మన జీవితాలన్నీ గుర్రప్పందాలే. ఇవి ఆడేవాళ్ళకి బాగా తెలిసిన మాటలు రెండే రెండు జాక్‌పాట్ తగిలింది, ఒక్క లెగ్‌లో పోయింది. మన బతుకులూ అంతే! పైన చెప్పినట్లు ఒక్క అక్షరం మారిందో మన తలరాతే మారిపోతుంది. ఒక్క idea మీ జీవితాన్ని మార్చివేస్తుందన్నట్లుగా ఒక్క అక్షరం మన జీవితాన్ని మార్చివేస్తుంది. జాక్‌పాట్ తగిలినోళ్ళు `దారిచూపిన దేవతా నా చేయి ఎన్నడు వీడక, జన్మజన్మలు తోడుగా’ అనో, ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి’ అనో పాడుకుంటే ఒక్క లెగ్గులో పోయినాయన, `తన మత మేదో తనది, మనమత మసలేపడదోయ్ మనము, మనమనుమాటే అననీయదు తాననదోయ్` అని పాడుకుంటాడు. చూశారుగా ఆర్ట్ ఫిల్మ్ ప్రేక్షకుల్లా బెటర్ హాఫ్‌ల మీద టాక్ ఎంత డివైడెడ్ గా ఉందో. పెళ్ళితో నీ జాతకం మారిపోతుందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. పెళ్ళైన తరువాతే తెలుస్తుంది జాతకం ఎంతలా మారుతుందో. వెనకటికి ఒకడు పరుగెత్తుతుంటే వాడి వెనక కొందరు పరుగెత్తడం చూసినోళ్ళు ఈయనకు మంచి ఫాలోయింగే ఉందే అంటే అది విన్న ఇంకో పెద్దాయన ఫాలోయింగో, ఛేజింగో ఎవరు చూడొచ్చారు అన్నట్లుగానే ఈ పెళ్ళి మ్యాటర్స్.
పెద్దలు కుదిర్చిన పెళ్ళి నాచురల్ కెలామిటీ అయితే లవ్‌మ్యారేజీ మేన్ మేడ్ కెలామిటీ. వెరసి రెండూ కెలామిటీలే. పెళ్ళికి ముందు Mad for each other, పెళ్ళయిన కొత్తలో Made for each other ఇంకాస్త గడిస్తే Mad of each other. మన వాళ్ళు ఇదే ఇంకోరకంగా పెళ్ళికి ముందు ఒకరంటే ఒకరికి పిచ్చి పెళ్ళయిన తరువాత ఒకరి వల్ల ఇంకొకరికి అని చెబుతుంటారు. ఒక మంత్రి గారు పిచ్చాసుపత్రి వార్డులు సందర్శిస్తుంటే ఒకడు రీటారీటా అని పెద్దగా ఏడ్వడం చూసి ప్రక్కనున్నతన్ని విషయం ఏమిటని అడిగితే `ఇతను రీటాను ప్రేమించిన భగ్న ప్రేమికుడు ` అని అక్కడి వార్డెన్ చెప్పాడు. మంత్రి గారు మరికాస్త ముందుకెళ్తే ఇంకో వార్డులో మరొకడు రీటా రీటా అని పెద్దగా రోదిస్తుండటం చూశారు. అప్పుడు వారి ప్రక్కనున్న పి.ఎ. `మనం ఇంతకు ముందు చెప్పుకున్న రీటాను పెళ్ళాడిన అదృష్టవంతుడే ఇతగాడు సార్` అని వివరణ ఇచ్చాడట. ఇవన్నీ చూసే ప్రముఖ కవి బోయి భీమన్నగారు
”ప్రేయసీ ప్రియులు
పెళ్ళికి ముందు అద్వైతం
పెళ్ళయిన కొత్తలో
విశిష్టాద్వైతం
ఇక ఆ తరువాత
ద్వైతమే”
అని జీవనసారాన్ని వివరించారు. పెళ్ళైన కొత్తలో భర్త మాట్లాడితే భార్య వింటుందట. ఆ తరువాత భార్య మాట్లాడితే భర్త వింటాడట. మరికొన్నాళ్ళు పోయాక ఇద్దరూ మా (పో) ట్లాడుకుంటే అందరూ వింటారట ఇలా కాలానుగుణంగా, అయితే evolution కాకపోతే Revolution.
