చిన్నతనంలో ఎంత కష్టమైనా రావచ్చుగాని పిండి మరకెళ్ళాల్సిన కష్టం మాత్రం ఎవ్వరికీ రాకూడదు. ఆసాంతం చదివి మీరే అవునో, కాదో చెప్పండి. నా బాల్యంలో కొంత కాలం అవనిగడ్డ, గిద్దలూరు, ఇచ్చాపురం వంటి చిన్న ఊళ్ళల్లో గడిచింది. అప్పట్లో అన్నపూర్ణా ఆటాలు, ఆశీర్వాద్ ఆటా ఆశీర్వాదాలు మాకు దొరకని కష్టకాలమాయే. అందరూ గోధుమలు, ధాన్యం, పప్పులు మర ఆడించుకోవల్సిందే. ఈ పనికోసం అమ్మలు, అమ్మమ్మలు మమ్ముల్ని బాల కార్మికులుగా వినియోగించుకుని పిండిమరకు తోలేవాళ్ళు. మాకు ఇప్పటి పిల్లలంత అవేర్నెస్ లేకపోవడంతో కార్మిక శాఖకు కంప్లైట్ చేయాలని తెలియదు. మేము అలా పిండిమర దారిపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ రాయితీ జల్లులా మరకు పోయి వస్తే పావలానో, పదిపైసలో ఆకర్ష్ పథకానికి ఆశ పడి ఈ సాహసానికి సిద్దపడితే మేము పడ్డ కష్టాలు పగోడికి కూడా వద్దు.
గోధుమలో మరొకటో నాలుగుమూడు కిలోలు క్యాన్‌లో పోసి ఆడించుకు రమ్మని చెపుతూ అమ్మలు మరవాడికి ఒక కేజీ తక్కువ చేసి చెప్పమని చెప్పి పంపేవారు. మరకు పోయి అబద్దం చెప్పడానికి పూర్తిగా సాహసించలేక పిండిమర చక్రాలు కర్కర్ మని చేసే సౌండ్‌లో అశ్వద్దామ హతఃకుంజరః అన్నట్లుగా మూడు కేజీలని రెండనో నాలుగును మూడనో అనేసేవాళ్ళం. పిండిమర వాళ్ళు పొద్దున్నుంచి నాలాంటి వాళ్ళను ఎంతమందిని చూసుంటారు? బాలయ్య బాబులా కంటి చూపుతో సరుకు తూకం కనిపెట్టేసి కరెక్ట్ గా వసూలు చేసేవాళ్ళు.
ఇంట్లో మరకు పంపేముందు కణ్వమహర్షి శకుంతలకు చేసే అప్పగింతల కంటె ఎక్కువే మాకూ బోధ జరిగేది. ”పిండి ఆడించేప్పుడు దిక్కులు చూడకు, పిండికాజేస్తారు జాగ్రత్త” అని, మరుమ్గా పట్టించమనో, మెత్తగా పట్టించమనో, పసుపు తరువాత ఆడించవద్దనో, కారం తరువాత ఆడించవద్దనో ఆంక్షలు చెప్పి పంపేవారు. ఇన్ని జాగ్రత్తలు చెప్పారు కదా అని మేము పిండిమరలో అడుగు పెట్టిన దగ్గరనుండి ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ వింగ్ వాళ్ళు డేగ కన్నుతో చూస్తున్నట్లుండే వాళ్ళం. దీనికితోడు ప్రతి పిండి మరలో ఒక సన్న గొట్టం దొంగ చాటుగా వాళ్ళ ఇంట్లోకి ఉంటుందని అందులోనుండి కొంత పిండి మరవాళ్ళు కాజేస్తారన్న బలమైన రూమరుండేది.
