మన మెగాస్టార్ ‘‘మొక్కే కదా అని పీకి పారేస్తే పీక కోస్తా’’ అంటే ఏమో అనుకున్నా గానీ, మా ఇంగ్లీషు మాస్టారు కూడా చుక్కనో, కామానో లైట్ తీసుకుని అటో ఇటో జరిపితే పీక తెగుద్ది అని మాకు ఏనాడో వార్నింగిచ్చారు. అనగనగా ఒక రాజుగారు Hang him not, leave him అని ఆదేశాలిస్తే వాస్తు విద్వాన్గారు కామా నైరుతిలో ఉండాలని Hang him, not leave him అని కాస్త ముందుకు సర్ధడంతో సదరు జీవుడు జరిగిపోయాడట. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందో లేదో తెలియదుగానీ ఒక్క కామా జీవితాన్ని ముగించేస్తుందని ఇది విన్నాక నమ్మాల్సిందే.
రాతల్లోనే కాదు మాటల్లోనూ పంక్చువేషను ప్రమాదకరమే. అసలామాటకొస్తే fullstop కంటే pause, comma మరింత ప్రమాదం. మేము ఉద్యోగ పర్వంలో బదిలీల సీజన్లో ‘సుబ్బారావును ఏలూరు వేద్దామా?’ అని సలహా అడిగామనుకోండి బతకనేర్చిన సలహాదారు ‘‘సుబ్బారావునా సార్’’,… అని బుర్ర గోక్కుని, పాజ్ ఇచ్చి పెద్దగా నిట్టూర్చాడా సుబ్బారావుకు ఏలూరు పోస్టింగ్ గల్లంతే. పెళ్ళి సంబంధాల విషయాల్లోనూ ‘’రంగారావు గారి అమ్మాయి లతను మా వాడికి చూద్దామనుకుంటున్నాం అనగానే,’’ ‘‘రంగారావు గారి అమ్మాయినా?’’ అని నిట్టూర్చి ఇంకాస్త లౌక్యమాన్ అయితే ‘‘ఆ పిల్లని గురించి ఏదో విన్నాం, పాపం పుణ్యం మనకు తెలియదనుకోండి అవేవీ మనం పెద్దగా పట్టించుకోనక్కర్లేదులెండి’’, అనేసి సైలెన్ట్ అయితే ఆ పెళ్ళి కథ ముగింపు మీకు వేరే చెప్పనక్కర్లేదు. ఈ పాజ్ ఎంత మహత్తరమైనదో మార్క్ట్వ్కెన్ మహాశయుడు ఏనాడో ఇలా శెలవిచ్చాడు….
‘The right word may be effective but no word was ever as effective as a rightly timed pause’. .... see how pause can be a big cause of worry.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని సినీకవి అంటే ఆడవారి నిట్టూర్పులు మరింత గొప్పవని … ‘A woman can say more in a sigh than a man can say in a Sermon’ అని మరొకరు భాష్యం చెప్పారు.
ఆశ్చర్యార్థకాన్ని (Exclamation!) ఎప్పుడు ఎలా ప్రయోగించాలో అని ఎక్కడో చదివినగుర్తు. నోబెల్ పురస్కార గ్రహీత Ernest Hemingway తన ప్రఖ్యాత నవల Old Man and the Sea మొత్తంలో ఒకే ఒక్కచోట ఆశ్చర్యార్థకం వాడాడట. ఏ రచయితైనా వీటిని విరివిగా ప్రయోగిస్తే తను గుర్తింపు పొందాలని తపనపడే మనస్తత్వానికి ప్రతీక అని చెబుతారు. ఇటీవల అమెరికా ఎన్నికల ప్రచారంలో నిజంగానే (literally)వెంట్రుక వాసిలో తూటాను తప్పించుకుని ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఆయనకు సింపతి బాగా కలిసొచ్చి (మన కోడికత్తి, మిస్సైల్ గులకరాయిలు కాకుండా అక్కడ నిఝం తుపాకి, నిఝం బుల్లెట్ కావడం వల్లనేమో) విజయం సాధించారు. డొనాల్డ్ట్రంప్ దొరగారు ఒకానొక సందర్భంలో కేవలం రెండు పేజీల ఉపన్యాసంలో అక్షరాల యాభై మూడు ఆశ్చర్యార్థకాలని వాడారట. వారి బాటలోనే ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి’ అన్నట్లు నిలువలేక ఔరా ట్రంప్దొరా! అని ఒకటేస్తా.