ఆచార్య రజనీష్ ఏదో సందర్భంలో “Wife and husband are intimate enemies“ అన్నారు. ఆలోచించగా ఆలోచించగా ఇది నిజమే అనిపించక మానదు. నాకు తెలిసిన కొన్నిజంటలు నవదంపతులుగా మొదలై తాతలు, నానమ్మలు, అమ్మమ్మలైనా వారి పోరాటపటిమ ఏ మాత్రం వీడలేదు. కోడిపందాలు చూడ్డానికి బోలెడు ఖర్చుపెట్టి, భీమవరం పోనవసరం లేదు. వీరింటికెళితే ఎప్పుడైనా సరే అవే పోరాటాలు తగ్గేదేలేదు. మొదటిసారి వాళ్ళను చూసిన వాళ్ళెవరైనా, వీళ్ళు ఖచ్చితంగా వచ్చే వారమే విడిపోతారనుకోవలసిందే. మాకు నలభై ఏళ్ళుగా అలవాటైంది కనుక ఏమీ భయపడం.
మిధునం
అందుకేనేమో రజనీష్ ఇలాంటి వారిని intimate enemies అన్నది. ఎంత Bitter half అయినా Better half గా మార్చుకోవడానికి పూజ్యులు బాపు రమణలు, మనకు మంచి దారి చూపెట్టారు. ఆప్తమిత్రులుగా ఉన్నవారిని `మీ చిరకాల మైత్రీ రహస్యం ఏమిటని` ఎవరో అడిగితే, రమణగారు, `పెద్ద విశేషమేమీ లేదండి, భరించడమే` అనేశారట. సర్దుకుపోవడం కుదరనప్పుడు భరిస్తే బతికేస్తాం. భరించడం అంటే అవతలివారు నొచ్చకుంటారు కనుక కళ్ళు తుడుచుకుని కొంచెం సౌమ్యంగా, స్పోర్టివ్‌గా సర్ధుకుపోవడం అనేస్తాం. ఎలక్షన్లలో బలంలేని పార్టీలు సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నాం అని బిల్డప్ ఇచ్చినట్లుగానే.
ఆ మాటకొస్తే ఏ పెళ్ళైనా ఇరువురికి ఎంతో కొంత compromise యే. కాకపోతే ఆ రాజీపడటం పశ్చాత్తాపడేందకాకూడదు. మా ఉద్యోగంలో ఎప్పుడైనా ఎవరితోనైనా చిన్న అభిప్రాయ బేధాలు వచ్చినప్పుడు ఆప్తమిత్రుడు రామచంద్రారెడ్డి “సోదరా! రాజీపడ్డవాడురాజు“ చూసీ చూడనట్లుపోతుండాలె. అని పదేపదే నాతో చెప్పిన మాట భార్యాభర్తలందరికీ శిరోధార్యం.
చెప్పకనే చెప్పడం
మన భాషావేత్తలు కూడా ఎంతో దూరదృష్టితో భార్యా, భర్తలు ఇద్దరికీ వొత్తులు (దీపం వొత్తుల్లాగే భా, భ) ఇచ్చారు. ఈ వొత్తుల విశేషం ఏమిటంటే ఒకదానితో ఒకటి వెలిగించుకోవచ్చు, కాల్చుకోనూవచ్చు. వైవాహిక జీవితంలో Better to Bend than to Break అన్న సూత్రం తెలుసుకుంటే ప్రశాంతత దొరుకుతుంది. గవర్నమెంట్ ఉద్యోగులు, పెళ్ళైన వాళ్ళు కొంచెం తోలుమందం (thick skin) చేసుకుంటే ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు.
వెనకటికి భార్యాబాధితుడొకాయన ఆవేశంగా లైబ్రరీకి పోయి లైబ్రేరియన్ గారిని కలిసి “భార్యను లొంగదీసుకోవడం ఎలా అన్న పుస్తకం ఉందా“ అని అడిగితే లైబ్రేరియన్ గారు చిరునవ్వులు చిందిస్తూ “కాలక్షేపం పుస్తకాలన్నీ పై సెక్షన్ లో ఉంటాయి సార్“ అని చెప్పాడట. ఆఫీసులో సరిగ్గా పనిచేయని ఉద్యోగిని “Go to Hell“ అని తిడితే వాడు నేరుగా ఇంటికి పోయాడట. ఝాన్సీలక్ష్మి వాళ్ళ తమ్ముడితో `నీకు తెలుసో తెలియదో మీ బావ కస్సలు నోట్లో నాలుకే లేదురా` అంటే, నాకెలా తెలుస్తుందక్కా నువ్వెప్పుడైనా బావను నోరు తెరవనిస్తేగా` అన్నాడట. ఇలాగే ఒకరోజు పేపరు చదువుతున్న భార్య `మనకు పెళ్ళి చేసిన పంతులుగారు పోయార్ట పాపం` అంటే అవును మరి చేసిన పాపం ఊరికినే పోతుందా అని భర్త నాలిక్కొరుకున్నాట్ట. ఊళ్ళో ఎవరో పెద్ద ఆఫీసర్ గారి గురించి ఆఫీసు స్టాఫ్, `మన సార్ ఆఫీసులో పులిలా ఉంటార్రా ఇంట్లో ఎలా ఉంటారో గాని`, అనుకుంటుంటే అది విన్న సార్ ఇంట్లో పనిచేసే అటెండర్ ఇంట్లో కూడా మన సార్ పులే కాకపోతే దుర్గాదేవి ఫోటోలో పులి పొజిషన్. పొజిషన్లోనే చిన్నతేడా మిగతాదంతా షేమ్ టు షేమే అని వివరించాడట.
ఇలాగే మరొకరు పర్సులో భార్య ఫోటో తప్ప ఏ దేవుడి ఫోటో పెట్టుకోకపోవడం చూసి మిత్రుడు `ఎందుకని ఇంకేఫోటోలు పెట్టుకోలేదని` వారిని అడిగాడట. ‘జీవితంలో ఎంత పెద్ద కష్టమొచ్చినా జేబులో నుంచి పర్సుతీసి మా ఆవిడ ఫోటో చూసుకుని ఇంతకంటే ఏ కష్టం పెద్దదికాదని అనుకోడానికే మిత్రమా’ అని గర్వంగా చెప్పాడట. ఇలాంటి జోకులు చెప్పుకోవడానికే కాని ఇది వాస్తవం కాదు. గ్రీకు ఫిలాసఫర్ సోక్రటీస్ ‘పెళ్ళైన తరువాత భార్య మంచిదైతే సుఖపడతావు గయ్యాళో చెడ్డదో అయితే వేదాంతివి (Philosopher) అవుతావ’ని చెప్పి కొన్నివేల సంవత్సరాలయింది. వారు చెప్పిందే నిజమైతే ఇప్పటికి కొన్నివేలమంది (for suppose all wives are bad) ఫిలాసఫర్స్ ఉండాలి. కాని సోక్రటీస్ తరువాత గొప్ప Philosophers అనతగిన వాళ్ళు వందకు మించిలేరు. పెళ్ళి తరువాత అందరూ Philosophical కావచ్చునేమో గాని Philosophers అయ్యింది అతి కొద్దిమందే. `మా ఆవిడ ఊరెళ్ళిందోచ్` అనుకునే వారికంటే `సమయానికి మా ఆవిడ ఊళ్ళో కూడా లేదు ` అనుకునేవారే Majority. మన పురాణాల్లో చూసినా ఇంట్లోనే కాదు యుద్ధరంగంలోనూ కైకేయి, సత్యభామల సహాయసహకారాలే దశరధుని, శ్రీకృష్ణుని గెలిపించాయి. `భద్రం Be careful బ్రదరు భర్తగ మారకు బ్యాచులర్` పాటే నిజమైతే లోకంలో ఎక్కువమంది బ్యాచులర్సే ఉండాలిగా. ఇలాంటి జోకులతో విసిగి కొన్ని రివర్స్ జోక్సూ పడ్డాయి. ఒక ఉత్తమ ఇల్లాలు వరలక్ష్మీవ్రతం నోచుకుని భర్త చేతికి అక్షితలిచ్చి పాదాలకు నమస్కరిస్తూ వచ్చే జన్మలో నైనా మంచి భర్త దొరకాలని దీవించండి అన్నదట. భార్య ఎంతో ఆర్తితో వేసిన ఈ జోక్ ముందు సింగిల్ డోస్ హామియో వైద్యంలా పైన వన్నీ దిగతుడుపే.
