ప్రస్తుతం ప్రతి ఇంటా, ప్రతినోటా నిత్యం Login యే. ఆ మాటకొస్తే మా చిన్నతనంలో మేమూ లాగు ఇన్ చొక్కా అవుటే. మా ముందు తరాల వాళ్ళు మాత్రం ఎల్ల‌వేళ‌లా పంచె ఇన్ చొక్కా అవుటే. ఎటొచ్చి మన తెల్ల దొరలొచ్చిన దగ్గరనుంచే లాగిన్లు పోయి చొక్కా ఇన్లు, అదేనండి ఇన్ షర్టు అనే ‘ట‌కాపీలు’వచ్చిపడ్డాయి. చొక్కా ఇన్నే ట‌క్‌ చేయడం అన్నమాట. మన లాగూ ఇన్లు పోయి ట‌క్కులు రావడంతో అకటకటా నా బోటివాళ్ళకు కష్టాలు మొదలయ్యాయి. తెలిసో తెలియకో ఆఫీసర్లమైన పాపానికి ఇన్ షర్ట్ చేసుకోవాల్సిన రోజులొచ్చాయి. నామటుకు నాకు ‘లాగు’ ఇన్నే హాయే అయినా ఒక్కోసారి ఏ కాన్ఫరెన్సుకో, ఫంక్ష‌న్ కో టక్ చేయడం (నా భాషలో వేషం కట్టడం) తప్పేదికాదు.

రోజూ టక్ చేసుకునేవాళ్ళు బహుసునాయసంగా, Force of habit లా కానిచ్చేస్తారు. నా మిత్రుడు రమేష్ ఫైరింజనొచ్చినా ఆఖ‌రుకు ఆంబులెన్సు వచ్చినా అంతకంగారులోనూ చొక్కా ఇన్‌గా టకాపీతోనే క్రింద‌కు దిగుతాడు. వీళ్ళకు టక్ చేసుకోవడం పోలీసు సెల్యూట్ కొట్టినంత, నర్సు వేక్సిన్ వేసినంత వీజీ. టక్ లేకుండా వీళ్ళను ఊహించుకోవడం కర్ణుడ్ని కవచకుండలాలు లేకుండా కరుణానిధిని నల్ల కళ్ళద్దాలు లేకుండా ఊహించుకోవడమే, ఇలాంటి కొంతమంది పెద్దలు (ఎనభైలు దాటేసినా) ఉదయం ఆరుకైనా, సాయంత్రం ఏడుకైనా వాకింగ్‌కు సైతం ట‌కాపీతోనే! వాళ్ళకు చొక్కా ప్యాంట్ లోకి చెక్కడం అప్రయత్నంగా అయిపోతుందనుకొంటా.

ఎటొచ్చి అడపా, దడపా వేషం కట్టే నా బోటివాడికి ఇన్ ష‌ర్టు మాత్రం పెద్ద శిక్షే! తప్పనిసరై అడ‌పా ద‌డ‌పా టక్ చేసినా ఎప్పుడు ఎక్కని రాజు గుర్రమెక్కితే వెనకా ముందయినట్లే ఉండేది. అద్దంముందు పదినిముషాలు నిల్చొని చొక్కాను చిన్నప్పుడు పొట్టుపొయ్యిలో పొట్టుకూరినట్లు కూరుకుని అటు సర్ది, ఇటు సర్ది ట‌కాపీతో రంగప్రవేశం చేసేవాళ్ళం. మా కష్టాలు అక్కడితో తీరేవి కాదు. మీటింగ్ మధ్యలో రెస్ట్ రూమ్ లో దూరి పని ముగించుకుని చొక్కాలోపల కూరుకునే ధ్యాసలో పడి జిప్పు పైకి గుంజడం మరిచేవాళ్ళం. తాళము వేసితిని గొళ్ళెము మరచితిని అంటే ఇదేమరి. లాగు ఇన్నయితే ఏ ప్రమాదం లేదు కానీ ఈ వేషం వల్ల‌ ఆలీబాబా కథలో క్లోజ్ సెసేమ్ అనడం మరచిన‌ ఆలీబాబా అన్నగారు చిక్కుల్లో పడినట్లు జిప్ క్లోజ్‌ సెసేమ్ మరువడంతో షేమ్ షేమ్ అయ్యేవాళ్ళం. ఏ పుణ్యాత్ముడో చూసి చెబితే ఫ‌ర‌వాలేదు గాని లేక‌పోతే సెంట్ర‌లైజ్‌డ్ ఏసినే.

చాలా కాలం క్రితం మా నాన్నగారు అమెరికా వెళ్ళినప్పుడు ఇలాంటి ఇబ్బందే పడ్డారు. ‘While in Rome Be a Roman’, అన్నట్లు నాన్నగారు అక్కడ ఇన్ ష‌ర్టు చేసుకుని ఓపెన్ సెసేమ్ గా ఉండటం గమనించిన ఎనిమిదేళ్ళ మనవడు “తాత XYZ” అన్నాడు. దాని అర్థం తెలియని తాత గారు పట్టించుకోకపోవడంతో వాడు ఆయన చెవిలో మెల్లగా “తాతా, Examine Your Zip (అమెరికా ఇంగ్లీషులో examine ను X అని, You ను Y అని Zip ను Zee అని Coding చేస్తారట) అనడంతో విషయం గ్రహించిన తాతగారు క్లోజ్ సెసేమ్ అనడంతో కథ సుఖాంతమయింది.

టక్ చేసుకోవడం సులభమే అయినా అన్ని టక్కులు ఆనందానివ్వవు. మన ANR గారు హృదయటక్కుకు ప్రసిద్దులు, SVR, రేలంగి గార్ల‌వి బెడ్డింగ్ టక్‌లు. వీళ్ళకు ప్యాంట్ జారిపోకుండా భుజాలమీదనుండి తాళ్ళు వేసి జాగ్రత్తగా బ‌స్తాల్ని వేలాడ‌దీసిన‌ట్లు ప్యాక్ చేసేవారు. రమణారెడ్డి గారు టక్ చేస్తే సినిమా కటౌట్‌కు ప్యాంటు, షర్టు తొడిగినట్లుండేది. ఈ కటౌట్ లాంటి పర్సనాలిటీలతో కాస్త ఇబ్బందే. సంపూర్ణ రామాయణం సినిమాలో రావణుడిగా నటిస్తున్న SVR సీతాపహరణం చేయాల్సి వ‌చ్చింద‌ట‌. ఆ సీన్లో సెట్ లోకి వచ్చిన SVR గారు సీతగా నటిస్తున్న చంద్రకళను చూసి “ఇలాంటి సీతనా నేను ఎత్తుకుపోవల్సింది’ ససేమిరా అంటే బాపు రమణులు వారితో “అయ్యా ఈ సారి కిలా కానిచ్చెయ్యండి ఇంకో పాలి సీత‌ను మారుద్దాం” అని ప్రాధేయపడటంతో శాంతించి సీతాప‌హ‌ర‌ణం గావించార‌ట‌. చెక్కబొమ్మలాంటి హీరోయిన్ మీద ‘బుట్ట బొమ్మా! బుట్టబొమ్మా!’ పాట, మీసాలేలేని ఏనుగులాంటి హీరోమీద ‘కోర‌మీస‌మున్న సింగ‌పు న‌డుమున్న‌వాడా’ అన్న‌పాట రాసిన‌ట్లే.

బెడ్డింగ్‌లు గాలి వ‌దిలేస్తే ….

