రాజమండ్రిలో పనిచేసే రోజుల్లో అనకొండలా మంద్రంగా సాగే ప్రభుత్వ జీపులో ఆఫీసుకు వెళ్తుంటే అద్దకం చేసే కంపెనీ వాళ్ళ గోడమీద …
‘We Dye for our Living’ అన్న బోర్డు చూశా! అప్పటికి పైలా పచ్చీసుల్లో ఉన్నాను అనలేను కాని కాస్త రంగీలా జోష్‌లో ఉన్న మాటైతే నిజం. కట్ చేస్తే యాభై పడిలో పడగానే పై మాటలే చిన్న సవరింపుతో … ఫాస్ట్ ఫార్వాడ్ అయి ‘We Dye for your liking & loving’ అన్న ట్రోలింగ్ మదిలో మొదలయ్యింది, కారణం లేకుండా కాదు.
తల నెరవడం మొదలవగానే Hell is other people అన్న ప్రఖ్యాత తత్త్వవేత్త జీన్‌పాల్ సార్థ్రే తత్త్వం అప్పట్లో నాకు వంటబట్టక ఉత్సాహంగా తలకు రంగేయడం షురూ చేశా. కొద్దిరోజులు డయ్యింగ్ బాగానే సాగినా అప్పుడప్పుడు పక్షానికోమారు డయ్యింగ్ కంటే dying మేలనిపించలేదు కాని ఈ బాధ కంటే బట్టతలొచ్చినా బాగుండేమో అనుకోని రోజులేదు. సబ్బురాసుకునే ఉపరితల వైశాల్యం (Surface area) పెరిగి నూనె రాసుకునే వైశాల్యం తగ్గడంతో పాటు నూనె కంటే సబ్బు చౌకేలే Cost benefit analysis అన్న తృప్తి మిగిలేదనుకున్నా కానీ పదిమందిలో మనల్ని గుర్తుపట్టడానికి ఆ బట్ట నెత్తాయనా? అని గుర్తింపు కార్డు రానందకు రంగేయడమే మెరుగు అని నన్ను నేను నిభాయించుకున్నా. బట్టతల మొదలై ఎకరాలు ఎకరాలు కోల్పోతున్న వారి వార ఫలాలు పరిశీలించగా కొంత ధనలాభం అన్న మాట (నూనె vs సబ్బు ఖర్చుల తేడా రీత్యా) బట్టతల వారందరికీ అది కామన్ ప్రిడిక్షనే అని నిర్ధారణయ్యింది.
వడ్లు దంచేవాడికే తెలుస్తుంది భుజాలనొప్పి అన్నట్లు క్రమం తప్పక రంగేసుకునే కామ్రేడ్స్కే తెలుస్తుంది ఆ బాధ ఎలాంటిదో, అది ఎంత తతంగమో, ఎంత శ్రమతో కూడుకున్నదో. సరైన డై దొరక్కపోయినా, అది మన వొంటికి పడకపోయినా రియాక్షన్‌తో ముఖాలే మాడిపోయి, మారిపోయిన దాఖలాల్లెనో. యాభై కూడా నిండని మా డెంటిస్ట్ మిత్రుడు డా.మధు తెలుపు నలుపులు సమానమైనా డయ్యింగ్ ‘ల్యాబ్’ తెరవకపోవడమేమిటని ఉండబట్టలేక ఆయన్నే అడిగా. ‘‘నా చిన్నప్పుడు మా ఊళ్ళో ఒకాయన తలకు రంగేస్తే అలర్జీ వచ్చి ముఖం చర్మం లేచిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు సార్. పాత ఫొటో, కొత్తఫొటో కలిపి ఆధార్‌కార్డ్ ప్రూఫ్ చూపితే కాని ఆయన్ను ఆనవాలు కట్టలేకపోయాం’’ అది చూసి రంగు కంటే ముఖం ముఖ్యం అని అప్పుడే ‘నోల్యాబ్’ అని నిర్ణయించుకున్నానని చెప్పాడు. మన టైమ్ బాగుండి అన్నీ బాగా కుదిరినా పాతరోజుల్లో ఫొటో స్టూడియోలో బ్లాక్ ఎండ్వైట్ ఫొటోలు, సెపియా కలర్, నెగటివ్‌లు కడగడం తీగకు ఆరబెట్టడం వంటి ప్రక్రియలన్నీ ఇంచుమించు కొద్ది తేడాతో మన హెయిర్ డయ్యింగ్స్లో కూడా భాగమే.
పైన చెప్పిన బాధలకోర్చి పట్టువదలని విక్రమార్కుడిలా రంగేసుకుంటున్న నన్ను ఒక చిన్న సంఘటన డిఫెన్స్‌లో పడేసింది. రిటైర్మెంట్కు ఎడాది ముందు (అదనపు రెండేళ్ళ చంద్రన్న తోఫాతో) ఇంకా దాచేమేముంది లెండి 59 నడుస్తుండగా వైజాగ్‌లో ఉద్యోగరీత్యా ఒక్కడినే ఉండాల్సి వచ్చింది. ఒకరోజు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వస్తూ చపాతీ కట్టించుకుందామని కాస్త రష్‌గా ఉండే టిఫిన్ సెంటర్ దగ్గర ఆగా. కౌంటర్లో టోకెన్ తీసుకుని ఫుడ్ పార్సిల్ తీసుకోవడానికి డెలివరీ కిటికీ దగ్గరకు పోతే జనం ఒకరి మీద ఒకరు పడి టోకెన్స్ చూపిస్తున్నారు. లోపల పార్శిల్స్ డెలివరీ ఇచ్చే కుర్రాడు నా ముందున్న వాళ్ళ మీదగా చేయి చాపి టోకెన్ చూపిస్తున్న నన్ను చూసి ‘‘ఆగండాగండి ముందు ఆ పెద్దాయన్ను పంపేద్దామని’’, నా టోకెన్ అందుకున్నాడు. మనం రంగేసినా పార్శిల్ వాడు రామపట్టాభిషేక పటంలో రాముడ్ని గుర్తించినంత సులువుగా నా పెద్దరికాన్ని ఇట్టే కనిపెట్టేశాడు.
టైటానిక్ సినిమా క్లైమాక్స్‌లో ఒక పక్క ఓడ ముగినిపోతుంటే జనం హాహాకారాలతో ప్రాణరక్షణ కోసం చిన్నచిన్న పడవల్లోకి దూకేస్తుంటే ఇవేవీ పట్టనట్లు టైటానిక్ మ్యూజిక్ బ్యాండ్ బృందం తాపీగా నిలువెత్తు గిటార్ వాయిస్తూ పాటలు పాడుతూనే ఉంటారు. ఆ ట్రూప్‌లో ఒకడు కాసేపు ఇదంతా గమనించి బ్యాండ్ మాస్టర్‌తో “Oh! Let us stop nobody is listening” అనడంతో బ్యాండ్ బజాయింపు ఆపేసి వాళ్ళూ జంపింగ్‌కు సిద్ధమవుతారు. అలాగే మన డైయింగ్ ఫేస్ మిస్ మ్యాచింగ్ జనం గ్రహించడం మొదలవగానే “Oh! Let us stop” అని రంగేయడం ఆపేసి మన మర్యాద కాపాడుకోవడం ఉత్తమం.