తినేవారికి మాత్రమే
ప్రస్తుత రాజకీయాల్లో చక్రం తిప్పడం అన్నమాట కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అనే ప్రయోగంతో పాటు బాగా అరిగిపోయింది. గతంలో కేంద్రంలో చక్రం తిప్పే స్వామి మీద పంక్చువేషన్ జోకొకటి విరివిగా ప్రచారంలో ఉండేది. వారు ఏదైనా ఫైలు తమ వద్దకు రాగానే not approved అని నోట్ఫైలింగ్ ఇచ్చేవారట. ఆ ఫైలు వెనుకున్నవారు వారిని దర్శించి ‘we will pay our respects’ (పరిపాలనా పరిభాష) తగు మర్యాదలు గైకొన్న పిదప not approved కాస్తా వారి నేర్పుతో ‘e’ చేర్పుతో, note approved అయిపోయి చాలా ఫైళ్ళకు శుభం కార్డు పడేదట. ఇలా రాజకీయ నాయకులు ఎవరికందిన చక్రం వాళ్లెత్తుకుపోవడంతోనేమో మనకు ఈ ఎండాకాలం కుండలకూ కరువొచ్చింది. ఇలా చక్రాలు తిప్పిన కొందరు చక్రధారులు చివరకు చక్రబంధంలో పడి కటకటాల్లో చిక్కడం పెద్ద చక్రధారి విష్ణుమాయే. స్వామికి ఎంత ప్రేమ లేకపోతే కోట్లవిలువైన వజ్ర కిరీటం సమర్పించిన పరమభక్తుని ఎంతో ఆర్తితో తన జన్మస్థాన ప్రాప్తితో కటాక్షిస్తాడు చెప్పండి?
హైస్కూల్లో చదువుకునే రోజుల్లో మా ఇంగ్లీషు మాస్టరు గారి అమ్మాయి ప్రక్కింటి అబ్బాయితో నిష్క్రమిస్తూ వాళ్ళనాన్నకు ‘I am elopping with Rakesh’ అని ఉత్తరం రాసి పెట్టి మరీ సర్దుకుందట. ఆ ఉత్తరం చదివి మాస్టారు అమ్మాయి జంపైపోయిన విషాదంలోనూ, ‘ఈ పిల్లకి వందసార్లు చెప్పాను eloping లో ఒక్క ‘p’ యే ఉంటుందని (శంకరశాస్త్రి శారదా హిందోళంలో శుద్ధ రిషభం ఎలా వస్తుందన్నట్లు) ఉగ్రుడై మండి పడ్డారట. కాళిదాసు కవి మృచ్చకటికం నాటకంలో తన ఇంట్లో జరిగిన దొంగతనం మర్చిపోయి అద్భుతంగా గోడకు కన్నం వేసిన చోరుడి హస్తలాఘవానికి, చోరకళకి ఆ ఇంటి యజమాని మురిసిపోయాడట. శంకరాభరణంలో సంగీతం మాస్టారు దాసు బ్రో।చే।వా।రె॥వ।రు।రా! అని అక్షరాలను అపసవ్యంగా విరిచినట్లే, ఒకాయన Govt requested therapist to train the clients అని రాయబోయి Govt requested the rapist to train the clients అని రాసి ఉద్యోగం ఊడగొట్టుకున్నాడట. పంక్చువేషన్ సరిగ్గా లేకపోతే పెద్ద పెద్ద పంఛ్లే పడొచ్చు.
