
మహాకుంభమేళా 144 సంవత్సరాలకొకసారే వస్తుందని గత నాలుగు నెలలుగా నిముషానికొక యూట్యూబ్ పోస్టింగ్స్‌తో, పేపర్ల నిండా వార్తలతో హోరెత్తి పోయింది. మేళాలో నాగసాధువులు శంఖాలు ఊదకముందే మా చెవులు దిబ్బిళ్ళు పడ్డాయి. ఇంకో నూట నలభైనాలుగేళ్ళకా! – ‘నో ఛాన్స్’ అనుకొని కుంభ్‌కు పోదామా అంటే Willing to wound afraid to strike అన్నట్లు ధైర్యం చాల్లేదు. ఈ డైలమాతో రోజులు దొర్లి పోయి ఫ్టైట్ టిక్కెట్లు నిజంగానే ఆకాశాన్నంటాయి. ప్రయాగ్‌రాజ్‌కు పోను, రాను టిక్కెట్ అమెరికా పోవడం కంటే కాస్త పైకే చేరింది. పోనీ మానేద్దామంటే పుణ్యం దొరకదేమో అని బెంగ. హేమ్లెట్లా to be or not to be సంకటస్థితిలో పడ్డాం. ఈ లోపు అదృష్టవశాత్తూ మాకు టికెట్ స్పాన్సరర్లు, సహ ప్రాయోజకులూ దొరికేసారు.
ఇంతటి కష్టకాలంలో కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి పార్థసారథి తోడు దొరికినట్లు మాకు ఆప్తమిత్రులు కిల్లాడి సత్యనారాయణ గారి అండ దొరకడంతో కొండంత బలంతో సాహసం చేయరా డింభకా రాకుమారి దొరక్కపోయినా, కనీసం పుణ్యం అయినా వస్తుందని టికెట్స్ కొనేసి వారికి ఫోన్ చేస్తే వారు రెస్పాండ్ కాలేదు. పదిలక్షల రూపాయలు అప్పు తీసుకున్నోడైనా అప్పిచ్చిన వాడి ఫోను ఎత్తుతాడేమో కానీ కుంభమేళా డ్యూటీలో ఉన్న వాళ్ళు ఫోన్ ఎత్తితే స్నానాలకో, గుడారాల ఏర్పాటు కోసమో బుక్ అయిపోతారు. వాళ్ళ తప్పేంకాదు. మేము
అక్కడకు వెళ్ళినప్పుడు మాకు గైడ్‌గా వచ్చిన పోలీసాయన మా డ్రైవర్‌తో ఇవాళ సాయంత్రం నాలుగు గంటల వరకు మా ఇంటికి మాట్లాడ్డం కుదర్లేదని వాపోయాడు. అక్కడకు వెళ్ళి మా కళ్ళతో చూసాం వాళ్ళ పరిస్థితి అలాంటిది. ఇక లాభం లేదని సత్యనారాయణగారి శ్రీమతి రమగారి ద్వారా విన్నపం చేసుకుని వారితో ‘యస్’ అనిపించుకుని ఊపిరి పీల్చుకున్నాం. మేము బయలుదేరే ముందు ‘ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోందా?’ అని సత్యన్నారాయణ గారిని ఫొన్లో అడిగితే ఆయన లౌక్యంగా నవ్వేసి, ‘రండి మీరే చూద్దురుగాని’ అన్నారు.

ఫిబ్రవరి 19 నుండి 23 వరకు కాస్త రద్దీ తక్కువగా ఉంటుందన్నవారి సలహా ప్రకారం ఫిబ్రవరి 19 మధ్యాహ్నానికి ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగాం. బ్యాగేజి క్లెయిమ్ కోసం బెల్టు దగ్గర నిలబడే చోట గోడమీద క్షీరసాగర మధన దృశ్యాన్ని, దాని ప్రక్కనే మరో రెండు పురాణ ఘట్టాలు, గంగావతరణం, సదాశివుల చిత్రాలు చూశాం. ఎయిర్పోర్ట్ రోడ్డంతా అందమైన స్థంభాలపై అమృతకలశాలతో అలంకరించారు. నగరమంతా గోడల మీద అందమైన పెయింటింగ్సే. అక్కడ యోగీజీ మార్క్ అడుగుడుక్కి కనిపించింది.

కోసం వచ్చిన కార్లలో బయలుదేరి బయట ఒక నాలుగుకిలోమీటర్ల దూరం వరకు సాఫీగా వచ్చేసాం. ఇంతోటి దానికా బోలెడు హైప్ ఇచ్చారు అనుకునేలోపు పిచ్చి ట్రాఫిక్ తగిలేసింది. ఎలాగూ ట్రాఫిక్‌లో చిక్కుకున్నామని మా డ్రైవర్‌ను కుంభమేళా విశేషాలను చెప్పమన్నాం. జనం తండోతండాలుగా వస్తున్నారని ట్రాఫిక్ రద్దీ నుండి యాత్రకుల్ని ఆదుకోవడానికి లోకల్స్ ‘ఇండియన్ జుగాడ్’ తో ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ల నుండి ఇద్దరిద్దరు భక్తుల్ని బైక్ మీద ఎక్కించుకుని ఘాట్లలో స్నానం చేయించి వెనక్కి డ్రాపింగ్ ఉపాయ కనిపెట్టారని చెప్పాడు.

ఈ రైడ్ మొదట్లో మనిషికి 500 రూపాయాల రేటుతో మొదలై ఆ రోజుకి 1500 రూపాయలకు పెరిగిందని చెప్పాడు. కాస్త వొళ్లు చేసిన జంటలైతే రెండు బైకులు ఎక్కక తప్పదు. జీరో సైజైతే ఒక్కటే సరిపోతుంది. ఏమైనా ఈ ఏర్పాటు బాగా వర్కౌట్ అయిందని చెప్పాడు. సంగం ప్రాంగణంలో చిన్న కాకా హోటల్ పెట్టడానికి నలభై రోజులకు అక్షరాల 95 లక్షల రూపాయలు అద్దె అని చెప్పడంతో మాకు మతిపోయింది. ఘాట్ల దగ్గర పడవల వాళ్ళు రెండు వేల రూపాయలతో మొదలెట్టి క్రమంగా ఇరవైవేలకు పెంచేసారని చెప్పాడు. 144 ఏళ్ళకు ఒకసారి వచ్చిన మేళా మా పేదలందరికీ మేలే చేస్తోంది అని చెప్పాడు. అక్కడ కారు తోలడం మాటెలా ఉన్నా కార్లతో మనుషుల్ని తోలడం చూసాం.

సంగం దారిలో కొన్ని సైన్‌బోర్డుల మీద ‘సంగం’కు వెళ్ళేదారి అని తెలుగులో కూడా రాశారు. మన తెలుగోళ్ళ భక్తి ప్రకంపనలు ప్రయాగకు చేరడం నిజంగా గొప్పే. కాశీలో కూడా అన్ని చిన్న గుళ్ళ మీద తెలుగు బోర్డులు చూశాం. మన వారి తాకిడి ఏ స్థాయిలో ఉందో చూడండి.
సంగంకు వెళ్ళే దారిలో భోంచేసి అతి కష్టం మీద మమ్ముల్ని రమ్మన్న చోటుకు చేరాం గానీ ఆ పైన దారి తెన్నూ లేదు. ఎటు చూసిన జనసముద్రం. మేము వెళ్ళాల్సిన పార్కింగ్ లాట్‌కు ‘U’ టర్న్ తీసుకువెళ్తే ఫర్లాంగ్ దూరానికి రెండు గంటలు పైనే పట్టొచ్చని డ్రైవర్ చెప్పాడు. చిన్నప్పుడు చేసిన కాలము, వేగము లెక్కల అనుభవంతో కార్లు దిగి లగేజి మోసుకుంటూ జనసంద్రాన్ని ఈదుకుంటూ పెద్ద రంగుల రాట్నం దగ్గరకు చేరాం. ఈ చిన్న పాదయాత్ర నిజమైన కుంభమేళా యాత్ర ఫీల్‌నిచ్చింది. ఈ లోపు మమ్ముల్ని గైడ్ చేస్తున్న జగ్గయ్యపేట సాంబగారు వచ్చి మాతో చేరి వాహనాల్లో మమ్ముల్ని బసకు చేర్చారు.
మా బస సత్యనారాయణ గారి కోసం, వారి సిబ్బంది కోసం తాత్కాలికంగా వేసిన గుడారాల ప్రక్కన వేసిన మరో రెండు జోధా అక్బర్ గుడారాల్లోనే. వారి ప్రయాగరాజ్ శిబిరం తుఫాన్ మధ్యన ప్రశాంతి నిలయంలా ఉంది. ‘యాత్ యాత్ శిబిర్’ అని ఆ ప్రాంగణం ద్వారం మీద హిందీలో బోర్డు ఉంది. ‘యాతనలు పడి చేరాలి కనుక ఆ పేరు పెట్టారా?’ అని సత్యనారాయణ గారిని అడిగా. ఆయన యాత్యాత్ అంటే హిందీలో ట్రాఫిక్ అని చెప్పారు.

కుంభమేళా అంటే అందరూ అనుకునేట్లు కేవలం జనసమూహం మాత్రమే కాదు. తాత్త్వికత, ఆధ్యాత్మికం, విశ్వాసం, నమ్మకం, ఇతిహాసం, జ్యోతిష్యం, వివిధ మతాల వీటన్నింటి మేలుకలయికనే అని మేము శిబిరం నుండి అడుగు బయట పెట్టగానే అర్థమయ్యింది. ప్రయాగ క్షేత్రం గంగ, యమున, సరస్వతీ పుణ్యనదుల త్రివేణి సంగమం. కుంభ్ అంటే భిన్నత్వాలను ఆకళింపు చేసుకుని ఆమోదించడం. అది ఎన్నో విభిన్న సంస్కృతుల సమ్మేళనం.
ఆదిశంకరులు సనాతనధర్మ పరంపరను కొనసాగించేందుకు పదమూడు అఖారాలను (సంఘాలను) స్థాపించారట. ఆ తరువాత మరో ఏడు అఖారాలు అదనంగా వచ్చి చేరాయి. అన్ని మహాకుంభమేళాల్లో ఈ అఖారాలు పాల్గొనడం విశేషం. అన్నింటి కంటే పెద్దదైన జున అఖారాలో హిందువులతోపాటు ముస్లిమ్, బౌద్ధమతస్థులు కూడా ఉండటం పరమత సహనానికి, ఏకత్వానికీ నిదర్శనం. వాటిల్లో ఉదాసీన్ అఖారా శిక్కుమతపరమైనది. మహాకుంభ్ మేళాల్లో ఈ అఖారాల పెద్దలు పలు చర్చలు, సమావేశాలు నిర్వహించడం తరతరాల సంప్రదాయం. లోకకళ్యాణం, సర్వమానవ సౌభ్రాతత్త్వ సాధనే ఈ చర్చల పరమార్థం.
ఎనిమిదో శతాబ్దంలో ఉత్తరభారతదేశ చక్రవర్తి హర్షవర్థనుడు స్వీయ పర్యవేక్షణలో కుంభమేళా ఘనంగా నిర్వహించాడని చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ తన రచనల్లో పేర్కొన్నాడు. అప్పటినుండి ఖగోళ శాస్త్ర రీత్యా మహాకుంభమేళా ప్రతి 144 సంవత్సరాలకొకసారి అవిఘ్నంగా నిర్వహించుకోవడం భారతదేశానికి మాత్రమే ప్రత్యేకం. ప్రపంచంలో కోట్ల జనాభా పాల్గొనే మహాకుంభమేళాను పరిశీలించడానికి ఎన్నో దేశాల నుండి శాస్త్రవేత్తలు, జిజ్ఞాసులతోపాటు హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నెలరోజులపాటు ప్రయాగ సంగమం వద్దే నివసించడం అపూర్వం.
అమెరికా పెళ్ళిళ్ళకు అతిధుల సంఖ్య వంద దాటదు. వాళ్ళను మన అంబానీలు, రాజకీయ నాయకుల పెళ్ళిళ్ళకు తీసుకొస్తే మన ఊరబంతులు, వేల మంది భోజనాలు చూస్తే స్పృహ తప్పుతారు. ఇక కుంభమేళాను చూస్తే అంతేసంగతులు. ఎన్నో ఇబ్బందులకు, కష్టాలకోర్చి జనం కుంభమేళాలో పాల్గొనడం వెనక ‘there is a strong social force driving them towards living together’ అని పలు పరిశోధనలలో తేల్చారు. అన్ని వసతులు, సౌఖ్యాలను మర్చిపోయి జనంతో కలిసి మమేకమయ్యేవారి మానసిక స్థితి, ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉంటాయని కూడా వారి పరిశోధనలు తీర్మానించాయి. “whereas the crowd “drug” seemed to have a positive influence on all aspects of the pilgrims’ health” అని కూడా నిర్ధారించారు. ఇలాంటి అత్యంత విలువైన మానవ సంబంధాలు జీవితాల్లో కొరవడం వల్లనే అమెరికా వంటి సంపన్న దేశాల్లో సంఫీుభావన తగ్గిపోయి వారు సంఘ జీవులన్న ప్రాధమిక స్పృహ కోల్పోతున్నారని గమనించారు. మానసిక శాస్త్రవేత్తలు మనుషులు కలిసి ఉన్నప్పుడు ‘నేను’ భావనను దాటి ‘మేము’ అన్న భావనలో జీవిస్తారని చెప్తారు.
ముసురుతున్న కుంభమేళా ఆలోచనలతో సాయంత్రం కాలినడకన ఐదుకిలోమీటర్ల దూరంలో అక్బర్ కోట దగ్గరున్న ఘాట్ల వరకు నడిచాం. చుట్టూ లక్షల జనం, కోలాహలం ఉన్నా మాకు ఎటువంటి ఆందోళన భయం కలగకపోవడం నిజంగా ఆ స్థలమహిమనేమో. పదిహేను గంటలు ట్రాఫిక్‌లో చిక్కుకుని చలిని భరిస్తూ, దొరికింది తింటూ ఎన్ని అసౌకర్యాలున్నా అక్కడి యాత్రికుల ముఖాల్లో కేవలం ఆనందం, తృప్తి మాత్రమే ప్రతిబింబిస్తున్నాయి. వాళ్ళలో అసహనం, అసంతృప్తి, అలసటల ఆనవాళ్ళైనా లేవు. నడుము వంగిన ముదుసలులు, పిల్లలు, భారీకాయాలతో మహిళలు కాళ్ళకు చెప్పులు కూడాలేకుండా తలమీద మూటలతో, మాటలతో నవ్వుతూ, తుళ్ళుతూ నడవడం గొప్పే. నడవడం ఆశ్చర్యం.

ఒక విదేశీ జర్నలిస్ట్ మేళాకు వచ్చిన డెబ్భై ఏళ్ళ భక్తుడ్ని ‘మంచులాంటి చల్లని నదిలో ఎలా మునుగుతున్నారు’ అని అడిగాడట. ఆయన ‘నా కంటే పదేళ్ళు పెద్దలు మునగడం చూసి’ అన్నాడట. ‘మరి వాళ్ళు ఎవరిని చూసి మునుగుతారు’ అంటే, ‘దేవుడి మీద నమ్మకంతో’ అని చెప్పాడట. మరో వృద్ధుడు తన ఇంటర్వ్యూలో గత మూడు కుంభమేళాలకు నేను వచ్చాను. మేళా జరిగిన నలభై రోజులూ రెండు పూట్లా సంగమస్నానం చేయడం వల్ల మరింత ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నానని చెప్పాడట.
కుంభమేళాలో పాల్గొనే కోట్ల మంది ప్రజల్ని ప్రభావితం చేసే ఏకాత్మత ఏమిటా అని పరిశోధించిన ఫ్రెంచి సామాజిక శాస్త్రవేత్త Durkhiem “Collective Effervescence” దీని వెనుక బలమైన ప్రేరణ అని పేర్కొన్నాడు. భారీ సంగీత కాన్సర్ట్స్, ఒలంపిక్స్ లాంటి క్రీడోత్సవాలు, మతపరమైన భారీ కూటములు, సాంస్కృతిక మేళాల్లో ‘Shared intense emotional experiences bring people together creating a sense of community and social solidarity’ అనే మాటలకు నమ్మకం కూడా తోడవటంతో కుంభమేళాలో ఈ భావన మరింత హెచ్చుగా ఉందని గ్రహించాడు.
‘Collective effervescence plays a crucial role in maintaining social cohesion and reinforces shared values and norms’ అన్న శాస్త్రీయ ప్రతిపాదనకు మన మహాకుంభమేళానే ప్రత్యక్ష నిదర్శనం. షుమారు అరవై ఏళ్ళ క్రితం భారతదేశాన్ని దర్శించిన J.K.Galbraith ‘India is a functioning anarchy’ అని విస్తుపోయాడట. ఇందులో మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది anarchy (అస్తవ్యస్త స్థితి) ని కాదు functioning నే!
మేము రెండో రోజు బోట్లలో సంగం ఘాట్‌కు చేరుకుని స్నానం చేసాము. అక్కడ నీళ్ళలో మునిగితేలి ఒక్క క్షణం పాటు ఆలోచనా రహిత స్థితిని (State of thoughtlessness) చేరుకుని, అనిర్వచనీయమైన స్థితిలో కొంతసేపు ఉండిపోయాం. ఆ తరువాత అక్కడ రణగొణ ధ్వనులు మురికి, ఎండ, జనతాకిడి ఏదీ మమ్ముల్ని తాకలేదు.
దేశంలో ఇంచుమించు సగం జనాభా అంటే షుమారు 62 కోట్ల మంది కుంభమేళాలో స్నానాలు చేసారని లెక్క తేల్చారు. అందులో కొంత డిస్కౌంటిచ్చినా కనీసం 20 కోట్ల మంది కేవలం ఇరవై కిలోమీటర్ల వైశాల్యంలో నివసిస్తూ స్నానాలు చేయడం ప్రపంచంలోనే అరుదైన ఘటన. కుంభమేళాలలో వసతులు, సౌకర్యాలు సరిగ్గా లేవని కొందరు విమర్శించారు. వారి మాటలు విన్నప్పుడు మన కార్పొరేట్ కాలేజ్ హాస్టల్ వార్డెన్ ఒక పిల్లవాడి తండ్రి అన్నంలో ఈగ వచ్చిందని కంప్లైంట్ చేస్తే ‘పూటకు మూడువేల మందికి వంట చేస్తుంటే ఈగలే వస్తాయి సార్, మీ వాడ్ని ఈగ తీసైనా తినమండి, లేదంటే మీ వాడినే తీసుకెళ్ళండి అని చెప్పాడట. అదే లాజిక్ కుంభ్ విమర్శకులకు అప్లై చేసి ఇష్టమైతే జనంలోకి దూకండి లేదంటే మీ ఇంట్లో టి.వి. చూసుకోండి అని చెప్పాలి. ఇటువంటి మేళాకు ఏర్పాట్లు చేయడం హెర్కూలియన్ టాస్క్. The Very Proportion of the task is beyond comprehension and daunting అయినా, దేశ విదేశీయులతో భళా అనిపించే స్థాయిలో యోగీజీ మేళా ఏర్పాట్లు చేశారు.

స్నానం ముగించుకుని వెనక్కి వస్తుంటే మార్క్‌ట్వైన్ 1896 లో కుంభమేళాను దర్శించి ‘It is wonderful’ అని మురిసిపోయి…
‘‘The power of faith like that, that can make multitudes upon multitudes of the old and the weak and the young and the frail enter without hesitation or complaint upon such incredible journeys and endure the resultant miseries without repining” అన్నది ఆయన పూర్తి నమ్మకంతో త్రికరణశుద్ధితో రాసినదే అని విశ్వసించాల్సిందే.
ప్రయాగ సంగమ నగరంలో రెండు రోజులు గడిపిన తరువాత అక్కడ ప్రజల్ని రప్పిస్తున్నది కేవలం నమ్మకమే అన్న నమ్మకం మరింత బలపడిరది. మా హైస్కూల్ రోజుల్లో సూపర్‌హిట్ దివార్ సినిమాలో స్మగ్లర్‌గా పెడదారి పట్టిన బిగ్.బి. నిజాయితీపరుడైన తన తమ్ముడు శశికపూర్‌తో ‘మేరే పాస్ పైసా హై, బంగ్లా హై, సబ్ కుచ్ హై, తుమారే పాస్ క్యా హై?’ అంటే శశికపూర్ నిదానంగా ‘మేరే పాస్ మా హై’ అన్నట్లు కొందరు ‘కుంభ్ మే క్యా హై? గందా హై, భీడ్ హై, పానీ బురాహై, బహుత్ షోర్ హై’ అంటే, భక్తులు తాపీగా ‘ఇదర్ హమారా విశ్వాస్ హై’ అంటారేమో! ఎప్పుడో ఆచార్య రజనీష్ ‘Faith is the most beautiful word in human language’ అన్నమాట కుంభమేళాకు సరిగ్గా సరిపోతుంది.
కుంభమేళాను, ప్రయాగను భౌతిక నేత్రంతో కాక మనోనేత్రంతో చూడగలిగితే అర్జునుడికి విలువిద్యలో కేవలం పక్షికన్నే కనపడినట్లు కుంభ్ ఆత్మ (Soul) మనకు అందుతుంది. అలా దర్శించిన ఒక దార్శనికులు వాట్సప్‌లో పెట్టిన పోస్ట్‌ను ఇటీవల చెల్లెలు డా.సుమతి నాకు పంపింది. అందులో సారాంశాన్ని యధాతథంగా మీతో పంచుకుంటున్నా ….
Did I learn something? The biggest lesson was given to me by my taxi driver Bhai. We were complaining of the difficult journey, hours of waiting in front of closed bridges and walking long ways, he said…
Deedi, in olden days people did years of penance, that too in difficult terrains, in adverse climatic conditions to meet their Lord or attain Moksha or whatever. Don’t you think it is too silly a complaint? And whom are you searching for? Lord? You can see Narayana everywhere in Kumbhamela Deedi. The housekeeping boy who cleans all the dirt is Narayana, the lady who feeds you is Narayana, the police man who helps you day and night is Narayana”.
Now let me tell you what I gained. It was a wonderful experience which taught me that humanity is the most beautiful thing in the world, it’s no less than Divinity and every human has its spark in him.
Yes, it was a beautiful experience of togetherness, kindness and love – Karthika.
మా యాత్ర ముగించుకుని తిరిగి వస్తుంటే ఎప్పుడో చదివిన A.L. Basham రాసిన The wonder that was India పుస్తకం గర్తుకొచ్చింది. దానికి చిన్న మార్పు చేసి The wonder that is India, కాదు కాదు – The eternal Wonder that will be India టైటిలే మన భారతావనికి సరైనదన్న భావన కలిగించిన కుంభమేళా ఆధ్యాత్మిక ప్రపంచానికి విమానంలో నుంచే నమస్కరించుకున్నా.
(ఆత్మీయులు రమా సత్యనారాయణ దంపతులకు కుంభాబి వందనాలతో, సహప్రాయోజకులు రవి, రేవతులకు – కృతజ్ఞతలతో)


సర్,
నిజాయితీపరుడైన తన తమ్ముడు శశికపూర్‌తో ‘మేరే పాస్ పైసా హై, బంగ్లా హై, సబ్ కుచ్ హై, తుమారే పాస్ క్యా హై?’ అంటే శశికపూర్ నిదానంగా ‘మేరే పాస్ మా హై’ అన్నట్లు కొందరు ‘కుంభ్ మే క్యా హై? గందా హై, భీడ్ హై, పానీ బురాహై, బహుత్ షోర్ హై’ అంటే, భక్తులు తాపీగా ‘ఇదర్ హమారా విశ్వాస్ హై’ అంటారేమో! ఎప్పుడో ఆచార్య రజనీష్ ‘Faith is the most beautiful word in human language’ అన్నమాట కుంభమేళాకు సరిగ్గా సరిపోతుంది.
అని కుంభమేళా సారాన్ని గాఢంగా వివరించారు. విలువైన ఆర్టికల్.
Beautifully narrated sir, thank you.
కుంభ మేళ యాత్ర విశేషాలు మీస్టైల్లో చక్కగా వివరించారు. అభినందనలు
మహా కుంభమేళా ప్రయాణ సందర్శనా విశేషాలు చక్కగా మీ శైలి లో తెలియజేశారు సార్! అభినందనలు 🙏
చాలా వైవిధ్యంతో కూడిన అనుభవం కళ్ళకు కట్టించారు సార్. ధన్యవాదములు
చాలా చాలా బాగా కళ్ళకు కట్టినట్లుగ చెప్పారు. మేము వెళ్లి వచ్చాము. కానీ మీ వ్యాసం చదివినతరువాత మహా కుంభమేలా చుసినందులకు చాలా చెప్పలేనంత ఆనందంగా వుంది. ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you very much Sir కుంభమేలా లో మునిగనంత అనుభూతి కలిగించినందుకు
సర్! హర్షగారూ! మీతో పాటు మమ్మల్నీ ప్రయాగ్ రాజ్ తీసుకువెళ్ళేరు. మీ కళ్ళతో అక్కడి దృశ్యాలన్నీ మా కళ్లు చెదిరేట్టు కట్టేశారు. అయ్యో! మేము వెళ్ళలేకపోయామే అనే బెంగ లేకుండా చేశారు.
మీరు చూసినవి, అనుభవించినవి.. చదువరులకు కూడా అంతే అనుభూతిని కలిగించేటట్టు రాయడం మీ నేర్పు. ధన్యవాదాలు..
చాలా బాగా వ్రాసారు. Great experience and learning from the trip. Very nice.
As usual
I need not attend KUMBHA mela
You brought the great event to me as such
You re blessed with your experience
మీ కుంభమేళ సందర్శనాంనందాత్భుతానుభవాన్ని విసిష్ఠ వివరాల సమేతంగా క్లుప్తంగా అందించినందుకు ధన్యవాదాలు 🙏🏻
చాలా బాగా రాసారు సర్. కంభమేళా ఆత్మను ఉద్వేగభరితంగా చిత్రించారు.
మేము కుంభమేళనందు స్నానంచేయు అదృష్టము లేకపోయినా మీకుంభమేళా స్నానము వివరణతో మేముకూడా పవిత్ర త్రివేణి సంగమంలో స్నానము చేసిన అనుభూతిని పొందాము. ధన్యవాదములు.
మేము కుంభమేళనందు స్నానంచేయు అదృష్టము లేకపోయినా మీకుంభమేళా స్నానము వివరణతో మేముకూడా పవిత్ర త్రివేణి సంగమంలో స్నానము చేసిన అనుభూతిని పొందాము. ధన్యవాదములు. మేము కుంభమేళనందు స్నానంచేయు అదృష్టము లేకపోయినా మీకుంభమేళా స్నానము వివరణతో మేముకూడా పవిత్ర త్రివేణి సంగమంలో స్నానము చేసిన అనుభూతిని పొందాము. ధన్యవాదములు.
హృదయాంతరాలలో దాగిన మానవత్వాన్ని విశ్వజనీనంగా దర్శించిన మీ సోదరి వ్రాసిన విషయాన్ని వివరించడం మెరుపులతో నిండిన మీ వ్యాసంలో అదే కోసమెరుపు. విశ్వమే విష్ణువు నరులే నారాయణులు. కుంభమేళాలో మునిగినంత ఆనందం కలిగింది మీ వ్యాసం చదువుతూ ఉంటే. హృదయపూర్వక ధన్యవాదములు…సూర్య ప్రకాశరావు
Impressive narrative.
మీ అనుభూతుల సమాహారం ను authentic quotes తెలియ చేసినందుకు ధన్యవాదాలు సర్
It’s a heart-touching experience! Faith moves mountains, while belief is like a stagnant pool. One should transcend belief to experience faith which is transrational. I appreciate you sharing your journey through the terrains of terrific crowds at Prayagraj and savouring the nectar of Sangam. The narration is superb!
Nice narrative sir 🙏