కాఫీ పెట్ట‌డం పెద్ద బ్రహ్మవిద్యా అనుకుంటాం గాని కాఫీ కాఫీలా పెట్ట‌డం మాత్రం నిజంగా బ్ర‌హ్మ విద్యే. కాఫీని కాఫీలా కాకుండా క‌షాయంలా తాగిన బాధితులంతా నాతో ఈ విష‌యంలో ఏకీభ‌విస్తారు. ఆ మాట‌కొస్తే కాఫీ పెట్ట‌డ‌మేకాదు, అమెరికాలో అయితే కాఫీ ఆర్డ‌రివ్వ‌డం ‌ కూడా బ్రహ్మ‌విద్యే. అక్క‌డ Starbucks లాంటి పెద్ద కెఫేల్లో కాఫీ ఆర్డ‌రివ్వ‌డానికి లైన్లో నిల‌బ‌డాలి. కౌంట‌ర్‌కు పైన న‌ల‌భై ర‌కాల కాఫీల వివ‌రాలుంటాయి.  క్యూలో ముందుకు క‌దులుతూ వాటిని కూడబ‌లుక్కుని చదివేలోపు మ‌న ట‌ర్న్ వ‌చ్చేసి మ‌న‌కు బేతాళ ప్ర‌శ్న‌ల రాపిడ్ ఫైర్‌ సెషన్ మొద‌ల‌వుతుంది. పెగ్గుల‌కే large, small అనుకున్నాగాని కాఫీకీ కప్పు సైజుల్ని బ‌ట్టి లార్జా, స్మాలా, టాలా, గ్రాండా, మీడియ‌మో చెప్పాలి. త‌రువాత మిల్క్‌లో ఫుల్లో, హాఫ్ ఎండ్ హాఫో, స్కిమ్ముడో చెప్పాలి. త‌రువాత కాఫీ బీన్స్‌లో ఏ ర‌కం కావాలో కూడా చెప్పాలి. అదీ అయిపోయిన త‌రువాత మోచా, ఎస్‌ప్రెసో, ల‌ఫాయ‌త్తో చెప్పాలి. చివ‌ర‌గా మ‌న‌ పేరు కూడా చెప్పి లైన్లో నుండి బ‌య‌ట‌ప‌డి కాఫీ డెలివ‌రీ కోసం కాచుక్కూర్చోవాలి. కాఫీ ఆర్డ‌ర్ చేసే తంతు అయ్యేట‌ప్ప‌టి కాఫీ తాగాల‌న్న కోరిక హుషారు స‌గం చ‌చ్చేపోతుంది. తాగ‌డం మొద‌లెట్టాక అంత లోటాడు కాఫీ తాగ‌లేక గ‌స మొద‌ల‌వుతుంది.

నా మటుకు నాకు ఇన్ని కష్టాలు పడి తెచ్చుకున్న అమెరికా కాఫీ పెద్దగా నచ్చేదికాదు. నా లెక్కలో అమెరికా కాఫీల్లో ఎక్కువ రకాలు  పీల్చడానికి, వాసనకు మాత్రమే ఉంటాయి.  తాగడానికి మాత్రం మా కుంబకోణం డిగ్రీ కాఫీనే సూపర్. మన ఐదు నక్షత్రాల హోటల్స్ లో కాఫీ కథ వేరేగా ఉంటుంది. మనం రూము నుండి ఆర్డర్ ఇచ్చిన అరగంటకు చిన్నబండిని నెట్టుకుంటూ ఎవరో వచ్చి డికాషిన్ పాట్, మిల్క్ పాట్,  షుగర్ పాట్, కప్పులు మనముఖాన పడేసి Have a good day అని ఒక బిజినెస్ స్మైల్ విసిరేసి పోతాడు.  మన పాట్లు మనం పడి కాఫీ కలుపుకోవడంలో ఎంత నైపుణ్యం కనబరిచినా, అవి చూరు నీళ్ళ లాగానో, మరో లాగానో వస్తుంది కాని కాఫీలా మాత్రంరాదు. ఈ బాధలు పడలేక అలాంటి హోటల్లో ఉన్నప్పుడు పొద్దున్నే లేచి హాయిగా లుంగీ కట్టుకుని రోడ్డెక్కి పేప‌రు కొనుక్కొని ఏ బంకులోనో, స్టాల్లోనో కాఫీ తాగేసేవాడ్ని. సొమ్ముకు సొమ్ము ఆదాతో పాటు మంచి కాఫీ తాగిన ఫీలింగూ ద‌క్కేది. 