మన ఉచ్ఛారణలో సైతం ఒక్క అక్షరం మారినా మొత్తం కథే మారిపోతుంది. ఎప్పుడైనా బేకరికీ పోతే flum cake ఉందా అని అడిగే వారిని, రెస్టారెంట్లో France fry గాని silly chicken (బుర్ర తక్కువ కోళ్ళు మరింత రుచిగా ఉంటాయేమో) ఉందా అని అడిగేవాళ్ళను చూస్తుంటాం. ఫ్లమ్ కేకు అర్థం తెలిస్తే జీవితంలో మళ్ళీ ఆ కేకుని నోట్లో వేసుకోలేం. తమిళనాట చాలా హోటల్స్ మెనులో Aloo, Gopi fry అన్న ఐటమ్స్ చూసి ‘గోపి’ ని ఎలా ఫ్రై చేస్తారో చూద్దామని ఆర్డరిస్తే ‘గోబి’ ఫ్రై తెచ్చి పడేసి సస్పెన్స్‌కు తెరదించాడు. ‘క, చ, ట, త, ప’ లేని దేశం కావడం వల్లే ఈ అపార్థమని గ్రహించి పరుషంగా అనిపించినా సరళంగా ఉన్న గోపీని తిన్నా. పంక్చువేషన్ బాధలు ఏ భాషకైనా తప్పవేమో. మన తెలుగు కూడా దీనికేమీ మినహాయింపు కాదు. మా హైస్కూల్ రోజుల్లో ‘రామునితో కపివరుడిట్లనియె’ కాస్త స్వల్ప జరుగుబాటుతో రామునితోక పివరుడిట్లనియే అనడంతో వాలం తారుమారై విపరీతీతార్థం వచ్చేసిందన్న జోకు మీరూ వినే ఉంటారు.
జాన్గూటెన్బర్గ్ యుగంలో కంపోజర్స్ చేసే ముద్రారాక్షసాలతో జనం కంపోజర్ కోల్పోయేవారట. అప్పట్లో కంపోజర్ ఉద్యోగం పోగొట్టుకున్న ‘సుర’దాసుని ‘‘అంత తప్పేంచేసావయ్యా?’’ అంటే ‘‘ఒకసారి అప్పుతచ్చులు అని కంపోజ్ చేశాను. అలాగే మరొకసారి సంఘాన్ని ‘స్కాచి’ వడపోసిన ఘనుడు అని చేశాను. ఇవేం పెద్ద తప్పులో ఎంతకీ నాకర్థం కావడం లేదు సార్’’ అని గోలపెట్టాడు. మరొకసారి మధుబాబు రవీంద్రభారతిలో జరిగిన సంగీత కచ్చేరిని విశ్లేషిస్తూ విద్వాంసులు మద్యమావతి రాగాలాపన గొప్పగా చేసారనబోయి ‘మద్యమా అతిరాగం’ రక్తి కట్టించారని రాసేసి మత్తెకించారు. గతంలో మన రాష్ట్ర గవర్నర్ గారి పేరు తమిళసై అని పేపర్లలో చదివి చదివి తమిళసై, తెలుగు సై అని ఇన్ని రకాల ‘సై’ లుంటాయా? అని సందేహించి తమిళం బాగా తెలిసిన పెద్దలు చెల్లప్పగారిని అడిగా. వారు ఆమె పేరు తమిళసై కాదు నాయనా తమిళ ఇసై అని, ‘ఇసై’ అంటే పాటని అర్థం చెప్పి, ‘ఇ’ మింగేయడం వల్ల నీకు విషయం మింగుడుపడలేదని విశదపరిచారు.


కుడి ఎడమైతే యదార్థవాది మన్‌కీ బాత్
‘నభూతో’నభవిష్యతి వొత్తులేకుండా చదివిన మన దర్శకేంద్రులు బూతులేనిదే భవిష్యత్తు లేదని అపార్థసారధై పాండురంగ మహత్మ్యం రీమేక్‌లో శృంగారాన్ని భారీగా వొలికించి భక్త పుండరీకునితోపాటు ప్రేక్షకుల్ని భక్తి, రక్తులలో ముంచెత్తారు.
వేమన శతక పద్యానికీ పంక్చువేషన్ పంఛ్ పడింది. ‘అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు ఎడతెగకపారుఏరున్ అని వేమన్నగారు అంటే, అప్పిచ్చువాడు తరువాత కొందరు కామా లేపేసి, ‘అప్పిచ్చువాడు వైద్యుడు’ అనేస్తారు. వాస్తవానికి మనందరి స్వానుభవం అప్పు ఇచ్చువాడు వైద్యుడుకాదు మనతో అప్పులు విరివిగా చేయించువాడు కార్పోరేట్ వైద్యుడు అని కదా. ఇటీవల మా ఇంట్లో పూజకు సిటీలో యంగ్ పంతులుగార్ని పిలిచాం. వారు స్పష్టమైన ఉచ్ఛారణతో మమ్ము మెప్పించాలని ‘శుక్లాంభరధరం శశివర్ణం ఛతుర్భుజం, ప్రసన్నవధనం’, అని అవసరం లేని వొత్తులతో మాకు లేనిపోని ఒత్తిడి కలిగించారు. ఎన్ని వత్తులిస్తే అంత గొప్పగా, గాఠిగా మంత్రం చదివినట్లని వారి భావనేమో లక్షవత్తుల పూజ స్ఫూర్తి పొంది.
అందరికంటే గొప్పగా ఉండాలని కొత్తగా హోటల్ పెట్టిన మిత్రుడు ‘ఎ వరస్ట్’ హోటల్ అని బోర్డు రాయించి ఎన్ని రోజులైన ఈగలు తోలడం వెనుక కారణం అంతుచిక్కక విచారిస్తుంటే, దారిన పోయే పుణ్యాత్ముడు ‘ఎవరెస్ట్’ హోటల్ అని బోర్డు సవరించడంతో కష్టమర్స్ తాకిడి పెరిగిందట.

కొన్నేళ్ళ క్రితం కోణార్క్‌లోని సూర్యదేవాలయాన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ పార్కింగ్‌లో ఉన్న కాలేజి టూర్ బస్ బ్యానర్ మీద “College girls exposure tour” అన్న మాటలు చదివి అవాక్కయ్యా. ఆ బ్యానర్ చూసి బస్సు దగ్గర జనం బాగానే గుమిగూడారు. కొంతసేపటికి అది పదప్రయోగ దోషం అని గ్రహించి అందరూ నిరాసతో వెనుదిరిగారు.
ఇలాంటిదే ఎలక్షన్ల ప్రచారకాలంలో ‘మధ్య తరగతికి ఆసరా’అని మరొక ప్రకటన చదివా. ఎలక్షన్స్ అయిన వెంటనే ‘మద్యతరగతికి ఆసరా’అన్న ప్రకటన చదివి సందర్భోచితంగా రెండూ కరక్టే కదా అని అడ్జెస్టయ్యా.

ఎలక్షన్ల ము(మ)0దుమాట
కొన్నేళ్ళ క్రితం మాకు తెలుగు పండితులు ముఖ్యమంత్రిగారు ఉండేవారు. ఒక తెలుగు సంవత్సరాది ఉత్సవ సభలో వారు ప్రసంగిస్తూ ‘‘గత రెండేళ్ళలో పేదల అభివృద్ధికి వంద కోట్లు వ్యాయామం చేశాం’’ అన్నారు. మేము వారి కవి హృదయం గ్రహించి ‘‘వ్యయం’’ గా వ్యవహరించేసుకున్నాం. మా ప్రక్కింటి అబ్బాయికి కోవిడ్ తరువాత ఆయాసం రావడంతో వాళ్ళ నాన్న అతగాడిని కొన్ని రోజులు సాయంత్రం పార్కులో నడిచి కాసేపు ప్రాణాయామం చేసుకుని రమ్మన్నాడు. పితృవాక్య పరిపాలకుడైన అభిరామ్‌కు అది ఎలా వినపడిందో రోజూ పార్కులో పొదల మాటున ప్రణయామం సాధన చేసి చేసి కొన్నాళ్ళకు ప్రణవితో పెళ్ళికి సిద్ధమై వచ్చాడు.
ఏమి రాసినా, ఏమి మాట్లాడినా జాగ్రత్తగా ఉండాలి అనేనేమో ఆంగ్ల రచయిత ఫ్రాన్సిస్ బేకన్ “Speech is silver, silence is gold” అని హెచ్చరించాడు. ఎన్నో సంవత్సరాలపాటు మౌనదీక్ష వహించిన అవతార్ మెహర్ బాబాగారు ‘‘జీవితంలో నిజమైనవన్నీ మౌనంలోనే ఇవ్వబడతాయి, స్వీకరింపబడతాయనే’’ చెప్పారు.


భగవాన్ రమణ మహర్షి సైతం దక్షిణామూర్తిలా తమ భక్తులకు మౌనబోధే చేసేవారట. అందుకే ఇంతటితో ఫుల్స్టాప్ పెట్టేస్తున్నా.

Excellent and hilarious I enjoyed every bit of this.
లేఖ రాసి వెళ్లిపోయిన వాళ్ళ కూతురు గురించి గాక ఆమె రాసిన మాటలో తప్పులు వెదికే ఇంగ్లీష్ మాస్టారి ఉదంతం భలే ఉంది. వేమన పద్యం లో తాత్పర్యం తెచ్చిన తంటా కూడా రసవత్తరంగా ఉంది. ఎన్ని విషయాలను ఉటంకించారు!!!
సార్,
మీ రచనలన్నీ పాఠకుణ్ణి ఏక బిగిన
చదివిస్తాయి.
చిత్రమేమిటంటే, ఏ రచన కూడా
ఎంత వ్యంగ్యం, ధ్వని ఉన్నా
ఇబ్బందికరంగా ఉండదు
రీడబిలిటీ మీ రచనల్లో పుష్కలంగా ఉంటుంది.
సార్,
మీ రచనలన్నీ ఏక బిగిన చదివిస్తాయి.
చిత్రమేమిటంటే, ఏ రచన కూడా
ఎవరినీ నొప్పించదు. పైగా
చదివినంత సేపూ చిన్నగా
నవ్వుకుంటూనే ఉంటాం.
సిల్లీ చికెన్. ఫ్లమ్ కేకూ, గోపీఫ్రై లు ఇంత రుచిగా చేసి వడ్డించడం మీకే సాధ్యం.
రాయడం రాక సరైన సబ్జెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నా అనుకొనే నాలాంటి వారికి పచ్చగడ్డి తో నైనా రుచిగా పచ్చడి చేసి మరీ లేటవకుండా టైముకు కాస్తంత వినోదం (అదీ ఫ్రీగా) పంచే మీరు
మంచి స్పూర్తి!
Superb presentation of importance of punctuation in a sentence with humourous examples as usual. I really enjoyed reading Harsha Garu👏
Interesting write-up/post indeed !
మీ లోకజ్ఞత మెచ్చదగింది. సందర్భోచితంగా పద ప్రయోగాలు, పద విరుపులు చక్కగా వివరించారు. ఒక పత్రకలో మహిళా కళాశాల విద్యార్థినుల మౌన ప్రదర్శన లో మౌన కి బదులు మాన అని పడింది. తర్వాత విషయం చెప్పనక్కర్లేదు కదా!