రెండేళ్ళ క్రితం క‌రోనా క‌ష్టాల‌కు ముందు వాషింగ్టన్ లో ఉన్న‌ప్పుడు ఒక రోజున మా అబ్బాయి సందీప్‌తో క‌లిసి ట్రేడ‌ర్‌జోస్ అనే ఆర్గానిక్ స‌రుకుల‌మ్మే సూప‌ర్ మార్కెట్ కు వెళ్ళా. మ‌న దేశంలో బ‌తుకు జ‌ట్కా బండైతే అమెరికాలో బ‌తుకు షాపింగ్ బండే. కొన‌న‌వి కొనిపించ‌డానికి తిన‌నివి తినిపించ‌డానికి వినియోగదార్ల‌ను వినియోగించుకోవ‌డంలో అమెరికా నిజంగా బిగ్ బ్ర‌ద‌రే. 365 రోజులు ఏదోసాకుతో వాళ్ళు పెట్టే Sales Deals తో మ‌నం డీలా ప‌డిపోవ‌ల్సిందే. Shop till you Drop వారికే చెల్లు. ఎంత జితేంద్రియుల‌మైనా మేన‌కను చూసి టెమ్ట్ అయిపోయిన విశ్వామిత్రనిలా మ‌నం కొన‌వ‌ల‌సిన లిస్ట్ అతిక్ర‌మించి క‌నీసం నాలుగైదు సరుకుల్నైనా బండిలో వేసుకోకుండా మాల్ మాయాబ‌జార్ నుండి బ‌య‌ట‌కు రావ‌డం జ‌రుగ‌దు. నేను సైతం ప్ర‌పంచాగ్నికి స‌మిధినొక్క‌టి ఆహుతిచ్చాను అన్న‌ట్లు మేమూ మా తోపుడు బండి నింపుకుని బిల్లింగ్ కౌంట‌ర్ క్యూలైన్ల ద‌గ్గ‌ర‌కు చేరాము.

మాకు ముందు కొంద‌రు బిల్లింగ్ చేయిస్తుండ‌టంతో నేను, మా అబ్బాయి మాట్లాడుకుంటూ బండితోసుకుంటూ ముందుకు న‌డుస్తున్నాం. మేము నిల్చున్న బిల్లింగ్ కౌంట‌ర్లో న‌ల్లనివాడు, ప‌ద్మ న‌య‌నంబుల‌వాడు, భారీకాయుడైన యువ‌కుడు న‌వ్వుతూ అంద‌ర్నీ ప‌ల‌క‌రిస్తూ స‌రుకులు సంచుల్లో స‌ర్ధి, సంద‌డి చేసి క‌ష్ట‌మర్స్‌ను సాగ‌నంపుతున్నాడు. అత‌న్ని గ‌మ‌నిస్తూ మా బండి నెట్టుకుంటూ మేమిద్ద‌రం మెల్ల‌గా కౌంట‌ర్ చేరుకున్నాం. బిల్లింగ్ చేస్తూనే అత‌ను మ‌మ్మ‌ల్ని చూసి మా అబ్బాయితో “Is he your Dad?“ అని అడిగి `Yes` అన‌గానే న‌వ్వుతూ `Don’t leave him, Hug him` అనేసి అంత‌లోనే ముఖం ముడుచుకుని `I am Ali. I am from Senegal, I lost my father two years ago, take care` అని వాడి భుజం త‌ట్టి మ‌మ్ముల్ని విష్ చేసి పంపేసాడు.

