
గుడివాడ ANR లో ఇంటర్ చదివే రోజుల్లో సాంబశివరావు గారు మాకు ఇంగ్లీషు పాఠాలు చెప్పేవారు. తిరుమలలో స్వామి దర్శనం తరువాత భక్తుల్ని గుడి పక్కనున్న చిన్న గదిలోకి తీసుకెళ్ళి స్వామివారికి అలంకరించిన వస్త్రాన్ని మన ముఖానికి అద్ది కర్పూర సుగంధాన్ని ఆస్వాదింపజేస్తారు. మా మాస్టారు కూడా మాకు అదే తీరుగ చిన్నతనంలోనే పుస్తక పరిమళాన్ని చవి చూపించారు.
మా నాన్నగారి బదిలీ కారణంగా డిగ్రీ చివర సంవత్సరం బెజవాడ (విజయవాడ అనబుద్ది కాదండి) SRR కాలేజీలో చేరి, ఒక ఆదివారం నవరంగ్ థియేటర్ క్యాంటీన్లో టీ తాగి, అలంకార్ సెంటర్‌కు నడుచుకుంటూ వెళ్తూ, పేవ్మెంట్ మీద పుస్తకాల గుట్టలుగా పోసి అమ్మడం చూసా. గుడివాడలో అప్పుడే పుస్తకలోకంలో పడ్డంతో అక్కడ కాసేపు ఆగి పుస్తకాల పోగును కదిలిస్తే ఒకటి, రెండు మంచి పుస్తకాలు చాలా చౌకగా దొరికాయి. అది మొదలుగా విజయవాడలో ఉన్నన్ని రోజులూ రెండు, మూడు నెలలకొక ఆదివారం కాళ్ళు అలంకార్ సెంటర్ వైపు లాగేసి పాత పుస్తకాల ముందు నిలేసేవి.
విజయవాడలో పాత పుస్తకాలమ్మే వాళ్ళకు అప్పట్లో అంత అక్షరజ్ఞానం లేకపోవడంతో పుస్తకాలు ఎంత తక్కువ రేటే చెప్పినా ఇంకాస్త బేరం ఆడి చవగ్గా నచ్చిన పుస్తకాలు కొనేవాళ్ళం. ఇప్పటికీ ఎప్పుడైనా ఒక ఆదివారం విజయవాడలో ఉంటే అలంకార్ వైపు నరం గుంజేస్తుంటుంది. గత కొన్నేళ్ళుగా బెజవాడలో రౌడీయిజం, గుండాయిజం, బ్లేడ్ బ్యాచ్‌లు, పెట్రోలు షోడా బాంబు గూండాలు పెరిగిపోయి నగర వాతావరణం పాడైపోయింది కానీ, మేము చదువుకునే రోజుల్లో విశ్వనాధ సత్యన్నారాయణ, నండూరి, పెద్దిబొట్ల, వేగుంట, కరుణశ్రీ, శ్రీశ్రీ, గోపిచంద్, మధురాంతకం రాజారామ్, పురాణం, కొమ్మూరి, శ్రీపాద, తిలక్ బుచ్చిబాబు, చలం పుస్తకాలతో ఓల్డ్ బుక్స్ అంగళ్ళు గోల్డ్మైన్లే. వీటికి తోడుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, వార, మాసపత్రికలు, దీపావళి ప్రత్యేక సంచికలకు, నవోదయ, మహాలక్ష్మి, ప్రగతి, అలకనంద ప్రచురణలకు మా బెజవాడే పెద్ద అడ్డా. దేన్నైనా సుసాధ్యం చేసే చిట్కాల పుట్ట అంబడి పూడి పుస్తకాలు, మధుబాబు ఎర్ర ఎర్రని డిటెక్టివ్ నవలలు మాకు మరి కాస్త బోనస్. ఆ రోజుల్లో బాపు, వణ్ణాది, బాలి గారి అందమైన ముఖచిత్రాలతో అన్ని పత్రికలు, నవలలు అందంగా అలరించేవి. బందర్‌రోడ్‌లోని రామ్మోహన్ గ్రంథాలయం పలు సాహితీ సదస్సులకు, చర్చలకు కేరాఫ్ అడ్రస్.