నా బాల్యమిత్రుడి కొడుకు ముప్పైఐదేళ్ళవాడు బాల నెరుపు ఉన్నా రంగేయకపోవడం నాకు మరొక ఝలక్. అడపాదడపా ‘అన్నా’ అనే సంబోధన కరువై అంకుల్ పిలుపులు అలవాటవడంతో ఇంకెందుకు ఈ శ్రమంతా అని ‘ల్యాబ్’ మూసేశాను. నెల్లూరు పెద్దారెడ్డితో మాట్లాడాల్సిందే అని పోలీస్‌స్టేషన్‌లో ఆగామాగం చేసిన బ్రహ్మీ అసలు రంగు బయటపడగానే కిమ్మనకుండా తనే లాక్ప్లోకి దూరిపోయి తలుపు గెడేసుకున్నట్లే నేనూ వెనకడుగేసా.
ఎంత తాత్త్వికత అలవరచుకున్నా రంగేసేవాళ్ళు మెజార్టీ కావడంతో కొంత పీర్ప్రెషర్కు లోనవ్వడం మనబోటి ఉప్పు, కారం తినే జీవులకు తప్పదు. భవసాగరం ఈదే వారికి To Dye or not to Dye అన్న హేమ్లెట్ ధర్మసంకటం వీడదు. కాకపోతే కళ్ళకింద క్యారీ బ్యాగులొచ్చినా, మనవరాళ్ళకు పెళ్ళిళ్ళైపోయి మనవలకు సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ రిలీజుల్తో, టీమ్ లీడర్ల నసతో గడ్డాలు నెరిసిన తరువాత కూడా తాతలు, అవ్వలు ‘‘ల్యాబ్’’ నిర్వహించడమే కాస్త ఇబ్బంది. తలకి రంగేసుకోవడమే పెద్ద తలనొప్పని కొందరనుకుంటే మరికొందరు అతని కంటే గొప్పోడు అచంట మల్లన్న అన్నట్లు గడ్డానికీ రంగేస్తున్నారు. నిరంతరం ప్రజాసేవలో తలమునకలుగా ఉన్న ‘ఉత్తమ’నాయకులు సైతం తలను తారులో ముంచితేలుస్తూ గడ్డానికీ తారు పూయడం వారి సహన శీలతకు గొప్ప గీటురాయి. వారి ఓపికకు జోహార్ అనాల్సిందే. సంసారులు, పబ్లిక్ఫిగర్స్, సెలబ్రిటీలు రంగేసుకోవడం కొంతలో కొంత న్యాయమే! దేహభ్రాంతి వీడండనే బోధస్వాములు తలకు, గడ్డానికీ ఠంచనుగా నలుపు పామేసుకోవడం చూస్తూ వారి ప్రవచనాలు వినడం కొంత ఇబ్బందే. నేను ఏ స్వామీజీనైనా కలిసే ముందు వారికి పెట్టే లిట్మస్ పరీక్ష తలకు రంగేస్తున్నారా అని. వేసారా, ఇక వారిని కలిసి నేర్చుకునేదేముంది అని సర్థుకోవడమే.
ఈ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళాం. సదరు పెళ్ళికొడుకు గారి తాతగారు ఎనభై పైబడ్డవారే. వారికి పైనుంచి పిలుపొస్తే పెద్దలాయర్నో, డాక్టర్నో పట్టుకుని తంటాలు పడి ఇంటరిమ్ స్టే తెచ్చుకుని వీల్ ఛెయిర్లో పెళ్ళికి మెల్లగా తోసుకొచ్చారు. అలాంటి పరిస్థితిలోనూ సాగర సంగమం సినిమాలో కమల్‌హాసన్ రక్తం ఎక్కించుకుంటూ మరీ శిష్యురాలికి డ్యాన్స్ నేర్పినట్లు తాతగారు ఆ పెళ్లిలో తలనీలాలను తుమ్మెద రెక్కల్లా ‘రంగు’రించారు. ఎనభైలు దాటిన అలనాటి మేటి తారలు, గాయనీమణులు తలలూగిపోతున్నా తగ్గేదేలే అని నలుపుకై నలిగి శ్రమపడుతున్నారు.
వీరిది ఒక తీరైతే మా వైజాగ్ డ్రైవర్ వెంకన్నది మరో తీరు. అయ్యప్ప మండల దీక్షల్లో గురుస్వామి క్యాడర్ ఏనాడో దాటేసి నడివయస్సులో తల నెరిసినా వెంకన్న రంగేయడం గత ముప్పై ఎళ్ళల్లో ఎన్నడూ మేము చూడలేదు. ఇటీవల వైజాగ్ వెళితే వెంకన్న పాత బి.ఎస్.ఎన్.ఎల్ వారి నల్లటెలిఫోన్ రంగు తలతో షాకిచ్చాడు. ‘ఏమిటి వెంకన్నా ఈ అకాల మార్పు?’ అని అడిగితే, ‘‘అయ్యా మా అల్లుడు అమర్నాథ్ యాత్రకు తీసుకెళ్తానన్నాడు. ఆ యాత్రకు వెళ్ళాలంటే మరీ ఓల్డ్ లుక్స్ ఉంటే పోనివ్వరట. తీర్థయాత్ర కోసమే ఈ బ్లాక్ మ్యాజిక్ తంటా’’ అని సిగ్గుపడుతూ ‘రంగు’ రహస్యం విప్పాడు. భగవంతుని కోసం, భక్తికోసం ఐసా రంగు దాల్నేతో మాఫ్ కర్ సక్తేనా!
రోజూ టీవీలో హెయిర్ డైల యాడ్స్ చూస్తుంటే శ్రీశ్రీ గారు రాసిన …
ఓ మహాత్మ ఓ మహర్షి
ఏది చీకటి ఏది వెలుతురు
ఏది నరకం ఏది స్వర్గం
ఏది తెలుపు ఏది నలుపు
నిన్న సత్యం నేటి స్వప్నం’’ … తో పాటు నిన్న Pepper నేటి Salt అని అదే ఫ్లోలో పాడుకుంటేనే గాని కలత చెందం.
తనికెళ్ళ భరణిగారు ఎంతో ఆర్తితో
ఆటగదరా శివా
ఆటగద కేశవా…
ఆటగదరా నలుపు
ఆట గదరా తెలుపు
‘నలుపు తెలుపుల గెలుపు ఆటనీకు
మిధ్యలో ఉంచి ఆడేవునన్ను’ అని శివయ్య నలుపు తెలుపు చక్కర్లో పడేసాడని వాపోయారు.
తల మీద పెప్పర్ శాతం తరిగి సాల్ట్ శాతం పెరుగుతూ పోతుంటే నోట్లో కెళ్ళే ఉప్పు శాతం క్రమంగా తగ్గించుకోమని పెట్రోలు రిజర్వ్‌లో పడిందన్న ఇండికేటర్లా మనకూ ఇదొక ఇండికేషనన్న మాట. Age gracefully అనేదే దాని ఆంతర్యం, తాత్పర్యం. షోలే సినిమాలో రెండు చేతులు పోగొట్టుకున్న పోలీస్ ఠాకూర్ సాబ్ పాత్ర అద్భుతంగా పోషించిన సంజీవ్‌కపూర్ పెప్పర్, సాల్ట్ స్ట్రీక్‌తో వయసుకు తగినట్లు హుందాతనం చూపాడు. ఇంత చెప్పినా గోలీలాడే పిల్లల్లా మా కాయ మా ఇష్టం అన్నట్లు మా ఓపిక మా ఇష్టం అంటారా ఆ పై మీ ఇష్టం.
05flen
బాగుంది సర్. రచనా వ్యాసంగం అలవాటు ఉన్నవారికి దేవుడు రకరకాల అనుభవాలు ఇస్తాడేమో. ఎందుకంటే వాళ్లు మిగిలినవారికి అర్థమయ్యేలా చెబుతారని.
ఈమధ్య సోషల్ మీడియాలో ప్రకృతి సహజమైన అంటే మన నువ్వుల నూనె, ఆముదం, ఇంకా మునగాకుపొడి? చార్కోల్ వంటి వాటితో సైడ్ఎఫెక్ట్స్ లేని నల్ల జుట్టు సాధ్యం అని ఊదరగొడుతున్నారు. వాటిలో నిజానిజాలు తెలుసుకోవడానికి సైతం మీరు ప్రయోగం చెయ్యాలని కోరితే మీకు కోపం వస్తుందేమో అని సంశయం. 😊
Rangela ante edo josh vunna topic anukunnam Sir. Atu etu tirigi ma meedaki vachindi. Fun angle of greying hair and baldness. Finishing line is my wife shows me to my children if u don’t oil your hair regualrly mee nanna la bald eipotaru ani…that’s the agony..🤣…an issue associated with many young people also these days..food habits stress etc..God save all of us..
రంగు పడింది😄 తల పండిన హాస్యానికి మీకు మీరే సాటి!
పెళ్ళం బాధ భరించలేక రంగేసుకొనేవాళ్ళు మీకు తగిలినట్టు లేరు!
ఇంకా నేను ధర్మ సంకటం లో పడలేదు. కానీ ఈ విషయం పంచుకోవడంలో ఇంత ఆనందం ఉందని ఇప్పుడే అర్థం అవుతుంది.
అన్నా
మంచి కధ చిన్న సబ్జెక్టు మీద బాగా ఇచ్చావు.. హాస్యం బాగుంది.. రంగు వేసుకోవడం ఒక వూభి లాంటిది. అది మనసుకు సంబంధిచింది. నా విషయం లో రంగు స్టార్ట్ చేయించింది బొంబాయి లో నా పైన వుండే చీఫ్ మేనేజర్. తెల్లటి జుట్టు తో నీవు ఇలా బ్యాంకు కు వస్తే ట్రాన్స్ఫర్ చేస్తాను అని కూడా చెప్పిన తర్వాత మొదలైయింది.. ఇంక ఆపడం కష్టం గా ఉంది. నా భార్య కు పిల్లలకు మాత్రం చెప్పాను. రంగు వయవద్దని. రంగు వేయడం ప్రారంభిస్తే మాములు కన్నా తొందరగా తెల్లాబడుతుంది.. ఒరిజినల్ గా తెల్ల బడితే వుండే గ్లామర్ ఉండదు. మా అబ్బాయి హర్ష ను ప్రస్తావించింనందుకు ధన్యవాదములు. ఇప్పటికి నేను రంగు మానేయగానే మిత్రులు, బంధువులు మామ నీ మొహం చూడ లేకపోతున్నాము అని మరలా మొదలు పెట్టిస్తున్నారు. ప్రజా గాయకుడు గద్దర్ కొన్ని రోజులు పూర్తి తెలుపు, కొన్ని రోజులు మహా నలుపు. ప్రస్తుతం నేను, నా వైఫ్ వెళ్తుంటే చాలా మంది మీ అమ్మగారిని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి అంటుంటారు. ఆవిడది ఒరిజినల్ వైట్, నాది డూప్లికేట్ బ్లాక్ కదా మరి.. మరొకసారి ధన్యవాదములు
మహాద్బుతం 😁👌🏻👌🏻👌🏻
WoW 🤩 Lovely Narration 😂🤣
ప్రస్తుత సమాజ లోని పోకడలను చక్కగా వర్ణిచారు.హాస్య భరితంగా.భావ గర్భితంగా.
అరే అన్నా రంగు వేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ( 30 సంవత్సరాలుగా) ఈ రోజు వరకు రంగు వేసుకొనే ప్రతి సారీ ఇంకా రంగు వేయ్యలో వద్దా అనేది తేల్చుకోలేక పోతున్నా ఇప్పుడు ఇది చదివిన తరవాత నా సందిగ్ధం మరీ ఎక్కువైంది. నన్ను ఏమి చెయ్యమంటావో జర చెప్పరాదే……
సర్ నమస్సులు.
గొప్ప సరదా అనిపించిందండి చదువుతుంటే.
సంతోషం సర్
దీన్ని మేము పట్టాభిషేకం అని పిలిచెవాళ్ళం. కిరీటంలాగా రంగు బోర్లించినట్లు ఉండి చెప్పలేని వింత వర్ణనతొ ఉంటారు జీవులు.
నాకు కొవిడ్ సమయంలొ. బ్యాంక్ కి వెళితె పక్కనున్న ప్రౌడ ముదుసలి మగువ , తాతగారు Senior citizens అటు అనడంతొ తెల్లపొవడం నావంతు అయ్యింది. అందులొ మరి అవమానం మా ఆవిడ కొంగుచాటు ముసిముసి నవ్వు. అక్కడితొ నేను పట్టాభిషేకానికి నెల నెల సిద్దం . 👍
సునిశిత హాస్యం మీద మీకు ఉన్న మక్కువ డై వంటి చిన్న విషయాన్ని కూడా ఒక కథావస్తువు చేసింది సార్! మీరు ఉదహరించిన కవులు నటులు రచనల వల్ల రంగు మరింత సోయగాన్ని సంతరించుకుంది . సాగరసంగమంలో కమలహాసన్ ముచ్చట్లు, అనగనగా ఒక రోజులో బ్రహ్మానందం పెద్దారెడ్డి ఇక్కట్లు వెంకన్న అమర్నాథ్ యాత్ర కోసం పడిన “ రంగు “ పాట్లు బహు పసందు గా విశదీకరించారు. శ్రీ శ్రీ లాంటి మహామేటి విప్లవ కవిని కూడా మీరు “రంగు” లో బంధించారు. అభినందనలు!👏💐———చలం
హమ్మయ్య నేనైతే మీ వైజాగ్ వెంకన్ననే తేడానల్లా తను భగవంతుణికైతే నేను నాభార్య పిల్లల ఆంక్షతో మా పెద్దమ్మాయి పెళ్ళిలోనే సుమీ 🥲
డై ప్రహసనాన్ని కడు రమ్యంగా చిత్రించారు. మీది సునిశిత పరిశీలన గనుకనే డై కూడా కథార్హమైంది. సాగరసంగమంలో కమలహాసన్ ముచ్చట్లు, అనగనగా ఒక రోజు లో బ్రహ్మానందం పెద్దారెడ్డి ఇక్కట్లు చక్కగా చమత్కరించారు!
ముక్తాయింపుగా వెంకన్న రంగు పాట్లు సెలవిచ్చారు. మీ హాస్య చతురతకు అభినందనలు 👏
నమస్కారాలతో——చలం
బాగుంది
నా జ్ఞాపకానికి వస్తుంది.
నేను బ్యాంక్‌లో క్యూలో కనిపించినప్పుడల్లా, కౌంటర్ ఇంచార్జి ఎప్పుడూ చెబుతుంటాడు
ఆ పెద్దాయనను ముందుకు పంపండి
ఒక రచయితకు ఏదో ఒక సబ్జెక్టు పైన రాయాలని ఆలోచన వస్తే, ఎంత వ్యూహాత్మకంగా ఒక ఆర్టికల్ రాయవచ్చు అనేది, ఈ ఆర్టికల్ చూసిన తర్వాత తెలిసింది. అత్యద్భుతం.
నీ ఆలోచనని ఎంతో అద్భుతంగా మలచి ఒక కావ్యం రాసావు. చాలా చాలా బాగుంది హర్ష .
సర్,
తెలుపు నలుపు చక్కర్ లో పడిన చాలామంది మీ అనుభవంతో తమ అనుభవాల్ని పో(త)ల్చు కుంటారు.
మీ హర్ష వనం లో నవ్వుకుంటూ మరోసారి తిరిగాను.
రంగు రించడం, నలుపుకై నలగటం ..వంటి పదప్రయోగం బాగుంది.