స‌రుకులు కార్లో వేసుకుని ఇంటికి బ‌య‌ల్దేరామే గానీ ఆలీ అన్న మాట‌లు నా మ‌దిలో ఆలోచ‌న‌ల తెనెతుట్టెను క‌దిపాయి. అత‌ని ఆలోచ‌నా హ‌గ్గు నుండి ఎంత‌కీ బ‌య‌ట‌ప‌డ‌లేక‌ మ‌న హ‌నుమ‌, రామ‌చంద్రుల హ‌గ్గే గుర్తొచ్చింది. ఎప్పుడో ముప్పై ఐదేళ్ళ క్రితం ట్రైనింగ్‌లో ఉండ‌గా ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్‌మెంట్ జాయింట్ క‌మీష‌న‌ర్ డి.ఎస్‌.మూర్తి గారిని క‌ల‌వ‌డానికి వెళ్తే, ఆయ‌న ఛాంబ‌ర్‌లో హ‌నుమ, రామ‌చంద్రులు ఆలింగ‌నం చేసుకుంటున్న క్యాలెండ‌ర్‌, దాని క్రింద “Best Example of Master Servant Relationship“ అని రాసి ఉన్న మాట‌లు ఆ రోజున‌ నా క‌ళ్ళ‌ముందు ప‌దేప‌దే మెదిలాయి.

భ‌గ‌వంతుని భ‌క్తుని బాంధ‌వ్యం

నాకు తెలిసి ఇంత‌కంటే మ‌ధుర‌మైన అనుభూతినిచ్చే హ‌గ్ వేరొక‌టి లేదు. రామాయ‌ణంలో వాత్స‌ల్య‌పూరిత‌మైన కృత‌జ్ఞ‌త‌తో హ‌నుమ‌ను కౌగిలించుకున్న‌ రామ‌చంద్ర‌మూర్తి నీవు నాకు చేసిన ఉప‌కారాలు లెక్క‌లేన‌న్ని. అవ‌న్నీ నీకు తిరిగి చేయాల‌నే ఉంది. కానీ అలాంటి క‌ష్టం నీకు ఎన్న‌టికి క‌ల‌గ‌కూడ‌దు. అందువ‌ల్ల‌నే నీవు చేసిన మంచి ప‌నుల‌న్నింటినీ నాలోనే ఐక్యం చేసేసుకుంటున్నానుఅని చెప్ప‌డం మ‌ర్యాద‌పురుషుని సంస్కారం.

మ‌నిషి ఎలా ఉండాలో చెప్పే రామాయ‌ణంలో ఇలాంటి ఉదాత్త‌త‌మైన ఘ‌ట‌న ఉంటే మ‌నిషి ఎలా ఉంటాడో చెప్పే మ‌హాభార‌తంలో ధృతరాష్ట్రుడు అదే హ‌గ్గింగ్‌తో ఏకంగా భీముడ్నే పొడిపొడి చేసేసి మ‌ట్టిలో క‌లిపేద్దామ‌నుకున్నాడు. రెండూ హ‌గ్గింగ్లే అయినా ఎంత తేడానో చూడండి. మ‌గ్గింగ్ స‌మ‌స్య‌ అమెరికాకే ప‌రిమిత‌మైనా ఈ హ‌గ్గింగ్ సంప్ర‌దాయం అన్ని మ‌తాల్లో ఏదో రూపంలో మ‌న‌కు క‌న‌ప‌డుతుంది. ముస్లిమ్ సోద‌రుల ర‌మ్‌జాన్ హ‌గ్గింగులు, పెళ్ళికొడుకు బ‌దాయి హ‌గ్గింగులు మ‌న‌కు తెలిసిన‌వే. పాదాభివంద‌నాలు, గ‌లేల‌గానాలు ఉత్త‌ర‌భార‌తం నేటికీ మ‌రిచ‌పోలేని స‌త్సంప్ర‌దాయాలు. ఎటొచ్చి మ‌న‌ద‌గ్గ‌రే ఇవ‌న్నీ పోయి ఎంత వ‌య‌స్సున్న వాళ్ళ‌ను క‌లిసినా `హాయ్ అంకుల్లే` మిగిలాయి.

మా సేల్స్ బాయ్‌ అలీ అన్న‌ట్లు హ‌గ్గింగ్ చాలా గొప్ప‌దే! శ‌కుంత‌ల దుష్యంత్‌ల ప్ర‌ణ‌య వృత్తాంతం త‌రువాత శ‌కుంత‌ల ఆధార్‌కార్డ్ లాంటి అంగుళీకాన్ని(ఏకైక ID Proof) పోగొట్టుకుని ఆ క‌ష్ట కాలంలో ఆల్ట‌ర్‌నేట్ ID Proof గా పుత్ర గాత్ర ప‌రిష్వంగాన్ని (Hugging of Son) చూపించాల‌నుకుందంటే హ‌గ్గింగ్ Powerful పాస్ వ‌ర్డ‌నేగా!. స‌మ‌యానికి నార‌దుడు మేఘాల్లోంచి క్లైమాక్స్ సీన్లో ఎంట్రీ ఇచ్చిన‌ట్లు అదే cloud technology తో మ‌న పెద్ద‌లు అశ‌రీర‌వాణితో దుష్యంతుడి మెమొరీ రిట్రీవ్ చేయ‌డంతో క‌థ సుఖాంత‌మై మ‌న‌కు భ‌ర‌త‌ఖండం ద‌క్కింది. ఇప్పుడు తెల్లోళ్ళు ట‌చ్ స్ర్కీన్లు తెచ్చామ‌ని చెప్పుకున్నా మ‌న వాళ్ళు ఏనాడో హ‌గ్‌నే వాయిస్‌రిక‌గ్న‌నిష‌న్ కంటే ముందే ఉప‌యోగించారు. మూర్ఖ‌త్వంతో నిల‌బెట్టుకోలేక‌పోయాడుకానీ శ్రీ‌కృష్ణుడు ట‌చ్ థెర‌పీతోనే గ‌దా మ‌న‌ శిశుపాలుడ్ని స్మార్ట్ కిడ్‌ను చేసింది.

భ‌ర‌తుని ఐడెంటిఫికేష‌న్ పెరేడ్

ఈ హ‌గ్గింగ్ థెర‌పీతోనే మాతా అమృతానంద‌మ‌యి వంటి గురువులు త‌మ భ‌క్తుల‌కు స్వాంత‌న‌నిస్తారు. భ‌క్తుల‌ పాద‌స్ప‌ర్శ‌తో త‌మ త‌పోశ‌క్తి డిస్చార్జ్ అయిపోతుంద‌న్న కార‌ణంగా కొంద‌రు స్వాములు దానికి అంగీక‌రించ‌రు. మ‌న కార్పొరేట్ గురువులు పోతే పోయిందిలే అని Rate fix చేసి పాద‌పూజ‌ల‌కు సిద్ద‌మ‌వుతున్నా మ‌రీ Spencers రేట్ల‌వ్వ‌డంతో కొంద‌రే వారినే సేవించుకోగ‌లుగుతున్నారు.

హ‌గ్గైనా, ట‌చ్ అయినా ప్రాణుల‌న్నింటికీ ఓదార్పును, ప్ర‌శాంత‌త‌ను చేకూరుస్తాయి. అందుకే మ‌న పెంపుడు కుక్క‌లు, దూడ‌లు మ‌న స్ప‌ర్శ‌కు త‌న్మ‌య‌మౌతాయి. ప‌సి పిల్ల‌ల‌కు ఆ వ‌య‌స్సులో ఈ మాతృ స్ప‌ర్శ‌ మ‌రీ ముఖ్యం. అమెరికాలో ఒక హాస్పిట‌ల్లో పిల్ల‌ల వార్డు ద‌గ్గ‌ర “Real way to touch a child is to touch the child “ అని రాసి ఉంది. అది చ‌దివి నా చిన్న‌ప్ప‌టి సంగ‌తులు గుర్తుకొచ్చాయి. పిల్ల‌లుగా మ‌నం మారాం చేస్తుంటే మ‌న అమ్మో, నాన్నో మ‌న‌నొక దెబ్బేస్తే మ‌న పెద్ద‌మ్మో, తాత‌య్యో పిల్ల‌ల్ని అలా ఎవ‌రైనా కొట్టుకుంటార్రాఅని వాళ్ళ‌ని మంద‌లించి మ‌న‌ల్ని ద‌గ్గ‌ర‌కు తీసుకుని మ‌న వొళ్ళు నిమిరి మ‌న‌నాన్న‌నో, అమ్మ‌నో! `ఏడ్చారులే`, అని మంద‌లిస్తే మ‌నం విజ‌య‌గ‌ర్వంతో క‌ళ్ళు తుడుచుకుని, వాళ్ళిచ్చిన పావ‌లా తీసుకుని బ‌జార్లోకి ప‌రుగెత్తితే ఆ భ‌రోసానిచ్చే ట‌చ్ మ‌న‌కు అనుభూతిలోకి వ‌చ్చేది. సైన్స్ రీసెర్చ్‌లో మాన‌వ స్ప‌ర్శ‌కు మ‌రెన్నో సున్నిత‌మైన విష‌యాల‌కు సంబంధం ఉంద‌ని తేలింది. శిశువుల‌కు మాతృ స్ప‌ర్శ (Mother’s touch) త‌క్కువైతే అది వారిలో పెద్ద‌య్యాక‌ హింస‌కు దారి తీసే భావోద్వేగాల అల‌జ‌డి పెంచుతుంద‌ట‌. ఆత్మీయుల హ‌గ్గుల‌కు దూర‌మై ప‌సివాళ్ళు మ‌న టెడ్డీ బేర్ల‌ను ప్రాణ ప్ర‌దంగా హ‌గ్ చేసుకుని నిద్ర‌పోవ‌డం చూస్తే నాకు నిద్ర‌ప‌ట్ట‌దు.

ప్ర‌పంచంలో ప‌లుదేశాల్లో కోతుల మీద జ‌రిగిన ప‌రిశోధ‌నలో ఎన్నో అద్భుత‌మైన విష‌యాలు తెలిశాయి. ఈ ప‌రిశోధ‌న‌లో భాగంగా పిల్ల‌కోతుల్ని కొన్నింటిని పుట్టిన వెంట‌నే త‌ల్లుల నుండి వేరు చేసి పెంచారు. మ‌రికొన్ని కోతి పిల్ల‌ల్ని త‌ల్లి కోతుల ద‌గ్గ‌రే పెర‌గ‌నిచ్చారు. త‌ల్లికోతుల నుండి వేర్ప‌డి పెరిగిన కోతి పిల్ల‌లు అభ‌ద్ర‌కులోనై బెరుగ్గా త‌యార‌య్యాయ‌ట‌. త‌ల్లుల సంర‌క్ష‌ణ‌లో మాతృ స్ప‌ర్శ‌తో పెరిగిన పిల్ల‌లు ఆత్మ‌విశ్వాసంతో, ఎంతో నిబ్బ‌రంగా ఉండ‌టం గ‌మ‌నించారు. భూమి గుండ్రంగా ఉంద‌న్న‌ట్లు ఈ ప‌రిశోధ‌న త‌రువాత అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో ప‌సిపిల్ల‌ల్ని త‌ల్ల‌లునుండి వేరు చేసి క్రిబ్స్ లో పడుకోబెట్టే సంస్కృతికి స్వ‌స్తి చెప్పి మళ్ళీ త‌ల్లుల‌ ప్ర‌క్క‌లో ప‌డుకోబెట్టుకుని, జోకొట్టే అల‌వాటు కొన‌సాగిస్తున్నారు.

ఈ జోకొట్ట‌డం, బుజ్జగించ‌డం పిల్ల‌ల‌కే కాదు పెద్ద‌ల‌కు అవ‌స‌ర‌మే. అందుకే ప్ర‌పంచ‌మంతా రాజ‌కీయ నేత‌లు అలిగిన త‌మ అనుచ‌రుల‌ను, కొన్నిసార్లు ప్ర‌తిప‌క్షాల నాయ‌కుల్ని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు చేస్తుంటార‌ని మ‌న పేప‌ర్‌వాళ్ళ‌ ఉవాచ‌. మ‌న ప్ర‌తి ప‌క్ష‌నాయ‌కులు సైతం కొత్త కూట‌ములుగా, ఫ్రంట్లుగా ఏర్ప‌డిన అన్ని స‌భ‌ల్లో చేతులు క‌లిపి పైకెత్త‌డం (అయిష్టంగా కూట‌మిలో కూడినోళ్ళు, ఓపిక త‌క్కువోళ్ళు, భారీకాయులు చేతులు స‌గ‌మే ఎత్త‌డంతో వారి హ్యాండ్స్ ఫార్మేష‌న్ పాత బ్రిడ్జి మీద విరిగిపోయిన రెయిలింగుల్లా ఎగుడు దిగుడుల్తో) మ‌నం ప్ర‌తి ఐదేళ్ళ‌కు ఎల‌క్ష‌న్ల‌కు ముందు సీజ‌న్స్ గ్రీటింగ్స్ ల్లా చూస్తూనే ఉన్నాం. ఇక ముందుకూడా చూస్తూనే ఉంటాం. ప్ర‌స్తుతానికి వాళ్ళు ఇలాచేతులెత్త‌డం మిన‌హా చేసేదేముంటుందిలే!

మ‌న క‌ర‌చ‌ల‌నాల్లో (Shake Hands) బోల్టు వైరైటీలు చూస్తుంటాం. కొంత‌మంది షేక్ హ్యాండిస్తే ఏ స్పంద‌న లేకుండా చెక్క‌ను తాకిన‌ట్లుంటే మ‌రికొంత మంది ప‌ర్స‌నాలిటీడెవ‌ల‌ప్‌మెంట్ పుస్త‌కాలు కొత్త‌గా చ‌దివిన‌వారు మ‌న చేతిని చ‌పాతీ పిండి నొత్తిన‌ట్లు వొత్తేస్తారు. ఆ త‌రువాత అన్న‌గారితో డ్యూయ‌ట్ పాడిన హీరోయిన్లా మ‌నం ఆర్దోపెడీషియ‌న్ను చూడాల్సిందే. వీళ్లు ఎంత స్నేహ‌పూర్వ‌కమైన వాళ్ళో How to win over friends పుస్త‌కం చ‌దివిన వాళ్ళో షేకాడింపుతోనే మ‌న‌కు చెప్పేస్తారు. మరికొంత మంది (దేశాధినేత‌లు, రాయబారులు) క‌లిపిన‌ చేతులు Fevical అంటించిన‌ట్లు ఊపి, ఊపి ఎంత‌కీ వ‌ద‌ల‌రు. మ‌న Indian News Reel లో ఇవే మ‌న‌కు త‌ర‌చూ క‌న‌ప‌డే తెంపులేని ఊపుళ్ళు, మిల‌మిల కెమేరా క్లికింగ్స్‌. నాద‌బ్ర‌హ్మ త్యాగ‌య్య గారు కూడా బ్రోచేవారెవ‌రురా అని వేడుకుని, నా పాత‌క మెల్ల పోగొట్టి గ‌ట్టిగ‌ నా చేయి ప‌ట్టి విడువ‌క అని రామునితో అనేస్తారు. ఇటువంటి స్ప‌ర్శ‌తోనే అనుబంధం ఏర్ప‌డి హ్యాపీ హార్మోన్ ఆక్సిటోసిన్ విడుద‌ల‌వుతుంది. Human touch ఎంతో న‌మ్మ‌కాన్ని, క‌రుణ‌ను, ఉప‌శ‌మ‌నాన్ని ప్రేరేపిస్తుంది. అందుకే పాణి గ్ర‌హ‌ణం పెళ్ళిలో ప్ర‌ధాన ఘ‌ట్టం.

ర‌మ‌ణుల క‌రుణాపూర్ణ స్ప‌ర్శ‌

ఆధునిక వైద్య శాస్ర్తంలో Touch therapy కి చాలా ప్రాముఖ్య‌తుంది. స్ప‌ర్శ ఆత్మీయత‌నే కాదు. తిట్ల‌నూ పుట్టిస్తుంది. వాడు అంత స్ప‌ర్శ లేకుండా ఎలా బ‌తికేస్తున్నాడో అని కొంద‌ర్ని మ‌నం తిట్టుకుంటాం. దుర‌దృష్ట‌వ‌శాత్తు, నేటి వైద్యులంద‌రూ రోగుల్ని ట‌చ్ చేయ‌డం ఎప్పుడో మానేశారు. క‌రోనా పుణ్యాన మ‌డిబామ్మ‌ల్లా ఇది మ‌రికాస్త అసింట అసింటే అయిపోయింది. ట‌చ్ మాట వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా నేను ఓ కార్పొరేట్ ఆసుప‌త్రి వారి `Touching lives` అనే Ad ఎన్నిసార్లు జాగ్ర‌త్త‌గా చ‌దువుదామ‌ని ప్ర‌య‌త్నించినా అప్ర‌య‌త్నంగా Touching Purses అనే వ‌స్తుంది. అక్క‌డ‌కు వెళ్ళినోళ్ళంద‌రికీ నా Rhyming యే వ‌స్తుంది. అదే న‌చ్చితీరుతుంది.

గ‌తంలో మీకు చెప్పిన డి.ఎస్‌.మూర్తి I.A.S గారి టేబుల్ మీదే చిన్న చెక్క మీద Keep in touch Don’t keep touching అని కూడా రాసుండేది. మ‌న మిత్రులు కూడా ట‌చ్‌లో ఉంటే మెచ్చుకుంటారు గానీ ట‌చింగ్‌లోనే ఉంటే నొచ్చుకుంటారు. ట‌చింగ్‌ లోనే ఉంటూ హ‌రిశ్చంద్రుని విసిగించి, వేధించిన‌ న‌క్ష‌త్ర‌కుడ్నిఎలా మ‌రువ‌గ‌లం.

“Some people bring happiness where ever they go….

Some people bring happiness when ever they go“

ఆప్ ఆయే బ‌హారాయే కొంద‌రైతే

ఆప్‌గ‌యే బ‌హారాయే మ‌రి కొంద‌రు.

మీరెలాంటి వారో తేల్చుకోండి. క‌నీసం తెలుసుకోండి. న‌న్ను రెండో కేట‌గిరిలో మీరు వెయ్య‌క‌ముందే ఇక్క‌డితో ఆపుతా ….

(ఆత్మీయులు డి.ఎస్‌.మూర్తి I.A.S గారికి కృత‌జ్ఞ‌తల‌తో)

26 Replies to “Joy and hugs”

  1. Very nice article ,Which explains about the feelings of touch but it also touches heart . On reading, this leaves happy and joy. Thank u Harsha Garu.

  2. Sir
    Recent movie lo last closing dialogue..ఆత్మీయత కూడిన ఒక చిన్న స్పర్శ ఒక జీవిత కాలానికి గుర్తు వుంటుంది అన్నట్లు..hug and touch can lift the spirits of a person…రాములు వారు హనుమ hug ki background entha వుందని తెలియచేశారు..

  3. Excellent narration of a story from a simple word ‘Hug’ uttered by a young Blacky in a Mall with a tinge of humour. Hats off to you, sir

  4. బావగారు,
    Rollercoaster లో తిప్పి, దింపేసారు.
    Very nice ride , enjoyed immensely.

  5. Sir,

    శుభోదయం .
    శరన్నవ రాత్రి శుభాకాంక్షలు
    స్పర్శ మధురానుభూతిని హృదయానికి “టచ్ ” అయ్యేలా చెప్పారు .

  6. మిమ్మల్ని చదివిన ప్రతి సారి గుండె ను టచ్ చేస్తున్నారు సార్. మీ రచన ల్లోని ధార అనితర సాధ్యం. నాకు చాలా ఇష్టం. హ్యాట్సాఫ్

  7. A beautiful depiction, touching upon human touch with a good touch of humour. It reminded me of the story of Kuda, a hunchbacked women, who was turned into a beautiful women by the sweet touch of Lord Krishna.

  8. నవరసాలతో నిండిన శరన్నవరాత్రి కానుక గా ఈ హగ్గింగ్ ఎపిసోడ్ చాలా చాలా బాగుంది. పాత కొత్తల కలయికలతో మీ శైలి మీదే, ఇంకా ఎన్నో ఎన్నో ఇటువంటివి మీ హర్షవనమ్ నుండి ఆశిస్తున్నాం.

  9. I loved your literary hug.It fascinates always reading your subjects. They touch and hug every subject nicely.Spirituality marking you never miss. Humour is another ingredient.Your observation is so deep
    and presentation of the musings magical.

  10. Dear Harshavardhan Garu,
    Almost every message from you
    Will have very sensible & meaningful
    This particular message is very touching andi
    Regards
    Ravindra Babu

  11. Picking up a small incident at a mall you have carried us through Ramayana and Mahabharata. You always make a very less talk and make more OBSERVATION of persons around you. Good analysis of touch and hug. It is a feeling which can’t be expressed in words. Hug is one of the modes of treating sick ( barring Covid)

  12. శుభోదయం సార్!ఈ హగ్గింగ్లు టచ్చింగ్లతో పెద్ద గొడవే వచ్చింది ఎంత చక్కటి పరిశీలన! అసలు మీరు ఇంత కొంగొత్తగా ఎలా ఆలోచిస్తారండి? మీరే అంశాన్ని తీసుకున్నా అందులో నవరసాలన్నీ ఉండి తీరతాయి బహుశ మీకు చాలామంది కవులు రచయితలు మిత్రులుకదా ఆ మిత్రత్వంకూడ మీ ఈ ప్రత్యేకతల వల్లే చేకూరిందనుకుంటాను రామాయణ భారతకాలాల్ని నేటి డిజిటల్ యుగంతో అన్వయించడం అబ్బో అద్భుతం కదండి మీరిలాగే పది కాలాలపాటు మిత్రులందరినీ మీ హాస్యచతురతతో అలరిస్తారని బలంగా విశ్వసిస్తూ….చలం🙏🏼🙏🏼🙏🏼

  13. Superb. Very touching. I used this touch technique as one of my content in training to nearly 1000 women activists in 23 districts just before bifurcation of AP. it was good success and trainees became emotional in almost all 46 batches. ….. Vengal Reddy

  14. తండ్రి ప్రేమ,ఆత్మీయత,అలింగణాలు, హాస్య చతురత, రామాయణ, మహాభారత లు ఊటంకిస్తూ సరదా సరదాగా సాగింది సర్ మీ కథానిక.. సూపర్ సర్

  15. Really very good analysis harshavardhan garu…about the hug…you wrote…very recently i read some where that COW HUG THEREPHY..WAS INTRODUCED…MEANS HUGGING THE COW FOR SOME TIME..by doing that will get relief from many doses

  16. I loved the way joy & hugs is portrayed with the lively incidents while adding the humour 😊

    I recall the incidents happened during my childhood where I am consoled by my grandparents👴🏻🧓🏻

    experienced the different types of hand shakes 🤝

    last but more costly experience at the hospital when my mother was treated by the doctor by being behind the glass partition and not even checking her pulse rate 😇

    Sir, Thank you for the nice blog, enjoyed reading 👍🏻

  17. హర్ష గారూ! ఎక్కడనుండి ఎక్కడికి మీరు తీసుకువెళ్ళారో కదా! అమరికా నుండి రామాయణభారతాలు తడిమేసేరు. రమణులదగ్గరనుండి మూర్తి గారివరకు గుర్తుచేసుకున్నారు. తీగలాగి స్మృతుల డొంకను కదపడం మీకు అలవోకగా అలవడిన విద్య. అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *