ఆదిశంకరులు అద్వైత్వాన్ని బోధించి కొన్నివేల సంవత్సరాలు గడచిపోయినా ఇప్పటికీ ఆ తత్త్వాన్ని స‌రిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళెందరో తెలియదు కాని దాన్ని అరాయించుకుని ఆచరించే వాళ్ళు మాత్రం అతి కొద్దిమందే. అద్వైత్వాన్ని అరగదీసేస్తున్నఘ‌నులు (నాతో క‌లిపేలెండి) ల‌క్ష‌ల్లోనే. ఆధ్యాత్మిక గురువు మాతృశ్రీ జిల్లెళ్ళమూడి అమ్మను ఎవరో భక్తుడు అద్వైత్వం అంటే ఏమిటని అడిగితే అమ్మ “అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే అత్తగారు తన కోడల్ని, కూతుర్ని ఒకేలా చూడగలగడమే అద్వైతం” అని చెప్పారట. ఇదేమాట కోడలు వైపునుంచి చూస్తే అమ్మను, అత్తను ఒకేలా చూడ‌టం కూడా అద్వైతమౌతుందేమో కదా! ఇది ఎంత తేలికో అనుకుంటాం కాని ఆచ‌రిస్తే తెలుస్తుంది ఇది అయ్యే ప‌నికాద‌ని. ఈ అత్తాకోడళ్ళ మధ్య సయోధ్య కుదర్చడానికేమో కవిగారు అత్తలేని కోడలుత్తమరాలు ఓయమ్మా అంటూనే కోడల్లేని అత్త గుణవంతురాలు అని కూడా అనేసి ఇద్దరికీ win-win situation క‌ల్పించి సేఫ్‌గా తప్పుకున్నాడు.

అద్వైత్వాన్ని ఇంకొంచెం దగ్గర చేసుకుని చూద్దాం. సింపుల్‌గా చెప్పాలంటే ఎదుటివారి బాధ చూసి మనబాధే అనుకుని చలించిపోతే empathy (అద్వైతం), ఎదుటి వారి బాధను చూసి మనం బాధపడితే Sympathy (విశిష్టాద్వైతం), ఎదుటివారి బాధను చూసీ చూడనట్లుపోతుంటే apathy (ద్వైతం). ఇలా పోయేటోళ్ళను కాపాడాల్సింది మాత్రం ఆ సీతాపతే. పూర్వం షేక్‌స్పియ‌ర్ నాట‌కం చూడ్డానికి వెళ్ళిన రాకూమారి స్టేజిపై నాట‌కంలో కింగ్ లియ‌ర్ ప‌డుతున్న క‌ష్టాలు చూడ‌లేక గౌను త‌డిచి పోయేలా వెక్కివెక్కి ఏడ్చిండ‌ట‌. వాస్త‌వ జీవితంలో ఎముక‌లు కొర‌కే చ‌లిలో థియేట‌ర్ బ‌య‌ట గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్నత‌న‌ జ‌ట్కా వాడు రాకుమారికి గుర్తుకు రానే రాలేద‌ట‌. స్టేజ్ పైని కింగ్ లియ‌రే సత్యం జ‌ట్కావాడు మిధ్య అనుకునే త‌త్త్వం ఆమెది.

Love thy neighbour as you love thyself (నీ వలెనే నీ పొరుగు వానిని ప్రేమించుము) అనే బైబిల్‌ చెబుతోంది. ఇది సగమే అర్థంచేసుకున్న మన పిల్లలు పొరుగు పిల్ల‌నో, పిల్లోడ్నో ప్రేమించేస్తారు. అప్పుడు అది వేలంటైన్‌ తత్త్వం అవుతుంది.

మన భారతంలో సైతం తిక్క‌న‌గారు అద్వైతాన్ని …..

“ఒరులే యవి యొనరించిన

నరవర! యప్రియము తన

మనంబునకగు తా

నొరులకునవి సేయకునికి

పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్‌” అని మ‌న‌ని హెచ్చ‌రించారు.

సంకీర్తనాచార్యులు అన్నమయ్య కూడా ‘ఎదిరికెప్పుడు చేయు హితమెల్ల తనదని చదివి చెప్పని అట్టి చదువేల’ అని చదువుల సారాన్ని విశదీకరించారు.

అనునిత్యం మనల్ని కనిపెట్టి ఉండే మన పని వాళ్ళకు, మన డైనింగ్‌ టేబుల్‌ మీదే మీరు అన్నం పెట్టగలిగితే మిమ్ముల్ని మించిన అద్వైతులు లేరు. మన ఇంట్లో కనీసం ఎక్కడో దగ్గర వారికి తిన‌డానికేమైనా పెడితే విశిష్టాద్వైతం. ఎప్పుడూ ఎవ్వరికీ, ఎక్కడా ఏమీ పెట్టకపోవడమే ద్వైతం. అలాగే మెగావెడ్డింగ్‌ చేస్తూ అతిథులకు వారిని తోలుకు వచ్చిన డ్రైవర్లకూ ఒకే లాంటి భోజనం పెడితే మీరు అద్వైతులే. కనీసం వారికి ఫుడ్ ప్యాకెట్టైనా ఇస్తే మీరు విశిష్టాద్వైతులు. అట్టి వారి ఉనికే మీకు స్పృహలో లేకపోతే మీరు ఖ‌చ్చితంగా ద్వైతులే.

ఒక ఊరిలో మంచి చేయి తిరిగిన స‌ర్జ‌న్ కూర‌లు త‌రిగిన‌ట్లు రోజుకు నాలుగైదు స‌ర్జ‌రీలు చేస్తూ పేషంట్స్ బాబోయ్ నొప్పి అంటే ఓస్ ఆ మాత్రం ఓర్చుకోలేక‌పోతే ఎలా అనేవాడ‌ట‌. కాలం క‌లిసి రాక స‌ద‌రు స‌ర్జ‌న్ గారికీ చిన్న స‌ర్జ‌రీ అయ్యింద‌ట‌. అప్పుడు ఆయ‌న ప్ర‌పంచంలో నాకున్నంత బాధ‌ నొప్పి ఎవ్వ‌రికీ ఉండ‌ద‌ని స్టేట్ మెంట్ ఇచ్చాడ‌ట‌. అవును మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు కోసింది ఊరోళ్ళ‌ను క‌దా త‌న‌దాకా వ‌స్తేనే ఏ త‌త్త్వం అయినా బోధ‌ప‌డేది.

నాకు తెలిసినంతలో కొంద‌రు రాజకీయ‌నేత‌ల్లా అద్వైతాన్ని అ(పా)ర్థం చేసుకున్నవారు మరొకరు కనపడరు. నీవు, నేను వేరు కాదు అని మనసా వాచా నమ్మే వీరు తన మన బేధం చూపక వారు మోజు ప‌డిన ఇళ్ళను, స్థలాలను, ఎదుటివారి నుండి క‌బ్జా చేసేస్తున్నారు. నువ్వు నేను ఏకాత్మలమైనప్పుడు నీ దగ్గరుంటే ఒకటి నా దగ్గరుంటే ఒకటా అని వారి ప్రగాఢ విశ్వాసం.

మ‌న పురాణాల్లో వేట‌కు వెళ్ళి దారిత‌ప్పి ఆక‌లితో అల‌మ‌టిస్తున్న రాజు విశ్వ‌ర‌థునికి (సెకండాఫ్‌లో విశ్వామిత్రుడు) అత‌ని సైన్యానికి శ‌బ‌ల (నందిని) అనే గోమాత కృప‌తో వ‌శిష్ఠ మ‌హ‌ర్షి మంచి విందు భోజ‌నం పెట్టాడ‌ట‌. విందార‌గించిన విశ్వ‌ర‌థుడు మ‌హిమ‌గ‌ల ఆ గోమాత‌ను త‌న‌కివ్వ‌మ‌ని అడిగితే వ‌శిష్టులు నిరాక‌రించ‌డంతో ర‌జోగుణోపేతుడైన రాజు అప్ప‌టిక‌ప్పుడు ఆ గోవును State property గా (జాతీయ‌సంప‌ద‌గా) డిక్లేర్ చేసి (మ‌న‌రాష్ట్ర ప్ర‌భుత్వాలు అర్థ‌రాత్రి G.O లు జారీచేసిన‌ట్లు) బ‌ల‌వంతంగా ప‌ట్టుకుపోవ‌డానికి ప్ర‌యత్నించి భంగప‌డ్డాడ‌ట‌. మ‌న నేత‌ల క‌బ్జాల‌కు విశ్వామిత్రులే స్ఫూర్తి ప్ర‌దాత‌లు అనుకోవాలి. వీరి బాటలోనే కొందరు వేదాంతులు.

‘అన్నమైతేనేమిరా? మరి

సున్నమైతేనేమిరా? అందుకే ఈ

పాడుపొట్టకు అన్నమే వేతామురా!’

అని తత్త్వాన్ని పాడుతూ రెంటికీ తేడాలేన‌ప్పుడు అన్నమే వేస్తేపోలా అని పాడుపొట్ట‌కు అన్నమే వేసే పరమలౌక్యులు.

పూర్వం ఒక విదేశీ భక్తుడు భగవాన్‌ రమణ మహర్షిని “How to treat others”అని అడిగితే రమణులు “There are no others” అని చెప్పారట. ఎదుట ఎవ్వడూ లేడు (అది నువ్వే) అని అద్వైతాన్ని ఏకవాక్యాత్మ‌కంగా ఇంత అద్భుతంగా చెప్పగలగడం జ్ఞాన స్వరూపులు భగవాన్‌కే సాధ్యం.

మనం రమణులు చెప్పిన ఉన్నత అద్వైత స్థితికి చేరుకులేక‌పోయినా సాటిమనిషి మనలాగే అనుకోకపోయినా క‌నీసం మనిషిగా గుర్తించి స్పందించగలిగితే మ‌నం అద్వైత మందిరానికి ఆరుమెట్లు ఎక్కేసి, ఉత్త‌మ అనుష్ఠానం చేసేసినట్లే.

24 Replies to “అద్వైతం”

  1. అద్వైతం ఆవగించంతైనా ఒంట పడితే…
    నా గురించి నువ్వుగించంతైనా తెలుస్తుందనుకుంటాను!

  2. సార్,
    అతి క్లిష్టమైన అద్వైత పరమార్ధాన్ని,అత్యంత లఘువు గా,సునిశిత హాస్యం రంగరించి అద్భుతమైన శైలి లో మనసులోకి చొప్పించారు…

  3. It is very refreshing with comparisons of different dharmas but leading to self realisation to attain the ultimate happiness of a man.
    Well written taking the reader from different periods viswamithrudu, Ramana maharishi, bible, Valentine’s day to politics, nationalisation n ultimately the man which is centre of advaitam. Congratulations to Harshavardhan garu.

  4. అద్వైతం గురించి తమ విశ్లేషణ సందర్భానుసారంగ ఉపమానాలతో కలిపి అర్ధవంతముగా తెలియచేసిన విధము చాల బావుంది సార్.

  5. Dear Harshavardan garu,
    In my language,
    “Chimpesaru Saaru”.
    Beautiful description of how you treat yourself when you look at others as there are no others, other than you.

  6. అద్వైతాన్ని ఇంతచక్కటి సులభశైలి లో అందరకూ అర్ధమయ్యేట్టు చక్కగ వివరించారు సర్. అభినందనలు…….చలం

  7. పెద్దలు, గురువుల అనుభవపూర్వక మార్గదర్శక వ్యాఖ్యలతో మీ వ్యాఖ్యానం సూటిగా, స్పష్టంగా, చురుకు కలిగించేలా ఉంది హర్షన్నయ్యా..

  8. హర్షవర్ధన్ గారు మీరు ఒక్క చిన్న పదానికి ఇంత అర్ధాని పరమార్ధాన్ని వివరించారు……అందుకే ఒక్కమాటలో మీరు మాకు ఆదర్శ శంకరులు….

  9. రమణమహర్షిగారు అద్వైతాన్ని ఏకవాక్యం లో చెపితే మా అన్నయ్య అత్తా కోడళ్ళు , యజమాని పరివారం , నాయకులు ప్రజల మధ్య వున్న , వుండాల్సిన అద్వైతాన్ని అద్భుతంగా వివరించి ,చదివినవారు ఆలోచించేలా చేసారు .
    Surrendered అన్నయ్యా…🙏🏼

  10. ‘ అద్వైత’ రచనా చతురత అద్వితీయం

  11. అద్వైతంగురించిమీరువ్రాసిన వివరణ అద్భుతం సర్. మీ మనసుకు అద్దం పట్టినట్లువుంది. హ్యాట్సాఫ్ టు యు సర్. కీప్ గోయింగ్ సర్

  12. Sir it’s very realistic comparing with olden days and present circumstances and also very interesting and thanks and congratulations sir.

  13. అద్వైతాన్ని చాలా చక్కగా అందరికీ అర్థం అయ్యేటట్లు చెప్పారు. అభినందనాలు.మీకు సాహిత్యం లో ఎంతో పట్టు ఉందని మీ హర్షవనం లో తిరిగితే తెలుస్తోంది.

  14. బాగుంది. భగవాన్ రమణ మహర్షి సందేశం తో ముగింపు అద్వైతాన్ని అందరికీ అర్థం చేయిస్తుంది.🙏

  15. హర్ష,
    అద్వైతం పై రాసిన ఆర్టికల్ చాలా బాగుంది.
    సర్జన్ గురించి రాసిన విషయం నాకు బాగా నచ్చింది. ” ఒక్క ” పదం ఆధారంగా నీవు ప్రచురిస్తున్న రచనలు మనసుకు ఆహ్లాదాన్ని అనందాన్ని కలుగ చేస్తాయి అనటం లో ఏమాత్రం సందేహం లేదు.

  16. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్దికి హర్షవనమే సోపానము. లెక్చరర్ గా మీరు పాఠాలు చెప్పిన తీరు ఇంకెంత బావుండేదో అనిపిస్తోంది, ఇది చదివాక.

    1. అద్వైతం గురించి తమ విశ్లేషణ సందర్భానుసారంగ ఉపమానాలతో కలిపి అర్ధవంతముగా తెలియచేసిన విధము చాల బావుంది సార్.

  17. హర్షగారూ!
    హర్షవనంలో మీ పోస్టింగ్ చదివిన తరవాత ఏదోపచ్చడి మెతుకలతో కాక సకల సంబారాలతో భోజనం చేసినట్లనిపిస్తుంది.
    రాజకీయనాయకులకు ఎలక్షన్ కాలంలో అద్వైతులు, ఎలక్షన్ అయిన తర్వాత విశిష్ట ద్వైతులు కదా!
    మీరు ఎంచుకున్న టాపిక్ బాగుంది. అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *