ఇప్పుడు జిల్లాగా రూపుదిద్దుకోబోతున్న నర్సాపురంలో ముప్పైయి ఐదేళ్ళ క్రితం పనిచేస్తుండగా మిత్రులు రావూరి రంగారావు గారి ద్వారా జి.ఎ.రాజ్‌కుమార్ (ఐ.ఎ.ఎస్. 1978) గారి పరిచయభాగ్యం కలిగింది. అప్పటికి వారు నీలగిరీస్ (ఊటి) కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. వారి ఆహ్వానం మేరకు ఊటి చూడడానికి వెళ్ళినప్పటి నుండి నేటికీ వారితో సాన్నిహిత్యం కొనసాగుతోంది. రాజ్‌కుమార్ గారు గొప్ప స్నేహపాత్రులు, పరోపకారులు.
“రాజు తలుచుకుంటె దెబ్బలకు కొదువా, కలెక్టర్ తలుచుకుంటే మర్యాదలకు కొదువా” అన్నట్లు మేము ఊటిలో ఉన్న నాలుగు రోజులు మాకు ‘రాజ’ మర్యాదలే జరిగాయి. మేము అక్కడ ఉండటానికి ఊటి లేక్ ఎదురుగా గెస్ట్‌హౌస్, తిరగడానికి కారు. మాకు లోకల్ గైడ్‌ను కూడా ఏర్పాటు చేశారు. మొదటిసారి కలెక్టర్ బంగళాలో వారిని కలిసినప్పుడే వారి సంస్కారం, సింప్లిసిటీ అలరించాయి. మా బాగోగులు చూసుకోవటానికి ప్రతిరోజూ ప్రొద్దునే ఒకరిని వారు మా గెస్ట్‌హౌస్‌కు పంపేవారు. మా అబ్బాయి సందీప్ (రెండేళ్ళ పిల్లవాడుగా ఉండటంతో) వాడికి పాలు ఒకరోజున ఆలస్యంగా వచ్చినందుకు ఈ రోజుకూ వారిని కలిసినప్పుడల్లా ‘‘మీ చంటోడికి పాలు కూడా ఇవ్వలేకపోయానయ్యా,’’ అని గుర్తు చేసుకునే సున్నిత మనస్కులు రాజ్‌కుమార్‌గారు.
కలెక్టర్ రాజ్‌కుమార్ గారితో కలెక్టర్ బంగళా – నీలగిరీస్
మేము ఊటినుండి వచ్చిన కొద్దిరోజులకే వారిని ఊటినుండి హఠాత్తుగా బదిలీ చేసారు. వారు కలెక్టర్‌గా చేరిన కొద్దినెలలకే Frontline పత్రిక వారి పనితీరును ప్రశంసిస్తూ మంచి వ్యాసం ప్రచురించింది. అతిసామాన్య కుటుంబంలో జన్మించిన రాజ్‌కుమార్‌గారికి పేదప్రజల కన్నీటితడి తెలుసు. వారి జీవితాల్లోని కష్టాలు తెలుసు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందేలా చూడడమే ఆయన ప్రధాన లక్ష్యం. కలెక్టర్‌గా వారి సేవల గురించి Frontline పత్రిక ప్రముఖంగా గుర్తించి ….
“The New Collector moved like whirlwind. He toured the poorest, most backward areas of the region, often from morning to midnight, walking miles to reach remote tribal villages where no government representative had ever set foot before. Within months Raj Kumar had become a legend in the district” అని కొనియాడింది.
నీలగిరి జిల్లాలో కోటగిరి, గూడలూర్, కూనూర్ ప్రాంత ఆదివాసీల కష్టాలు సానుభూతితో విని వారికి బ్యాంక్ లోన్స్ మంజూరు చేయించి రేషన్ కార్డులు అందజేయడంలో కలెక్టర్‌గా ఆయన కృషి అద్వితీయం. దురాక్రమణకు లోనైన ఆదివాసుల భూములన్నింటినీ రాజ్‌కుమార్‌గారు సర్వే చేయించి వారి భూములు వారికి రీఅసైన్ చేసేసారు. అక్రమ కలప రవాణా కాంట్రాక్టర్లను కట్టడి చేసారు. అయితే వారి సేవలు అక్కడి ప్రజలకు ఎక్కువకాలం కొనసాగలేదు. ప్రజాపక్షాన నిలిచిన కలెక్టలందరికీ లభించే Tranfer on administrative grounds సాకుపై రాజ్‌కుమార్‌గారికి మరికొద్ది నెలలకే అక్కడినుండి బదిలీ అయ్యింది. వారి ఆకస్మిక బదిలీ వార్త అక్కడి పేదవాళ్ళను, ఆదివాసుల్ని కలచివేసింది. కొన్నివేలమంది ప్రజలు కలెక్టర్ బంగళాను ఆఫీసును ముట్టడించి బదిలీకి వ్యతిరేకంగా ఆందోళనలు రాస్తారోకోలు చేశారు. వేల టెలిగ్రామ్స్‌తో ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు.
ప్రజలకు మద్దతుగా అక్కడి లాయర్లు కోర్టులు బహిష్కరిస్తే, స్థానిక విద్యాసంస్థలు అక్రమ బదిలీకి నిరసనగా మూసేశారు. ధర్నాలు ఉధృతై ప్రజలు రోదిస్తూ, ‘ఈ కలెక్టర్ వచ్చిన తరువాతే తమ బిడ్డలకు పట్టెడన్నం దొరికిందని, ఇల్లులేని వాళ్ళకు ఇళ్ళు చేకూరాయని, ఆదివాసుల భూములు ఆదివాసులకు దక్కాయని’ వాపోయారు. ఈ నిరసనలను గురించి తెలియజేస్తూ Frontline పత్రికలో Cry for a Collector అని వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించింది.
కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకారుల ధర్నా
ప్రభుత్వ ఉత్తర్వులకు లోనై ఈ ఇబ్బందికర పరిస్థితులను నివారించడానికి రాజ్‌కుమార్‌గారు ఊటి నుండి వెళ్ళిపోయారు. వారి వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించాలనుకున్న ప్రజలకు ఈ విషయం తెలిసి కలెక్టర్ బంగళాకు వెళ్ళి వారి శ్రీమతి శారదగారిని వారి తరపున ఆ సభకు తీసుకువెళ్ళారు. ఈ సందర్భంగా Front line పత్రిక …..
“Sharada spoke briefly assuring the people that the new collector would continue the work Raj Kumar had began. She then spent over an hour accepting at over 500 garlands on behalf of her husband”.
ఇదంతా జరిగి మూడు దశాబ్ధాలు గడిచిపోయినా ఇప్పటికీ నీలగిరి ప్రాంత గిరిజనులు రాజ్‌కుమార్ గారిని మర్చిపోలేదు. ఎంతో Neutral గా Objective గా ఉండే Frontline పత్రిక రాజ్‌కుమార్ గారి, సేవానిరతిని గుర్తిస్తూ వార్త వ్రాయడం వారి ప్రతిభకు నిదర్శనం. పైగా అది paid up news items లేని కాలం, వారిది అలాంటివి ఉంటాయి కూడా అని తెలియనితనం.
మేము ఎప్పుడు తమిళనాడు వెళ్ళినా వారిని కలుస్తూ, వారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన మమ్ము కలుస్తుండటంతో, వారితో సాన్నిహిత్యం పెరిగి వారి వ్యక్తిత్వం మరింత దగ్గరగా తెలుసుకునే అవకాశం దొరికింది. వారితో జరిగిన కొన్ని అనుభవాలు మరువలేనివి. మేము చెన్నైలో ఎప్పుడు వారింటికి వెళ్ళినా వారే స్వయంగా మాకు వడ్డన చేసేవారు. ఒకసారి వారు స్పెషల్ ఛీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు మా మిత్రుడికి చెన్నై సెక్రటేరియేట్‌లో ఏదో పని పడిరది. రాజ్‌కుమార్‌గారిని అడిగితే మీరు సెక్రటేరియేట్‌లోనికి రావడానికి పాస్‌లు అవసరం కనుక ఉదయాన్నే మా ఇంటికి బ్రేక్‌ఫాస్ట్‌కు వచ్చేయండి నా కార్‌లో వెళ్ళిపోదాం అని అనడంతో వారింటికి వెళ్ళాం. ఉదయం సెక్రటేరియట్‌కు బయలుదేరేందుకు మేము ఇద్దరం ఉండటంతో కారులో ఒకరు ముందు కూర్చుంటాం అని అంటే రాజ్‌కుమార్ గారు ససేమిరా అని వారు ముందు సీట్లో డ్రైవర్ ప్రక్కన కూర్చుని మమ్ముల్ని వెనకకూర్చో బెట్టుకుని తీసుకెళ్ళారు. స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నా నిరాడంబరంగా ఉండటం వారికే చెల్లు. మరొక సందర్భంలో రాజ్‌కుమార్‌గారు మా తమ్ముడి కుమార్తె సుమేధ పెళ్ళికి వచ్చారు. విందు ముగించుకుని వెళుతున్న వారిని సాగనంపడానికి కలిసి నడుస్తుంటే వారు ‘‘పులిహార బాగుందయ్యా, ఐదారుగురికి సరిపడేలా కొద్దిగా ప్యాక్ చేసి ఇవ్వగలవా?’’ అని అడిగారు. వారు అడిగినట్లు ప్యాక్ చేయించి ఇస్తే, ‘మా అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌కి నలుగురు పిల్లలు. వారు ఇది తిని సంతోషిస్తారని’, ప్యాక్ తీసుకుని వెళ్ళారు. ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న సాటి వారికోసం స్థాయి మరచివారు చేసిన ఈ పని నాకెంతో సంతృప్తినిచ్చింది. ఎదిగే కొద్ది ఒదగడం వారి నైజం.
రాజ్‌కుమార్‌గారి తండ్రి గారైన గంటా అరుణ్‌కుమార్‌గారు కూడా ఆ రోజుల్లో బి.ఎ. చదివి దళితుల, బీదల పక్షాన పోరాడారు. ప్రజల హృదయాలలో చెరగని స్థానాన్ని పదిలపర్చుకున్న అరుణకుమార్‌గారి విగ్రహాన్ని వారి స్వగ్రామమైన మేడపాడు (ప॥గో॥జిల్లా) లో ఏర్పాటు చేయడం వారి సేవకు గుర్తింపు. రాజ్‌కుమార్ గారు సేవానిరతిలో వారి తండ్రికి పుత్రోత్సాహం కలిగించారు.
కలెక్టర్‌గానే కాక ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్‌గా, శ్రీలంకశరణార్థుల పునరావాస కమీషనర్‌గా మరెన్నో ఉన్నత పదవులనలంకరించిన రాజ్‌కుమార్‌గారు ఎక్కడ పని చేసినా తనదైన ముద్రను విడిచి పేదల పక్షపాతిగా నిలిచారు. అందరికీ అందుబాటులో ఉంటూ అందరివాడనిపించుకున్న ఘనత వారిదే.
ఇటీవల డెల్టా, ఒమిక్రాన్ వైరస్‌ల మధ్య షార్ట్ బ్రేక్‌లో మిత్రులతో కలిసి తిరువణ్ణామలై రమణాశ్రమం వెళ్ళాం. మేము వెళుతున్నామని రాజ్‌కుమార్‌గారు వారి శ్రీమతి గారితో కలిసి తిరువణ్ణామలై వచ్చి మాతో ఉండి మాకు మంచి బస ఏర్పాటు చేసి అరుణాచలేశ్వరుని దర్శనం అద్భుతంగా చేయించారు. అక్కడ మాతో ఉన్న రెండు రోజుల్లో మేము ఎదురుపడినప్పుడల్లా ఫక్తు గోదావరి జిల్లాల సంప్రదాయంతో మీరు భోజనం చేసారా అని నాలుగుసార్లు మనడ్రైవర్లు కూడా భోజనం చేసారా అని ఎనిమిదిసార్లు అడగడమే కాక ఒకరోజు మేము ఉంటున్న హోటల్లో వారే దగ్గరుండి డ్రైవర్లకు భోజనం పెట్టించారు. “A Great man shows his greatness the way he treats a small man”, అని ఎవరో అన్నమాట వీరికి సరిగ్గా సరిపోతుంది.
అరుణాచలేశ్వర సన్నిధిలో రాజ్‌కుమార్‌గారితో
గత ముప్పై ఏళ్ళుగా మేము ఎప్పుడు మద్రాసు, రమణాశ్రమం వెళ్ళినా వారే మాకు ఆపద్భాంధవులు. మద్రాసులో ఉన్న తెలుగు వారందరికీ వారు ఆపన్న రక్షకులు కావడంతో వారి పదవీ విరమణ సభను చెన్నై తెలుగు అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. రాజ్‌కుమార్ గారి అబ్బాయి, అమ్మాయి ఉన్నత చదువులు చదువుకుని బాగా స్థిరపడటం సంతోషదాయకం. పుస్తకాలు బాగా చదివే అలవాటున్న రాజ్‌కుమార్‌గారికి ప్రపంచమంతా మిత్ర సంపదే. ఇంతమంది ప్రేమాభిమానాలను చూరగొన్న రాజ్‌కుమార్‌గారు ధన్యులు. వారి సాహచర్యం లభించిన మేము మరింత ధన్యులం. నేటి ఐ.ఎ.ఎస్ ఆఫీసర్లకు వారు స్ఫూర్తి ప్రదాతలు
(Being grateful is greatful and graceful అని నేర్పిన ఆత్మీయులు రాజ్‌కుమార్ గారికి నమస్సులతో)
Sir,
My comment …
I fully agree with Sripadagaru.
గొప్ప వ్యక్తిత్వం, దయాగుణం ఉన్న వ్యక్తులు అందునా అధికారులు చాలా అరుదుగా ఉంటారు, మీ అనుభవంలో ఒకరి గురించి చెప్పేరు, ధన్యవాదాలు, నా అనుభవంలో అయితే మీరే అటువంటి వారు🙏
💐💐👏👏👌👌👌👏👏💐💐
People believe the system only because of such noble administrators who work with empathy. Raj Kumar Sir’s journey is truly inspiring. The was you have recalled the memories and presented here is worth reading and sharing.
స్నేహమేరా జీవితం
స్నేహమేరా శాశ్వతం
అన్నాడొక మహాకవి.
ఆ కవి భావనతో మూర్తీభవించిన
తమరి యెక్క వ్యక్తిత్వపరిమళం అక్షరాల రూపంలో మాకందించారు.
స్నేహ స్పూర్తిని పెంపొందిచుటలొ మీకు మీరే సాటి.
ధన్యోస్మి. 🙏🏻
రాజకుమార్ గారు లాంటి మిత్రులు ఉండటం మీ అదృష్టం.
మీలాంటి స్నేహశీలి పరిచయ భాగ్యం కలగటం మా అదృష్టం.
ఇటివల సిద్దిపేట కలెక్టర్ రైతులను, విత్తనాల షాపుల వారిని బూతులు తిట్టి, పనిలో పనిగా కోర్టులను కూడ తిట్టేసి, యం యల్ సి అయ్యాడు.
రాజ్ కుమార్ గారి గురించి నీవు రాసింది, ఈ సిద్ది పేట మాజీ కలెక్టర్ కు పంపించు హర్షా.
నీలగిరుల్లో రాజకుమారులు మకుటం తొ మీరు వెదజల్లిన స్నేహ సౌరభాలు చాలా బాగున్నాయి. సహృదయులైన మీకు మంచి మనసున్న వారు తారస పడితే ఆ స్నేహం కలకాలం నిలిచి సౌరభాలు వెదజల్లుతాయి.
మీ పరిచయ భాగ్యం కలగడం మా అదృష్టం. మీ కధా కధనవ్యాసంగం మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇలాగే కొనసాగించండి 🙏
ఎందరో మహానుభావులు, అందరికి వందనాలు. 🙏
రాజకుమారు గారి లాంటి కారణజన్ములని పరిచయం
చేసినందుకు ధన్యవాదములు.
స్నేహశీలులైన హర్షవర్ధన్ గారికి అలాంటి వారే పరిచయం అవుతారు. 35 సం నుండి స్నేహాన్ని కొనసాగిస్తూ అప్పటి విషయాలను గుర్తు పెట్టుకొని ఇప్పుడు అందరితో పంచుకోవడం చాలా బాగుంది.
హర్షవర్ధన్ కు ప్రేమాసిస్సులు.
ఆదర్శప్రాయంగా మనుగడ కోసమే జనించిన మహానుభావుల జీవిత విశేషాలను హర్శ్వనంలో పొందుపరచటం అభినందనీయము. హాస్యము లేని ఆదర్శప్రాయతను తెలుపుతున్న మీ రచన హర్శవనం లో ప్రత్యేకమైనది. మరెన్నో ప్రత్యేకమైన రచనలను కోరుకుంటున్న ,మీ
గంజాయివనంలో తులసిమొక్కలూ ,పంకంలో పద్మాలూ,కార్బన్ కాలుష్యం లాంటి మానవకూపంలో ఆక్సిజన్ ను వెదజల్లే మహానుభావులు. అటువంటి వారి వలనే భూమి క్రుంగిపోకుండా చైతన్యంగా వుంది. శతాధిక వందనాలు వారికి!
సర్! మీ అమ్ముల పొదలో ఉన్న మరొక బ్రహ్మాస్త్రం శ్రీ రాజ్ కుమార్ గారు. ఎప్పుడో 30 ఏళ్ళక్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడే జరిగినట్టుగా మీరు హృదయంలో పదిలపర్చుకోవడంతో తెలుస్తోంది వారి వ్యక్తిత్వం మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకుందో ! మంచి వ్యక్తిత్వసౌరభాన్ని ఆస్వాదించడంలో మీకు మీరే సాటి🙏🏼🙏🏼🙏🏼——చలం
🙏🙏🙏🙏🙏
అభిమానం ఆప్యాయతలు కలబోసిన మానవత్వంకల మనసులు ఇలా ప్రపంచమంత పరిమళించడం అలాంటి పుణ్యమూర్తులతో పరిచయం అదృష్టం.
Every officer should remember that we are human beings first before being an officer. Even a small act of kindness and compassion always helps others in unknown ways..Nice to know about such a person..
Your association with him ….. Ofcourse birds of same feathers flock together…🙏🙏
Great sir,very informative and guide too
ఇటువంటి సహృదయులయిన అధికారులవల్లే ప్రజల జీవితాలు సుఖమయమౌతాయి.
Wonderful and Great personality। “When you do something for others, it is important to do it without expecting any reward and to forget what you have done”.
మిత్రసంపదను సమాదరించడంలో మీ బాణీ ప్రత్యేకం. ఒకసారి పరిచయం అయితే వారు మీకు అభిమాన బందీలు అయిపోతారు. అవతలి వారి సంస్కారం తోబాటు మీ సంస్కారం పేర్కొనాలి. అభినందనలు.
రాజకుమారుడు…. రాజ్ కుమార్.చెన్నైలో పని చేసిన పదేళ్ళలో ఒక పదిసార్లు వారిని చూసి ఉంటాను. పది రోజుల క్రితమే వారితో మాట్లాడాను.మీ హర్షవనంలో స్నేహ పరిమళాలు పూయించారు, rajkumar గారి ఊటీ లాంటి చల్లని మనస్సుని మాకు పరిచయం చేస్తూ….
To remember and maintain good friendship is your greatness.