంగతేమిటో!
గత పదిహేనుళ్ళుగా మా కాలనీలో అదే పార్కుకు వాకింగ్‌కు వెళుతున్నా. ఇటీవలి కోవిడ్ మహమ్మారితో కొంతమంది పూర్తిగా కనుమరుగైపోయారు. మరికొంత మంది పార్కుకు రాలేని స్థితికి చేరుకుంటున్నారు. పార్కు బెంచీల మీద మారుతున్న వ్యక్తుల్ని చూసినప్పుడల్లా ప్రముఖ కవి డా.ఎన్.గోపి గారు వృద్ధాశ్రమం అనే కవితలో …
‘వృద్ధాశ్రమంలో
మంచాలు పాతవే
వచ్చి పొయ్యేవాళ్ళే
మారుతుంటారు’ అన్న మాటలే గుర్తుకొస్తుంటాయి.
ప్రఖ్యాత ఆంగ్ల రచయిత R.L Stevenson “the great affair is to move” అని కదలడం గొప్పదనం చెప్పాడు. తత్త్వవేత్త సోక్రటీస్, జానీవాకరుడు అదే బోధించారు.
Life should go on – Let us walk till we talk
(జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులతో, మా నడతను, నడకను సరిదిద్దే ఆత్మీయులు ఆచార్య కొండన్నకు, పార్కు మిత్రులకు కృతజ్ఞతాభివందనాలతో …)
మీ ఆరోగ్యమైన హాస్యపు నడక తో మీతో కలిసి నడిచినంత సంతోషం. ప్రతి వాక్యం హాస్య అక్షర సత్యం. మీ నడకల్లో ఎంత సాహిత్యమో ఎంత హాస్య మో ఎన్ని అనుభవాలో. ఎంత కష్టపడి ఎంతో ఇష్టపడి వ్రాస్తే తప్ప ఈ నడకలు వస్తాయా.?
Sir
వాకింగ్ యొక్క ప్రాశస్త్యం చాలా సరదాగా వివరించారు. మార్నింగ్ వాక్ విలువ తెలిసినా ఏదో కారణాలు చెప్పుకుంటూ అలా రోజులు దాటి పోతున్నాయి. ఇలాంటి మాకు ఒక మంచి వాకింగ్ partner ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉండే వాడిని…పట్టు వదలని విక్రమార్కుడు లా నువ్వు levali వాక్ కి రావలసినదే anela….మీ కథనం చదవక మళ్లీ ఇంకో గట్టి ప్రయత్నం చేస్తాను Sir..
గురువు గారికి నమస్సులు
అయ్యా గురువు గారు, గాంధీ జయంతి రోజున Wal’King పై మీ వ్యాసం చాలా ఆప్ట్ గా ఉంది . మీదైన శైలి లో చక్కగా హాస్యము,చతురత జోడించి walkers గురుంచి – వారి మనస్తత్వం గురించి విశదీకరించారు .
తత్వవేత్త లు ఫ్రెడరిక్ నిషి alp పర్వత శ్రేణులలో రెండు గంటలు నడక , ఇమాన్యుల్ కాప్ తన నడక సమయ పాలన మా అనందరికి స్ఫూర్తిదాయకం ,అనుసరణీయం .
సతీ సావిత్రి తన భర్త ప్రాణాల్ని కొని పోతున్న యమధర్మ రాజుని నడక తోనే వెంబడించి తిరిగి తన భర్త ప్రాణాలు తెచ్చుకున్న వైనం శ్లాఘనీయం .అందరికీ కళ్ళకు కట్టినట్టుగా నేటి సమాజాన్ని ఆవిష్కరించారు
సార్,
ఉదయపు ఉషోదయపు నడక మీద చక్కటి,చిక్కటి వ్యాసం రాశారు.కామేడిగానే ప్రపంచాన్ని చూపారు.శ్రద్ధ గా అలసత్వాన్ని దులిపారు.చివరికి బాపు కి నివాళి అర్పించారు.చక్కగా చదివి వాకింగ్ ట్రాక్ సూటు బూటు దుమ్ముదులిపేలా చేసారు
నడకకు,నడక గూర్చి చెప్పిన మీకు నడక మరియు నడత నేర్పిన బాపుకు వందనాలు
“ఎటొచ్చి కొన్ని పాదయాత్రలు మన తల రాతలు మార్చి మనల్ని మట్టి కరిపించి మన కొంప మీదకు తీసుకొచ్చాయి. అందుకని మరక మంచిదే అన్న యాడ్ చూసి మోసపోరాదు. నడకలన్నీ మంచివే అన్న భ్రమలో పడరాదు.“
👏👏👏
హర్షవర్ధన్ గారు ఉదయపు నడక మరియు నడక క్లబ్బుల గురించి వారిదైన శైలి లో చాలా చక్కగా చెప్పారు . అయితే వారు టచ్ చేయని , మా వాకర్స్ క్లబ్ లో విషయం ఒకటి చెబుతాను. మా వాకర్స్ క్లబ్బులో ఒకరోజు వాకింగ్ చేసి 200 నుంచి 300 కాలరీలు తగ్గించు కొంటే వాకింగ్ అయిన తర్వాత గ్రూపులో ఎవరో ఒకరికి మనవడు/ మనవరాలు పుట్టారనో లేకపోతే కొత్త కారు/ ఇల్లు కొన్నారనో నెయ్యి కారం దోసె, ఆదివారం అయితే దోసె చికెన్ స్పెషల్ లాంటి వాటితో 400 నుంచి 500 కాలరీలు వేసుకొంటారు .