కొంతమంది ఏ ఆకారంలో ఉన్నా ఏ వయస్సులో ఉన్నా టక్కులు చేయడం మానకపోవడం వల్లనే మనకీ వ్యధ. బెల్టు సైజు 34 తో మొదలై 44కు చేరుకున్నా (ఇంక బెల్టుకి కొత్తగా కన్నాలు వేయడానికి వీలులేక పోయినా) వీరు ‘లాగు’ ఇన్ కాకపోవడంతో వీళ్ళను చూస్తే ప్రెగ్నెంట్స్ కు EDD ఇచ్చినట్లు అయ్యో వీళ్ళకు ఇచ్చేవీలు లేదు కదా అని జాలేసేది. (EDD అనగా Expected Date of Delivery) వీరికి not applicable క‌నుక‌ వారు వీరు నిరంతరం ఈ గుడ్డ‌లు కట్టిన చ‌లివేంద్రం బాన‌లు మోయాల్సిందే). ఇలాంటి వారు లుంగీల్లోకో / పంచెల్లోకో మారితే బెల్టుకు క‌న్నాల బాధ‌లు, ప్యాంట్లు ఆల్ట‌రేష‌న్స్‌ ఉండ‌వు క‌దా. ఇది చూడలేక కొంతమంది అలాంటి మిత్రులతో ‘టి’ షర్టులు కొనిపించాము. రెండోరోజు టీషర్ట్ ‘ఇన్‌’ తో ప్రత్యక్షమైతే ”నీకిప్పుడు టక్ అవ‌స‌ర‌మా?” అని అంటే చిన్నప్పుడు గోలీలాటలో పిల్లలు నా కాయ నా ఇష్టం అన్నట్లుగానే నా ‘కాయం’ నా ఇష్టం (అని ఎంతో నిర్ధాక్షిణ్యంగా) అని, చూసేవాళ్ళంరినీ ఎంతో క‌ష్ట‌పెట్టాడు.

మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఏ వ‌య‌స్సుకు ఆ ముచ్చట అనేది ముమ్మాటికీ నిజం. అన్నీ బాగుంటే చూసేందుకు బాగుంటుంది. చూసేవాళ్ళూ బతికుంటారు. ఆ మధ్య ఒక పెళ్ళిలో ఇద్దరు నానమ్మలు, అమ్మమ్మలు వడ్డాణాలు, అరవంకీలు అలంకరించుకుని తిరుగుతుంటే చూసేందుకు రెండు కళ్ళూ చాలలేదు. ఏదో సరదాగా పెళ్ళకి వచ్చిన వాళ్ళను ఇంత కఠినంగా శిక్షించడం ఎంత పాపమో వాళ్ళకు తెలియలేదు. అమెరికాలో పిల్లలున్న మన పెద్దవాళ్ళు ఇక్కడ పార్కుల్లో నిక్కర్లేసుకుని తిరిగేర‌కం ఇంకోర‌కం. వీరంతా ఆరోత‌ర‌గ‌తిలో జీవ‌హింస చేయ‌రాదు, భూత‌ద‌య క‌లిగి ఉండ‌వ‌లెను అనే పాఠాన్ని చ‌ద‌వ‌కుండా ఛాయిస్‌లో వ‌దిలేసిన వాళ్ళే.

మా కాలేజ్ డేస్ లో ఈ ట‌క్కులు పోయి సఫారీలు రావ‌డంతో వాటికి కొంత తెరపడింది. ఈ సఫారీలు ఇంకొక రకం కష్టాలు తెచ్చాయి. టక్కే చేయని నన్ను పెళ్ళికి మావాళ్ళు సూటు, బాటు (మరీ పెద్ద వేషం) వేయమన్నారు. నా వల్ల కాదని మొరాయిస్తే మా మేనత్తను ప్రయోగించారు. ప్రజాభీష్టానికి తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం అన్నట్లు ఆ పెద్దామె మాట కాదనలేక సఫారీకి వొప్పుకున్నా. (కొంతలో కొంతైనా ఊపిరాడుతుందిలే అని). పెళ్ళి రోజు ఆ సఫారీ తొడిగి తరువాత దాన్ని ఎవరికో ఇచ్చేసి సఫారీ సఫరింగ్ నుండి బయటపడ్డా. సఫారీ డ్రస్ అనగానే గన్ మేన్లు గుర్తొచ్చే కండీషనింగ్తో ఉన్నప్పుడు అలాంటివి ఒప్పుకోవడం క‌ప్పుకోవ‌డం కష్టమే. సూటు, బూటు పోటుల కంటే కొంతలో కొంత ఈ సఫారీలే న‌యం.

గ‌డిచిన‌ మే నెలలో ఒక పెళ్ళికి వెళితే పెళ్ళికొడుకు ఫుల్ సూట్లో గుర్రమెక్కి ‘రాజు వెడలె రవి తేజములల‌రగ’ అని ఊరేగుతున్నాడు. గుర్రమెక్కిన మా రాజుకు తలమీద భారీ తలపాగా, ముఖం మీద నుండి క్రిందకు గుమ్మానికి వేలాడదీసినట్లు పూలదండలు. పెళ్ళి ఊరేగింపు రాత్రే అయినా మర్యాదకు లోటులేకుండా ఛత్రి. ఇవి చాలవన్నట్లు వీడియో కవరేజ్ కోసం ఫోకస్ లైట్లు. ఆ రోజు బయట టెంపరేచర్ ఓ నలభై అనుకోండి. ఇంత అంగరంగ వైభవంగా `బారాత్` వస్తున్న పెళ్ళికొడుకు పరిస్థితి నా సామిరంగా ఏమి చెప్పమంటారులెండి! వారు స్పృహ తప్పిపోయే ప్రమాదం నుండి కాపాడడానికేమో ప్రక్కన ఒకడు ఆయన ముఖాన ఉన్న పూల దండలను పైకెత్తి పట్టుకుంటే ఇంకొకడు విసన కర్రతో విసురుతున్నాడు.

మ‌న ధ‌మ్ బిర్యాని పెళ్ళికుమారుడు

ఆ పెళ్ళి కొడుకు దీనస్థితి చూస్తే పైనా, క్రిందా మంటపెట్టి వండే బిర్యానీ గుర్తొచ్చింది. ఎంత నల్లనివాడు ప‌ద్మ‌న‌యంబుల‌ పెళ్ళి కొడుకైనా ఈ ఎర్పాట్లతో రంగు విరగాల్సిందే లేదా దమ్ బిర్యానీ అయిపోవాల్సిందే. హాయిగా ‘లాగూ’ ఇన్ సుఖాన్ని పోగొట్టుకుని, సూట్లు, సఫారీలు, బూట్లు, మాన్యవర్ డ్రస్సులతో (కొన్ని కొన్ని సార్లు గరకు తల పాగాలు, పులిగోరు పతకాలు ముత్యాల దండలు అదనపు సొగసులు) ఎంత కష్టం తెచ్చిపెట్టుకున్నారో మన పెళ్ళి కొడుకులు (పెళ్ళి తరువాత కష్టాలకు సీజనింగేమో) అనుకున్నా. పెళ్ళి కూడా యుద్ధం లాంటిదే అనుకునే కొంద‌రు పెద్ద‌లు పెళ్ళి బారాత్‌లో వీర‌ఖ‌డ్గాన్ని కూడా పెళ్ళికొడుకు చేతికిచ్చి, వీర‌తిల‌కం దిద్ది పంపుతారు.

