ఆ మ‌ధ్య ఒక సూప‌ర్ మార్కెట్ కు బ్రెడ్ కొందామ‌ని వెళితే దాని మీద Best Before అని తేదీ వేసుంది. అలా వేసుంటే ఆ త‌రువాత అది పాడైపోతుంద‌ని కాద‌ట గానీ బ్రెడ్ తాజాద‌నం, రుచి కొంతలో కొంత త‌గ్గుతుంద‌ట‌. ఆ తేదీ త‌రువాత మ‌రికొన్ని రోజులు గ‌డిస్తేనే అది పాడ‌వుతుంద‌ని అర్థం. కొన్ని విట‌మిన్ టాబ్లెట్స్‌కు కూడా Best Before Date ఉంటుంది. ఆ తేదీ తరువాత అవి పారేయ‌న‌క్క‌ర్లేదు కానీ అంత బాగా ప‌నిచేయ‌వ‌ట‌. అదే మందుల‌కైతే Expiry Date వేస్తారు. ఆ తేదీ త‌రువాత ఆ మందు వాడితే ప‌ని చేయ‌క‌పోగా ప్ర‌మాదం తెచ్చి పెడుతుంద‌ని. స‌రుకుల‌కు, మందుల‌కు వ‌ర్తించే Best Before తేదీలు Expiry డేట్లు మ‌నుషుల‌కూ వ‌ర్తిస్తాయోమో !

Best Before ను మ‌నకు అప్లై చేద్దాం. ఇలా అన‌గానే నాకు శ్రీ‌ర‌మ‌ణ గారు ఎప్పుడో చెప్పిన జోకు గుర్తొచ్చింది. ఒక రిటైరైన వృద్ద దంప‌తుల్ని చూడ్డానికి గతంలోవారి ద‌గ్గ‌ర ప‌నిచేసిన కుర్రాడు వెళ్ళాడ‌ట‌. ఆ పెద్దాయ‌న అత‌నితో “ఈ ఇల్లు ఇర‌వై ఏళ్ళ క్రితం ప‌దిల‌క్ష‌ల‌కు కొన్నాం, అప్ప‌ట్లో కాబ‌ట్టి అయింది, ఇప్పుడైతే మ‌న‌వ‌ల్ల ఏమ‌వుతుంది“ అని వాళ్ళు కూర్చున్న సోఫాల గురించి కూడా, “ఈ రోజ్‌వుడ్ సోఫాలు న‌ర్సీప‌ట్నంలో ఉండ‌గా రెండువేల‌కు కొన్నాం. అప్ప‌ట్లో కాబ‌ట్టి“…. అని ఇలా అప్ప‌ట్లో, ఇప్ప‌ట్లోతో ప‌రామ‌ర్శ‌కు వ‌చ్చినత‌న్ని బాదేస్తుంటే ఇదంతా వింటూ కాఫీ తీసుకొచ్చిన పెద్దామె ”అవున్నాయ‌నా ఆయ‌న చెప్పిన‌వ‌న్నీ క‌రెక్టే కానీ ఇంకొక్క విష‌యం నీకు చెప్ప‌డానికి మొహ‌మాట‌ప‌డ్డారు. మాకు ఇద్ద‌రు పిల్ల‌లు. అప్ప‌ట్లో కాబ‌ట్టి ఏదో అలా అయిపోయింది కానీ ఇప్పుడైతే ఈయ‌నవ‌ల్లేమ‌వుతుంది” అనేసింద‌ట‌.

ఆ పెద్దామె చెప్పిందాన్ని బ‌ట్టి ఏతావాతా మ‌నం అర్థం చేసుకోవ‌ల‌సిందేటంటే వ‌స్తువుల‌కే కాదు మ‌నుషుల‌కూ Best Before ఉంటుంద‌ని. కొంత‌మంది అర‌వై వ‌చ్చేస‌రికి ఆరుమెట్ల‌ని చూసినా అదిరిప‌డి అవి ఎక్క‌డానికి ఆయాస‌ప‌డుతుంటారు. మ‌రి కొంత‌మంది వంగి కింద‌ప‌డ్డ తాళం చేతులు కూడా తియ్య‌లేని స్థితిలో ఉంటారు. మ‌రికొంత‌మంది యాభై దాట‌గానే మ‌న ఆడ‌వాళ్ళు ఏడు వారాల న‌గ‌లు అలంక‌రించుకున్న‌ట్లుగా తెల్ల‌వార‌గానే ఏడు వారాల మందుల పెట్టె తెరిచి SUN-MON-TUE-WED- …… M(Morning) , B.M (Before Meals), A.M(After Meals), E(Evening), B.B.(Before Bed) అని వారానికి స‌రిప‌డా మందు బిళ్ళ‌లు చింపి గ‌ళ్ళు నింపేసుకుని మింగుతుంటారు. వారి పెన్ష‌న్‌లో నాలుగోవంతు అపోలో ఫార్మ‌సీకే! ఇలాంటివారు అంద‌రూ మ‌నంపైన చెప్పుకున్న Best Before బాప‌తే!

ఈ మ‌ధ్యే ఎక్క‌డో చ‌దివిన‌ట్లు గుర్తు ప్ర‌పంచంలో ప్ర‌తి వంద మందిలో 65వ పుట్టిన‌రోజు జ‌రుపుకునేవారు ఆరు మందేన‌ట‌. అంటే మిగిలిన 94 మంది అర‌వై ఐదు సంవ‌త్స‌రాలు నిండ‌క‌ముందే స‌ర్దుకుంటున్నార‌న్న‌మాట‌. ఈ లెక్క‌న అర‌వై ఐదు దాటితే Fan, T.V, Fridge లు Warranty Period దాటీ ప‌నిచేసిన‌ట్లే. మ‌నం కూడా 70 దాటితే Extra Warranty, ఎన‌భై దాటితే Double Extra Warranty. ఆ పైదంతా భారీ బోన‌స్సే. Warranty Period దాటేసినా మోత చేయ‌కుండా తిరిగే fan (మ‌నుషులైతే ఏ గొట్టాలు, Walkers, Wheel Chairs లేకుంటే) నిజంగానే Best Before యే కాదు Best After కూడా. ష‌ష్ఠిపూర్తులు, స‌హ‌స్ర చంద్ర ద‌ర్శ‌నాలు జ‌రుపుకున్న‌వారు నిజ‌మైన భాగ్య‌వంతులు, అదృష్ట‌వంతులు. Count your Blessings అని అందుకే అన్నారు.

మిష‌నైనా, మ‌నిషైనా ఎంతో కొంత‌జాగ్ర‌త్త‌, మైన్‌టేనెన్స్ ఉంటేనే కొంత Quality performance తో మ‌రికొంత‌కాలం కొన‌సాగుతుంద‌నే Best Before అన‌డంలోని ధ‌ర్మ సూక్ష్మ‌మేమో! ఏ మైన్‌టేనెన్స్ లేకుండా మిడ్‌నైట్ బిర్యానీలు తినేసి, బీర్లు తాగేస్తే బీర్బ‌లుల‌మౌతామ‌నుకునేసి, కార్ల‌లో వాకింగ్స్ చేసేస్తే మ‌నం Best Before లు కాక‌పోగా Worst after లు అయిపోతాం. చివ‌ర‌కు చెడిపోయిన సైకిల్ లా బెల్లు త‌ప్ప అన్నీ మోగేస్తాయి. మిడ్‌నైట్ బిర్యానీలు మిడ్‌నైట్ ఆంబులెన్స్‌ల‌కు ఆహ్వానాలు, కార్పొరేట్ ఆసుప‌త్రుల‌కు సోపానాలు. ఆహారం మితంగా మందులా తిన‌క‌పోతే మందులే ఆహారంగా తినాల్సిన గ‌తిప‌డుతుంది. అందుకే పెద్ద‌లు If your food is good there is no need of medicine , If your food is bad there is no use of medicine అని అన్నారు.

Best Before కొంత‌లో కొంత ప‌ర్వాలేద‌నిపిస్తుంది. ఎందుకంటే ఆ తేదీ త‌రువాత కూడా బండి ఎలాగోలా న‌డుస్తుంటుంది క‌నుక‌. ఎటొచ్చి Date of Expiry యే Non Negotiable. ఇంకో మాట చెప్పు అనో ఇంకో తేదీ చెప్పు అన‌డానికి వీల్లేదు. ఇప్పుడంటే రైళ్ళు కాస్త టైముకొస్తున్నాయి గాని మా చిన్న‌ప్పుడు మేము ఎక్క‌వ‌ల‌సిన రైలు జీవిత కాలం లేట‌న్న‌ట్లే వ‌చ్చేయి. ఇలా ఫ్లాట్ ఫార‌మ్‌మీద మ‌నం ఎక్క‌వ‌ల‌సిన రైలు కోసం వెయిటింగ్ లో ఉండ‌గానే రెండు గూడ్సు బ‌ళ్ళు, రెండు ఎక్స్‌ప్రెస్‌లు ఒక పాసింజ‌ర్ రైలు (మ‌నం ఎక్క‌వ‌ల‌సింది త‌ప్ప‌) వ‌చ్చి వెళ్ళిపోతుండేవి. ఈ లోగా మ‌నం ప్లాట్ ఫార‌మ్ మీదున్న బోర్డ్‌ల‌న్ని నాలుగు సార్లు చ‌దివేయ‌డం బ‌ళ్ళ‌మీద అమ్మేవ‌న్నీ న‌మిలేయ‌డం కూడా అయిపోతుంది. మ‌న‌తో వెయిటింగ్ చేసే వాళ్ళ‌తో బంధుత్వం క‌లుపుకోవ‌డ‌మో త‌గాదా వేసుకోవ‌డ‌మో ఒక్క‌టే మిగిలుంటుంది. ఇదుగో అలా మేము వెయిటింగ్ చేస్తుండ‌గా కొన్ని గూడ్సు రైళ్ళ‌ను గంట‌లు త‌ర‌బ‌డి కొన్నిసార్లు రోజులు త‌ర‌బ‌డి, లూప్‌లైన్ లో (మాకు తోడుగా) ప‌డేసి ఉంచేవారు.

ప‌డేసిన గూడ్సు బోగీలు నాకొక బేతాళ ప్ర‌శ్న‌మిగిల్చాయి. అలా ఆగి ఉన్న ప్ర‌తి గూడ్సు బోగీపైనా కెపాసిటి, ట‌న్నేజి వివ‌రాల‌తోపాటు R-1987 అనో R-1989 అనో పెద్ద అక్ష‌రాల‌తో రాసి ఉండేది (ఇప్ప‌టికీ R-2022, R-2026 అనో ఉంటాయి) కొన్నేళ్ళ‌పాటు ఈ R-87 ఏమిటా అన్న మ‌ర్మం విడ‌లేదు. ఎంతో కాలం తేల‌ని ఈ స‌స్పెన్స్ ఒక‌సారి రేల్వే వేగ‌న్ వ‌ర్క్ షాపులో ప‌నిచేసే ఆయ‌న‌ను క‌ల‌వ‌డంతో వీడింది. వ్యాగ‌న్లో త‌యార‌య్యే ప్ర‌తిబోగీ మీద కెపాసిటీ, ఇత‌ర వివ‌రాల‌తోపాటు అది మ‌ళ్ళీ వ‌ర్క్ షాప్‌కు వెన‌క్కి ఎప్పుడు (వాప‌స్) రావాలో తెలియ‌డానికి R (RETURN) అని తిరిగి రావాల్సిన‌, సంవ‌త్స‌రం వేసి పంపుతార‌ట‌. ఆ వ్యాగ‌న్ ఎక్క‌డున్నా స‌రే R అని వేసిన స‌మ‌యానికి ఎట్టి ప‌రిస్థితిల్లోనూ వ‌ర్క్ షాపుకు Return రావ‌లిసిందే.

బోగీలు – తిరిగిరావ‌ల్సిన వివ‌రాలు

గూడ్స్ వ్యాగ‌న్‌కు మ‌న‌కు పెద్ద తేడా ఏమైనా ఉందంటారా? మ‌న‌కూ మ‌నం భూమ్మీద ప‌డ‌కముందే పెరుమాళ్ళో, పై వాడో `R` అని ఏదో ఒక తేదీ, టైమ్ వేసే మ‌న‌ని కింద‌కు డిస్పాచ్ చేస్తాడు. ఇంకెవ‌రో దీన్నే ఇంకోలా చెప్తారు. మ‌నకు ఇన్ని శ్వాస‌ల‌ని Count fix చేసి పంపుతార‌ట‌. ఆ Count పూర్తి అవ‌గానే శ్వాస‌బంద్‌. మ‌నం Pack up. అందుక‌నే పిల్లవాడు Monthly Pocket money జాగ్ర‌త్త‌గా వాడుకున్న‌ట్లుగా మ‌న‌మూ శ్వాస‌ల్ని నియంత్రించుకుని, Slow down చేసుకుంటే మేల‌ని చెప్తారు. అలా శ్వాస‌ల్ని నియంత్రించుకునే తాబేలు ఎక్కువ‌కాలం జీవిస్తుంది. వేగంగా శ్వాస తీసుకునే శున‌కాల వంటి జీవులు అల్పాయుషులుగా ఉంటాయ‌ట‌. మ‌నుషుల్లో కూడా యోగా, దీర్ఘ శ్వాస‌లు సాధ‌న చేసే వారు, నిట్టూర్పులు విడిచేవారు ఎక్కువ‌కాలం జీవిస్తే బుస‌లుకొడ్తూ, సెగ‌లూదేవాళ్ళు త్వ‌ర‌గా స‌ర్దుకుంటార‌ని వినికిడి. స‌రిగ్గా ఆ fixed టైమ్ రాగానే గూడ్స్ వ్యాగ‌న్ వ‌ర్క్ షాప్‌కు, మ‌నం రీసైక్లింకు. కాక‌పోతే వాటికీ మ‌న‌కు చాలా పెద్ద‌తేడానే ఉంది. వాటి Return Date, time రెండూ Open and Clear. మ‌న ద‌గ్గ‌ర‌కొచ్చే స‌రికే ఆ రెండూ పైవాడు invisible ink తో వేసి పంపుతాడు. మ‌న‌కు అది క‌న‌ప‌డ‌దు. అలా క‌న‌ప‌డ‌కపోవ‌డం మ‌న దుర‌(అ) దృష్టం. అదే మ‌న‌కు కన‌ప‌డితే ఆ రోజు కంటె ముందే చాలాసార్లు పోతాం.

Best before తేదీ తెలిస్తే పెద్ద తేడా ప‌డ‌దు. కాని రెండోది మాత్రం అస్స‌లు తెలియ‌కూడ‌దు, మ‌నం కూడా దాన్ని తెలుసుకోవాల‌నుకోకూడ‌దు. హైవే మీద రాత్రులు వెళ్ళేట‌ప్పుడు Dipper లైటేసుకుని ఎక్క‌డో దూరంగా ఏముందో తెలుసుకునే కంటే ద‌గ్గ‌ర్లో మ‌న‌ముందేముందో చూసుకోవాలి. Dim Dipper లో Dipper త‌క్కువ గాను Dim ఎక్కువ‌గాను వాడుతూ హైవే (జీవిత‌) ప్ర‌యాణం కొన‌సాగించాలి. వెర‌సి వ‌ర్త‌మానంలో జీవించాలి. తెలియ‌ని దాని గురించి బెంగ‌ప‌డ‌క ఉన్నంత‌లో మ‌న జీవితాన్నిఆస్వాదించాలి.

మన పెద్దలు చెప్పిందీ అదేమాట…

(తమ్ముడు కావలిమూర్తికి కృతజ్ఞతలతో .)



21 Replies to “Best Before ….”

  1. Dear Sri Harshavardhan GARU,
    To day only I have gone through your BEST BEFORE,
    It is really a wonderful and philosophy filled article.
    Every plant in your Harshavanam is like a health (Healing)giving herbal.
    I Donot have to say any thing further since all readers didnot leave any thing for me to write.
    May god bless you with long , healthy life..
    Please share few of my wishes to Sri Kavali Murthy GARU.

  2. “Best before” is the best for ever.
    ఎప్పటిలాగానే ఆలోచింపజేసే చమత్కారం తో కూడిన కథ చాలా బాగుంది. హర్షవనం లో ఇది మరో మంచి మొక్క.
    Thank you Harshavardhan garu.

  3. It takes me to have a variety of thought processes. Can I call this humorous philosophy? But 100% truth in it.
    The greatness of the creation is no knowledge on the future. That’s how organisms have chance to happily live till expiry date, otherwise we can’t imagine the great chois the man creates!
    The underlying lesson is how best human can mould his/her time till expiry date to be with perfect peace, happiness , emit fragrance of good with humanity oneself and to others.
    Enjoyed while reading!
    Thank you for sharing.

  4. Respected Harsha Vardhan garu
    Mee Best before చాలా బాగుంది.Machine అయినా మనిషి అయినా మైంటైనేన్స్ ఉంటే క్వాలిటీ performance ఉంటుంది అనే విషయాన్ని చాలా చక్కగా,వినోదాన్ని జొప్పించి అందరూ చదివేలా వ్రాశారు

  5. Best Before and expiry చదువుతుంటే మీరు ఎదురుగా మాట్లాడుతున్నట్టుగా ఉంది

  6. Expiry date జీవితంలో ప్రతీ వస్తువుతో పాటు మనిషికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో,ఆరోగ్యానికి ఆహారనియమాలు ఎంత ఆవశ్యకత ఉంటుందో,రైల్వే వేగన్ల పై చాలామంది కి తెలియని R కు ఉన్న పాధ్యాన్యత …ఇలా చిన్ననాటి సామాజిక స్థితిగతులు ఇప్పుడెలా ,ఎంత వేగంగా మారిపోయాయి అనేది చాలా చక్కగా చెప్పారు సార్.హాస్యం కూడా చక్కగా పండించారు. చిన్నప్పటి రైళ్లు ఎంత ఆలస్యంగా నడిచేవి,ఆ సమయంలో మనం చేసిన ప్రతీ పని మీ నానీలు చదువుతుంటే మమ్మల్ని మేం గతంలో కి వెళ్లి చూసుకున్నట్లుంది సార్

  7. Everything has an expiry date whether it is body or bread. Some can be seen and some, one cannot.
    Very well said Harsha garu.

  8. Great sir! best before is really the best expression! your application of the same to human life is wonderful. Everybody ,i am sure, might have noticed that railway wagon thing .But everybody can not evince interest and observe as you do. I, too, as a normal citizen never applied my mind as to its meaning and relevance of “R”. long breadth “deergha swasa” in yoga denotes longer life . Tortoise lives for 400 years and you rightly said dog lives for only 8 years on an average. If everybody starts doing pranayama (breathing) and enhances life span to that of tortoise ,can we see the old faces time and again regularly? I am doubtful! what ever may be thing this ‘Best Before & ‘ Date of Expiry’ and their subtilities in your hand donned a clothe, so special that attracted every other eye. I am amazed at your grasp of the things and putting them in a ligher yet hilarious tune. that hilarity left me in raptures for quite sometime. my warmest greetings & expecting many more enecdotes from you to cheerup all——–chalam

    I

  9. Best before or expiry dates మనకి వర్తించే వైనాన్ని చక్కగా వివరించారు.

  10. బావుంది , చాలా, చాలా బాగుగావున్నది. హాస్యము , విజ్ఞానం , వివేకం , కర్తవ్యం , అన్నివకచోట చేర్చటం చాలా అభినంద నీయము. ఇటువంటి ఉపయోగకరమైన కబుర్లు చెప్పి అందరినీ ఆనందింప చేయ వలసిన అవసరం ఉన్నదని నా అభిప్రాయం.

  11. కథనం ఆలోచనామృతం. ఏది ఏమైనా Everyone should strive to be the “best before” the “expiry”

  12. Its very apt during this COVID times.Simple & short with a mask of humour.
    Best before use in a way helps you to do the right thing at the right time
    If you postpone you may miss the flavour of life. Very deep message in your natural style

  13. హర్షవర్ధన్ గారూ!పోలికలు బాగుండడమే కాదు, రైల్వే బోగీలమీద ఉండేR అర్థం కూడ తెలిసింది. మంచి వైరాగ్యం కూడ నేర్పారు. అన్నీ తెలిసికూడ అజ్ఞానంలో మునుగుతుంటాం. వ్యాసం బాగుంది. అభినందనలు.

  14. హర్షవర్థన్ గారూ! హర్షవనం లో మీ రచనలు చాలా బావుంటున్నాయి. ఒక చిన్న మాటని పట్టుకుని ఎన్ని కబుర్లు మాల గుచ్చేశారు…వనంలో నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు….

  15. సూపర్, invisible ink తో కాకుండా మార్కర్ పెన్ తో నుదిటి మీద రాసి పంపితే (కనబడే లలాట లిఖితం😀) ప్రజల జీవన విధానం ఇప్పటిలా కాకుండా వెరైటీ గా ఉండేదేమో, మనం ఊహించలేం ఆ స్థితి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *