కొన్ని పర్యాటక కేంద్రాలు కొన్ని కొన్నింటికి ప్రసిద్ధి. శబరిమల మకరజ్యోతికి, తిరువణ్ణామలై కార్తీక పౌర్ణమికి, సింహాచలం చందనోత్సవానికి. అదే తీరులో గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్ ఎడారి ప్రాంతమే అయినా చలికాలంలో పౌర్ణమికి ప్రసిద్ధి. ఆప్తులు శ్రీనివాస్, ఉమల ప్రోత్సాహంతో మేము సైతం చంద్రునికో నూలుపోగన్నట్లు వెన్నెల్లో రాన్ చూడటానికి మరికొంత మంది మిత్రులతో కలిసి గత జనవరిలో వెళ్ళాము. రాన్ గొప్ప టూరిస్ట్ కేంద్రమే అయినా మన జక్కన్న గారి మగధీర భైరవుడి రథం ఇసుకలోకి దిగే సీన్ చూసినంకనే అక్కడికి యాత్రికుల రద్దీ పెరిగింది. వెనకటికి కర్ణాటకలోని కుక్కె సుబ్రహ్మణ్య స్వామి గుడికి సచిన్ వెళ్లొచ్చిన తరువాత రెండు రోజుల్లో ఆ గుడి వెబ్‌సైట్‌కు డెబ్బయి వేల హిట్స్ రికార్డ్ అయినట్లు, కడపలోని అమీన్ పీర్ దర్గాకు ఎ.ఆర్.రెహ్మాన్ విజిట్‌తో విజిటర్స్ పెరిగినట్లు, రాన్ ఆఫ్ కచ్‌కు రన్ ఆఫ్ టూరిస్ట్స్ తాకిడి పెరిగిపోయింది. మానవులు మాధవునికి సైతం రేటింగ్స్ పెంచడమే కుక్కే సచిన్ కథ.
మొత్తం పన్నెండు మంది బృందంతో రాజ్‌కోట ఎయిర్ పోర్ట్ నుండి ఐదుగంటల రోడ్డు ప్రయాణం తరువాత కచ్‌లోని టెన్ట్ సిటీ చేరాం. రాజ్‌కోట నుండి కచ్ వరకు హైవేకు రెండు వైపులా అడుగడుగునా టైల్స్, సిరమిక్ పరిశ్రమలే. హైవే మీద మైళ్ళకు మైళ్ళు హెవీ వెహికల్సే. పాపిన్స్ చాక్లెట్లలా ఇరవైకి తక్కువ కాని టైర్లతో అవి కాండ్లారేవుకు నిరంతరంగా సరుకులు మోసుకుపోతున్నాయి. హైవేపై ఒక చోట టీ తాగడానికి చిన్న షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఆగాము. అక్కడ ఒక షాపులో కొన్ని పుస్తకాలు అమ్ముతుంటే చూద్దామని వెళితే అక్కడున్న పుస్తకాల్లో money, rich, invest పదాలు లేని పుస్తకాలే లేవు. ఈ titles చూసిన తరువాత అంతకుముందు దాటి వచ్చిన పరిశ్రమల నేపథ్యం అర్థమై, అమెరికా అనుభవం గుర్తుకొచ్చింది. ఇరవై ఏళ్ళ క్రితం డిస్నీ ల్యాండ్‌కు వెళుతూ మొబిల్ అనే ఊళ్ళో ఒక రాత్రి చిన్న హోటల్లో బస చేశాం. అవి ఇంటర్నెట్ అంతగాలేని రోజులు. ఆ రాత్రి ఏమీ తోచక హోటల్ రూమ్‌లోని టెలిఫోన్ డైరెక్టరీ తిరగేస్తుంటే P అనే పేజీలో Ankit Patel, Rajesh Patel, Ravi Patel, Govind Patel అని నాలుగు పేజీల పైగా పటేల్స్ పేర్ల పటాలం కనబడటంతో నోరెళ్ళబెట్టా. హార్లిక్స్ యాడ్ పిల్లవాడు నేను హార్లిక్స్ తాగను, తింటాను అన్నట్లు మన గుజరాతీలు మేము ఉద్యోగాలు చెయ్యం, వ్యాపారాలు చేస్తాం ఉద్యోగాలిస్తాం అని తేల్చేశారు. ప్రస్తుతం అమెరికాలో చిన్నాపెద్దా అన్నీ ఊళ్లల్లో పటేల్ బ్రదర్స్ ఇండియన్ స్టోర్సే మన వాళ్లకు దిక్కు. గుజరాతీయులలో ఉద్యోగాలు చేసేవాళ్ళను బుర్ర తక్కువోళ్లు అని లోకువు కడతారు.
జనవరి నెల పౌర్ణమిరోజు రాత్రి 11 గంటలకు టెంన్ట్ సిటీ చేరి మా గుడారాల్లో సెటిల్ అయ్యాము. ఉదయం లేచి చూస్తే కురుక్షేత్ర యుద్ద శిబిరాల్లా ఎటు చూసినా టెంట్లే! మాలో పెద్దలు కృష్ణయ్య గారు విడిది చేసినది ద్రోణాచార్య శిబిరం అని, రెండు చేతుల్తో రెండు చరవాణులను అవలీలగా హేండిల్ చేసే మా శ్రీనువాసునిది సవ్యసాచి శిబిరం అని నామకరణం చేసుకున్నాం. ఆ రెండు శిబిరాల నడుమ మా ప్రమధ గణాల శిబిరాలు కొలువుదీరాయి.
ఆ రోజు రాత్రి తెల్లవారు ఝామున చలి గజగజలాడించడంతో మంచం మీద ఏ అంకేసినా మాకు నిద్ర మాత్రం రాలేదు. ‘మార్నింగ్ టీ, మార్నింగ్ టీ’, అన్న టీవాలా అరుపుతో లేచాం. ఎవరిమీదైనా కచ్చి ఉంటే మన ఖర్చులతో టూర్‌కు పంపి ప్రేమగా డిసెంబర్లో కఛ్ గుడారంలో తొంగోబెట్టి దుప్పటి దాచేస్తే ఖచ్చితంగా శాశ్వతంగా తొంగొని morning tea కాస్తా mourning tea అయ్యేది ఖాయం. ‘చలి ఇంతలా ఉందేటి బాబు,’ అని చాయ్ బాయ్‌ని అడిగితే మీరు ఇంకో పదిరోజులు ముందు వస్తే ఔర్ ‘బహుత్ బడియా’ అని చెప్పడంతో ఎప్పుడో విన్న మూగవాడి టైమ్ జోకు గుర్తొచ్చింది. వెనకటికి వాచీ పెట్టుకున్నవాడ్ని ఎదురుగా వస్తున్న తను వాచీవైపు చూపించి ‘టైమెంత?’, అని అడిగాడట. వాచీవాలా ఏమీ సమాధానం చెప్పకుండా అడిగిన వాడి కడుపులో చాచిపెట్టి ఒక్క గుద్దుగుద్దాడట. టైమడిగినాయన ప్రక్కనున్నతనితో టైమెంతంటే అంతలా గుద్దాడేటండీ?’’ అని అడిగితే, ‘‘వాడు మూగోడు సార్ టైం ఎన్ని గంటలైతే అన్ని గుద్దులు గుద్ది మరీ టైమ్ చెప్తాడు పాపం’’ అనగానే, ఇంకా నయం ఇంకో గంట ముందు అడిగాను కాదు అని సంబరపడ్డాడట.
మరుసరి ఉదయం నిద్రలేచి బ్రేక్‌ఫాస్ట్‌కు పడోసీల శిబిరాలు దాటుకుంటూ డైనింగ్‌హాల్ చేరాం. మా Evoke టెంన్ట్ రిసార్ట్‌లోనే ఐదువందలకు పైగా గుడారాలున్నాయి. కచ్‌లో ఇలాంటి రిసార్ట్స్ పదికిపైగానే ఉన్నాయి. ఇవన్నీ ఎడారిలో జోధా అక్బర్ సీజనల్ సెట్టింగ్స్ లెక్క. నాలుగు నెలలు సీజన్ అయిపోగానే ఈ సర్కస్ డేరాలన్నీ ప్యాకప్. అక్కడ అంతా టెంపరవరీ అయినా ఏర్పాట్లన్నీ పర్మనెంటే, డోంన్ట్ వర్రీనే!
డైనింగ్ హాల్లో భారీ బ్రేక్‌ఫాస్టే ఏర్పాటు చేశారు. మన ఇడ్లీలకు ఏ మాత్రం ఢోకా లేకుండా గుజరాతీ డోక్లాతో పాటు పరోటాలు, రోటీలు, చపాతీలు ఫ్లైయింగ్ సాసర్లలా గాలిలోకి ఎగురుతున్నాయి. వహ్వా అనేలా పోహాతో పాటు జ్యూస్‌లు, బెహతరీన్ ఛాయ్, కాఫీలు కూడా కలవు. తినడం ముగించుకుని రిసార్ట్‌లో. నడుచుకుంటూ వినోదకార్యక్రమాలు చూసుకుంటూ లోకల్ సైట్ సీయింగ్‌కు బస్సులెక్కాము. మా బస్సు గయుడు రెండు గంటల ప్రయాణం తరువాత డోలోవీర అనే సింధూలోయ నాగరికత నాటి గ్రామం చూడటానికి చేరతాము అని చెప్తూ Road to Heaven మీదుగా వెళ్తాం అని చెప్పగానే Why this Kolavari, Dholavari Di అని ధనుష్ పాట పాడుకున్నాం.
Road to Heaven ఉప్పుఎడారి మధ్యలో వేసిన రోడ్డే! రోడ్ టు హెవెన్ పేరు గొప్పే కానీ దారి మాత్రం అంత గొప్పగా లేదు. నేటి మన ఆంధ్రారోడ్లు లాగే గతుకులతో, బంప్‌లతో ఉండటంతో అవును మరి స్వర్గానికి దారి అంత తేలిగ్గా ఎందుకుంటుందిలే అని సర్దుకున్నాం. స్వర్గ రహదారికి ఇరువైపులా ఉన్న నీళ్లల్లో సుదూర ప్రాంతాల నుండి వలస వచ్చిన ఫెమింగో పక్షుల గుంపులు కనువిందు చేశాయి.
ఎడారిలో రంగురంగుల దుస్తులతో తలపాగాలతో (పగిడీలు) యాత్రికులు ఫొటోలు తీసుకునేందుకు దుకాణాలున్నాయి. మా వాళ్ళు కొంత మంది స్థానికుల వేషాల్లో ఒదిగిపోయి ఫొటోలు దిగేశారు. మనకు ఎన్నికల సీజన్లోనే దణ్ణాలు. గుజరాతీయులు మర్యాద పురుషులు. అక్కడ అందరూ అడుగడుక్కీ దణ్ణాల మీద దణ్ణాలే! మా బస్ గైడ్ బస్ ఎక్కగానే మా అందరికీ టోపీలు పెట్టాడు. అవి పారేసుకుంటే మీదే బాధ్యత అని హెచ్చరించాడు. దణ్ణాలు పెట్టి మరీ టోపీలు పెట్టడం గుజరాయితీలకే చెల్లు.
నిజానికి చివరికి మేము చేరుకున్నది కోలవరో, ధోలావరో కాదు. బస్సు దిగి ‘Dholavira’ అన్న బోర్డు చూసి తూచ్ అనుకున్నాం. ధోలావీర గ్రామం ఐదు వేల సంవ్సతరాల క్రిందట సింధూలోయ నాగరికతలో వికసించి మూడు వేల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది. అప్పట్లో ఆ నగరానికి ఇరు వైపులా Mandsar, Manhar అనే నదులు ప్రవహించేవట. నగరం మొత్తం ఎంతో ప్రణాళికాబద్దంగా నిర్మించబడింది. మంచినీటికి, డ్రైనేజీ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ఆ నగర విశేషం. అక్కడ దొరికిన పాత్రలు, ఆటవస్తువులు, పనిముట్లు నాటి పరిణితి చెందిన నాగరికతకు చిహ్నాలు, వీటన్నింటినీ అక్కడ ఒక చిన్న మ్యూజియమ్‌లో ప్రదర్శనకు ఉంచారు. ధోలా వీర నుండి గాంధిగ్రామ్ అనే హస్తకళల గ్రామానికి వెళ్ళాం.
గాంధిగ్రామ్ గుజరాత్‌లోని హస్తకళాకారుల నివాస స్థలం. అక్కడ అద్భుతమైన బొమ్మలు, నేత చీరలు, కొయ్య వస్తువులు తయారు చేసి ఇళ్ళ వద్దే అమ్ముతారు. అక్కడి రంగులు చూస్తే Vibrant and colorful Gujarath అనే మాట ఎంత సరైనదో తెలుస్తుంది. వస్తువుల ధరలన్నీ టూరిస్ట్ ఫ్రెండ్లీనే. అక్కడ చిన్నచిన్న పిల్లలు చూడముచ్చటైన గుజరాతీ సంప్రదాయ దుస్తులతో సరుకులు అమ్మడం చూసి ముచ్చట పడి వారితో ఒక ఫొటో దిగుతాం అని అడిగాం. వారు జరూర్ అంటూనే నవ్వుతూ ప్రతిఫొటోకు దిగినవారికి జస్ట్ వంద రూపాయలు ఇస్తే చాలనడంతో గుజరాతీయుల సంపద వెనుక విజయ రహస్యం తెలిసొచ్చింది. ఫొటోకు వంద, మనం ఫొటో దిగడానికి పగిడీ కడితే వంద. వారి దగ్గర మన జగనన్న ఉచిత పథకాలు జాన్తానై. షాపింగ్ ముగించుకుని రాత్రి శిబిరాలకు చేరుకున్నాం.
మేము కచ్ నుండి బయలు దేరే రోజు రిపబ్లిక్ డే ఉత్సవాన్ని జెండా, వందనాన్ని రిసార్ట్స్‌లో ఘనంగా ఏర్పాటు చేశారు. దేశభక్తి గీతాలతో సాంస్కృతిక నృత్యాలతో రిసార్ట్స్ ప్రాంగణం అంతా మారుమోగిపోయింది. గుజరాతీయులకు దేశభక్తి, రాష్ట్రభక్తి రెండూ ఎక్కవే. నాలుగు రోజులు రాన్ఆఫ్కచ్ ఉప్పు ఎడారిలో గడిపిన తరువాత కాస్తంత ఉప్పు తింటే విశ్వాసంగా ఉండాలనేది సామెత కాదు యదార్థం అని తెలుసుకున్నా. గాంధీజీ చిన్నతనంలో గుజరాత్ ఉప్పు తిన్నందుకు చారిత్రాత్మకమైన దండిమార్చ్తో, ఉప్పు సత్యాగ్రహంతో మనకు స్వాతంత్య్రస్ఫూర్తినిచ్చారు. అదే బాటలోలో గుజరాత్ ఉప్పు తిన్న మాన్యమహోదయ్జీ ఉక్కు మనిషి పటేల్ గారి విగ్రహాన్ని ప్రతిష్టించి తమ విశ్వాసాన్ని వారి ఔన్నత్యాన్ని చాటారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ గారి Statue of Unity విగ్రహం ప్రపంచంలోనే అన్నింటికంటే ఎత్తైనదట.
ఆ రోజు రాత్రి పది దాటిన తరువాత వెన్నెల్లో ఎడారికి తీసుకువెళ్ళారు. పున్నమి వెలుగుల్లో ఉప్పు ఎడారి మెరిసిపోయింది. అప్పుడు ఎందుకింత మంది టూరిస్ట్స్ వస్తున్నారో తెలిసింది. వెన్నెల్లో ఎడారి చూడగానే సితార సినిమాలో వేటూరి గారు రాసిన, జానకమ్మ పాడిన వెన్నెల్లో గోదారి అందం పాట, మా గోదారి మదిలో మెదిలింది. నోట్ల రద్దు తరువాత వచ్చిన కొత్త కరెన్సీ నోట్ల మీద మనదేశంలోని చారిత్రక కట్టడాల చిత్రాలను వేశారు. మనం రోజూ ఎక్కువగా చూసే వందనోటు మీద గుజరాత్‌లోని రాణికా వావ్ దిగుడు బావి బొమ్మే అచ్చేసి అచ్చా అనిపించారు. ఐదువందల నోటు మీద కూడా పోర్బందర్ మహాత్ములే! అంతెందుకండి నాలుగంటే నాలుగురోజులు ఇరవై గ్రాముల గుజరాత్ ఉప్పు తిని, అక్కడ ఉప్పు గాలి పీల్చిన నేను రాన్ ఆఫ్ కచ్ బ్రాండ్ అంబాసిడర్నై ఇదంతా రాసేస్తుళ్ళా! మీకు ఇంతకంటే ఇంకేం రుజువు కావాలి అబ్బాయ ఉప్పు గొప్ప తెలియడానికి.
ఎలక్షన్లలో కొన్ని చెదురు, మదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం అన్న తీరుగా మా కచ్యాత్ర కూడా అక్కడక్కడా (మాకు) ఆందోళనకరమైన మేడమ్స్ ‘‘శారీ’’ షాపింగ్స్, కొండొకచో మా వాహన చోదకుల చోద్యాలు (తిరుపతి హోటల్ భీమాస్‌లో కమ్మని నేతి పొంగలిలో పంటికింద మిరియాల్లా) మినహా త్రీ రోజెస్ టీ అంత ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోయింది.
మా బృందంలో ఆముదం తాగిన ముఖాల్లేనే లేవు. అందరూ ఆత్మీయంగా పలకరించుకునే వాళ్ళే ఉండటం మా అదృష్టం. మా కచ్ యాత్రా బృందం మొత్తంలో మాకు ఎంతో నచ్చి, మేము ఎంతో మెచ్చిన సంఘమిత్ర (సార్థక నామధేయురాలు) మమ్ములందర్నీ ఆద్యంతం శ్రద్ధగా చూసుకోవడం మా భాగ్యం. నా దగ్గర కొంచెం ఫైనాన్సే ఉంటే తనతో ‘‘బేటీ హైతో ఐసా’’ సినిమా తీసేద్దును.
మంచి ప్రదేశాలకు మంచి మనుషులతో వెళితే అవి మరింత మంచిగా అనిపిస్తాయి, కనిపిస్తాయనేది కచ్ వలన మాకు దక్కిన యాత్రా కథాఫలం “Good people make places more good”
మొధెర సూర్యదేవాలయంలో మా బృందం
(ఆప్తులు ఉమ, శ్రీనివాస్ (అలియాస్ అర్జునుడు) దంపతులకు కృతజ్ఞతలతో …)
సహజ సుందర వర్ణన ।
యం. రాధా కృష్ణ మూర్తి
ఈ వ్యాసం లో నీ ముద్ర సస్పష్టం – ముఖ్యంగా ఉపమానాల్లో………
యాత్రాకథనం ఆసక్తికరంగా ఉంది. సింధూలోయను దర్శించుకున్న అనుభూతి కలిగింది. ధన్యవాదములు.
మేమే యాత్ర చేసిన ఫీలింగ్ తెప్పించారు సార్ మీ ఆకట్టుకునే కథనంతో. చాలా చక్కని చారిత్రక ప్రదేశాలను మంచి మనుషులతో నేరుగా సందర్శించడం అనేది మరపురాని దృశ్యంగా మిగిలిపోతుంది సార్. ఎక్కడా బోర్ కొట్టకుండా సమయస్పూర్తితో చక్కని హాస్యం పందించారు సార్. థాంక్యూ సార్
Gujarat vellivachanoch
Thank you sir for providing information on your trip to Gujarat Rann of Kach. Very interesting narration of all aspects of the tour. Really not only for people who are not able to visit such places but also for others, is a real delight to know about such places. Congratulations for making available such information with lot of fun.
హర్షవర్ధన్ గారికి ఎవరి మీద కచ్చి ఉండదు కాబట్టి వారు వారి ఖర్చుల తో కఛ్ పంపించాల్సిన అవసరం లేదు. కఛ్ యాత్ర మధ్య మధ్యలో జోకులతో బాగాసాగింది.