క‌త్తితో క‌ళ్యాణ కద‌న‌రంగానికి

పై కష్టాలన్నీ చూసిన తరువాత నాకు మ‌న తమిళ తంబిలపై గౌరవం రెట్టింపయింది. ఎవరు ఎన్ని వేషాలు కట్టుగాక మా తమిళ సూపర్ స్టార్లంతా బృందావన్ గార్డెన్సు లోనైనా, హాలీవుడ్ లోనైనా హాయిగా లుంగీల్తోనే డ్యూయట్స్. అందుకే వారి లుంగీడాన్సు పాట వైర‌ల్ అయి ప్ర‌పంచాన్నంతా లుంగీలు చుట్టించింది. గతంలో తమిళనాట ఒక క్లబ్ కు పంచెతో వెళ్ళిన పెద్దాయనకు ‘నో ఎంట్రీ’ చెప్పినందుకు మన పురచ్చితలైవి సెల్వి జయలలితగారు ఇంకొకసారి మన తమిళ పులులకు ఇలాంటి అవమానం, అవరోధం కలిగిస్తే బట్టలే కాదు తోలు కూడా ఒలిచేస్తానని పంచెజోలికి వ‌చ్చినోళ్ళ‌కి పంఛింగ్స్ తో గ‌ట్టి వార్నింగ్ ఇచ్చార‌ట‌. ఇవన్నీ విని చూసిన తరువాత మీకు మన ‘లాగు’ ఇన్నే బెటర్ అనిపించడం లేదా? మన లాగు ఇన్ ఉన్నా పోయినా ఈ కొలువుల లాగిన్ మాత్రం మ‌న‌ల్ని వ‌దిలేలా లేదు.

లాగిన్ అవడమంటే ఏమిటో అనుకున్నా. జుగాడ్ కు పేరొందిన మన దేశీయులు లాగిన్ అంటే ప్రెష‌ర్ కుక్క‌ర్ వెయిట్‌ను కంప్యూటర్ ‘కీ’ బోర్డు మీద పెట్టేసి నిజమైన హోమ్ వర్క్ కు లాగిన్ అవడం చూసి ఔరా ఎంతపని చేసిందీ లాగిన్ అని నోరెళ్ళ బెట్టా!

(ముప్పై ఐదేళ్ళ పూర్వమే ”టకాపీ” అనే కొత్త‌ పదాన్ని సృష్టించి వినోదం పంచిన అసమదీయ మిత్రుడు భుజంగరావుకు కృతజ్ఞతలతో …)

29 Replies to “Login – ‘లాగు ‘ ఇన్”

  1. Hi Anna, very good description of the Lagin and login. I enjoyed it thoroughly and it’s very hilarious. Especially Pelli Koduku kahshalu. Tamilnadu mans dressing style is always best, Panchi kattu or Lungi. Doesn’t matter, who you are.

  2. కుక్కపిల్లా, సబ్బుబిళ్ళా..
    కాదేదీ కవితకనర్హం!
    అన్న శ్రీశ్రీ ని గుర్తు చేస్తూ..
    లాగిన్నూ, టకాపీ..
    కాదేదీ కధకనర్హం అనిపించేరు🙏🏻

  3. Chaala saradaga undi sir, Mullapudi Venkata Ramana gari rachanalu gurthu chesaru. Congratulations sir

  4. కుక్కపిల్లా, సబ్బు బిళ్ళా..
    కాదేదీ కవితకనర్హం!
    అన్న శ్రీశ్రీ ని గుర్తు చేసి,
    లాగిన్నూ, టకాపీ…
    కాదేదీ కథకనర్హం!
    అనిపించారు 🙏🏻

  5. Anna, An excellent article. Me too have same issue. Ofcourse, all for us are from same school.

  6. శుభోదయం
    Log”in” కష్టాలు చాలా సరదాగా వున్నాయి. మా dental కోర్సు ragging lo రకారకాల in shirts చేయించే వారు freshers Day అయ్యే వరకు. ప్రతి రోజు బయట ఎదురయ్యే టక్కు కష్టాలు బాగా రాశారు. బాగా లేదు అని చెప్పిన vinani వాళ్లు. Evarem అనుకున్నా na tak na eshtam anukune vallu…life going on
    This topic is a laughter riot Sir…

    1. చాలా హాస్యాస్పదంగా వుంది. ‘లాగిన్’ లో ఇంత విషయం వుంది అని తెలిసింది. ఈ ‘వెబ్’ సమావేశాల కాలంలో ‘లాగిన్’ అవండి అని చరవాణి ద్వారా సూచనలు వస్తే అందరూ వున్న ‘టక్అప్’ లు తీసేస్తారేమో సార్…

  7. Chala saradaga undi sir…pelli koduku situation Nijame papam..naku chala sarlu alage anipinchindi 😀😃🙏

  8. Harsha uncle, చాలా చక్కగా హాస్యం తో కూడిన రచన..మీకు అభినందనలు

  9. అన్నీ తెలిసినవో/అనుభవించిన లో అయినా చదువు తోంటే చాలా బాగుంది.ముళ్ళపూడి రమణ మళ్ళీ రా‍స్తున్నాడా అనిపించింది

  10. Sir enjoyed a lot while going through the login and remembering all things from childhood to present days and congratulations sir for your good articles

  11. హాస్యం వ్యంగ్యం మిళితమైన చక్కని రచన. అభినందనలు.

  12. నిత్య జీవితంలో జరినవే చక్కగా చెప్పటం బాగుంది

  13. A beautiful ,refreshing description n journey of logu in to login.
    Congratulations Harshavardhan garu.

  14. గతంలో పంచె కట్టు లో కూడ చొక్కా పంచ లోపలి కి తోసి పటకా పెట్టి పై న కోటు వేసుకునే వారు
    పాను గంటి వారి రచనలు గురుతు వచ్చింది

  15. Very nice H v garu you still remember tackapee in this lockdown time most of us forgot it
    Thanks for mentioning me

    1. Hilarious.
      In our childhood in Guntur we rarely saw an INSHIRT person except advocates walking to the court. ( no vehicles, may be some having cycles).
      Dr. Sivaramakrishna used to tuk with two belts.
      Please add dhoti tuk also. In old cinemas we used to find. For example Allu in some pictures. Harsha, continue the blogs. At least for few minutes we can enjoy.

  16. నవ్వుల హరివిల్లులాగున్నది,కాలక్షేపం
    బఠాన్నీల్లాగున్నది,నవ్వులు పుట్టించేల్లాగున్నది,దటీజ్ హర్షవర్ధన్ నానీల్లాగున్నది.
    హాస్య కవిత్వం బాగున్నది హర్షవర్ధన్గారూ!

  17. Navvule navvulu
    We also played role of a teacher for new tuck comer cousins.we also teased some hridaya tuckers if ANR kind
    Thanks for kindling nemories
    Wonderful piece
    Keep the tempo👏👏👏

  18. లాగిన్ ఏదేదో కంప్యూటర్ వ్యవహారం అనిపించి లాగిన్ అయతే , చిన్నతనంలో పొడుగుచొక్కలలో బొందు లాగులు , పోస్ట్ డబ్బాలు గుర్తొచ్చాయి. ఏడు నిమిషాల సరదా గా గడచింది. వక దృశ్యము నుండి మరో దృశ్యం లోనికి కదులుతున్న మీ అనుభవాల జ్ఞాపకాల దృశ్యాలు కడు కమనేయముగా వున్నవి.

  19. కాదేదీ కవితకనర్హం అన్నట్టు రాసే బుద్ది బలం ఉంటే ఏ వస్తువయినా రచనకర్హమే అని నిరూపించారు హర్షవర్ధన్ గారూ!లాగిన్ మీద ఇంత విషయముందా?అనిపించింది. అలాగే ధమ్ బిర్యానీ పెళ్ళి కొడుకు వగైరాలు. సరదాగా ఉన్నాయి.

  20. After a long time I have experienced irresistible bouts of laughter
    I enjoyed login thoroughly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *