మనం పుట్టింది మొదలు పోయేవరకు ఏకైక మంత్రం ‘కండీషన్స్’ అప్లై (షరతులు వర్తిస్తాయి). ఇల్లు, ఆఫీసు, బడి, గుడి ఎక్కడైనా, ఏమికొన్నా, ఏమితిన్నా ఇదే గోల‌. ఇది చాల‌దన్నట్లు ‘స్మాల్‌ ప్రింట్‌’ మరికొంచెం మనశ్శాంతి కరువవడానికి. జీవితం షార్ట్‌ ఫ్లైట్‌లా ఎక్కి బెల్టేసుకుని కుదురుకునేలోగా అరవై దాటేసింది. ఇదుగో ఇప్పుడు జీవితంలో మొట్టమొదటి సారిగా ఏ కండీషన్స్‌, షరతుల్లేని ప్రేమను మనమరాలు రేయ చవి చూపించింది. చూపించింది అనడం కరెక్ట్‌ కాదు, చవిచూసే స్థాయికి నేనే ఎదిగానేమో. ఊహ తెలియక ముందు మా అమ్మకూడా ఇదే ప్రేమనిచ్చినా అప్పుడు తెలుసుకునే జ్ఞానం లేదు. అలా అప్పుడు మిస్సయిన దాన్ని క్రికెట్‌ ఆటలో ఎల్‌బిడబ్ల్యూ కు సెకండ్‌ అప్పీల్లా మా ఆవిడ అందించినా ఈసారి కొంతలోకొంత జ్ఞానం వచ్చినా మళ్ళీ మిస్సయ్యా. ఈ సారీ జ్ఞానం లేక కాదు. తీరిక, శ్రద్ధ లేకనే. పరుగుల‌ జీవితంలో దాటుకుంటూ దాటుకుంటూ రేయమ్మ చేతిలో క్లీన్‌బౌల్డ్‌. ఇప్పటికి సరిగ్గా ట్యూన్‌ అయిన ఎంటెన్నా తో షరతుల్లేని ప్రేమ గట్టిగా తాకింది.

ఏడాది వయసున్న రేయమ్మను చూసుకోవడానికి అమెరికాలో ఆరునెలలు గడపడంతో షరతుల్లేని ప్రేమను ఆస్వాదించే వయసును సమయం నేర్పింది. ప్రతిరోజు నిద్రలేచి కళ్ళు తెరచీ తెరవకనే తాతా అంటూ నా గదికి పరుగెత్తుకొచ్చేది. ఒకరోజు మారాం ఎక్కువ కావడంతో విసుగుతో తనని వదిలి వేరే గదిలోకి వచ్చేసాను. నా అసహనం, విసుగు ఏమీ ఎరుగని రేయమ్మ పదినిముషాల‌కే పరుగు పరుగున‌వచ్చి తాతా అని నా మెడను చుట్టేసింది. మనం చదువుకున్న చదువు, పెంచుకున్న అహం ఎవరికైనా అన్నీ మైమరపించి ఇలా దగ్గరగా  చేరనిచ్చిందా? పసివాళ్లలా అవన్నీ మనం వదుకోలేం కనుకనే మన జీవితాలు నిస్సారమై ప్రేమరాహిత్యానికి లోనవుతున్నాయి.

రేయమ్మతో ఉన్నప్పుడే “ఈ ప్రపంచంలో అత్యంత మధురమైన ధ్వని … పసిపిల్ల‌ల నవ్వే” అన్న నిత్య సత్యంతో పాటు ‘The Simplest toy, one which even the youngest child can operate, is called a grandparent’,   అని కూడా తెలుసుకున్నా. ఆల‌స్యంగా అయినా ఈ అనుభవం కొత్త పాఠాన్ని నేర్పింది. సీడీల‌కు, టీవీ సీరియల్స్‌కు రీవైన్డింగ్ ఆప్షన్‌ ఉంటుంది కాని జీవితాల‌కు రీవైన్డింగ్స్ అస్స‌లుండవు. దాటిపోయిన మధుర క్షణాల‌కు రిగ్రెట్టింగే మనకు మిగిలే ఏకైక ఆప్షన్‌ అనిపించి ఎప్పుడో చదివిన చిన్నకథ గుర్తొచ్చింది. ఒక పసివాడు రోజూ వాళ్ళ నాన్నను ఉప్పెక్కించుకో (దొరలైతే Piggyback అంటారు గామోసు) అని మారం చేస్తుంటే వాళ్ళ నాన్న ‘నాకు టైమ్‌ లేదురా తరువాత తరువాత’ అని వాడి సరదా తీర్చనేలేదు. ఆగని కాలం దొర్లి కొడుక్కి 20 తండ్రికి 50 దాటిపోయాయి. పాపం ఆ తండ్రి (నాలాగే 60కి బుద్దొచ్చిన బ్యాచ్‌) పిల్ల‌వాడి చిన్నతనపు కోరిక గుర్తుచేసుకుని వాడి సరదా అప్పుడు తీర్చలేదు, ఇప్పుడు తీర్చాల‌ని ఉన్నా తీర్చలేను అని చింతించాడట. ఆ తండ్రికి పశ్చాతాపం మిగిలింది కాని ఆనందం దక్కలేదు.

మన జీవనయానంలో ఎన్నో అందమైన మైలురాళ్ళుంటాయి. ఇటీవల‌ కేంద్ర ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన శ్రీమతి ప్రీతి సుడాన్‌ గారు (ఐ.ఎ.ఎస్‌) అమ్మమ్మ అవగానే ‘జీవితంలో అన్ని దశ‌లు ఆనందించి ఆస్వాదించదగినవే’ అని గతంలో నాతో అన్నమాట రేయమ్మతో గడిపిన క్షణాల్లో పదేపదే గుర్తుకొచ్చేది. ఇదంతా మీతో ముచ్చటించటం స్వానుభవంతో. ఎటొచ్చి అనుభవాల‌న్నీ బట్టతల‌ వాడికి దొరికిన దువ్వెనలే! మనకు అక్కరకురావు.

ఒకప్పుడు అనే మంచి కవితలో చంద్ర కన్నెగంటి

‘‘మేమూ  పిల్ల‌ల‌మే ఒకప్పుడు

మాకూ సమయం తెలియని కాలం ఉండేది

లోకం తెలియని నవ్వులు ఉండేవి

తడిసిన చెంపలు తుడిచే చేతులు ఉండేవి…. ’’

అన్నందుకైనా తడిచెంపలు తుడిచే చేతుల్ని కట్టేసుకోకండి. నా వెనక వస్తున్న వాళ్ళందరికీ కళింగపట్నం రేవులో మూడవ ప్రమాద హెచ్చరికే, మేరా నామ్‌ జోకర్‌ లో రాజ్‌కపూర్‌ గారి ‘‘ఏ భాయ్‌ జరదేఖ్ఖే చలో! ఆగే భీ నహీ పీఛే భీ! ’’ అన్న పాట. ప్రఖ్యాత తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్లు ‘‘జీవన వేగంలో దృశ్యాలు మసకబారి పోతాయి. నిదానించి నడిస్తే దృశ్యాల‌ స్పష్టత వస్తుంది’’. అందుకే నిదానించి దేవుడు మన ఆట ముగించేలోపే అన్ని ఆటలు ఆడేద్దాం. జీవితంలో ‘నో కండీషన్స్‌ అప్లై’ అన్న ఒక్క కండీషనే పెట్టుకుని షరతుల్లేని ప్రేమతో అవధుల్లేని ఆనందాన్ని అనుభూతుల్ని మూటగట్టుకుందాం.

7 Replies to “No Conditions Apply”

  1. Very Good Evening sir. Great feelings resulted reading the article. If we have enough love, we will be the happiest and most powerful person in the world. Our lives are complete, we have good memories and loved ones. Kids are terrific. Kids love gives you infinite feelings.

  2. పసిపిల్లాడికి పాల బువ్వ తినిపించి నట్లుగ మీరు ఈ ‘నో కండీషన్స్‌ అప్లై’ అన్నది అందించి నందులకు ముందుగా మీకు నా నమస్సుమాంజలిలు🙏.
    స్వానుభవంగా మీరు మాతో పంచుకునే విషయాలు
    వాస్తవానికి అంతర్లీనంగా హృదయాంతరాళాలను తాకే జీవిత సత్యాలు .
    తాతయ్యగ మనమరాలు చి।।రేయ తో గడపిన కాలంలో మీరు పొందిన ప్రేమనుభూతులను చదువుతుంటే, అవును కదా! తాతయ్యగా పొందే ప్రేమ అనిర్వచనీయం అనిపిస్తుంది.
    ప్రేమానురాగాల చిరునామా వెదకి జీవితానుభావాలను పొదవి జీవన సాఫల్యాన్ని నుడివి
    ‘ నో కండీషన్స్‌ అప్లై’ అనే జీవిత తారక మంత్రోపదేశం చేయడం హర్షనీయం.

  3. అన్నయ్యా ఎంత బాగా చెప్పారో grand-parenting గురించి. నేను నాన్నమ్మ అయ్యాక తెలుస్తూంది ఆ మధురిమ. నా మనవడే నా ప్రపంచం అని నేను, గుండెనిండ పొంగిపొరలే ప్రేమ తన్నుకు వస్తున్నా ఎక్కడ లేని గంభీరాన్ని పులుముకొని “వాడు వాడి అమ్మ, నాన్న ల పిల్లాడే “ అనే మా ఆయన మాటలకు నవ్వుకుంటాను, ఎందుకంటే నిద్ర లేచింది మొదలు పడుకునే దాకా వాడి ముద్దు ముచ్చటలే ఆయనకు.
    అందుకే అన్నారు కామోసు”అసలు కంటే వడ్డీ ముద్దని”.

  4. Greetings to harsha anna for the new innings. కొత్తగా పెట్టిన Musings category super. Deeni కోసం eager గా wait chesam. Your debut musing is a runaway hit👌. Pl do more on this category.
    Intlo అందరికీ chadivi vinipinchentha goppagaa undi ee musing.
    Meeku reyamma rupam lo unconditional happiness vachhindi. మేము kuda vethukutham ఏ rupam lo ekkada undo మా life lo . Dorakkapudu kadaa!😀

  5. చాలా బాగా చెప్పారు sir, మన పెద్దవాళ్ళు అందుకే అన్నారనుకుంటా అసలు కన్న వడ్డీ ముద్దు అని, మన పిల్లల దగ్గరకి వచ్చేప్పటికి లేని time, ఓపిక మనవళ్ల దగ్గరకి వచ్చేటప్పటికి వచ్చేస్తుంది. నిజమే షరతులు లేని ప్రేమతో అవధుల్లేని ఆనందాన్ని అనుభూతుల్ని మూటగట్టుకుందాం🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *