ఐదు వందల ఏళ్ళ క్రితమే Shakespeare “What’s in a name?“ అని రోమియో జూలియట్ నాటకంలో జూలియట్తో అనిపిస్తే మన వాళ్ళేమో పేరులోనే పెన్నిధి అనేశారు. ఇంత డివైడెడ్ టాక్తో మనకు పెద్ద చిక్కే వచ్చిపడింది. ఇందులో నిజం ఎటువైపుందో లేక truth lies somewhere in between యేమో చూద్దాం. మన పెద్దవాళ్ళ కాలంలో పిల్లల్ని కనడంగాని, వాళ్ళకు పేర్లుపెట్టడం గాని బిగ్ డీలేమీ కాదు. అయితే గియితే తాతల పేర్లో, నానమ్మల పేర్లో తగిలించి దేవుళ్ళ పేర్లు  పెట్టేసేవారు. అందుకనే ఒకప్పుడు విజయవాడ బీసెంట్ రోడ్లో నిలబడి దుర్గారావ్ అనే కనకదుర్గ అనో కేకేస్తే కనీసం అరడజను మంది వెనక్కి తిరిగి చూసేవారు.  అదే విశాఖపట్నంలో అయితే అప్పారావ్ అని కేకేస్తే నలుగురు, ఆ మాటకొస్తే ఏ వూళ్ళో అయినా సరే శ్రీనివాస్ అని పిలిస్తే పదిమందైనా పలుకుతారు. ప్రతి క్లాసులో నలుగురికి తగ్గకుండా శ్రీనివాసులో, శ్రీ లక్ష్ములో ఉండటంతో వై.శ్రీను, కె.శ్రీను, పి.శ్రీను అనాల్సిందే. మిత్రుడు ప్రొఫెసర్ రఘు పేర్ల మీద ఇంకో జోక్ చెప్పాడు. హైదరాబాద్ లో గానీ,  నల్గొండలో గానీ జనం మీదకు రాయి విసిరేస్తే అది యాదగిరికే తగులుతుందట. అందరి పేరు అదే అయితే అంతేగా! అంతేగా!

గతంలో పిల్లల పేర్లు పెట్టడడానికి కొంతమంది భక్తి కొద్దీ వాళ్ళ నమ్మకాల కొద్దీ పెట్టేవారు. మా మిత్రుడి ఇంట్లో వాళ్ళ నాన్నగారి పేరు మస్తాన్రావు, ఆయనకో తమ్ముడు పుడితే ఆయనకు చిన్న మస్తాన్రావు అని పేరు పెట్టారట. చిన్న మస్తాన్రావుగారికి ఇంకో తమ్ముడు పుట్టడంతో ఆయన్ను చిట్టి మస్తాన్రావు అన్నారు. కొసమెరుపుగా చిట్టి మస్తాన్రావుకు ఇంకో తమ్మడు పుట్టడంతో  ఆయనను వొట్టి మస్తాన్రావు  (వొట్టి పేరులో కలపలేదులెండి) అని పిలుస్తూ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నను పెద్ద మస్తాన్రావుగా ప్రమోషన్ ఇచ్చేసి సమస్య పరిష్కరించుకున్నారు. మస్తాన్ బాబా గారిపై వారికి గల అపారమైన భక్తి, నమ్మకం వల్లనే ఈ మస్తాన్ల పరంపర. నా చిన్నతనంలో మా బంధువుల్లో ముగ్గురికి అన్నవరం అని పేర్లుండటంతో వారిని పెద్దన్నారం,  చిన్నన్నారం, మద్దెన్నారం అని పిలుచుకునేవాళ్ళం. ఈ విషయంలో మన తమిళ సోదరులు మనకంటే ఇంకొంచెం పైనే ఉంటారు. అక్కడంతా మురుగుడి మయమే కావడంతో వేలాయుధన్, వేల్మురుగ, శక్తివేల్, (సాదా) మురుగేశన్, దండాయుధపాణి, ఆర్ముగం, షణ్మగం, శివకొళందు, బాలమురుగన్ పేర్లతో హోరెత్తిస్తారు.

పేర్లు పెట్టడానికి ఒక్కోదేశంలో ఒక్కో సంప్రదాయం, ఆనవాయితీ ఉంటుంది. రష్యాలో పిల్లలకు పేర్లు పెట్టడానికి వాళ్ళను నీళ్ళల్లో తోసేస్తే వాళ్ళు పెట్టే గావుకేకలు నాయనోయ్, దేవుడోయ్, అమ్మోయ్ అన్నట్లుగా యాకోయ్, లుద్మినోయ్, సర్గోయ్ అని పెడతారట. అదే చైనాలో అయితే రెండు పింగాణీ గిన్నెలు, కప్పులు కిందపడేసి అవి పగిలేప్పుడు చింగ్, చాంగ్, ఛుంగ్, మింగ్ చేసే మోతలే వాళ్ళ పేర్లు అవుతాయట. ఇవి కొంత నవ్వుకోడానికే కావచ్చుగాని వాళ్ళపేర్లు అలాగే ఉంటాయి. అమెరికాలో రెడ్ ఇండియన్స్ (నేటివ్ అమెరికన్స్) పేర్లు మాత్రం ఒక ప్రత్యేక పద్దతిలో పెట్టడం నిజం. అక్కడ పిల్లలకు పేర్లు పిల్ల/పిల్లవాడు పుట్టగానే నర్సు పరుగెత్తుకొచ్చి బయట మొదట కనపడ్డ దృశ్యాన్నే పేరుగా పెట్టేస్తారని చదివాను. అందుకే వాళ్ళపేర్లు Dancing bear, Passing cloud, Singing bird, Standing deer అనే ఉంటాయి.

మన దేశంలో సీజనల్ నేమ్స్ చూస్తుంటాం. స్వాతంత్ర్య పోరాట సమయంలో కుటుంబ పేర్లుగా ఉన్న‌ గాంధీ, నెహ్రు, బోస్, ఛటర్జీ, టాగూర్, బెనర్జీ, రాయ్లతోపాటు కమ్యూనిస్టు నాయకులైతే వాళ్ళ పిల్లలకు లెనిన్, స్టాలిన్, చూటే పేర్లు పెట్టేసుకున్నారు. ఆడపిల్లలైతే ఒక సీజన్లో స్వరాజ్యాలు, స్వతంత్ర లక్ష్ములు, క్రాంతులు, అరుణలు, ఝాన్సీరాణులే. నాస్తిక‌ సంఘంవారు దేవుళ్ళపేర్లను తప్పించి లవణం, సమరం, రశ్మి, జగతి, గ్రామ్ అనే పేర్లూ పెట్టేసుకున్నారు. స్వాతంత్ర పోరాట కాలంలోనే లాలాల‌జప‌తిరాయ్‌, బాల‌గంగాధ‌ర తిల‌క్‌, బిపిన్ చంద్ర‌పాల్ త్ర‌యం LAL, BAL, PAL  గా ఎంతో ఖ్యాతిపొందారు.  పెద్దవాళ్ళు పెట్టిన పాతపేర్లు నచ్చక, నప్పక కొంతమంది పెరిగి పెద్దయిన తరువాత చిన్న టింకరింగు చేసుకున్న దాఖాలాలు చాలానే ఉన్నాయి. మా కాలేజి రోజుల్లోనే విజయవాడలో ఒకరి ఇంటిముందు యు.వి.వర్లు అని ఉండేది – వారు వెంకటేశ్వర్లట. ఇంకొకరు అదేపేరును పి.వి.లూ (P.V. Loo) గా కత్తిరించుకుని Battle of Waterlooని స్ఫురింప చేసేవారు. మిత్రుడు ప్రసాద్ వాళ్ళ మేనమామకు వారి తల్లిదండ్రులు రామానుజులని విలక్షణమైన పేరు పెడితే ఆయన అమెరికా వలసపోయిన వెంటనే K.R.Zulu  గా మార్చుకుని జూలు విదిలించారు. ఈ షార్ట్ క‌ట్ పేర్ల‌కు నాకు తెలిసినంత‌లో మా కాలేజీ రోజుల్లో ట్యూటోరియ‌ల్ కాలేజీల పితామ‌హులు (గుంటూరు) ర‌వి ట్యూటోరియ‌ల్స్ వ్య‌వ‌స్థాప‌కులు సి.విశ్వ‌నాధ‌న్‌గారే ఆద్యులు. ఆ త‌రంలో సి.వి.ఎన్‌. ధ‌న్‌గా వారిని ఎరుగ‌ని వారే లేరు. ఢిల్లీలో ఐ.ఎ.ఎస్ కోచింగ్ నిష్ణాతులు S. RAU లాగానే.  మనపేర్లు (వాళ్ళు పల‌క‌లేక‌) మన రామూలందరూ RAM (కంప్యూటర్ భాషలో RAM లు అన్నట్లు పలికి), మన శ్యామ సుందరులంతా SAM  (వాళ్ళ‌కి తెలిసింది SAM Club దుకాణం కనుక) మన కృష్ణయ్యలంతా క్రిస్లు, మన పద్మావతులంతా Pad  లూ (I Pad ల మ‌హిమ‌తో) అయిపోతారు. మ‌న వెంక‌టేశ్వ‌ర్రావ్‌లు వెంకీల‌యిపోతారు.

మాచెల్లెలు అమెరికాలో వాళ్ళ అబ్బాయికి అభిరామ్ అని చక్కటి పేరు పెడితే పలకడం చేతగాక వాడిని అబ్రహంను చేసేశారు. అదే విష్వక్సేనుడు, కాత్యాయని అని పేర్లు పెడితే ఎలా పలుకుతారో.  ఈ పేర్లు మార్చేయడంలో మనమూ ఏమీ తీసిపోము లేండి. ఆ రోజుల్లోనే  Shakespeare మన వాళ్ళు షేక్‌ పీర్‌ సాహెబ్ ను చేసేశారు. పనిలో పనిగా పీటర్ను పేతురుగా, డేనియల్ను దానియేల్గా, డేవిడ్ను దావీదుగా, మేరీనీ మరయమ్మగా, సైతానును సాతానుగా, మేధ్యూస్ను ముత్తయ్యగా రూపాంతరం చేసుకుని మనమూ కొంత రుణం తీర్చుకున్నాం. ఏమైనా ఎంతో ముచ్చటపడి పెట్టుకున్న పేర్లు అలాగే నిలుపుకుని పిలచుకుంటేనే బాగుంటుంది. కాని మనం అలా చేయం. ఎంతో మంచి పేర్లు పెట్టిన పిల్లల్ని బుజ్జి, చంటి, కన్న, టింకు, బబ్లూ, బాబీ, చిన్నా, బుల్లి, నానీ అనిపిలుస్తూ వాళ్ళపేర్లనే మర్చిపోతాం. మాకున్న తాతయ్యల్లో ఒకర్ని చిన్నబ్బాయి తాతయ్య అనేవాళ్ళం. అలాగే ఇంకొకరు చంటిమామయ్య. ఈ ముద్దు పేర్లతో వాళ్ళు సీనియర్ సిటిజన్స్ గా ఎదిగినా చిన్నబ్బాయి తాత, చంటి మామలుగా వొదిగిపోయారు. మన చరిత్రలో చిరంజీవులుగా నిలిచిపోయిన మార్కండేయ, ధ్రువుడిలాగే అనుకోండి. గోదావరి జిల్లాలో రాంపండు, సత్తిపండు, సూరిపండు, పండుగాడు పేటెంటెడ్ ముద్దుపేర్లు. ఆ జిల్లాల్లో దత్తత తీసుకోవడం కూడా ఎక్కువే. అలా దత్తతకొచ్చిన వాళ్ళ అసలుపేర్లు మర్చిపోయి జనం దత్తుడు అనే పిలుస్తారు. ఊరికి కనీసం నలుగురు దత్తుడ్లుండేవారు. ఇదంతా తెలియని నాకు దత్తుడు అంటే దత్తాత్రేయుడేమో అనుకున్నా.  కాని తరువాతే దత్త రహస్యం తెలిసింది. గోదావరి జిల్లాలో మైనర్ బాబులు కూడా ఎక్కువే. ఎంత ఆస్తి కర్పూరం చేసినా, ఎంత పెద్దైనా మైనర్ బాబు మైనర్ బాబే. ఇదే కోవలో ఎంతో మంచిపేర్లున్న రచయితలు కొందరు భమిడిపాటి రామగోపాలంగారు (భరాగో) అయితే బండిగోపాల్రెడ్డిగారు (బంగోరే) అయిపోయారు. గొప్ప తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిగార్నిJK గా, చక్రవర్తుల రాజగోపాలాచారిని  C.R గా, మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారిని E.K. గా కుదించేశాం. మంచిపేరు పెట్టుకున్న ట్రస్ట్లు కూడా ఇదే కోవలో  అప్పాజోస్యుల విష్ణుభొట్ల ట్రస్ట్ కాస్తా `అజోవిభో` అయిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం కాస్తా తి.తి.దే అయిపోయింది.

ఈ పేర్లు కుదించే, మార్చే తీరు నాకు అస్సలు నచ్చదు. మద్రాసులో  మన సినిమా వాళ్ళు ఎక్కువగా ఉండే టి.నగర్ వాస్తవానికి త్యాగరాజనగర్, అలాగే ఎమ్.జి.రోడ్ – మహాత్మా గాంధీ రోడ్, ఎస్.డి.రోడ్- సరోజినీ దేవిరోడ్, జవహార్లాల్ నెహ్రు యూనివర్సిటీ జె.ఎన్.టి.యు గా మార్చిపిలిచి అటువంటి మహనీయుల పేర్లు మనం స్మరించుకునే అవకాశం పోగొట్టుకుంటే అంత మంచి పేర్లు పెట్టిన పరమార్థం పోతుంది అనేదే నా ఆవేదన. ఇలాంటి చిరస్మరణీయుల పేర్లుపూర్తిగా పలికితేనే సార్థకత. అందుకని ఇక్కడ పొదుపు పాటించకుండా ఉంటేనే బాగుంటుంది.

పేర్ల సార్థకత కూడా కొంత చూద్దాం. మొన్నీ మధ్య విజయవాడ వెళ్ళినప్పుడు ఏలూరు రోడ్డులో మంచి సెంటర్లో రహస్యబార్ అని బోర్డు చూసి ఇదేదో మిస్ మేచేనే, ప్రక్కసందులో ఉంటే సార్థక నామం అయ్యేది కదా అనుకున్నా. ఇలాగే ఆఫీస్ కు వెళ్ళేదారిలో  మహా మాయా జ్యువెలర్స్ షాపు కనపడేది. ఎప్పుడూ ఒక్క కస్ట‌మ‌రూ అందులో ఉండగా నేను చూడలేదు. పాపం ఆ షాపు ఓనరుగారు గౌతమబుద్దుని తల్లిగారిపై గౌరవంతో ఆ పేరు పెట్టుకుని ఉంటారు. మహానగరంలో మాయగాడు, మాయలోడు సినిమాలు మాత్రమే తెలిసిన మనవాళ్ళు ఆ షాపు లోనికి పోవడం లేదేమో అనుకుని ఒక రోజు ఆగి మరీ ఆయనకు పేరు మార్చమని చెబుదామనుకున్నంత టెంప్ట్ అయ్యాను.  ఇంకో దగ్గర K K D బార్ అని ఉంది. అది కదలివచ్చిన కనక దుర్గ బార్ అట. వెంటనే కదలివచ్చిన కనక దుర్గ బార్ కెళ్ళి తూలివచ్చిన దుర్గా ప్రసాద్ అన్న టాగ్లైన్ వచ్చేసింది.  కరుణ చికెన్ సెంటర్, సాయి వైన్స్ వంటి పేర్లు కూడా మిస్ మాచెస్సే. అలాగే విద్యాధర్ అని పేరున్నవాడు టెన్త్ క్లాస్ నాలుగు సార్లు ఫెయిలయితేనో అదృష్ట దీపక్ అనేవాడికి ఆరు సార్లు యాక్సిడెంట్ అయితేనో పర్ఫెక్ట్ మిస్ మ్యాచ్లే. అమృతం అని పేరు పెడితే చైనీస్ డ్రాగన్లా అగ్గి కురిపిస్తే ఇంకేం అమృతం చెప్పండి.

ప్రస్తుతం పిల్లలకు పేర్లు వెదకడం, పెట్టడం పెద్ద యజ్ఞం. అమెరికాలో పుట్టగానే పేరు పెట్టేయాలి. అందుకని అక్కడ మనవాళ్ళు ముందే వెతుకులాడ‌తారు. ఎక్కడెక్కడో ఆరంభించి వెదికి వెదికి తిరిగి మన విష్ణు సహస్ర, లలిత సహస్ర నామాలలో ఏరుకోవడం భూమి గుండ్రంగా ఉందన్న నమ్మకం బలపడడానికే. ప్రస్తుత ట్రెండ్ ఎంత అర్థంలేని పేరైతే అంత గొప్పన్న మాట. అందుకే చాలామంది తల్లిదండ్రుల్ని పిల్లల పేర్ల అర్థం అడిగితే అయోమయంగా చూస్తారు.  ఈ మధ్యనే ఎంతో ఆధునికంగా ఆలోచించే యువ జంట వారికి వరుసగా ఇద్దరమ్మాయిలు పుడితే వాళ్ళకు అలేఖ్య, అపురూప అని పేర్లుపెట్టి మురిసిపోతూ ఏమి జరుగుతుందో తెలుసుకునేలోపే ఇంకొక అమ్మయీ పుట్టేసింది.  మంచి సమయస్ఫూర్తితో మూడోపాపకు, “అనూహ్య“ అని సార్థక నామకరణం చేశారు. ఇంకో జంట అబ్బాయి కోసం నాలుగుసార్లు ఎదురుచూసి నాలుగో సారీ అమ్మాయే పుట్టడంతో ఆ పిల్లకు `స్వస్తి` (ఉషశ్రీ గారు మహాభారత రేడియో ప్రసంగాల్లో ప్రతి ఎపిసోడ్ చివరా మంచి బేస్ వాయిస్ తో “స్వస్తి“ అన్నట్లుగా) అని పేరుపెట్టుకుని కు!!ని!! ఆపరేషన్ తో స్వస్తి పలికేశారు.

ఒకసారి మిక్కిలి ఇంటిపేరు గల మిక్కిలి పుల్లయ్యగార్ని కలవాల్సి వచ్చి ఆయన పేరును తలుచుకుంటూ ఆయనను ఊహించుకుంటూ కాలింగ్ బెల్ కొడితే తలుపు తెరచిన అతి భారీ కాయులే మిక్కిలి పుల్లయ్యగారు అని తెలుసుకుని ఆ మిస్ మ్యాచ్ కి కలతపడ్డా. బస్ స్టాప్ లో చాలాసార్లు బస్సు కోసం వెయిట్ చేస్తూ ఒకాయన కనపడేవాడు. సదరు మహనీయుని పేరు నిరీక్షణ రావ్ అని తెలుసుకుని సార్థక నామధేయులే అని మురిసిపోయా. మా ఆఫీసులో ఎన్నడూ ఏ పనీ చేయని వారొకరుండేవారు. వారికి పని గండం. ఏ పని చేసినా ప్రాణాంతకం అని జాతకంలో ఉందట. కాకతాళీయమో కాదో తెలియదు కాని వారిపేరు మాత్రం సుఖయోగి – సార్థక నామధేయులే వారు. ఇదంతా చదివిన తరువాత ముందు మనం అనుకున్నట్లుగానే పేరుకున్న పరిమితి, గౌరవం నిజంగానే Truth lies somewhere in between అనే అనిపిస్తుంది. కొంటెద్వయం బాపు రమణలను ఎవరో “మీ ఊళ్లో పేరున్న వాళ్ళెవరైనా  పుట్టారా?“ అని అడిగితే వారు ముక్త కంఠంతో “అబ్బేలేదండి, అందరికీ పుట్టిన తర్వాతే పేరు పెట్టార“ని చెప్పారట.

ఈ పేర్ల ముచ్చట్లు డా.ఎన్.గోపి గారు చెప్పిన జోక్ తో ముగిద్దాం. మహాకవి శ్రీశ్రీకి సముద్రం అంటే చాలా ఇష్టమట. ఒకసారి వారు సాహితీ సభలకు ఢిల్లీ వెళితే వారికి, ఇంకొక రచయితకు ఒకే గదిలో ఆతిధ్యం ఇచ్చారట. శ్రీశ్రీ గారు ఆ తాత్కాలిక రూమ్మేట్ను “మీ పేరేమిటి?“ అని అడిగితే వారు “సాగర్ ఘోష్“ అని చెప్పడంతో శ్రీశ్రీగారు “హమ్మయ్య ఇక్కడ విశాఖ సముద్రం లేదన్న బెంగ మీతో తీరింద“ని ఆనందించారట. పేరులో పెన్నిధి అంటే ఇదిగాక ఇంకేముంటుంది చెప్పండి!

17 Replies to “What’s in a name?”

  1. నేను 1985 ఆగష్టు లో అనుకుంటా , ఎం।టెక్ అడ్మిషన్ తరువాత హాస్టల్ రూమ్ కోసం ఆఫీస్ లో వెయిట్ చేస్తూ నా ముందు నిలబడ్డ అబ్బాయి పేరు విని షాక్ అయ్యాను. ఇప్పటికి తేరుకోలేదు….

    అతనిపేరు రావణాసురుడు. ఇంటిపేరు బొడ్దు . నా ప్రాణ మిత్రుడు.

    అతన్ని గురుంచి అంతర్జాలంలో చాలా విషయాలు వున్నాయి కుతూహలం గల పాఠకులు వెతుక్కో గలరు!

  2. డాక్టర్ ప్రభాకర్ గారి సేవానిరతినే నేను
    స్వయంగా చూసాను.వారి సేవలను
    నేను నాభార్య వినియోగించుకున్నాము..వారికి సర్వదా కృతజ్ఞులము.ఎందరో బీదవారికి ఈ ట్రస్ట్ ద్వారా కంటి వెలుగులు ప్రసాదిస్తున్నారు…
    యింత చక్కగా వివరాలు పొందుపరిచిన నా మిత్రుడు హర్ష గారికి
    అభినందనలు….

  3. పేరులో ఇంతుందా, ఆర్టికల్ చదువుతుంటే మీతో మాట్లాడుతున్నట్లుగా ఉంది

  4. శుభోదయం
    మనుషుల పేరు లో వున్న తికమక లు సరదాగా చాలా బాగానే చెప్పారు సర్. కొన్ని పేర్లతో మనకి స్పెషల్ అనుబంధం కూడా ఏర్పడుతుంది. నాకూ బాగా గుర్తు మీరు ఒకసారి చిత్తూరు ICP check పోస్టు visit పూర్తి చేసుకొని రిటర్న్ ట్రైన్ వెళ్లే టైమ్ లో స్టేషన్ లో మీకు గౌరవ send off evvataniki నేను రైల్వే స్టేషన్ vachanu. మీరు నన్ను ఏమి పేరు అని adagatam నేను Harshavardhan అని చెప్పడం జరిగింది. Oh! 20 సంవత్సరాల తరువాత Dept ki enko Harsha vachada ani meeru navvutu annaru.

  5. Very good. Interesting and enlightening. A proper mix of humour and historical facts. This took me to the past present and future

  6. చాలా బాగుంది సర్.
    పేర్లలో ఉన్న వైవిధ్యాన్ని చాలా చక్కగా
    వివరించారు..

  7. చాలా బాగుంది సర్.
    పేర్లలో ఉన్న వైవిధ్యాన్ని చాలా చక్క వివరించారు.

  8. బాగుంది….నేను మేదరమెట్ల లో పనిచేస్తున్నప్పుడు, అకౌంట్ ఓపెన్ చేయాలంటే అంజయ్య s/o అంజయ్య. తల్లి పేరు అంజమ్మ. అక్కడ సింగరాయకొండ ఆంజనేయ స్వామి ప్రసిద్ది. అందరి పేర్లు హనుమంతు, ఆంజనేయులు,అంజయ్య గా ఉండేవి. ఇంకా లోన్ రికవరీకి ఫోటో ఒకటే ఆధారం. అక్కడి జోక్… మామిడి పండు తిని ముట్టె పైకి విసిరేస్తే ఖచ్చితంగా హనుమంతు మీద గానీ, పంది మీద గానీ పడుతుంది.

  9. ఇదో వెంగ్యహస్య రచనా?
    చాలా నవ్వు తెప్పించింది.
    ఎప్పుడో చదివిన హస్యనవలలకు మించి నవ్వుతూ వకటికి రెండుసార్లు చదివించే రచన. హర్షవనం విలక్షణ వ్యాస రచనా సముదాయంగా రూపుదిద్దుకుంటున్నాయి. అభి నందనలు.

  10. పేరులో ఇంత మహత్తు ఉందాండి! ఆంధ్రా నుండిఅమెరికా దాకా ప్రపంచం అంతా చుట్టేసారు కదా సార్! Shakespeare నుండి శ్రీశ్రీ దాకా500 years చరిత్ర మొత్తం తిరగేసారు సుమా🙏🏼🙏🏼🙏🏼

  11. నామకరణం పై చాలా గొప్ప కవితను అందించారు కృతజ్ఞతలు
    షేక్సిపియర్ తో మెుదలు పెట్టి శ్రీ శ్రీ
    తో ముగించిన తీరు అద్బుతం
    మద్యలొ మద్యలొ హాస్య రసాన్ని చక్కగా పండించారు
    హర్ష వనం లో పూచిన గులాబీ ల
    గుమగుమలు కడు ముదావహం

  12. పేర్ల వైవిధ్యాన్నీ, పేర్ల అంతరార్థ వైవిధ్యాన్నీ వివరిస్తూనే పేర్లు పెట్టే వారి ఆలోచనా రీతల్లోని వైవిధ్యాన్ని కూడా ఆవిష్కరించిన నీ తీరుకు సార్థకంగా ఏ పేరు పెట్టొచ్చబ్బా అని ఆలోచిస్తుంటే “రమణీయం” అని చటుక్కున తోచింది. Enjoyed thoroughly.

  13. మంచి సబ్జెక్ట్.
    నల్గొండ లాగే గుంటూర్లో రాయి వేస్తే ఖచ్చితంగా కోటేశ్వర రావు కే/లేదా సాంబ శివ రావు కే తగులు తుంది.
    నా చిన్నతనంలో నెల్లూరులో కాపాడి పాలెం లో నాకు స్నేహితులు ఉన్నారు. ఆ పేట కు కాస్త రౌడీ పేరుండేది. అక్కడ కొంత మంది పేర్లు లెనిన్, స్టాలిన్ వుండేవి. తిట్టుకునేపుడు ఒరే స్టాలిన్ నాకొడకా, నీ అమ్మ… అని తిట్టినపుడు , లేదా లెనిన్ నాకొడుకు పిక్ ప్యాకెట్ నాయాలు అన్నపుడు ఆ మహానుభావులకు పట్టిన దుర్గతి చూసి భాదేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.