మా దుర (అ)భిమాన పిండిమర
పిండిమరకు చేరుకుని హై ఎలర్ట్ లో వెయిటింగ్లో ఉంటే ఈ లోపు మరవాళ్ళు మేము పిల్లలం గనుక పెద్దల్ని, నోరుగలవాళ్ళని ప్రయార్టీలో పెట్టేసేవారు. ఆ రోజుల్లో కరెంట్ ఉన్న సమయం కంటే కరెంట్ కట్ సమయమే ఎక్కువ కావడంతో వెయిటింగ్ తప్పేది కాదు. ఈ వినోదాన్ని గమనిస్తూ కొంత సేపయ్యేప్పటికి మరలో లేచిన పిండంతా తలమీద పడి మాకు బాలవృద్దుల గెటప్ వచ్చేసేది. కాసేపటికి ఆ గోలలోనే ఆపరేటర్ మా చేతిలో క్యాన్ గుంజుకుని స్పెసిఫికేషన్స్ చెప్పేలోపే పైనున్న బకెట్ లో పోసేసి పిండి వచ్చే గొట్టానికి వేలాడుతున్న టార్పలిన్ గుడ్డను మడిచి గొట్టం మీదకు తోసి కర్ కర్ మని విష్టుమూర్తిలా రెండు చక్రాలు తిప్పేవాడు. పైన బకెట్లో వేసిన గోధుమలు గ్రైండర్లో నలిగి క్రింద ఉన్న టిన్‌లో పడటానికి మూడు, నాలుగు నిముషాలు పట్టేది. పిండి నలిగి కిందకు పడే టైమ్ కు మడచి ఉంచిన టార్పాలిన్ గొట్టాన్ని క్రింద ఉన్న డబ్బాలోకి సెట్ చేసేవాడు. ఈ నాలుగైదు నిముషాల్లో పైన వేసినదంతా పిండిగా వస్తుందో లేదో అన్న టెన్షన్‌తో మా నరాలు చిట్లుతుండేవి. (ఇంట్లో పెట్టిన అప్పగింతలు భయాలు సామాన్యమైనవా!) మనపిండి ఆడుతున్నంత సేపూ ఏ చక్రం తిప్పినా ఎటువెళ్ళినా మన పిండి పోతోందన్న అనుమానంతో మాకు మనశ్శాంతి ఉండేదికాదు. కాసేపటికి డబ్బాలో పడ్డపిండిని మన క్యాన్‌లో వొంపి పొమ్మనేవాడు. మన కళ్ళన్నీ వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్‌లో బాలు వైపే తిరుగుతున్నట్లు ఆపరేటర్ చుట్టూ తిరుగుతూ ఉండేవి.
ఈ అడ్వెంచర్ ముగించుకుని తల, వొళ్ళు దులుపుకుని క్యాన్ భుజానికో, సైకిల్‌కో తగిలించుకుని మనకు ఇవ్వబోయే పావాలాకు బడ్జెట్ ప్లానింగ్ డ్రీమ్స్ వేసుకుంటూ ఇల్లు చేరేవాళ్ళం. ఇంటికి రాగానే క్యాన్ లో వచ్చిన పిండిని తూనికలు కొలతల శాఖల వలె హోమ్ శాఖవారు కొలిచేవారు. ఇహమొదలు ”ఎటు దిక్కులు చూశావ్! ఆ చచ్చినోడు మోసం చేసి పిండి కాజేశాడు. మేము ఎన్ని చెప్పిపంపితే ఏం ప్రయోజనం, అరకేజి తక్కువొచ్చింది. మెత్తగా పట్టమంటే బరగ్గా పట్టాడు. నీకు ఇన్నేళ్ళొచ్చాయి. ఒక్క పనీ వివరంగా చేసుకురాలేవు” అంటూ కేంద్ర్రప్రభుత్వం జి.ఎస్.టీ కాంపెన్సేషన్ ఎగొట్టినట్లో, తగ్గించినట్లో వారి దయాదాక్షిణ్యాలతో కొంత కోత విధించి పదిపైసలే ఇవ్వడమో మరీమూడ్ బాగాలేక పోతే మొత్తానికే మొండి చెయ్యి చూపేవారు. ఇలాంటి చేదు అనుభవమైన తరువాత మళ్ళీ మరకు పోకూడదు అనుకునే వాడిని కాని ప్రతీసారీ కొత్త రాయితీలతో నమ్మబలికి పంపేవారు. క్లైమాక్స్ మాత్రం ఒక్కటే, ‘పిండి తక్కువ, మోసం జరిగిపోయింది. మీ వల్ల ఏమీ కాదు’.
Jhoot Bole Kauwa Kaate మై మరకే చలే జాయేంగే
పిండిమర విధులు ఎలక్షన్ డ్యూటీల్లా ఏ మినహాయింపులు లేనివే. నేను ఇంటర్ చదివేటప్పుడు సెలవలకు మా ప్రసాదన్నయ్య గుడివాడ వచ్చాడు. ఆ రోజుల్లో బాబీ సినిమా విడుదలై ఒక వూపు వూపేస్తోంది. కాలేజి నుండి ఇల్లు చేరుకునేందుకు సందు తిరగ్గానే ప్రసాదన్నయ్య రెండు చేతుల్లో రెండు క్యాన్లతో ఎదురయ్యాడు. ‘అన్నయ్యా ఎక్కడికి?’ అని అడగ్గానే నిన్ననే మేము చూసొచ్చిన బాబీ సినిమాలో ‘మై మరకే చలే జాయేంగే` పాటెత్తుకుని ‘పిండిమరకే చలేజాయేంగే’ అని హుషారుగా పరుగెత్తుకున్నాడు. భవిష్యత్ in front crocodiles festival అని తెలియక కదా అన్నయ్య ఇంత ఎగిరెగిరి పడుతున్నాడు అనుకున్నా. నేను ఊహించినంతగా కాకపోయినా మర నుండి తిరిగొచ్చిన తరువాత హోమియో లో పొటెన్సీ డోసు పడనే పడింది. బావ కొడుకని సంభావింపక మా అన్నయ్యను తగురీతిగానే అమ్మ సత్కరించింది.
ఆ రోజుల్లో పిండిమర స్వానుభవం అయిన సాటి కామ్రేడ్స్ అందరికీ ఒక్క విషయం అర్థమై ఉంటుంది. యూనివర్సిటీ వీ.సీ.గా పనిచేసి విద్యార్థులతో తిట్టించుకోకుండా ఉండొచ్చేమో, ఎమ్మేల్యేగా నియోజకవర్గ ప్రజలందరితో మంచి అనిపించుకోవచ్చేమో కానీ పిండిమరకెళ్ళొచ్చి మంచి పనిమంతుడనిపించుకోవడం మాత్రం దుర్లభం.
ఎక్కడో మహాకవులు డా.ఎన్.గోపి వంటివారు తప్ప మానవమాత్రులు పిండిమరల పై మరులుగొనలేరు. వారు వడ్ల గిర్ని పై రాసిన అద్భుతమైన కవితలోని కొన్ని వాక్యాల తో ముగిస్తా.
”యాభైయ్యేండ్ల కిందటి ముచ్చట
ఆ పట్టాచప్పుడు
పేదవారి బతుకు లయను ధ్వనించేది
అతుకుల వల్ల ఏర్పడిన శబ్దాలవి
అతుకు ఒకటైతే టిక్‌టిక్
అనేకమైతే
టక్ టిక్ టక్ టిక్ టక్ టిక్ ……..
వడ్ల గిర్ని ఫోటో తీస్తే
దాని పక్కన
ఓ పేదకార్మికురాలి అవతారంలో
మా అమ్మమ్మ కనిపిస్తుంది
వడ్లను చేటలతో
ఇనుపతొట్టిలో పోసే కూలిపని ఆమెది
రెండు బస్తాల ఒక్క రైతులు
ఓ పిడికెడు బియ్యం
ఆమె గంపలో పోసి పొయ్యేవారు
మా అమ్మమ్మ కూడ బెట్టిన
ఆనాటి గింజలే
ఇవాళ్టి నా కవితాక్షరాలు ….
ఇప్పటికీ
దారిలో ఎక్కడన్న
వడ్లగిర్ని కనిపిస్తే
కారును స్లో చేస్తాను
మా అమ్మమ్మ కనపడుందేమో అని”
(ఆప్తులు ఆచార్యగోపి గారికి కృతజ్ఞతలతో …)
మా ఇంటిని ఆనుకునే జిన్ను ఉండేది (అవును మాకు మర అనే మాటే తెలీదు జిన్ను అనే అంటాం) మీలా అప్పుడప్పుడు కాకుండా బాల్యంలో చాలా భాగం ఆ జిన్ను చప్పుడు, ఆ పిండి ధూళిలో సైకిల్ గానులా దొర్లి పోయింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే లీలగా ఆ చక్రపు పిండి అచ్చుల్లో జిన్ను రోజులు. థాంక్యూ సర్.
ఇందులో నాన్సెన్సు ఏముందో నాకర్ధం కాలేదు అసలు మర ముచ్చట్లు ఇచ్చగించాలంటే అది అనుభవంలోకి రావాలి ఆ మజా ఎంజాయ్ చేయాలి మీరు మరోసారి మమ్మల్ని బాల్యంలోకి అలవోకగ తీసుకెళ్ళిఆనందడోలికల్లో తేలియాడేలా చేసారు ఇంచుమించు అందరూ ఈ మర బాడిన పడ్డవాళ్ళే కాని ఇంత సుందరంగా గ్రంధస్ధంచేయడం మీవల్లేఔతుంది మర అనుభవాలతోబాటు బియ్యం కిరోసిన్ రేషన్ క్యూ అనుభవాలు నాకు అదనం ఆహా మీ చతురత కడుంగడు ప్రశంసనీయం నా అభినందనలు
ఆలస్యంగ స్పందింస్తున్నందుకు క్షంతవ్యుణ్ణి లింకు నేరుగా రాలేదు భుజంగరావు లింకు ద్వారా స్పందిస్తున్నా
ఇందులో నాన్సెన్సు ఏముందో నాకైతే ఏమీఅర్ధం కాలేదు మాకైతే చాలా ఆనందపూర్వకమైన ముచ్చట. ప్రతి పోస్ట్ మమ్మల్ని బాల్యంలోకి తీసుకెళ్తోంది. అందరికీ ఇంచుమించు ఇటువంటి అనుభవాలే ఉన్నా వాటిని ఇంత సుందరంగ గ్రంధస్థం చేయడం మీ వల్ల మాత్రమే ఔతుంది . మర అనుభవాలతో పాటు రేషన్ బియ్యం కిరోసిన్ క్యూ అనుభవాలు అదనం నాకు.
నేను ఆలస్యంగా స్పందిస్తున్నందుకు కారణం నాకు లింకు నేరుగా రాకపోవడమే
భుజంగరావుకు పంపిన లింకు ద్వారా ఇప్పుడు నా స్పందన తెలియజేస్తున్నాను మాకు అమితానందాన్ని కల్గిస్తున్న మీకు కృతజ్ఞతాభివందనాలు
Reminiscing childhood travails. I am no exception to all these. The only difference is you had a hope of some reward at the end of the episode. We were always apprehensive of punishment. Thankless can’t be the right word.
Representative voice on behalf of all of us. Wonderful presentation
Reminiscing childhood travails. I am no exception to all these. The only difference is you had a hope of some reward at the end of the episode. We were always apprehensive of punishment. Thankless can’t be the right word.
Representative voice on behalf of all of us. Wonderful presentation
Well articulated sir. Yes, we all have gone through this phase in our childhood. May be the concern of our elders is to teach us that in every step/work/act of life caution is required so that we are not taken for granted. Kudos 🙏 to your writing proficiency and sense of humor
‘మర’చి పోలేని…
‘మర’లా రాలేని ఆ ‘మర’పురాని
జ్ఞాపకాలను భలే గుర్తు చేసారు.
దేన్నయినా అందంగా రాయడం
మీకు కొట్టిన ‘పిండి’ అయింది. అభినందనలు.
I didn’t do all this nonsense in my child hood , I don’t hear my mother and father only games and study, hence I am doing sub – collector and do service to the people not to my family, still I am doing service in ONGC AT AGE OF 68 . In the interest of the nation’s, thanks don’t think otherwise.
Thank you for your feedback
This article is written for Sagatu Jeevulu and alpa Jeevulu
But not for intellectual and patriotic people like you.
You are above such nonsensical thoughts as you worked hard and Retired in a Very High Position.
Good to know about your Great Service to Nation at 68 through ONGC.
Please keep going 🙏🏿
Thank you for your feedback.
This nonsensical article is written for sagatu jeevulu and isn’t meant for Intellectuals like you.
You are a Self Made Person who Retired in la Very High post as Sub Collector.
Good to know that you are serving the Nation through ONGC at 68.
That’s Really Great !!
Please keep going
Hilarious recollection of Childhood memories, sir. I couldn’t resistr myself from lol going back to my childhood where I too experienced pindimara kashtaalu. Excellent narration sir.
పిండిమరలో ఉన్న మర్మాలన్నీ బయట పెట్టాసేరు. ఏవిషయంపైనైనా అలవోకగా రాయగల సామర్ధ్యం సంపాదించారు. అనుభవాలొక్కటే కాదు, మీరు చదివిన పుస్తకాల అనుభూతులు కూడా పంచుతున్నారు. సాహిత్య గుభాళింపులు మనసుకు చేరుతున్నాయి. అభినందనలు.
We may change but our oldies may not . Certain extent I also experienced with you for above said.
Very well explained Anna
వంగల వారి కొద్దిపాటి వ్యంగ్యంతో కూడిన పిండి మర ప్రహసనం చాలా చాలా బాగుంది. చిన్నప్పటి అనుభవాలను మరోసారి ఆనందంగా అనుభవించే అవకాశం కల్పించారు. నాకు బాగా నచ్చింది, మీ అనుమతి లేకుండా ఈ ఆర్టికల్ ను మా bank groups లో పెట్టాను. మా bank circles లో ఎంతో మంది మెచ్చుకుంటూ మెసేజెస్ పెట్టారు. ఇంకా ఇలాంటివి ఎన్నో మీ నుండి కోరుకుంటూ…
విజయానంద్.
ఇది నా సొంత కథ లాగే ఉంది. బహుశా మన ఏజ్ గ్రూప్ అందరికీ అంతే. ఈ రోజు నాకు ఓ కోయిన్సిడేన్స్. నెల్లూరులో పాత రోజుల్లో మర ఉండే ప్రాంతం వచ్చా. అక్కడ ఇప్పుడు ఓ కేకుల షాప్ ఉంది. చిన్నపుడు మర జ్ఞాపకాలు మనసు లో తిరుగాడాయి. ఇప్పుడే ఇది చదివా.
One more fantastic writing. Especially, “Baalayya kantichoopu” is hilarious.
Thanks you sir
అనుభవాల గింజల్ని గుండె పిండిమరలో వేసి కొంచం కూడా “దొంగ దారి పట్టించకుండా” జ్ఞాపకాల పిండిని తయారుచేసిన వైనం మనోజ్ఞం.
Sir Excellent. Adbhutam. Naa Chinnathanam gurthuku Vachhindi
నేను కూడా ఈ పిండి మర వెతలు పడినవాడినే, అదనంగా రేషన్ షాప్ దగ్గర కిరోసిన్ కోసం ఉండే చాంతాడంత లైన్లు, కానీ ఇప్పుడు అవి తీపి గుర్తులు, మీ జ్ఞాపకాలు చదివి మరోసారి నా జ్ఞాపకాలలోకి వెళ్ళేను, చాలా బావుంది.
Excellent sir. Made us remember the good old days. The way you presented it is, amazing sir.
అద్భుతః అన్న మాట అనేకమంది అనేకసార్లు వాడి పిండి మరలో వేసి ఆడించిన పిండిలాగా మెత్తగానో…. బరగ్గానో చేసిసిన మాట! అయినా అదే మాట మరోసారి మరపట్టినట్టు గట్టిగా చక్రం తిప్పి అంటున్నాను…అద్భుతః
వారి వ్యాసం, మీ వాక్యం రేండూ అద్భుతః! ఈ రోజు ఇందువలననేమో కాస్త ఆయుషు పెరిగిందనపించింది.