న్యూస్డూడెంట్ బుక్‌సెంటర్ వారు నోట్‌బుక్స్ వెనుక బాపుగారి వేసిన బొమ్మ నా కాలేజిడేస్ ఫేవరేట్. అవసరం లేకపోయినా ఆ బొమ్మకోసం బోలెడు నోట్సులు కొనేవాడ్ని. అదెలాగంటే బుగ్గన సొట్ట (Dimple) అంటే మోజున్న చిన్నోడు ఆ డిరపుల్ కోసం చిన్నదాన్ని ప్రేమించి ఆ పిల్ల మొత్తాన్ని పెళ్ళాడినట్లే అనుకోండి. గ్రీటింగ్స్ యుగంలో అభినందనవారి న్యూఇయర్ గ్రీటింగ్ కార్డ్స్ బాపుగారి బొమ్మలతో కరుణశ్రీ వంటి కవుల మంచి కాప్షన్స్‌తో భలేముచ్చటగా ఉండేవి. అవి కొన్నా పోస్ట్ చేసేవి తక్కువే. దాచుకునేవే ఎక్కువ. ఇటీవల న్యూస్టూడెంట్ బుక్‌స్టోర్ యజమాని బాబ్జీగారిని కలిసినప్పుడు ఈ ముచ్చట్లు ఆయనతో చెప్తే ఎంతో సంతోషించారు.

తిరుపతి శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో పి.జి చదివేటప్పుడు ఓల్డ్ బుక్స్ కోసం చెన్నై (ఈ సారీ మద్రాసు అనడమే ఇష్టం) మూర్ మార్కెట్‌కు రెండు మూడుసార్లు వెళ్ళా. అప్పట్లో మూర్ మార్కెట్లో వందకు పైగా పాతపుస్తకాలు షాపులుండేవి. కంప్యూటర్ యుగం రానందున అక్కడ లిటరేచర్, పుస్తకాలు, నవలలు పుష్కలంగా దొరికేవి. తమళతంబిలు మా బెజవాడ ఓల్డ్బుక్ సెల్లర్స్ అంత ‘అన్పడ్’ కాదు. ఒకసారి అక్కడి సేల్స్బాయ్తో షేక్స్పియర్ హేమ్లెట్ పాతపుస్తకమే కదా కాస్త తగ్గించి ఇమ్మని బేరమాడబోతే, ‘‘ఎప్పుడో వందల ఏళ్ళ క్రితం రాసిన పుస్తకమే కదా, కొత్తైనా, పాతైనా ఏమి తేడా ఉంటుంది?’’ ఇవ్వనుపొమ్మన్నాడు. అప్పుడు అర్థమయ్యింది మురగవేల్తో ముడియాదని. మూర్మార్కెట్ సేల్స్బాయ్స్లో ఎక్కువమంది ఏదో పుస్తకం తిరగేస్తూనే అమ్మకాలు చేయడం చాలాసార్లు చూసా. మూర్మార్కెట్లో కొన్న Fowler’s Kings English పుస్తకాన్ని ఇటీవలే మిత్రులు కిల్లాడి సత్యన్నారాయణగారి అమ్మాయి, చదువుల కల్పవల్లి శ్రీవాణికి పంపించేసా.
ఆ రోజుల్లో మూర్మార్కెట్ పుస్తకాల షాపుల ముందు క్యూకట్టని నగర ప్రముఖులే లేరంటే అతిశయోక్తి కాదు. ఎందరికో జ్ఞానదానం చేసిన మూర్మార్కెట్ 1985 లో (కాలబెట్టడం) దహనమవ్వటం ఇప్పటికే పెద్ద మిస్టరీనే. చరిత్రకారుడిగా, మ్యాడ్మేన్ ఆఫ్ మద్రాసుగా పేరు పొందిన ముత్తయ్య ఈ మార్కెట్ నిర్మాణాన్ని అప్పటి మద్రాసు మున్సిపల్ కమీషనర్ సర్జార్జ్ మూర్ చేపట్టాడని Once upon a City అనే పుస్తకంలో రాసాడు. ఆ రోజుల్లో దక్షిణ భారత దేశంలో అరుదైన పాత పుస్తకాలకు ఏకైక చిరునామా మూర్ మార్కెట్టే.

కాలక్రమంలో ఎనభైల్లో సివిల్స్ ప్రిపరేషన్‌కు హైదరాబాద్ వెళ్ళడంతో నా పాతపుస్తకాల ప్రేమాయణం అబిడ్స్‌కు మారింది. గత నలభై సంవత్సరాలుగా ఆరునెలలకొకసారి అబిడ్స్ పేవ్మెంట్స్ సర్వే చెయ్యకపోతే ఏదో వెలితిగా తోస్తుంది. ఎన్టీఆర్ గారి ఇల్లు, జి.పి.వొ ఎదురుగా పావురంతో నెహ్రు గారి విగ్రహం, చర్మాస్ షోరూమ్, పుల్లారెడ్డి స్వీట్స్ వారి ఏకైక అవుట్లెట్, హాలివుడ్, మెట్రో చెప్పుల దుకాణాలు, అన్నపూర్ణ, స్వాగత్ హోటల్స్, ఇస్కాన్వారి హరేకృష్ణ మందిరం (విశ్వనాథ్ గారి శుభోదయం సినిమాలో ‘గంధము పుయ్యరుగా’ పాట ఫేమ్) హుస్సేన్ బుక్‌షాప్, బూల్‌చంద్ షోరూమ్‌తో కళకళలాడిన అబిడ్స్ సెంటర్ నేడు వెలవెలపోతూ బూల్గయే యాదే. నేటి అబిడ్స్ కళ తప్పిన నాటిమేటి హీరోయిన్ కాంచన వలెనే గత వైభవపు చిహ్నం.
అబిడ్స్ పాత పుస్తకాలకు నేను ఎన్నటికీ తీర్చుకోలేనంత రుణపడిపోయా. రిటైరయ్యే ముందు పేవ్మెంట్ల మీద దొరికిన ఒకపాత పుస్తకం రచయితగా నా రెండో ఇన్నింగ్స్‌కు ప్రేరణనిచ్చింది. అక్కడ ఇరవై రూపాయలకు కొన్న హెరాల్డ్ కుష్నర్ పుస్తకంలో, ‘పుట్టిన ప్రతివ్యక్తి ఒక బిడ్డకు జన్మనివ్వాలి, ఒక మొక్కనాటాలి, ఒక పుస్తకం రాయాలి’ అన్న మాటలు చదివా. మొదటి రెండూ అప్పటికే పూర్తి చేసాం కదా అనేసుకుని ఆ మిగిలిన మూడో పనికి ఉద్యమించా. శ్రీశ్రీ గారి భిక్షువర్షీయసి అనే కవితలో
‘’ఆ అవ్వే మరణిస్తే
ఆ పాపం ఎవ్వరిదని
వెర్రిగాలి ప్రశ్నిస్తూ
వెళ్ళిపోయింది’’ అని అంటే, ఆ పుస్తకమే కనపడక నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలవ్వకపోతే అని అప్పుడప్పుడు నాలో నేను అనుకుంటాను. ఒక్కోసారి అబిడ్స్ ఫుట్‌పాత్ పుస్తకాల వెతుకులాటలో ఎంతలా మునిగిపోయే వాడినంటే అక్కడికి కొనడానికి వచ్చిన వారు నేనే సేల్స్‌మేన్‌ను అనుకుని నన్ను రేట్లు అడిగేంతగా!
ఈ సందర్భంగా శ్రీ కాళహస్తి దగ్గర సువర్ణ ముఖినది గురించిన విన్న చిన్నకథను మీతో చెప్పుకోవాలి. ఆ రోజుల్లో దేవాలయ నిర్మాణానికి పనిచేసిన కూలీలు సాయంత్రం నదిలో మునిగి నమస్కరించి పైకి తేలితే వారి శ్రమ, ప్రాప్తానుసారం బంగారు, వెండి, రాగి, మట్టి నాణెం దొరికేదట. ఆ నాణెమే వారి రోజు వారీ కూలి అని చెప్పుకునేవారు. పనిలో పనిగా ఒళ్లు వంచని పనిదొంగలకు చిల్ల పెంకులే దొరికేవట.
అబిడ్స్‌లో మా పాత పుస్తకాల వెతుకులాట ఇంచుమించు అలాంటిదే! ఒక్కోసారి చేయిపెట్టగానే అరుదైన అద్భుతమైన పుస్తకం ఆకలి రాజ్యం సినిమాలో కమల్‌హాసన్ అన్నట్లు చెత్తలో దొరికిన చిత్ర రత్నంలా అలా చేతిలోకి వచ్చేది. మరోసారి సాయంత్రం వరకూ కాళ్లు అరిగేలా ఎంత తిరిగినా ప్రతిసారి కనిపించే బాపురెడ్డిగారి కవితలో, రొండా బైరన్ పుస్తకం సీక్రెటో, డేల్ కార్నిగి రాసిన How to Influence your friends మాత్రమే సర్వత్రా ఎదుట పడి కలవరపరిచేవి. ఇరవై రూపాయలకు ‘టీ’ కూడా దొరకని ఈ రోజుల్లో పదిరూపాయాలకే ‘టీ’కా తాత్పర్యాలతో సుమతీ, వేమన శతకాలు నేటికీ దొరకడం అబిడ్స్‌లో లంకెల బిందెలు దొరకడం కాక మరేమిటి?
ఒక్కోసారి పాతపుస్తకాల వేటలో కొందరు రచయితలు వారి మిత్రులకు కాంప్లిమెంటరీలుగా సంతకం చేసి ఇచ్చిన పుస్తకాలు అమ్మకానికి కనపడి మనసు కలతపడేది. వందల కోట్లు ఆస్తులు కూడ బెట్టిచ్చిన తాత, తండ్రుల ఫొటోలు అటకమీదకో, స్టోర్ రూమ్‌కో చేరడం చూసిన తరువాత ఆ బాధ కొంత వరకు పోయింది. ఎందుకంటే ఈ పుణ్యాత్ములు కనీసం ఇంకొకరికి పుస్తకం చదివే అవకాశం కల్పిస్తున్నారన్న ఓదార్పుతో. కొన్ని పాతపుస్తకాల మీది రాతలు గత స్మృతులను కదిలిస్తాయి. అందులో సంబోధనలు, భాష, వారి హృదయస్పందనల్ని పట్టిచ్చేలా ఉంటాయి. నేను కొన్న పుస్తకాల్లో మచ్చుకు రెండు చూడండి …

ఇంతకాలానికి తెలుసుకున్నదేమిటంటే చదివే అలవాటున్న వారు వెంటనే వాటిని చదివేస్తారు (చివరకు కిరాణా కొట్టువాడు పొట్లాంకట్టిన పాత పేపరైనా సరే). అంతెందుకు కొందరు అబిడ్స్ పేవ్మెంట్ల మీద నిలబడే సగం పుస్తకం చదివేస్తారు. మరికొందరు వాట్సాప్‌లో పంపిన చిన్న మెసేజ్ చదవావా అని రెండు నెలల తరువాత అడిగితే, ‘‘ఇంకా చూళ్ళేదు చాలా బిజీ’’ (రోజుకు ఆరుగంటలు దిక్కుమాలిన పబ్జీనో, డోటానో ఆడుతూ) అంటారు. డిజిపిగా పనిచేసి రిటైరై ఎనభై ఏళ్ళు దాటిన పెద్దలు శ్రీ రొడ్డం ప్రభాకర్ గారికో, నిర్మాణ కార్యక్రమాల్తో, పలు వ్యాపారాల్లో తలమునకలుగా ఉన్న మిత్రుడు కుర్రా శ్రీనాథ్కో, చాలా బిజీ డాక్టర్ పద్మశ్రీ, డా.అనగాని మంజులగారికో ఎప్పుడైనా వాట్సప్ మెసేజ్ పంపిస్తే వారు చదివి అదే రోజు కామెంట్ పెట్టేస్తారు. బిజీ బాబులూ వింటున్నారా?
ఈ మధ్య ఒకరోజు మా పార్క్‌లో పుస్తకం మర్చిపోయి వదిలేసి రెండో రోజు సాయంత్రం వెళ్తే అది అక్కడే పదిలంగా ఉంది. పుస్తకం పోనందుకు సంతోషించినా పుస్తకాలు పరిగ్రహించే స్థాయికి మనవాళ్ళు ఎదగలేదే అని కించిత్ మనస్తాపం చెందా. ‘పుస్తకాలు చదివేవారు వాటిని దొంగలించరు, వాటిని దొంగలించే వారు చదవరని’ ఎక్కడో చదివిన గుర్తు.
ఇలా అబిడ్స్ పుస్తకాల వెంట యువకుడిగా తిరుగుతూ తిరుగుతూ కాలక్రమేణా నేను సీనియర్ సిటిజన్నైపోయా. ఎన్నో ఏళ్ళుగా ఆ మార్కెట్ బాటా షోరూమ్ మలుపులో కుర్చీవేసుకుని కూర్చునే కరీముద్దీన్‌ను చూస్తుండగానే నడివయస్సు దాటి సీనియర్ సీనియర్ సిటిజనైపోయాడు. గత ఏడాది అనుకోకుండా ఒకరోజు కరీముద్దీన్‌ను కలిసి మాట్లాడా. తను లాల్‌బహదూర్ స్టేడియంలో పనిచేస్తూ గత యాభై ఏళ్ళుగా ఆదివారాల్లో పాత పుస్తకాలు అమ్ముతున్నానని చెప్పాడు. మొన్న ఆదివారం అబిడ్స్ వెళ్తే కరీముద్దీన్ రిటైరయి, వయసు రీత్యా రావడం లేదని వారి వారసులు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా నవ్వుతూ పలకరించే కరీముద్దీన్ భాయిలేని లేని లోటు బాగా కనిపించింది.

కరీముద్దీన్ భాయి
మా అబ్బాయి తేజ ఢిల్లీలో చదివేరోజుల్లో దర్యాగంజ్‌లో కిలోమీటర్ లెక్కున్న పాతపుస్తకాల మార్కెట్, అలాగే బొంబాయి చర్చ్ గేట్ దగ్గర పాతపుస్తకాల మార్కెట్, బెంగుళూర్ లోని పాతపుస్తకాల మార్కెట్, దలైలామా నివాసమున్న ధర్మశాల పాతపుస్తకాల మార్కెట్స్ చూసి ఏదో ఒక పుస్తకం జ్ఞాపికగా కొనే భాగ్యం కలిగింది. అమెరికా పాతపుస్తకాల షాపులు మన లైబ్రరీలకంటే పెద్దవిగా ఉంటాయి. అక్కడ తొంభైల్లో ఉన్నవారు తోపుడు బండి నిండా పుస్తకాలు నింపుకుని పోవడం చాలాసార్లు చూసాను. అమెరికా వారు పుస్తకాలు పదిలపరిచే తీరే అద్భుతం. 1905 లో అచ్చైన అడ్వెంచర్స్ ఇన్ కన్టెంట్మెన్ట్ అనే పుస్తకం అమెజాన్‌లో తెప్పిస్తే అది వందేళ్ళు దాటినా ఇంకా కొత్తగానే ఉంది.
అమెరికా లైబ్రరీల్లో పాతబడిన (Out of Circulation) పుస్తకాలను ఒక కౌంటర్లో అమ్మకానికి పెడతారు. పుస్తకం ఏదైనా బైండిరగ్ అయితే డాలర్ మిగతావి యాభై సెంట్లు. ధోరో రాసిన వాల్డెన్ పుస్తకాన్ని ఒక లైబ్రరీలో అర డాలర్‌కు కొని థ్రిల్ అయ్యా. ఇటీవల చాలాసార్లు కాన్సస్ దగ్గరున్న లారెన్స్ పట్టణంలో డస్టీబుక్స్టోర్కు వెళ్ళా. దాని పేరు డస్టీయే కాని లోపల చాలా నీట్‌గా ఉంది. ఆ షాపులో నిరంతరం కలయతిరిగే నల్ల గండుపిల్లి ప్రత్యేక ఆకర్షణ. దాన్ని చూసినప్పుడల్లా పోయిన జన్మలో CAT పరీక్ష ఫెయిలైన ఏ జీవుడో ఈ జన్మలో బుక్‌స్టోర్‌లో ఇలా కుదురుకున్నాడేమో పాపం అనిపిస్తుండేది.

టర్కీలోని ఇస్తాంబుల్‌లో పాతపుస్తకాలకు ప్రత్యేకంగా ఒక మార్కెట్టే చూశాం. అది ఇస్తాంబుల్ యూనివర్సిటీ ప్రక్కనే ఉండటం విశేషం. ఇంగ్లాండ్ దేశంలో వేల్స్ నగరానికి దగ్గర్లో Hay on Wye అనే ఊరు నిండా పుస్తకాల దుకాణాలే ఉంటాయని విన్నా. జపాన్‌లో ఒక హోటల్లో అన్ని గదుల్లో ఎటు చూసినా పుస్తకాలేనట. దైవం కరుణిస్తే ఎప్పటికైనా అవి చూడాలని బకెట్ లిస్ట్‌లో వేసా.

ఇంగ్లండ్ – పుస్తకాల గ్రామం
పుస్తకాలు పాతవైనా, కొత్తవైనా వాటిని చదవడం మాత్రం గొప్ప అలవాటు. ప్రపంచంలో ఏ రంగంలో ప్రసిద్ధులైనా పుస్తకాలు చదివే అలవాటు మాత్రం వారందరికీ కామన్. బిల్‌గేట్స్, ఒబామా, వారన్ బఫెట్ వంటి పెద్దలందరూ ఇప్పటికీ రోజూ చదువుతూ, వారు చదివిన పుస్తకాల సమీక్షల్ని సోషల్ మీడియాలో జనంతో పంచుకుంటున్నారు. ఇది విన్నాక మనవాళ్ళు బుక్స్ చదివేందుకు టైమ్ దొరకడంలేదంటే నమ్మబుద్ది కాదు.
ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.సోమరాజు గారు వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు సర్ విలియమ్ ఆస్లర్ రాసిన ‘ఇక్విమినిటాస్’పుస్తకం చదివి గొప్ప వైద్యుడ్ని కావాలని సంకల్పించుకున్నారట. డి.ఆర్ (దొడ్ల రామచంద్రారెడ్డి) గారు కాలేజి రోజుల్లో లే మిజరబుల్స్ నవల చదివి, కావలి జవహార్ భారతి కళాశాలను స్థాపించి ఎందరికో విద్యా దానం చేసారు. ఇటీవల హైస్కూల్ చదువులు దాటని చింతకింద మల్లేశం హైదరాబాద్ కింగ్కోటిలో పాతపుస్తకాలు కొని, చదివేసి, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ నేర్చేసుకుని కొత్త చేనేత పరికరాన్ని ఆవిష్కరించి దేశవ్యాప్తంగా పేరు సంపాదించి మంచి బయోపిక్కు స్ఫూర్తినిచ్ఛాడు. ఇవన్నీ చూసే మా పిల్లలకు చిన్నప్పటి నుండి ‘మనకు లక్ష్మీ కటాక్షం సరస్వతి ద్వారానే’ అని పదేపదే చెప్పేవాడ్ని. ఉత్తరాలు బతికున్న రోజుల్లో కొన్ని ఊళ్ళకు అడ్రసు రాసేటప్పుడు వయా కోడూరు, వయా చెన్నూరు అన్నట్లు చాలా మందికి లక్ష్మీకటాక్షం వయా సరస్వతీ మహలే. మా అబ్బాయిలకు ఇంకోమాట కూడా చెబుతుంటాను. ఎప్పుడైనా నేను బ్రెత్లెస్ అయితే ఆక్సిజన్ మాస్క్ పెట్టొద్దు, పుస్తకాల షాపులో కొత్తపుస్తకాల మధ్యన తిప్పండి అంతా సర్ధుకుంటుందని చెప్పాను. మండు వేసవి వర్షంలో నేల తడిసిన వాసన, కొత్త పుస్తకాల వాసనలను మించిన పెర్ఫ్యూమ్ ఏదైనా ఉంటుందా?

మనవరాలు రేయ పుస్తకాన్వేషణ (బార్న్స్ & నోబుల్స్)
చివరగా ఆచార్య గోపిగారు రాసిన ‘వొయ్యి’అనే కవితలోని మాటలతో ముగిస్తా.


(అక్షరాలను కళ్ళకద్దిన సాంబశివరావు మాస్టారి పాదాలను కళ్ళకద్దుకుంటూ..)

సార్ సరస్వతి కటాక్షం తో లక్ష్మి కటాక్షం నానుడి ఆ నానుడి కి బాండగారం ప్రదేశాలను చక్కగా విషదీక రించారు 🙏🙏
I remember going to Moore market next to central station in madras many times in my childhood. Used to watch test cricket next to the market & then spent time browsing through old books. Moore market was also famous for old whiskey bottles (empty) which are not to be seen nowadays. Now there is one old book shop in Islam road.
Wonderful presentation sir.
ఈ అన్ని పట్టణాల్లో ని పుస్తకాల షాపులు తిరగటం ఒకెత్తైతే ఆ షాపుల పేర్లు, యజమానుల పేర్లు,పుస్తకాలు-వాటి రచయితల పేర్లు కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇది చదువుతున్నంత సేపు ఆయా ప్రాంతాల లో ప్రత్యక్షంగా తిరుగాడుతున్నట్లనిపించిందంటే అతిశయోక్తి కాదు.
ఇలాంటి రచనలు మీ కలం కాని కలం నుంచి మరెన్నో రావాలని కోరుకుంటున్నాను.
Very good God bless you reading 📚 is a good habit example to younger generations in today’s technology decades 🙏
Really a great habbet you developed from your childhood. May be the impact of your beloved teacher Sambasiva Rao. It is again a great quality to live with your everlasting teacher. I wish you to have abundent joy in procuring and reading books and thank you for posting a good narretion. Padmanabhaia
చాలా బాగుందండీ మీ రచన. నేను జీవితంలో చేసిన పుస్తకాల అన్వేషణ, తరిమి తరిమి వాటిని సంపాదించటం, గుర్తుకొచ్చాయి. చిన్న వయసులో నేను ఇలాగే చేసానుకదా అని ఙ్ఞాపకం వచ్చింది.
మీ రచనలు చాలా బాగుంటున్నాయి
మన పాత పుస్తకాల బజారుల్లో తిరిగిన వారికీ, తిరగని వారికీ ప్రపంచ పుస్తక బజారులన్నీ పరిచయం చేసిన మీ రచన రిపీటడ్ వాట్సప్ మెసేజ్ ల మధ్య దొరికిన ఉపశమనం 🙏🏻
గ్రంథపఠనం కాలగర్భములో కలిసిపోతున్న వేళ……
తిరిగి జీవం పోస్తున్న తమరికి ఇవే
💐🙏వందనాలు 🙏💐
ఆబిడ్స్ మరియు మూర్ మార్కెట్ పుస్తకాల కధనం ఒక అద్భుతం. ఈ తరం వాళ్ళకి పుస్తకాల మక్కువ పూర్తిగా లేదనే చెప్పాలి. అందుకే సహనం, ఓర్పు కూడా బాగా తక్కువ. లంకె బిందెలు చాలా అపురూపంయిన కథానిక.
Excellent depiction of experiences of roaming around old books selling streets and picking up a few. I used to do this when I was student and in early days of my job. One such book is written by Henry David Thoreau which inspired Gandhi.
What a recollection, your experience also took me back to my initial days of employment in Bejawada police. I too feel homely by uttering Bejawada instead of Vijayawada. Keep going dear Sri.Harsha
ఇది చదవగానే ఫ్లాష్ బ్యాక్ పుస్తకాలు అన్నీ రెపరెప లాడాయి. పుస్తకం కొనడం, చదవడం, రాయడం ఉన్న జీవితంకంటే కావలసిందేముంది. అద్భుతమైన వ్యాసం సర్.
హర్షవర్ధన్ గారికి పుస్తక పఠనాసక్తి మెండు కాబట్టి వారికి పాతపుస్తకాల షాపులో దొరికే పుస్తకాలన్నీ లంకె బిందెలే !
మా నెల్లూరు లో కూడా సంతానం బుక్ షాపు ( పాత పుస్తకాల అంగడి ) ఉంది. ఈసారి నెల్లూరు వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఏమైనా దొరుకుతాయామో try చేయండి.
Great depiction of timeless memories and endless emotions. Your message that everyone should read, not necessarily old books, is invaluable. But another important aspect that many of those, who read books, more often than not, do not imbibe the values and the insights, which the books contain. Wisdom should be the ultimate product of book reading. Bad books tell us “don’ts” and good books tell us “do’s”. Imbibing the do’s and don’ts leads us to wisdom.
A good informative article, not so easily, compiled!!!!!!!!
It is said, better late than never. I will restart my forgotten( too busy of late, you know) book reading habit again with a book (gifted by you Harsha garu) again. Thanks for reminding of one important habit to become ‘Lakshmi Putra’. ✨️
You never met me without a book in your hand. The book was always presented to me. Even you brought two books from US. During our four decade journey, in all our meetings, you were talking about books, places, Bapu and Ramana Maharshi. Nothing else. You had already become famous for reading, observing and writing. Your search for books will continue forever.
sir,
Reading about your journey through the world of books is simply superb and inspiring. We have learnt the importance of books and reading it . Today it’s become a habit and without reading a book the day doesn’t end. Thank you for inspiring . It’s truly a wonderful book world.
Regards
Sir,Good article.Through this our future generations will up hold the value of ancient books.
Regards
డియర్ హర్ష గారు,
” అబిడ్స్ లో లంకె బిందెలు” చదివిన తర్వాత నాకు అనిపించింది ఏమిటంటే మీలోనే ఒక పుస్తక భాండాగారం కొలువై ఉందని.
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.🙏
“పుస్తకాల పట్ల మక్కువ, పదాలు పట్ల ప్రేమ, జ్ఞాపకాల పరిమళంతో మేళవించిన ఈ రాయడం… ‘అబిడ్స్‌లో లంకెల బిందెలు’ అక్షరాల అక్షరప్రేమికుల ఆత్మకథ! విరళమైన అనుభవాల్ని హృద్యంగా పంచుతూ, పాఠకుడిని ఓ పుస్తకాల పయనంలో తీసుకెళ్ళింది. నిజంగా చెప్పాలంటే… ఇది ఒక అక్షర యాత్ర, ఇది ఒక ‘సాహితీ సంధ్యారాగం’.”
అద్భుతం… మధురం… మంత్రముగ్ధం చేసే మాటల మేఘం!
సాహితీ సంధ్యారాగం అంటే ఆర్థం?
పుస్తకాలు ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటాయి.అద్భుతమైన వ్యాసం..
పుస్తకాల తో సమ్మిళితమై సాగే మీ జీవన యానం ఇలాగే శోభాయమానంగా మీకు బాగా నచ్చిన ఆ పుస్తకాల సుగంధ సౌరభాల మధ్యలోనే కొనసాగాలని కోరుకుంటాను. Best Wishes to you. May you find many more bright books and people along the journey. Request you to spread the knowledge you acquired through those books for the benefit of those lesser mortals who could not recognise the potential of the books. There are some who enjoy reading books but cannot afford leisurely reading. Previleged are those who realise the importance and are fortunate enough to spare time.