గొప్ప రిలీఫ్
B.V (lu) (భార్యావిధేయులు) కాని వారికంటే అయినవారే ఎక్కువ మానసిక ప్రశాంతతను ఆనందాన్ని అనుభవిస్తున్నారని పలు పరిశోధనల్లో తేలింది. వీరికి ఏ భయమూ ఉండదు. వారు ఎవ్వరికీ జవాబుదారీ కాదు. ఇట్టి శరణాగత పొందిన వారికి ఏ చింతలూ ఉండవు. Delegation of powers at home మానసిక వొత్తిడిని పూర్తిగా పోగొడుతుంది. Usurpation of power కంటె delegate చేసి మర్యాద, గౌరవం దక్కించుకోవడం మేలని మేధావులు కొందరే తెలుసుకుంటారు. వారే సుఖపడతారు. వాస్తవానికి ఏ భార్యకు భర్త హీరోకాజాలడు (కేవలం ఆమెకు భర్త అయిన ఒకే ఒక్క technical reason వల్లనే). నా దృష్టిలో భార్యల హీరోవర్షిప్ పొందిన వారందరూ భారతరత్నకు అర్హులే. అష్టభార్యలున్న పురుషోత్తముడు శ్రీకృష్ణ పరమాత్మ సైతం ఇష్టసఖి సత్యభామ తనతలపై తన్నినా కోపగించక `చెల్వగు నీపదపల్లవంబు మత్తను పులకాగ్రకంటక వితానముతాకిన నొచ్చునంచునే ననియెద అల్కమానవుగదా యికనైన అరాళకుంతలా` అనే బతిమాలుకున్నాడు! జ్జానపీఠ పురస్కారాన్నందుకున్న కవి సామ్రాట్ విశ్వనాథ వారి భార్యావియోగ దుఃఖాన్ని వరలక్ష్మి త్రిశతి శతక రూపంలో తీర్చుకుని ఊరడిల్లారు. మరో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ గారు కూడా వారి శ్రీమతిపై `నాలో నీవు` అని గొప్ప ఎలిజీ వ్రాశారు.
ఇటీవలనే బీహార్‌లో దశరధ్ మంజీ అనే సామాన్యుడు తన better half ఫల్గుణీదేవి రోజూ నీళ్ళు తెచ్చుకోవడానికి కష్టపడుతుంటే అడ్డంగా ఉన్న కొండను ఒంటిచేత్తో ఇరవై సంవత్సరాలు శ్రమించి తవ్వేసి దారిచేసి Best husband of the century అనిపించుకుని Mountain Man గా పేరుపొందాడు.
మౌంటెన్‌మ్యాన్ మాంజీ
Better half అనేమాట భార్యాభర్తలిద్దరికీ వర్తించినా ఎక్కువగా భార్యనే better half అనడం మనం వింటూ ఉంటాం. ఈ వాస్తవం గ్రహించిన మనపూర్వులు (ఇంగ్లీషు వాళ్ళు Ladies first అనకముందే) మన దేవతల్ని సైతం సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనరసింహులు, రమా సత్యన్నారాయణ అనే గౌరవించారు. పూజలప్పుడు కూడా సీతాపతేనమః అనో, నమః పార్వతీ పతే హరహర అనో అంటాము. మన భారతీయ సంస్కృతికే పరిమితమైన విశిష్టమైన అర్థనారీశ్వర తత్త్వమే అపురూపమైన ఊహ. అందుకే జగతః పితురా వందే పార్వతీ పరమేశ్వరం అంటారు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ వాక్కు, అర్థం లాంటివారు. అందుచేతనే అమ్మవారి మహిమ తెలుసుకున్న రామదాసుల వారు మముబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని మొరపెట్టుకుంటే మరొకాయన `నడిరేయి ఏ ఝామునో స్వామి నిను చేర దిగివచ్చునో’ అని మంచి టైమింగ్ లో తన కేసు ప్రెజెంట్ చేసుకున్నాడు. భార్యలేని వారు యజ్ఞ యాగాలు చేయడానికి కాదు కదా కనీసం దంపత్తాంబూలాలందుకోవడానికి క్కూడా అనర్హులు అని మన శాస్ర్తం చెప్పడంలో భార్య ఔన్నత్యం మనం తెలుసుకోవాలి. ఇది గ్రహించే మన త్రివిక్రమ్ గారు తెలివిగా పాత టైటిల్ నే రీఫర్బిష్ చేసి `అరవిందసమేత వీర రాఘవ ` అని మన మీదకు వదిలారు.
మగధీర
భారతీయ సంప్రదాయంలో మన అష్టకష్టాలలో దాస్యం, పేదరికం, బాకీ పడటంతోపాటు భార్యా వియోగం మాత్రమే ఉందికాని భర్త వియోగం లేదు. సదాశివుని సతీవియోగాగ్రహానుగ్రహం వల్లనే మనకు అష్టాదశ శక్తి పీఠాలు అమరాయి. శ్రీరామచంద్రులు సైతం సీతావియోగ శోకంలో హనుమదౌత్యంతో సీతాన్వేషణకై సుగ్రీవునితో MOU చేసుకున్నారు. అన్నమయ్య వారి బాధను చూడలేక `ఆడదాని బాసి అడవిలో రాకాసి వేటలాడే చూడవే సిన్నికా` అని పాడుకున్నాడు. భృగుమహర్షి తన భర్తని గుండెలపై తన్నినందుకు `నేను హర్ట్` అని శ్రీ మహాలక్ష్మి అలిగి భూలోకం చేరితే ఆమె వియోగం భరించలేక మహావిష్ణువు అలవైకుంఠపురం నుండి క్రిందకు దిగడంతో మనకు కలియుగ వైకుంఠంతోపాటు తిరుపతి లడ్డుదక్కింది. లోకంలో ఎన్ని స్నేహాలున్నా దాంపత్యానికి మించిన మైత్రి లేనేలేదని గొప్ప గజల్ చెబుతోంది. నేడు ఉద్యోగాల్లో, డెడ్‌లైన్లతో, సోషల్ మీడియాతో దాంపత్యంలో మైత్రితో పాటు కెమిస్ర్టీ తగ్గి అకౌంట్స్, ఎకనమిక్స్ పెరిగిపోతున్నాయి. దాంపత్యంలోతగ్గిపోతున్న సామరస్యానికి `సమరం` గారే దిక్కవ్వడం అతి పెద్ద Paradox.
కాలమహిమ
ఈ జోకుల మాటెలా ఉన్నా Better half ను Better గా చూసుకుంటే మనం ఫిలాసఫర్స్ అవ్వాల్సిన అగత్యం రాదు. టైమ్ మరీ బ్యాడ్ అయితే పోయేదేముంది dude అనుకుని ముందుకు పోవడమే.
చివరగా అలనాటి అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ లేఖల్లో తన కొడుక్కి వ్రాసిన వాక్యాలతో ముగిస్తాను.
“There is no greater happiness for a man than approaching a door at the end of a day knowing someone on the other side is waiting for the sound of his footsteps“
కాకపోతే ఆ వెయిటింగ్ అప్పడాల క్రరతో అట్లకాడతో కాకుండా అగరుపొగలతో అయితే బాగుండు. ట్రై చేసి చూడండి (Please do wear helmet).
(ఆప్తుడు రామచంద్రారెడ్డికి నివాళులతో)
Very nice harsha
మీ వ్రాతలప్పుడప్పుడూ…
చాలామందికి (అందరికీ అనే ధైర్యం లేక) వాతల్లా ఉంటయ్!
అందరూ మన్ని కాదులే అని బాగా ఎంజాయ్ చేస్తారు😝
It’s true. Sometimes it is bitter half and most of times, it is better half. When one is bitter, one remember Socrates and all the victims. When one is happy, He sings, ” gaalilo telinatlundi ” like Pawan Kalyan’s Jalsa film song.
Wonderful article, full of with and humour. 😃
భార్యా భర్తల ననుసరించి చెప్పిన మీ ఛలోక్తులు/పంచులు ఈ తరానికి ఎంతో మెచ్చేల చాలా అద్భుతంగా ఉన్నాయి సార్.
బెఠర్ హాఫ్( బిట్టర్ హాఫ్) ముచ్చట్లు సోక్రటీస్ తో మొదలుపెట్టడం మీ హాస్యచతురతకు చారిత్రక సునిశిత దృష్టికి అద్దం పట్టింది శంకరాచార్యులు రామానుచార్యులు నుండి నేటి త్రివిక్రమ్ ల వరకు చక్కగా సందర్భోచితంగా వాడిన తీరు ప్రశంసించ దగినది మీ రు అక్షరాలను తద్వారా భావాలను వ్యక్తపరచడంలో సిద్ధహస్తులు సుమండి. ఉషోదయ నమస్సులతో………చలం
సర్,
చాలా బాగా రాశారు.వాస్తవానికి దగ్గిరగా..పోలికలు చక్కగా ఉన్నాయి.
ఎలక్షన్లలో బలంలేని పార్టీలు సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నాం అని బిల్డప్ ఇచ్చినట్లుగానే…..
గవర్నమెంట్ ఉద్యోగులు, పెళ్ళైన వాళ్ళు కొంచెం తోలు మందం (thick skin) చేసుకుంటే ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు…. వంటి సత్యాలను అద్భుతంగా రాశారు.
మళ్లీ మళ్లీ చదివేలా ఉంది మీ ఆర్టికల్..
సార్ మీ హర్షవనం మహా ఆనందమయం 🙏🏼
బాగున్నాయి సర్
మాంఛి విరుపులతో మెరిపించారు సుమా!! ఎవరో అన్నారని చెప్పి, చివరిలో చెణుకులు విసిరిన వైనం నచ్చింది. అన్నీ తెలిసినవే అయినా, చెప్పిన కధా విధానం ఆకట్టుకుంది. మీరిలాగే హర్ష వనంలో సాహిత్య సేద్యం చేస్తూ, సౌరభాలు పంచుతారని ఆశిస్తున్నాను. మీ రచనను నాకు పంపించిన KSN RAJUకి ధన్య వాదాలు..మీకు అభినందనలు!!🙏🙏🙏
సంసారంలో సరిగమలు లా..ఇవన్నీ
జీవితంలో కితకితలూ…ఇంతవరకూ
జరిగిన చిత్రవిచిత్రాలు ఎప్పుడైనా
వయస్సు మల్లాకా ,నెమరువేసుకొనే
సందర్భాలు… సమయాలు…వచ్చే
అవకాశాలున్నాయా….
సందేశం చాలా బాగుంది సార్
చిన్న సవరణ:
In built auto correction వల్ల, ఒక Typographical mistake వచ్చింది.
కావున, దయచేసి వివరించి అనే చోట, విభజించి అని చదువుకోగలరని మనవి.
రచన బాగుంది. కాని, కొన్ని చోట్ల పేరాలు పెద్దగా వున్నాయి. అదొక్కటే చదవడానికి కొంత ఇబ్బంది. సందర్భానుసారంగా పేరాలను వివరించివుంటే, బాగుంటుంది.
సోక్రటీస్ తర్వాత వందకు మించి తత్త్వవేత్తలు లేకపోవడం అనేది రచయిత విస్తార విషయ పరిజ్ఞానాన్ని సూచిస్తుంది.
భార్య ఉంటేనే ఇల్లు (home), లేకుంటే దానిని ఇల్లు అనడానికి వీలు లేదు. అది ఒక నివాసానికి చిరునామా (house) మాత్రమే. ఇల్లు, ఇల్లాలు రెండూ పరస్పరాశ్రయకాలు. ఒకరు లేనిదే మరొకటి లేదు (లేదా కాదు.) నామవిజ్ణానం (Onamastics) అదే విషయాన్ని స్పష్టంగా చెపుతుంది.
అందుకే, రవీంద్ర నాథ్ ఠాకూర్ గారు తన ఒక కథకు ” The Home coming” అని పేరు పెట్టారు.
Uncle, I just loved every bit of it :).. keep these coming.. Best wishes
Final ga better half ki Saranagathi esthe life bitterness వుండదు antaru. Cant live with them ,Can’t live without them….Sir
Hilarious Sir
Chalaa baagundi sir.
తుమ్మా భాస్కర్
హర్షవనంలో అంకురించిన ‘be(i)tter half’ చాలా betterగా ఉంది. జీవితంలో నిజమైన స్నేహితులు భార్యాభర్తలే. ఏ కొద్దిమందో విడిపోతారేగాని చాలామంది కలిసి కొట్టుకు చస్తూనో సాగిపోతుంటారు. భార్యా భర్త విషయాన్ని తీసుకుని తానొవ్వక, తానొప్పించక నవ్విస్తూ సంసార సాగర అంతరాన్ని చెప్పిన హర్షవర్ధనుగారు హర్షనీయులు. నా జీవితంలో ఉదయం 5.00 గంటల లోపున చదివిన సాహిత్యమేదైనా ఉందంటే ఇదే మొదటిది.
హర్ష ,
బెటర్ హాఫ్ , అర్ధాంగి ,
నావుద్దేశంలో భార్యకు సార్థక నామధేయం. భర్తకు భార్య బిట్టర్ హాఫ్ అవటం చాలా తక్కువ సందర్భములలో జరుగుతుంది అని నా అభిప్రాయం . భర్త-భార్య
ల మీద వచ్చిన వ్యగ్య రచనలు
నవ్వు టకే కానీ వాస్తవాలు కావు. సహజీవన స్రవంతి సవ్యంగా సాగి పోతూనే ఉంది. బెటర్ హాఫ్ – బిట్టర్ హాఫ్ లు రెంటినీ హాస్య సందేశ పూర్వకం గా చెప్పినందుకు
అభినందనలు.
ప్రమీల గారి సౌజన్యం తో….
అద్భుతం గా వ్రాసిన హర్ష గారికి అభినందనలు
😁👍చాలా బాగుంది 😉👏
😆👌
హర్షవర్ధన్ గారూ! మీ హర్షవనం పెద్దబాలశిక్ష చదివినట్లుంటుంది. లోకానుభవాలన్నీ ఒకచోట రాశీభూతమవుతాయి. అభినందనలు.
సోక్రటీస్ నుంచి ఇప్పటివరకు భార్యాభర్తల అందరి స్వగతం ఇదే అనుకుంటాను.