మన దగ్గర కాఫీ స్ట్రాంగా, లైటా, షుగర్, నో షుగర్ అని చెబితే స‌రిపోతుంది. మద్రాసులో (చైన్నై అనడం నాకు ఇష్టం లేదు) ఏ చిన్న హోటల్లోనైనా గిన్నెలో బోర్లించిన గ్లాస్ ఎత్తిన‌ప్పుడు బొళక్‌, బొళ‌క్ అన్న వీనులకింపైన సౌండ్ తో ఆ  ఫిల్ట‌ర్‌ కాఫీ ఇచ్చే కిక్కే వేరు. దానికోసమే అమెరికానూ కాదనుకుని మద్రాసుకు మరలివచ్చేసానని మా వియ్యంకుడు వెంకటేశ్వరావ్ పదేపదే చెబుతూ మేము మ‌ద్రాసు వెళ్ళినప్పుడల్లా ప్రశస్థమైన సంగీతా కాఫీ మాతో ఆస్వాదింపజేస్తారు.  అదే కోవలో కొంతమంది కాఫీ ప్రియులు హోటల్ సీట్లో కూర్చున్న చోటు నుండి గంటల తరబడి కదలకుండా మన పౌరాణిక నాటకాల్లో పద్యాలకు పదే పదే Once more  కొట్టినట్లు కప్పు మీద కప్పు కాఫీలు లాగించేస్తుంటారు. ఎటొచ్చి మన దగ్గర రోడ్డు మీది బంకుల్లో, బండ్ల దగ్గర కాఫీతోనే చిక్కొచ్చింది. అమెరికా కాఫీ సోలకు తక్కువ కాదు కాని మన బంకుల్లో కాఫీ మరీ ఉగ్గు గిన్నె లంత ప్లాస్టిక్ కప్పులతో ఇస్తున్నారు. అవి పట్టుకోవ‌డం ఒక ఛాలెంజ్ అయితే మీద పోసుకోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ మూతి కాల‌కుండా తాగడం ఇంకా పెద్ద ఛాలెంజే. నిజానికి ఈ కాఫీ రెండు గుటకలు పడితే గొప్పే. ఎప్పుడైనా ఇలాంటి చోట కాఫీ తాగాల్సివస్తే  ఏకంగా నాలుగు ఉగ్గుగిన్నెల కాఫీ తాగితేనే కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది. లేకపోతే ప్రసాదం అంటే నాలిక్కి రాసుకునే పదార్థం నాయినా అన్నట్లే కాఫీ అంటే గొంతు తడుపుకునే పదార్థం మాత్రమే.

నిజానికి కాఫీ చేయడానికి కావలిసింది పాలు, నీళ్ళు, షుగరు, కాఫీ పొడే అనే నాలుగే నాలుగు పదార్థాలైనా కొంత మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు రిటైర్ అయ్యే లోపు లీవ్ లెటర్ కూడా సరిగ్గా రాయలేని తీరుగానే  కొందరు ఇల్లాళ్ళు, అమ్మమ్మలు, నానమ్మలై పోయినా కాఫీని కాఫీలా మాత్రం కలపలేరు. వారి చేతి చలువతో అది అయితే పానకమో కాకపోతే కషాయమో అవుతుందే కాని కాఫీమాత్రం కాలేదు. వెనకటికి బెర్నార్డ్ షా దగ్గరకు ఒక యువకవి తన కవితలను తీసుకొచ్చి వాటిని చదివి షా గారి  అభిప్రాయం చెప్పమంటే నోటి దురుసుకు పేరొందిన షా వాటిని చదివి తిరిగి ఇచ్చేస్తూ “This is anything but Poetry” అన్నట్లుగానే వారు చేసేది కాఫీ మాత్రం కాదు.

ఇన్స్టెంట్ కాఫీల కంటే ఫిల్టర్ కాఫీ తయారీ విధానం మరికొంత కష్టం. ఫిల్టర్ కాఫీ రుచికి ఏదీ సరిసాటి కాదనేనేమో బ్రూకాఫీ అడ్వర్టైజ‌ర్సు ఎంతో జాగ్రత్తగా `ఇంచుమించు ఫిల్టర్ కాఫీకి సరిసాటి` అన్నారే కాని మించి అనలేదు. ఫిల్టర్ కాఫీ మేకింగ్ నిజంగా గొప్ప కళే. ఫిల్టర్ లో పొడి ఎంత వెయ్యాలి, ఎలా వెయ్యాలి, నీళ్ళు ఎన్ని పొయ్యాలి, ఎలా పొయ్యాలి ఎంత ఎత్తునుంచి పొయ్యాలి, ఎంత వేడిగా పొయ్యాలి, ఎంత ఆగి ఆగి పొయ్యాలి ఫిల్టర్ చిక్కగా దిగడానికి ఎంత తట్టాలి అనేది రాకెట్ సైన్స్ అంత గొప్పదే. ఇవన్నీ అమిరితే సరైనా ఆల్కేమితో సిస‌లైన కాఫీ అవుతుంది. ఇది తెలుసుకోలేని, నేర్చుకోలేని అమ్మలు ఎన్ని ఫిల్టర్లు మార్చినా, పౌడర్లు మార్చినా ఫైనల్ అవుట్ పుట్ మాత్రం మనం పైన చెప్పుకున్న పానకమో, కషాయమో. నిత్యం అటువంటి కషాయ కాఫీ సేవించే పతిదేవుళ్ళందరూ గరళకంఠులైతే పానకం కాఫీ సేవించేవారందరూ శ్రీరామ కళ్యాణంలో పానకం సేవించే భక్తులో కాక‌పోతే మంగ‌ళగిరి పాన‌కాల రాయుళ్ళో.

కాఫీ మేటర్ అంత తేలిగ్గా తీసి పారేసేది కాదండి. మెగాస్టార్ `మొక్కే కదా అని పీకి పారేస్తే పీక కోస్తా` అన్నంత ప్రమాదకరమైందే. అరకు లోయలో కాఫీ మ్యూజియంకు వెళ్ళినప్పుడే నాకూ ఈ సంగతి తెలిసింది. ఆ మ్యూజియంలో కాఫీ చరిత్రతో పాటు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. టర్కీ దేశస్థులు గొప్ప కాఫీ ప్రియులట. టర్కీలో పెళ్ళిళ్ళలో అమ్మాయి అందచందాలు, గుణగణాలతో పాటు కాఫీతయారీ నైపుణ్యం కూడా కౌంట్ అవుతుందట. అలాగే పెళ్ళి కొడుకు  రోజుకు ఎన్ని కప్పుల కాఫీ భార్యకు ఇవ్వగల స్తోమత ఉందో కౌంట్ అవుతుందట‌. ఒక‌ప్పుడు టర్కీలో రోజుకు తగినన్ని కాఫీలు ఇవ్వలేని భర్తకు విడాకులిచ్చే హక్కు భార్యలకు ఉండేదట.  ఇలాంటి రూల్ మన దగ్గర కూడా ఉంటే కనీసం ఎంత లేదన్న ముప్పై శాతం భర్తలకు   Summary disposal ఇచ్చేయాల్సి వస్తుందేమో. అది లేకపోబట్టే కాపురాలు నిలబడుతున్నాయనిపిస్తుంది.

ప్రస్తుతం కాఫీ అలవాటు దేశమంతా విస్తరించినా దక్షిణ భారతీయులు మరింత కాఫీ ప్రియులు. మన కాఫీ ప్రియత్వం ఎంతమేరకు పోయిందంటే ఇటీవల వీణ విద్వాంసులు, ఆప్తులు దుడ్డు సీతారామయ్య గారిని కలిసినప్పుడు వారు కర్ణాటక సంగీతంలో `కా పి ` రాగం గొప్ప రాగమని మల్లీశ్వరిలో `పిలిచినా బిగువటరా` శ్రీ కృష్ణాతులాభారంలో `భలే మంచి చౌక బేరము`, మాంగల్య బలంలో `హాయిగా ఆలుమగలై కాలంగడపాలి`, రోజా సినిమాలో `నా చెలి రోజావే` వంటి గొప్ప పాటలు కాపి రాగంలోనే కూర్చబడ్డాయి అని చెప్పారు. ఈ కాపి  రాగం అంతగా తెలియని కొంతమంది సంగీత దర్శకులు వేరే భాషల్లోని ట్యూన్లను కాపీ కొట్టి మ‌న‌కు కాపి రాగాలు వినిపిస్తున్నారు.  కాపిరాగం, కాఫీ రెండూ మన సొంతమే. అందుకనే మన వాళ్ళు కాఫీ విత్ క‌ర‌న్ అన్నా, శేఖ‌ర్ క‌మ్ముల గారు ఆనంద్ మంచి కాఫీలాంటి సినిమా అన్నా, మ‌రెవ‌రో కుదిరితే కప్పు కాఫీ అన్నా,  anything may happen over a cup of coffee అన్నా అన్న‌న్న‌ మన కాఫీ ఎంతో మిన్నన్నా అనిపించకా మానదు. ఇంకో కప్పు తాగాలనిపించకా మానదు. తప్పుతుందా మ‌రి … కానివ్వండి

18 Replies to “Art of Coffee making”

  1. కాఫీ గురించి చదివాక, వెంటనే కాఫీ తాగాలన్న కోరిక కలిగి టైం చూడలేదు, కాఫీ ని ఆస్వాదిస్తూ,కాఫీ గొప్ప తనాన్ని చాలా బాగా వివరించిన మీకు ధన్యవాదాలు. ఎప్పుడయినా బెంగళూరు వచ్చే అవకాశం వస్తే తప్పకుండా మా ఆతిథ్యాన్ని స్వీకరించి, మా ఇంటి కాఫీ తాగి వెళ్ళండి గురువుగారు. వందనాలు

  2. After reading all above comments, I don’t think any thing is left. However, I wish to say “a very very interesting and excellent piece of information about coffee”.
    SOUTH INDIAN COFFEE—ZINDANAD

  3. అద్భుతంగా ‘కాఫీ చెయ్యడమెలా’నన్న విషయాన్ని ప్రారంభించి, ‘కాఫీ చేయడం బ్రహ్మవిద్యే’నని ముగించారు. అది మాత్రం నిజం. అనుకున్నంత తేలిక కాదు, ఏ పనైనా. నేను నల్లకాఫీకి దాసుడనైన విషయం చెపితే, మీరూ నవ్వక మానరు.
    ఓ రోజు కంపెనీ తరఫున ఓ సెమినార్లలో పాల్గొన్నా. రోజంత జరిగిన సమావేశమవడంతో మధ్యాహ్నానికి కాఫీతాగుదామని బయటవెళ్ళి, డికాషను వంచుకున్నా, గ్లాసులోకి. హబ్బ! ఎంత చక్కని సువాసన. ఆ పల్చని డికాషన్లో పాలు కలపాలంటే బాధేసింది, పంచదార సంగతి సరేసరి. అలానే తాగేసా డికాషన్ను ఆ సమయంలో. మత్తులో పడిపోయా, అరడజను కప్పుల డికాషను తాగి, ఇంటికి వెళ్ళి, ప్రకటించేసా, నల్ల కాఫీనే నా ప్రియురాలని. కాని, నా ప్రియురాలి గురించి ఆ రోజు నుండి ఇంకా వెతుకుతూనే ఉన్నానంటే నమ్మరు మీరు. 😀
    మధ్య మధ్యలో మీరు ముద్రించిన బొమ్మలు మరీ ముద్దొస్తున్నాయి.

  4. Manchi Coffee laanti musings.Hasyam paalu….chikkanidecoction laanti subject….panchadaara laanti suvaasana…Giliginthalu pettee cartoons annee Adhurs. Elanti coffee Hot Hot coffee serve cheesinanduku Thanks chebuthoo….srimathi kitchen naalugo coffee ki urgentgaa order/request veesa😃😄🙏👌

  5. బావగారు,
    మన అబ్బాయిల దగ్గర ఉన్న కాఫీ ఎంత్రాలు, చేపుస్తకం (manual) వాటి చందా ప్రహసనం (monthly subscription), మొదలగు వాటిని ప్రస్తావిస్తూ , రెండవ బాగాన్ని అందించండి ఆస్వాదిస్తాము.

  6. Its well articulated sir. I still remember my grandparents starting their day with a big glass (not cup) of coffee. We often hear this word- Procaffeinating (tendency not to start anything until you’ve had a cup of coffee). Not sure of its etymology, but this was applicable to our family also when I was a kid. Coffee is definitely a hot favourite (of course, cold also for many these days) for most of us. As you mentioned, amidst this “any thing may happen over a cup of coffee” culture, for sure, invitation to coffee is a good gesture (kudirite cup coffee) for connect and bonding

  7. Made me to think about only coffee during the day 😊; in general I take a cup of tea in the evening; after reading the blog on coffee, my brain has not allowed the taste buds to accept tea and pulled me to have the delicious home made filter coffee 😍cheers ☕️ ☕️

  8. True Sir.
    Coffee making is really an art and with proper mixing of ingredients, we can enjoy its aroma n taste.

  9. It is just wonderful description on Coffee making. It seems you can publish a book on Coffee with its related events.
    Enjoyed while reading variety Coffee types from America to Madras!
    Please think to write a book on this. (I don’t have Telugu key board)
    Kind wishes
    Chukka

  10. Excellent
    Okasari ekkadiko teesukelli poyaru

    Marosari manam coffee madhyalo kalavali
    E Covid taggaka

    Chala naga rasaru 💐👌✅🌈🎉

  11. మంచి ఫిల్టర్ కాఫీ తాగించావ్ హర్ష

    1. Really I traveled in a world of coffee and learnt much. Dear Harsha
      Your style of presentation is good and simple.
      Continue.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *