ఇదంతా డెబ్భయి అయిదేళ్ల కిందటి సంగతి. కోనసీమ మారుమూల కుగ్రామమైన చినగాడవిల్లిలో బసవ పద్మనాభం, లక్ష్మీనరసమ్మ దంపతులకు మూడవసంతానంగా జన్మించింది నాగమణి. ఆమెకంటే ముందుగా భూమ్మీదపడ్డ బిడ్డలు బతక్కపోవడంతో, ఈ పిల్ల పరిస్థితి ఏమవుతుందోనని అమ్మానాన్నలు భయపడ్డారు. బంధుమిత్రులు ఆందోళపడ్డారు.
పురిటిపిల్లలకు మారకం తప్పాలంటే అప్పట్లో ఏవేవో పేర్లతో పిలవాలనేది పల్లెటూళ్లల్లో ఒకానొక సిద్ధాంతం. అలా అనామకంగా పిలుపుచేస్తే ఆ పిల్లలు బతికిబావుంటారనేది ఆశ. అంచేతనే నాగమణికి ఎర్రెమ్మ అనే కొసరు పేరు దక్కింది. ఆనంతరకాలంలో ఆ కొసరుపేరే బంధుమిత్రులందరికీ అసలుపేరుగా చిరపరిచితమైంది. నాగమణి కాస్తా ఎర్రెమ్మగా ఎదిగింది.
ఆమె తర్వాత పద్మనాభం దంపతులకు మరో ఏడుగురు పిల్లలు పుట్టకపోలేదు. కానీ, అందులో ఇద్దరు మాత్రమే బతికిబట్టకట్టారు. ఎర్రెమ్మకు తోబుట్టువులు కాగలిగారు.
కన్నతల్లి ఎప్పుడూ కాన్పులతల్లిగా మంచాన్ని విడవకపోవడంతో చిన్నపిల్లలబాధ్యత పెద్దదానిగా పెరుగుతున్న ఎర్రెమ్మ మీదనే పడ్డాయి. అతి చిన్నవయసునుంచే ఆమె తోబుట్టువులకు అలా అమ్మకాని అమ్మ అయింది. ఒకదశలో అయితే ఇంటి బరువంతా ఆమెదే అయింది. అలాంటప్పుడు, విద్యాభ్యాసం ఎక్కడని సాగేను. కాబట్టే ఎర్రెమ్మది వానాకాలం చదువయింది. చదువు వానాకాలానిది కావచ్చును. ఎర్రెమ్మ మనసు మటుకు వసంతకాలానికి మారురూపు. మంచితనానికి నిలువెత్తు నిత్యరూపు. ఆమె పుస్తకాలు చదవలేకపోయినా జీవితాన్ని చదవగలిగింది. సాటిమనిషిని మనిషిగా చూడగలిగింది. అనురాగాన్నీ, ఆప్యాయతలనూ అణువణువునా రంగరించుకోగలిగింది.
పదిహేడేళ్లవయసులో ఎర్రెమ్మ వివాహం వెంకటేశ్వరరావుగారితో జరిగింది. అంతవరకూ గుమ్మం దిగని ఆమె పెళ్లికూతురుగా తొలిసారి అత్తింటి గడపతొక్కింది. ఆరుగురు ఆడబిడ్డలకు తల్లయింది. అయినప్పటికీ ఆమెకు ఇల్లు తప్పనిచ్చి వేరే ధ్యాస ఉండేదే కాదు. మహాఅయితే మెట్టినింటికి వచ్చాక పేరంటాలకో, శుభకార్యాలకో, గుడికో గోపురానికో ఇల్లు దాటి ఉండొచ్చును. అది కూడా వేళ్లమీద లెక్కబెట్టగలిగినన్నిసార్లు. కనీసం బట్టలదుకాణానికో, బంగారం కొనడానికే వెళుతుంటారు అమ్మలు. ఈ ఎర్రెమ్మకు అలాంటి వెళ్లడాలూ లేవు.
ఎర్రెమ్మ భర్త వెంకటేశ్వరరావు మూడేళ్లవయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు. ఎర్రెమ్మే ఆయనకు తల్లి ప్రేమసైతం అందించిందని చెప్పాలి. అరవైసంవత్సరాలపాటు ఆయనతో సంసారయాత్ర అరమరికలు లేకుండా సాగించింది. ఆయనకు అన్నీ తానే అయింది. సుఖసంతోషాలను పంచిపెట్టింది.
ఎర్రెమ్మావెంకటేశ్వరరావుల పెద్దకుమార్తె వివాహం 1982లో జరిగింది. ఆఖరమ్మాయికి రెండో అబ్బాయి 2000 సంవత్సరంలో పుట్టాడు. పద్దెనిమిదేళ్ల ఈ మధ్యకాలంలో వారిల్లు ఎలా ఉండేదంటేను.. చిన్నసైజు అన్నపూర్ణాస్టూడియోలాగానే ఉండేది.
ఒకవైపు ఒక అమ్మాయి పెళ్లిచూపుల సెట్, మరోవైపు ఇంకో అమ్మాయి సీమంతం సెట్, ఇంకోవైపు వేరొక ఫ్లోర్‌లో బారసాల సెట్.. ఇలా నిరంతరాయంగా రకరకాల వేడుకలు ఆ ఇంట కళ్లకు కట్టేవి. ఈ కాలావధిలోనే ఆరుగురు ఆడపిల్లల వివాహాలు వాళ్లకు పన్నెండుమంది పిల్లలు పుట్టడాలూ జరిగిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు. ఘనమైన ఈ బాధ్యతలన్నీ ఎర్రెమ్మగారి చేతులమీదుగానే జరిగాయని వేరుగా చెప్పుకోనక్కరలేదు. ప్రేమాభిమానాలకూ, ఓపికాసహనాలకు ఆమె పెట్టిందిపేరని చెప్పడమూ అతిశయోక్తికాదు.
ఒక సందర్భంలో ఎర్రెమ్మ పిల్లలిద్దరు పురుటిమంచాల మీద ఆసుపత్రిలో రెండు వేరువేరు గదుల్లో ఉంటే, సరిగ్గా అప్పుడే వెంకటేశ్వరరావుగారికి ఏక్సిడెంట్ అయింది. ఆయనకూడా చికిత్సకోసం అదే హాస్పిటల్‌లో చేరడం వైచిత్రి. కాకపోతే, ఒకే దవాఖానాలో తండ్రీబిడ్డలు మూడుగదుల్లో కుదురుకుని వైద్యం పొందుతుంటే నిష్కామకర్మయోగిలా ఎర్రెమ్మ వాళ్లకి సేవచేసి సేదతీర్చారు. అంతేగానీ, సంయమనం కోల్పోనేలేదు. సహనాన్ని విడువలేదు. వీటన్నింటికీ తోడు ఎగసిపడే ఆర్థికసమస్యలనూ ఆమె ఎన్నడూ పట్టించుకోనేలేదు. స్థితప్రజ్ఞతనే ఎల్లవేళలా ప్రదర్శించారు.
ఎర్రెమ్మ భగవద్గీత చదవలేదు. పురాణాలు పఠించలేదు. వేదాంతం ఆమెకు తెలియదు. ఉపనిషత్తుల ఎరుకేలేదు. కానీ, వీటి సారాంశాన్ని జీవితంలో ఆచరించి చూపగలగడమే ఆమె మానవతకు దర్పణం. ఆమె చైతన్యశీలతకు నిదర్శనం.
పెద్దలు చెప్పే మహాప్రతిపదార్థాలేవీ తెలియకపోయినా వాటన్నింటినీ తన బతుకులోకి తనకు తెలియకుండానే అనువదించుకున్న మహామనీషి ఎర్రెమ్మ. నేను అల్లుడిగా వారింట కాలుమోపి ముప్ఫయిమూడేళ్లు దాటింది. ఈ కాలంలో సహనానికి ప్రతీకగా నిలిచే భూమాత సైతం అప్పుడప్పుడు కంపించిపోయి భూకంపాలు తేవడం ఎరుగుదును. గంభీరమైన సముద్రుడు కూడా సునామీగా ఎగిరిపడటం చూశాను. ఎర్రెమ్మగారిలో మాత్రం కోపం కాదు కదా. చిన్నపాటి అసహనాన్నీ చూడనేలేదు. నిజం చెప్పాలంటే, హద్దుమీరిన ఆమె సహనాన్ని చూసి అప్పుడప్పుడు నేనే సహనం కోల్పోవడం యదార్థం.
నాకు తెలిసి ఎర్రెమ్మగారికి ఎవరితోనూ విభేదాలు లేవు. వివాదాలు లేవు. ఇంట్లో పనివాళ్లతోనయినా గొంతుపెంచి మాట్లాడిన ఘటనలు లేనేలేవు. ఆశ్రమవాసంలో ఉన్న కొందరు స్వాములే అగ్నిహోత్రావధానుల్లా విరుచుకుపడుతున్న ఈ కాలంలో, పుట్టిననాటినుంచీ శ్రమవాసంలోనే ఉంటూ అతిపెద్ద ఫ్యామిలీ సర్కస్ నడుపుతున్న ఎర్రెమ్మ ఇల్లాలికి ఇదంతా ఎలా సాధ్యమైందనేది అత్యంత ఆశ్చర్యకరమైన భోగట్టా.
ఇప్పుడు అలుపెరగని మూడవఇన్నింగ్స్ ప్రారంభించి, నాలుగోతరం మునిమనవరాళ్లు రేయ, తన్విలకు, మునిమనుమడు విహాన్‌కు ప్రేమ అందిస్తోంది ఎర్రెమ్మ. ఈమె వండే చేపలపులుసే అయినా, బిర్యానీయే అయినా మనవలు, మనవరాళ్లు వెర్రెత్తిపోయిమరీ తింటుంటారు. వీళ్ల అమ్మలకంటే ఎర్రెమ్మకే వీళ్ల రుచుల గురించి, అభిరుచుల గురించి బాగా తెలుసును. అందుకే వీళ్లందరికీ ఆమె మహా అపురూపం.
అహర్నిశలూ ఇలా సంసారంకోసం పాటుపడిన ఎర్రెమ్మగారికి అరవైయ్యేళ్లు దాటాక మోకాళ్లు మొరాయించాయి. కూతుళ్లు పట్టుబట్టి ఆపరేషన్ చేయించడంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసి పనులు మొదలు పెట్టేయడం ఆమెకు ఓపిక ఉండికాదు. ఓపిక చేసుకునే అనేది వాస్తవం. ప్రస్తుతం డెబ్భయిపడిలో పడిన ఎర్రెమ్మ సంపదంతా చిన్నసూట్‌కేసులో నాలుగు జతల బట్టలు. ఎవరితో మాట్లాడినా.. ‘‘చల్లగా ఉండండి. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు.’’ ఇవే ఆమె గళంవెంట దీవెనలే వెల్లువెత్తుతుంటాయి. ఎవరు ఎదురుపడి ఆప్యాయంగా పలుకరించినా వెన్నునిమురుతూ ఇవే ఆశీస్సులు ఆమె అందిస్తుండటం అదో అమృతోపమానమైన ఘట్టం.
సామాన్యురాలిగా ఉంటూనే అసమానురాలిగా స్ఫూర్తివంతమైన జన్మసంస్కారపు వర్తన సాగించే ఎర్రెమ్మ నాకు అత్త(మ్మ). ఆమెను చూసినప్పుడల్లా శ్రీనివాస్ రాయప్రోలు ఎక్కడో ఒక కవితలో అన్నట్టు..
“మనదేశంలో
ఆడవాళ్లు
ముసలివాళ్లయ్యే
పద్ధతొకటుంటుంది
మచ్చుకి
మా అమ్మ..
వందేళ్లు
పొయ్యిముందు..
వందేళ్లు
వంటగది గోడల మధ్య.. “
అన్న మాటలే నా చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటాయి.
కవి శ్రీనివాస్ తాను దర్శించిన ప్రేమమయ మాతృమూర్తులను సజీవంగా పరిచయం చేసేందుకు అమ్మల, అమ్మమ్మల చిత్రాలతో ‘అమ్మలకొలువు’ ప్రదర్శన ఏర్పాటుచేసిన సందర్భంలో..
ఎర్రెమ్మత్త – అమ్మసత్తెమ్మ
‘‘నాన్నలు తమ స్నేహితుల్ని కొందర్ని పోగేసి ఒక స్థలాన్ని సంపాదించి ఇళ్లనైతే కట్టగలరు కానీ, ఆ కట్టిన ఇళ్లల్లో ఇంత జీవం నింపి, ఆ ఇళ్లసముదాయాన్ని మనుషులు తిరుగాడే అందమైన కాలనీలుగా మార్చేది అమ్మలే..’’ అనే మాట మా అత్తమ్మ ఎర్రెమ్మను, మా అమ్మ సత్యమ్మను, మా మేనత్త రాజమ్మను చూసి వారి ప్రేమాభిమానాలు పొందడంతో స్వానుభవమయింది. అటువంటి అమ్మలు అత్తలు దేవుడిచ్చిన వరాలు.
జ్ఞాపకాలకు అంతం ఉండదు. మఖ్యంగా అమ్మలతో అమ్మమ్మలతో కూడిన జ్ఞాపకాలకయితే మరీను. వారి చీరచెంగులే మనకు కొంగుబంగారాలు.
Now a days very very rare in the society , people like Yerrammagaru.
She has wonderful son-in-law. Very lucky.
sildenafil 100 capsules
మాతృదేవోభవః
అమ్మలు మరియు అత్తమ్మలు
మనుష్యుల జీవితాశయాలను
ప్రతిఫలింప చేసి వరాలను కురిపించి మరియు తమ నిండైన ఆశీర్వాదాలను ప్రసాదించే ప్రత్యక్ష
దేవతామూర్తులని తమ కవితలో
విశదీకరించారు. కృతజ్ఞతలు
While I was reading the blog, I thought it’s a fiction; and happy to know that the write up is made on real life experiences.
For majority of the people the quality of life depends on their parents and grandparents; After reading your blog it’s proven and glad that I am associated with great human being 🙏🏻😊🙏🏻
బాగుంది. నిజమే, వాళ్ళు వేదాంతాన్ని ఆచరించారు.
Tammudu, Harsha, cheppi natlu, nenu kuda yerramma garini chalasarlu kalisananu, navvutu matladevaru. Anukokunda varicheti vanta kuda, ruchi chudatam jarigindi Vijayawada lo, tammudi to patu. Mutton curry, chesaru, gravy chalabagundi. Maa menatha Rajamma mariyu maa chinnamma Sattemma,gurinchi yentha cheppina… Veerandaru matru murthule🙏
జీవిత పాఠాలను వంటపట్టించుకున్నవారికి వేద వేదాంగాలతో పనిలేదనియు నిరూపించడానికి కొన్ని సార్లు దేవతలు ‘ఎర్రెమ్మ’లుగా అవతరిస్తారు. వాళ్లను అనుసరించిన వారు తరిస్తారు. అటువంటి అమ్మల, అత్తమ్మల, అమ్మలగన్న అమ్మల జీవిత కథల్ని వెలుగులోనికి తెచ్చే వారు పాఠకుల హృదయాలను గెలుస్తారు.
These are the silent and selfless mothers who often don’t get due recognition for their love and affection towards their progeny. This
Is a tribute to all such mothers and mothers in law. your writeup should brings a change in the attitude of present generation.
Great explanation and contribution for a great woman life
Very good real story. It is really fantastic
సహనానికి మారు పేరు భారత స్త్రీలు, అటువంటి వారిలో అత్యంత సహన శీలులు అరుదుగా ఉంటారు, అటువంటి వారి ఆదరణ పొందిన మీవంటి వారు ధన్యులు🙏.
అమ్మ, అమ్మమ్మ, మా పెద్దమ్మ కు హృదయ పూర్వక నమస్సుమాంజలి 💐🌺
Very good discretion and presentation in polite mother language.
Dear Harsha GARU,
You are one of the most luckiest person to have a mother and mother-in-law worth praising.
YourLove towards them
Is really appreciatable.may god bless you ou all.
Excellent. Touching.
Good to remember the qualities of Erramma and her habits